మహిళల రేడియో: మీరు వింటున్నారు.. 90.4 ఎఫ్ఎం

  • 2 సెప్టెంబర్ 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionమహిళల రేడియో: మీరు వింటున్నారు.. 90.4 ఎఫ్ఎం..

హలో... మీరు వింటున్నది 90.4 ఎఫ్.ఎమ్.. ఈరోజు మీకో రేడియో కథ చెప్పాలనుకుంటున్నాం. గుజరాత్‌లోని మారుమూల కచ్ ప్రాంతంలో కేవలం మహిళలతోనే నడిచే ఓ రేడియో స్టేషన్ ఇది. ఎప్పుడూ బడికి వెళ్లని మహిళలు, మధ్యలోనే చదువు మానేసిన గ్రామీణ మహిళలు ఈ రేడియో స్టేషన్‌ను ఎలా నడుపుతున్నారో చూద్దాం రండి..

సయార్ జో రేడియో పిలుపుతో ఇక్కడి చాలా గ్రామాలు మేల్కొంటాయి. నఖట్రానా తాలుకాలోని భిన్సర్ గ్రామంలో ఉన్న 90.4 కమ్యూనిటీ రేడియో ఓ ప్రత్యేకతను సంతరించుకుంది.

ఎందుకంటే ఇది కేవలం మహిళలతోనే నడుస్తోంది. 2012లో ప్రారంభమైన ఈ రేడియో.. ఆరోగ్యం, వ్యవసాయం, పశుపోషణ, విద్య తదితర అంశాలపై కచ్ భాషలో ప్రసారాలు అందిస్తోంది.

ఈ రేడియో స్టేషన్‌కు షరిఫా చెడ్డా మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. రేడియో జాకీగా పని చేయడానికి, ఓ కమ్యూనిటీ రేడియో మేనేజర్‌గా పనిచేయడానికి చాలా తేడా ఉందని ఈమె అంటున్నారు. మహిళల్లో చైతన్యాన్ని కలిగించేందుకు 90.4 రేడియో స్టేషన్ పనిచేస్తోంది.

‘‘ఇది మహిళలకు చాలా ఉపయోగపడుతోంది. రుతుస్రావం మీద మేం ప్రసారం చేసిన కార్యక్రమం నచ్చిందని ఓ మహిళ చెప్పింది. ఆ కార్యక్రమం విన్న తర్వాత తన కూతుర్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లానని ఆమె అంది’’ అని షరిఫా చెడ్డా అన్నారు.

దేవిసర్ గ్రామానికి చెందిన శాంత భవన నిర్మాణ పనికి వెళ్లడానికి ఉదయాన్నే లేవాలి. ఇంట్లో పనులు చేసే బాధ్యత కూడా ఆమె మీద ఉండటంతో చదువును మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది.

పొద్దున్నే లేచి ఇంట్లో పనులు చేసి ఆ తర్వాత పనికి వెళ్లాలి. కానీ ఆమె రేడియో జర్నలిస్టుగా మారారు. ప్రస్తుతం రేడియోలో పనిచేస్తుండటంతో స్కూల్‌కు వెళ్లలేకపోయాననే బాధ ఆమెలో లేదు. రేడియో తన జీవితాన్ని మార్చేసిందని శాంత నమ్ముతున్నారు.

‘‘నా సమస్యలేంటో తెలుసుకోవడం నేర్చుకున్నా. మొదట్లో కొత్తవాళ్లతో మాట్లాడాలంటే భయమేసేది. ప్రజల మధ్య సరిగా మాట్లాడలేకపోయేదాన్ని. రేడియో స్టేషన్‌లో చేరాక నేనూ మాట్లాడగలననే ధైర్యం వచ్చింది’’ అని శాంత పయాన్ అంటున్నారు.

శాంతలాగే చాలా మంది మహిళలు సయార్ జో రేడియోతో అనుసంధానమయ్యారు. ఆరేళ్లలో ఈ రేడియో వినే వారి సంఖ్య 26 గ్రామాల్లో 6 వేలకు పెరిగింది. ఈ రేడియో ప్రసారాల్లో సురవాణి, ఖాసో శాషన్ కార్యక్రమాలు ప్రాచుర్యం పొందాయి.

‘‘రేడియో కారణంగా ఈ గ్రామాల ప్రజలు కొత్త విషయాలు తెలుసుకోగలుగుతున్నారు. మొదట్లో ఇక్కడి మహిళలకు చాలా విషయాలు తెలియవు. రేడియో వచ్చాక చాలా విషయాలు తెలుసుకుంటున్నారు’’ అని ఈ రేడియో వినే ఒక పురుషుడు అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)