భీమా కోరెగాం కేసు: శంభాజీ భిడెను ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదు?
- అభిజీత్ కాంబ్లి
- బీబీసీ మరాఠి

ఫొటో సోర్స్, Getty Images
భీమా కోరెగాం హింసకు సంబంధించి దేశవ్యాప్తంగా అరెస్టులు జరిగిన తర్వాత కూడా, అదే కేసులో నిందితుల్లో ఒకరైన శంభాజీ భిడెపై ఇంకా చర్యలు తీసుకోకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
బీబీసీతో మాట్లాడిన పుణె రూరల్ ఎస్పీ సందీప్ పాటిల్ మాత్రం శివ ప్రతిష్ఠాన్‌కు చెందిన శంభాజీ భిడె, సమస్త్ హిందూ అఘాదీకి చెందిన మిలింద్ ఎక్బోటేపై మరో 15-20 రోజుల్లో చార్జిషీటు ఫైల్ చేస్తామని చెబుతున్నారు.
"భీమా కోరెగాం హింస కేసులో శంభాజీ భిడే, మిలింద్ ఎక్బోటెపై చర్యలకు సిద్ధమవుతున్నాం. మరో 15-20 రోజుల్లో చార్జిషీటు ఫైల్ చేస్తాం" అని సందీప్ పాటిల్ చెప్పారు.
2018 జనవరి 1న భీమా కోరెగాంలో హింసాత్మక ఘటనలు జరిగిన తర్వాత రోజు పింప్రి-చించ్వాడ్, కాలేవాడీలో నివసించే అనితా సావ్లే పింప్రి పోలీస్ స్టేషన్లో వాటిపై ఫిర్యాదు చేశారు. దీని ప్రకారం శంభాజీ భిడె, మిలింద్ ఎక్బోటే ఈ కేసులో నిందితులు.
ఫొటో సోర్స్, WWW.NARENDRAMODI.IN
భీమా కోరెగాం హింస తర్వాత 2018 ఫిబ్రవరిలో భిడెకు వ్యతిరేకంగా ఫిర్యాదు నమోదైన తర్వాత కూడా శంభాజీ భిడెతో కలిసి వేదిక పంచుకుంటున్న ఒక వీడియోను నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు
ఎక్బొటే లోపల, భిడె బయట
ఫిర్యాదు నమోదు చేసిన మూడున్నర నెలల తర్వాత మార్చి 14న మిలింద్ ఎక్బోటెను పోలీసులు అరెస్టు చేశారు. అతడు ఏప్రిల్‌లో బెయిల్‌పై విడుదలయ్యారు. కానీ, ఈ కేసులో మరో నిందితుడుగా ఉన్న శంభాజీ భిడెను మాత్రం ఇప్పటివరకూ అరెస్ట్ చేయలేదు.
అతడిని ఎందుకు ఇంకా అరెస్టు చేయలేదన్నప్పుడు "నేను పుణె రూరల్ ఎస్పీగా కొన్ని రోజుల క్రితమే చార్జ్ తీసుకున్నాను. అవసరమైన పత్రాలు పరిశీలించిన తర్వాత మాత్రమే నేను ఈ కేసు గురించి మాట్లాడగలను" అని సందీప్ పాటిల్ తెలిపారు.
2018 మార్చిలో భిడెకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. అసెంబ్లీలో మాట్లాడిన సీఎం "కేసు పెట్టిన మహిళ, భీమా కోరెగాం హింస సమయంలో తను స్వయంగా శంభాజీ భిడె, మిలింద్ ఎక్బొటె అల్లర్లకు నేతృత్వం వహించడం చూశానని చెప్పింది. తర్వాత మేజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలంలో శంభాజీ భిడె ఎవరో తనకు తెలీదని, అతడిని ఎప్పుడూ చూళ్లేదని చెప్పింది" అన్నారు.
ఫొటో సోర్స్, ANITA SAWALE
శంభాజీ భిడెకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్
శంభాజీ భిడె, ఎక్బొటెపై ఫిర్యాదు చేసిన అనితా సావ్లేతో బీబీసీతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ప్రకటనపై స్పందించిన ఆమె "సీఎం ఎఫ్ఐఆర్ నమోదు చేసినపుడు రికార్డ్ చేసిన నా వాంగ్మూలం గురించి తప్పుగా చెప్పారు. ఆయన దాన్ని సరిగా చదవలేదేమో, ఆయన మొత్తం విషయాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. అయినా శంభాజీ భిడెను ఇప్పటికే అరెస్ట్ చేయాల్సింది. ఆయనకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ ఉన్నప్పుడు, నిందితుడు అయినపుడు, ఆయన్ను అరెస్ట్ చేసి కోర్టుకు ముందు హాజరు పరచాలిగా" అన్నారు. భిడె అరెస్టు గురించి బాంబే హైకోర్టులో కూడా పిటిషన్ వేసినట్టు అనిత తెలిపారు.
