‘నక్సలైట్ల కుట్ర కేసులు’ ఎన్నిసార్లు రుజువయ్యాయి?

  • 29 ఆగస్టు 2018
కొండపల్లి Image copyright facebook
చిత్రం శీర్షిక కొండపల్లి సీతారామయ్య

మంగళవారం దేశవ్యాప్తంగా పలు నగరాల్లో సోదాలు జరిపిన పోలీసులు అయిదుగురు ఉద్యమకారులు - వరవరరావు, సుధా భరద్వాజ్, గౌతమ్ నవ్‌లాఖా, వెర్నన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరాలను అరెస్ట్ చేశారు.

ఈ ఏడాది జనవరిలో మహారాష్ట్రలోని భీమా కోరెగావ్‌లో చోటుచేసుకున్న హింసతో వారికి సంబంధం ఉందని, ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నారన్నది పోలీసుల ఆరోపణ.

విప్లవోద్యమ, పౌరహక్కుల నేతలపై పోలీసులు గతంలోనూ కుట్ర కేసులు నమోదు చేశారు.

మంగళవారం నాటి అరెస్టుల నేపథ్యంలో, స్వాతంత్ర్యానంతరం ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ప్రధానంగా నాలుగు కుట్ర కేసులను ప్రముఖంగా పేర్కొనవచ్చు. అవి.. పార్వతీపురం కుట్ర కేసు, సికింద్రాబాద్ కుట్ర కేసు, రాంనగర్ కుట్రకేసు, ఔరంగాబాద్ కుట్రకేసులు. వాటి నేపథ్యం పరిశీలిస్తే..

Image copyright Getty Images
చిత్రం శీర్షిక కానూ సన్యాల్

పార్వతీపురం కుట్ర కేసు

సాయుధ పోరాటం ద్వారా ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర చేశారని 1970లో ఈ కుట్ర కేసు నమోదు చేశారు. ప్రధానంగా శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటంలో పాల్గొన్న, సానుభూతి చూపిన సుమారు 148 మందిపై కేసు పెట్టారు.

ఈ కేసులో నక్సలైట్ నాయకుడు కానూ సన్యాల్ మొదటి ముద్దాయి. ఈ కేసులో తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావులను మద్రాసులో అరెస్ట్ చేశారు.

కేసు విచారించిన విశాఖపట్నం రెండో అదనపు సెషన్స్ జడ్జి 15 మందికి జీవిత ఖైదు విధించారు. మరో పది మందికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించగా, 50 మందిని నిర్దోషులుగా విడుదల చేశారు.

పార్వతీపురం కుట్ర కేసులో పలువురు నక్సల్స్ నేతలకు శిక్ష విధించడంతో దేశంలో నక్సలైట్ ఉద్యమం తొలి దశ భారీ కుదుపుకు లోనైంది.

సికింద్రాబాద్ కుట్ర కేసు

ఈ కేసులో పలువురు వామపక్షనాయకులు, విప్లవ నాయకుల మీద కేసు పెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్‌లో కుట్ర చేశారనే ఉద్దేశంతో దీనికి 'సికింద్రాబాద్ కుట్ర కేసు' అని పేరు పెట్టారు.

ఈ కుట్రకేసుకు సంబంధించి 1974లో ఎఫ్‌ఐఆర్‌ దాఖలయింది.

1971 నుండి వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ, మెదక్‌ ఇంకా కొన్ని ప్రాంతాల్లో జరిగిన బహిరంగ సమావేశాలు, సభలు, ఊరేగింపులు, వాటికి ముందు జరిగిన హింసాత్మక ఘటనల ఆధారంగా ఈ కుట్ర కేసు నమోదు చేశారు.

