మేధావుల్లేని భారతదేశమే మోదీ లక్ష్యం: ఆనంద్ తేల్తుంబ్డే

నరేంద్ర మోదీ

''నేనొక భయంకరమైన ఉగ్రవాదినో, నేరగాడినో అన్నట్లుగా మా ఇళ్లపై దాడులు చేశారు. పోలీసులు నన్ను విచారించదలిస్తే నన్ను పిలవడమో, నా దగ్గరకు వారు రావడమో చేయాల్సింది. కానీ, ఇప్పుడిలా నేనేదో కరడుగట్టిన నేరస్థుడిని అన్నట్లుగా చూపిస్తున్నారు'' ...తన ఇంటిపై పోలీసుల దాడుల నేపథ్యంలో ప్రొఫెసర్ ఆనంద్ తేల్తుంబ్డే చెప్పిన మాటలివి.

రెండు రోజుల కిందట ఆగస్టు 28న పోలీసులు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఉద్యమకారుల ఇళ్లపై దాడులు చేసి అయిదుగురిని అరెస్ట్ చేశారు.

ముంబయిలో వెర్నన్ గొంజాల్వెజ్, పుణెలో అరుణ్ ఫెరీరా, దిల్లీలో గౌతమ్ నవ్‌లాఖా, హైదరాబాద్‌లో వరవరరావు, హరియాణాలో సుధా భరద్వాజ్‌ను అరెస్ట్ చేశారు. వీరితో పాటు ఆనంద్ తెల్దుంబ్డే, మరికొందరి ఇళ్లపైనా దాడులు చేసి సోదాలు చేశారు.

ఆనంద్.. గోవా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ క్వార్టర్లలో నివసిస్తారు. పోలీసుల సోదాల సమయానికి ఆయన ఇంట్లో లేరు. ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో వారు సెక్యూరిటీ గార్డును బెదిరించి తాళం తీసుకుని తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తన ఇంటి తాళం తీసి సోదాలు జరిపారని ఆయన ఆరోపిస్తున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో డాక్టర్ ఆనంద్ తేల్తుంబ్డేను బీబీసీ తమిళ ప్రతినిధి ఎం.నియాస్ అహ్మద్‌ ఈమెయిల్ ద్వారా సంప్రదించారు. ఆ వివరాలు ఆనంద్ మాటల్లోనే..

ఫొటో క్యాప్షన్,

ఆనంద్ తేల్‌తుంబ్దె

సత్యసాయిబాబా గాల్లోంచి విభూతి సృష్టించినట్లుగా..

''ప్రస్తుత ప్రభుత్వం నిరాశాజనక పరిస్థితుల్లో ఇలాంటి చర్యలకు దిగుతోంది. ప్రజల హక్కులకు రక్షణగా నిలుస్తున్నవారిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరుగుతున్నాయి. దాడులకు గురైన వారంతా రాజకీయ నేతలతో ఏమాత్రం పోల్చలేని సామాన్య ప్రజాజీవితం గడుపుతున్నవారే. దేశ ప్రజల్లో ఉన్న అసమ్మతిని లేవనీయకుండా చేయడానికే వీరిపై చర్యలకు దిగుతున్నట్లు స్పష్టమవుతోంది.

ఈ అరెస్టులకు, భీమా కోరెగావ్ హింసకు ముడిపెడుతూ తప్పుడు అభియోగాలు మోపడంలో ఆ ఘటనలకు అసలు కారకులైన వారికి రక్షించేందుకు ప్రభుత్వం పడుతున్న తాపత్రయం కనిపిస్తోంది.

మిళింద్ ఎగ్బోటె, శంభాజీ భిడేలు అవాంఛనీయ ఘటనలకు ప్రణాళికలు రచిస్తున్నారని సామాన్య ప్రజానీకం సైతం ఘోషిస్తున్న తరుణంలోనూ సరిపడినంత మంది పోలీసులను అక్కడ మోహరించకపోవడమనేది.. ఈ హింసకు కారణమైనవారితో ప్రభుత్వానికి ఉన్న సంబంధాలను విస్పష్టంగా తెలియజేస్తోంది.

వారిపైనుంచి దృష్టి మళ్లించేందుకు గాను ప్రభుత్వం జిగ్నేశ్ మేవానీ, ఉమర్ ఖలీద్ ప్రసంగాలు రెచ్చగొట్టేలా ఉన్నాయన్న ఆరోపణలు మొదలుపెట్టింది.

ఎల్గార్ పరిషత్ నిర్వహణకు తమకు ఎవరి నుంచీ ఒక్క పైసా కూడా అవసరం లేదని జస్టిస్ ఖోల్షే పాటిల్ చెబుతున్నప్పటికీ ఎల్గార్ పరిషత్‌కు మావోయిస్టుల నుంచి నిధులు అందాయన్న ఆరోపణలు మొదలుపెట్టారు. అంతేకాదు, సత్యసాయిబాబా గాల్లోంచి విభూతి సృష్టించినట్లుగా మావోయిస్టు నాయకుల లేఖలంటూ పోలీసులు తప్పుడు ఉత్తరాలు సృష్టించారు.

