కుమారస్వామి: వంద రోజుల్లో 50 ఆలయాలు.. భయంతోనా లేక భక్తితోనా?

  • 1 సెప్టెంబర్ 2018
కుమారస్వామి ఆలయాలు చుట్టేస్తున్నారు Image copyright KUMARASWAMY/FACEBOOK

కర్నాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి వందకు 50 స్కోర్ చేసి కొత్త రికార్డు సృష్టించారు.

ఇది వినడానికి క్రికెట్ మ్యాచ్ స్కోర్ కార్డులా అనిపించవచ్చు. కానీ ఆయనది ఆ రికార్డు కాదు.

జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆయన మొదటి వంద రోజుల్లోపే 50 మసీదులు, ఆలయాలు, చర్చిలకు వెళ్లి పూజలు, ప్రార్థనలు చేశారు.

కుమారస్వామి మద్దతుదారులు, మతవిశ్వాసం ఉన్న వారు కూడా ఆయన చేస్తున్నది చూసి షాక్ అవుతున్నారు.

ముఖ్యమంత్రి వంద రోజుల్లో 47 ఆలయాలు, ఒక దర్గా, ఒక మసీదు, ఒక చర్చికి వెళ్లారు.

అలా అని రోజు మార్చి రోజు కుమారస్వామి ఆలయాలు చుట్టేస్తున్నారని కాదు, కొన్నిసార్లు ఆయన ఒకేరోజు రెండుమూడు లేదా నాలుగు ఆలయాలకు కూడా వెళ్లి పూజలు చేసేస్తున్నారు.

ఆయన పర్యటనలు ఇప్పుడు కర్నాటక రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమయ్యాయి. చాలా మంది ఆయనపై విమర్శలు కూడా చేస్తున్నారు.

"మేం కూడా గుడులు, గోపురాలకు వెళ్తాం.. అలా అని రోజూ గంతులేసి అలా ఆలయాలకు వెళ్లిపోం" అనే కామెంట్ ప్రస్తుతం బెంగళూరులో చాలా ఎక్కువగా వినిపిస్తోంది.

Image copyright Getty Images

అధికారం చేజారుతుందని భయమా?

కుమారస్వామి గుడులు-మసీదులు చుట్టూ అంతగా ఎందుకు తిరిగేస్తున్నారు అనేదే ఇప్పుడు ప్రశ్న.

"ఆయనకు అధికారం చేజారుతుందేమో అని భయమేస్తోంది. భవిష్యత్తు అనిశ్చితిగా ఉందని ఎవరికైనా అనిపిస్తే, మానసికంగా వారు ఏదైనా దైవిక సాయం కోసం వెతుకుతారు. ఎవరైనా సన్యాసి దగ్గరకు వెళ్లడం, ఏదైనా దర్గాకో, చర్చికో వెళ్లడం చేస్తారు" అని సంస్కృతం ప్రొఫెసర్ ఎంఏ అల్వర్ చెప్పారు.

"ఎవరైనా దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా గురువు, లేదా జోతిష్యుడి దగ్గరకు వెళ్తారు. పురాతన కాలంలో రాజులు కూడా తమ గురువులు లేదా జోతిష్యుల సలహాలు తీసుకునేవారు. అలాగే నేతలు కూడా ఇప్పుడు పూజలు, హోమాలు చేస్తున్నారు" అని కేరళ జోతిష్యుడు విష్ణు పుచక్కడ్ తెలిపారు.

ప్రస్తుతం జనం పూజలు, వ్రతాలు ఎక్కువ చేస్తున్నప్పటికీ, అవన్నీ చాలా వరకూ ప్రొఫెషనల్ అయిపోయాయని విష్ణు అన్నారు.

"శాస్త్రాలను సరిగా అర్థం చేసుకోవడం చాలా అవసరం. జ్యోతిషులు మీకు సలహా ఇవ్వచ్చు, కానీ మీలోపల కూడా దానిపై విశ్వాసం ఉండడం చాలా అవసరం" అని ఆయన చెప్పారు.

కొంతమంది కేవలం భయంతో ఆలయాలు-మసీదులు చుట్టేస్తారు. కొంతమంది సరైన దారి ఎంచుకుంటారు. ఇద్దరికీ ఫలితం లభిస్తుంది. భయపడ్డవారికి మానసిక శాంతి, దారి వెతికినవారికి ఆ దారి దొరుకుతుంది. కానీ వారి మనసులో విశ్వాసం ఉండడం చాలా అవసరం అని విష్ణు చెబుతారు.

Image copyright Getty Images

తన కోసమా? రాష్ట్రం కోసమా?

"నేతలకు అభద్రతాభావం ఎక్కువగా ఉంటుంది. కానీ వారు చేసే పూజలు, ప్రార్థనలు ఎలాంటివి అనేది నిర్వచించలేం. ఆలయాలకు వెళ్లడం వల్ల వారు ధార్మికులు అని ఎలా అనగలం. దేవుడు సర్వాంతర్యామి. మా ఇంట్లో కూడా ఉన్నాడు. అలాంటప్పుడు నేను గుడులు, మసీదులకు, చర్చిలకు ఎందుకు వెళ్లాలి" అని మానసికనిపుణులు డాక్టర్ శ్రీధర్ మూర్తి అన్నారు.

కుమారస్వామి గురించి అడిగిన ప్రశ్నకు "కుమారస్వామి మనసులో ఏముందనేది నేను చెప్పలేను. మొదట్లో రాజులు తమ రాజ్యం కోసం పూజలు, హోమాలు చేసేవారు. ఇప్పుడు కూడా ఆయన రాష్ట్రం కోసం వెళ్లుండచ్చు. దేవుడి పూజను ఎన్నో రూపాల్లో చేయవచ్చు" అని విష్ణు అన్నారు.

కుమారస్వామి తండ్రి దేవగౌడ మతవిశ్వాసాలను, జ్యోతిషులను నమ్మే నేతగా పేరు తెచ్చుకున్నారు.

కుమారస్వామి సన్నిహితులు కొందరు పేర్లు బయటపెట్టకూడదనే షరతుతో "తనకు ముఖ్యమంత్రి అయ్యేందుకు తగినన్ని స్థానాలు రాకపోతే రాజకీయాలే వదిలేస్తానని ఆయన ప్రమాణం చేశారు" అని చెప్పారు.

అదృష్టవశాత్తూ కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఏర్పడిన నాటకీయ పరిణామాల తర్వాత కాంగ్రెస్ ఆయనకు చివరికి ముఖ్యమంత్రి స్థానం అప్పగించింది.

పేరు రాయకూడదని కోరిన ఆయన సన్నిహితుడు ఒకరు "అలా ముఖ్యమంత్రి అయ్యాక ఆయనలో చాలా మార్పు వచ్చినట్టు నాకు అనిపిస్తోంది. ఆయన ఇప్పుడు గుళ్లు, మసీదులు అన్నీ తిరిగేస్తున్నారు" అని చెప్పారు.

Image copyright Getty Images

భక్తిలో మునిగిన నేతలు

మెజారిటీ నిరూపించుకోలేకపోయిన యడ్యూరప్ప రాజీనామా చేయగానే కుమారస్వామి కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఆలయాలకు వెళ్లడం ప్రారంభించారు. తన ప్రమాణ స్వీకారం రోజు కూడా ఆయన ఒక ఆలయానికి, ఒక దర్గాకు, ఒక చర్చికి వెళ్లొచ్చారు.

యడ్యూరప్ప కూడా 2008లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేరళలోని ఆలయాలకు, వైష్ణోదేవి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)