ఈ కేసులో 46 మందిపై కుట్ర, రాజద్రోహ నేరం అభియోగాలు మోపారు. 550 మందిని సాక్షులుగా నమోదు చేసారు. నాటి నక్సలైట్‌ నేత కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తిలతో పాటు విప్లవ రచయితల సంఘం సభ్యులైన కె.వి.రమణారెడ్డి, త్రిపురనేని మధుసూదనరావు, వరవరరావు, చెరబండరాజు, ఎం.టి.ఖాన్‌లను ఈ కుట్ర కేసులో నిందితులుగా పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుల తరపున వాదించిన ప్రముఖ న్యాయవాది కన్నబీరన్‌.. ప్రజాస్వామ్యంలో సమావేశాలు పెట్టుకునే హక్కు, అభిప్రాయాలు కలిగి వుండటం, వ్యక్తీకరించడం, వ్యక్తిగత స్వేచ్ఛ, నిరసన తెలిపే హక్కు అంశాలు మౌలికమైనవి అంటూ వాదించారు.

1989 ఫిబ్రవరి 27న సెషన్స్‌ కోర్టు సికింద్రాబాద్‌ కుట్ర కేసులో ప్రాసిక్యూషన్‌ సరియైన సాక్ష్యాలు సేకరించలేదని అభిప్రాయపడుతూ అందరినీ నిర్దోషులుగా ప్రకటించింది.

Image copyright SukhcharanPreet
చిత్రం శీర్షిక వరవరరావు

రాంనగర్ కుట్ర కేసు

1986లో ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర పన్నారంటూ 45 మంది విప్లవోద్యమ నాయకులు, విప్లవ రచయితలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. వారిలో 17 మందిపై చార్జిషీట్‌ దాఖలు చేశారు.

ఈ 45 మందిలో కొండపల్లి సీతారామయ్య వంటి నక్సల్స్‌ నేతలు, వరవరరావు తదితర విప్లవ రచయితలను నిందితులుగా పేర్కొన్నారు. ఆ తర్వాత 1995లో కొండపల్లి సీతారామయ్యపై కేసు ఉపసంహరించుకున్నారు. కేసు విచారణ జరిగిన ఈ సుదీర్ఘ కాలంలో కేవలం వరవరరావు, సూరిశెట్టి సుధాకర్‌లు మినహా మిగిలిన నిందితులంతా మరణించారు.

ఈ కేసులోనూ కన్నబీరన్ నిందితుల తరపున వాదించారు. గతంలోనే ఇలాంటి ఆరోపణలు చేయగా, వారు నిరపరాధులుగా బయటపడ్డారని వాదించారు. 2003 సెప్టెంబర్‌లో నిందితుల్లో మిగిలిన వరవరరావు, సూరిశెట్టి సుధాకర్‌లు ఇద్దరినీ నిర్దోషులుగా పేర్కొంటూ కోర్టు కేసు కొట్టేసింది.

Image copyright N.Venugopal/Facebook
చిత్రం శీర్షిక ఎన్.వేణుగోపాల్

ఔరంగాబాద్ కుట్ర కేసు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి మావోయిస్టు, విప్లవ రచయితలు కుట్ర పన్నారని పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

ఔరంగాబాద్‌లో కుట్ర పన్ని, అది అమలు చేయడానికి నల్లమల వెళుతుండగా నాటి మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ ప్రతినిధి గంటి ప్రసాదం, ఎన్.వేణుగోపాల్ సహా నలుగురు విరసం సభ్యులను 2005లో మే 30న నిజామాబాదులో అరెస్ట్ చేసినట్లు పోలీసులు న్యాయస్థానానికి తెలిపారు.

అయితే పోలీసులు తమపై ఆరోపించిన నేరాలను రుజువు చేసే సాక్ష్యాలను ఒక్కదానినీ సమర్పించలేకపోయారని ఎన్.వేణుగోపాల్ బీబీసీకి తెలిపారు. విచారణ సందర్భంగా పోలీసులు ఒకరు చెప్పిన దానికి, మరొకరు చెప్పినదానికి పొంతన లేదని అన్నారు.

ఈ కేసులో తీర్పు వెలువరిస్తూ కోర్టు... నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న పుస్తకాలను నిషేధించలేదని, వారు కుట్ర పన్నారు అనడానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని పేర్కొంది.

ఆయుధాలు సేకరించారు, ప్రభుత్వంపై యుద్ధ ఏర్పాట్లు చేశారన్న పోలీసుల వాదనతో విభేదిస్తూ.. ఆగస్ట్ 2, 2010 న నిజామాబాద్ అడిషనల్ సెషన్స్ జడ్జి ఆ కేసును కొట్టేశారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)