తమ చర్యలను మరింత బలపరుచుకోవడం కోసం ఉద్యమకారులు మోదీని హత్య చేసేందుకు కుట్ర పన్నారన్న అభియోగాలు మోపారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచీ తన ప్రజాకర్షణ తగ్గుతున్న ప్రతిసారీ తనపై హత్యకు కుట్రలు జరుగుతున్నాయన్న కట్టుకథలు అల్లి బూటకపు ఎన్‌కౌంటర్లకు పాల్పడుతున్నారు.

ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు పాటుపడుతున్నవారి రక్షణకు న్యాయవ్యవస్థ ముందుకు కదలడానికి ప్రభుత్వం అనుసరిస్తున్న ఇలాంటి దుశ్చర్యల ఉదాహరణలు చాలు'' అన్నారు.

బీబీసీ: దేశంలో భావస్వేచ్ఛ ముప్పు ముంగిట ఉందని భావిస్తున్నారా? మేధావుల గొంతులను ప్రభుత్వం నొక్కేస్తుందని అనుకుంటున్నారా?

ఆనంద్: కచ్చితంగా. విమర్శించేవారిపై మావోయిస్టులన్న ముద్ర వేయడం ప్రభుత్వానికి వంతపాడేవారికి అలవాటే. ఈ ప్రభుత్వం దేశాన్ని మేధోరహితంగా మార్చాలని కోరుకుంటోంది. మేధావులు ఉంటే ప్రశ్నిస్తారు.. ఆ ప్రశ్నలను ప్రభుత్వం సహించలేదు. ప్రజలను వివేకశూన్యులుగా మార్చేస్తే ఆ తరువాత తమ భక్తులుగా మార్చుకోవడం ప్రభుత్వ పెద్దలకు చాలా సులభం కదా.

బీబీసీ: తమలా ఇంకే ప్రభుత్వమూ బీఆర్ అంబేడ్కర్‌ను గౌరవించలేదని ప్రధాని మోదీ ఇటీవల చెప్పారు. అంతేకాదు, తమ ప్రభుత్వం పేదల కోసమే పనిచేస్తోందని ఆయన తరచూ చెబుతుంటారు. దీనిపై మీరేమంటారు? బీజేపీని దళిత వ్యతిరేకిగా చూస్తారా?

ఆనంద్: దళితులను ఇంతగా కష్టపెట్టిన ప్రభుత్వం కూడా ఇంకేదీ లేదు. అంబేడ్కర్‌ను కీర్తించడం, ఆయనకు స్మారకాలు నిర్మించడం అంతా ఒక వ్యూహం. స్వతంత్ర భావాలు గల దళితుల గొంతు పెగలకుండా చేయడమే దీని ఉద్దేశం.

కార్పొరేట్ సంస్థలను మునుపెన్నడూ లేనంత సుసంపన్నంగా మార్చిన ప్రభుత్వమేదో తెలుసు. ప్రపంచంలో ఇంకెక్కడా లేనంతగా దేశంలో అసమానతలు పెరిగిపోయాయి. పేదల అభివృద్ధిని తెలిపే సూచీలు ఈ ప్రభుత్వ పాలనలో ఎలా ఉన్నాయో తెలిసిందే.

బీబీసీ: సమకాలీన దళిత రాజకీయాలు ఏ దిశగా సాగుతున్నాయి?

ఆనంద్: సైద్ధాంతిక అస్థిరత, చీలికలు సుదీర్ఘకాలంగా దళిత రాజకీయాలను సమాధి చేస్తున్నాయి. దళితుల్లో కొత్త తరం ఇప్పుడు సరికొత్త స్పృహతో ఉద్భవిస్తోంది. వారిప్పుడు ప్రాపంచిక దృక్పథంతో ముందుకు సాగుతూ తమ భూహక్కులను, విద్యా హక్కును, సమాజంలో హుందాగా జీవించే హక్కును సాధించుకుంటున్నారు. ఈ దేశంలోని ప్రతి ప్రాంతంలోనూ ఇప్పుడిలాంటి క్షేత్ర స్థాయి ఉద్యమాలు వందలకొద్దీ వస్తున్నాయి. ఇవి నిద్రాణంగా ఉన్న దళిత శక్తికి కొత్త ఊపునిస్తాయని ఆశిస్తున్నాను, విప్లవాత్మక ప్రత్యామ్నాయాలకు బాటలేస్తున్నాయనీ చెప్పగలను.

బీబీసీ: అసమ్మతి వ్యక్తంచేసేవారిపై ప్రభుత్వం దేశద్రోహులు, మావోయిస్టులన్న ముద్ర వేస్తుందని భావిస్తున్నారా..

ఆనంద్: అవును. దేశద్రోహులు, మావోయిస్టులు వంటి విస్తృతార్థం ఉన్న పదాల అర్థాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా మార్చేసింది. అసమ్మతి తెలిపిన ప్రతి ఒక్కరిపైనా ఈ ముద్రవేస్తోంది. ఇది చాలదన్నట్లుగా కొత్తగా 'అర్బన్ మావోయిస్ట్' అన్న పదాన్ని పుట్టించారు. ప్రభుత్వానికి విధేయత ప్రకటించని ఉద్యమకారులు, మేధావులను ఈ కేటగిరీలోకి నెడుతున్నారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)