ఫొటో సోర్స్, ANITA SAWALE
అనితా సావ్లే
గురూజీకి ప్రమేయం లేదు
శంభాజీ భిడెపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేసిన శివ ప్రతిష్టాన్ ప్రతినిధి నితిన్ చౌగులే "భిడె గురూజీకి అక్కడ జరిగిన ఘటనలతో ఎలాంటి సంబంధం లేదని మేం మొదటి రోజు నుంచీ చెబుతూనే ఉన్నాం. గత 8 నెలలుగా ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులకు కూడా భిడె గురూజీకి వ్యతిరేకంగా ఏ ఆధారాలూ లభించలేదు. ఆరోపణలు చేస్తున్న వారు తమ దగ్గర ఏవైనా ఆధారాలు ఉంటే వాటిని పోలీసులకు ఇవ్వాలి. ఈ కేసులో అరెస్టైన మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆధారాలు దొరికాయి కాబట్టే పోలీసులు వారిని అరెస్ట్ చేశారు" అన్నారు.
ఫొటో సోర్స్, FACEBOOK/MILIND EKBOTE
మిలింద్ ఎక్బోటే
పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారు
దీనిపై మాట్లాడిన సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ పీబీ సావంత్ "ఎవరినైనా అరెస్టు చేయాలా లేదా అనేది పోలీసులే నిర్ణయిస్తారు. వాళ్లు ఇతరులను అరెస్టు చేసుండచ్చు. కానీ హిందుత్వ వాదులను అరెస్టు చేయకపోవడం అనేదంతా వారి వ్యూహం కావచ్చు. ప్రజల ఒత్తిడి ఉంది కాబట్టే కేసు నమోదు చేశారు. కానీ ఆధారాలు సేకరించడంలో, వాటిని కోర్టు ముందు ప్రవేశపెట్టడంతో నిర్లక్ష్యం చేశారు. తర్వాత వారిని అమాయకులుగా ప్రకటిస్తారు. హిందుత్వ వాదులు ఎలాంటి నేరపూరిత చర్యలు చేసినా, తమ పాలన కాబట్టి, వారు ఎలాంటి శిక్షా ఎదుర్కోరు. వాళ్లకు ప్రభుత్వం నుంచే ఈ శక్తి అందుతోంది అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీకి శంభాజీ భిడెతో మంచి సంబంధాలు ఉన్నాయి. రాయ్‌గఢ్ పోర్ట్ దగ్గర తన ప్రసంగంలో భిడె గురూజీ తనకు చాలా ఏళ్ల నుంచీ తెలుసని ప్రధాని చెప్పారు. ఆయనను గొప్పవారుగా వర్ణించారు. భిడెను అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. నేను ఆయన ఆదేశాలను పాటిస్తానని, గౌరవంగా ఆయనకు తలవంచుతానని తెలిపారు.
భీమా కోరెగాం హింస తర్వాత 2018 ఫిబ్రవరిలో భిడెకు వ్యతిరేకంగా ఫిర్యాదు నమోదైన తర్వాత కూడా శంభాజీ భిడెతో కలిసి వేదిక పంచుకుంటున్న ఒక వీడియోను నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి
- నాగ్‌పూర్ అత్యాచారం: 'పాతికేళ్ల నా సర్వీసులో అంత క్రూరత్వాన్ని ఎప్పుడూ చూడలేదు’
- హరికృష్ణ దుర్మరణం: ఒకే జిల్లా.. ఒకే కుటుంబం.. మూడు ప్రమాదాలు
- డోనల్డ్ ట్రంప్: మా పార్టీకి ఓటు వేయకుంటే 'అన్నీ కోల్పోవాల్సి వస్తుంది'
- హైదరాబాద్‌కు 500 ఏళ్లు: ఎక్కడ మొదలైంది.. ఎలా ఎదిగింది?
- వైరల్ ఫొటో: ‘స్కూల్ టూర్ కోసం వృద్ధాశ్రమానికి వెళ్తే... అక్కడ నానమ్మ కనిపించింది’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)