పోలీసులు చూపిన లేఖలు పూర్తిగా కల్పితం: సుధా భరద్వాజ్

ఎల్గార్ పరిషత్ కేసు దర్యాప్తు చేస్తున్న మహారాష్ట్ర పోలీసులు శుక్రవారం నిర్వహించిన ప్రెస్మీట్లో కొన్ని లేఖలు చదివి వినిపించారు. వాటిని సుధా భరద్వాజ్, మిలింద్ తెల్దుంబ్దే, రోనా విల్సన్ రాశారని చెప్పారు. నక్సల్స్ ప్లానింగ్, తదుపరి కార్యాచరణ, నిధులు, ఆయుధాలు సేకరించడం గురించి ఈ లేఖల్లో ఉందని ఆరోపించారు.
‘ఆ లేఖలు కల్పితం’ అని పేర్కొంటూ సుధా భరద్వాజ్ తమ లాయర్ వృందా గ్రోవర్ ద్వారా ఒక లేఖను విడుదల చేశారు.
న్యాయవాది, హక్కుల కార్యకర్త అయిన సుధా భరద్వాజ్ దిల్లీలోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో గెస్ట్ ఫ్యాకల్టీగానూ పనిచేస్తున్నారు. కార్మిక నేత కూడా అయిన ఆమె న్యాయవాదిగా తరచూ కార్మికులకు సంబంధించిన కేసులను వాదిస్తుంటారు.
తన డైరీలోని పేజీల్లో సుధా భరద్వాజ్ స్వదస్తూరీతో ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఆ లేఖలో ఆమె పోలీసుల ఆరోపణలను ఖండిస్తూ 9 పాయిట్లు రాశారు.
ఆ వివరాలు.. ఆమె మాటల్లోనే..
‘‘నా (సుధా భరద్వాజ్) తోపాటు, మానవ హక్కుల సంఘాల లాయర్లు, ఇతర ఉద్యమకారులు, సంస్థలను నేరాల్లో ఇరికించేందుకు పోలీసులు పూర్తిగా కల్పిత లేఖను సృష్టించారు. ’’
‘‘బహిరంగంగా అందుబాటులో ఉన్న వాస్తవాలు, నిరాధార ఆరోపణలతో పోలీసులు ఈ లేఖలు సృష్టించారు. ’’
‘‘చట్టబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన సమావేశాలు, సెమినార్లు లాంటి వాటిని పోలీసులు మావోయిస్టులకు నిధులు సమకూర్చేందుకు నిర్వహించామని చెబుతున్నారు.’’
"హ్యూమన్ రైట్స్ లాయర్లు, ఆ సంస్థల కార్యకలాపాలు అడ్డుకోడానికి, వారిపై ద్వేషం కలిగించేందుకు ఉద్దేశపూర్వకంగా వారికి మచ్చతెస్తున్నారు"
‘‘లాయర్స్ అసోసియేషన్ అయిన ఐఏపీఎల్ అధ్యక్షుడు జె.హోస్పేట్ సురేష్ లాయర్లపై దాడులకు వ్యతిరేకంగా మాట్లాడారని ఆ సంఘం చట్టబద్ధతనే రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నారు.’’
"నేను మోగాలో జరిగిన ఏ కార్యక్రమానికీ, ఎప్పుడూ 50 వేల రూపాయలు ఇవ్వలేదని స్పష్టంగా చెప్పాను. మహారాష్ట్రకు చెందిన అంకిత్, లేదా కాశ్మీరీ వేర్పాటు వాదులతో సంబంధాలున్న కామ్రేడ్ అంకిత్ గురించి కూడా నాకు తెలీదు"
‘‘నాకు గౌతమ్ నవ్లాఖా, లాయర్ ప్రసాద్ చౌహాన్ గురించి కూడా తెలుసు. నన్ను నేరాల్లో ఇరికించడానికే వారి పేర్లు చెబుతున్నారు. వారిపై చేసిన ఆరోపణలు కూడా నిరాధారమైనవే.’’
‘‘జగదల్పూర్ లీగల్ ఎయిడ్ గ్రూప్‌కు కూడా ఎలాంటి నిషేధిత సంస్థ నుంచి ఏ నిధులూ కేటాయించలేదు. వారు చట్టబద్ధంగా, న్యాయంగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.’’
"బస్తర్, చత్తీస్‌గఢ్‌లో మానవ హక్కుల ఉల్లంఘనను బయటపెట్టిన న్యాయవాదులు, ఉద్యమకారులు, సంస్థలపై ద్వేషం కలిగించడానికి, వారిని నేరాల్లో ఇరికించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు".
"ఈ లేఖలు కల్పితమని మరోసారి స్పష్టం చేస్తున్నా. వీటిని జులై 4న రిపబ్లిక్ టీవీలో చూపించినపుడే నేను వాటిని ఖండించాను. నన్ను పుణెకు దూరంగా ఉంచాలని వారు కోరిన సమయంలో కనీసం పుణె కోర్టుకు గానీ, ఫరీదాబాద్ సీజేఎం ఎదుటగానీ ఈ లేఖలు సమర్పించలేదు" అన్నారు.
అంతకు ముందు..
శుక్రవారం ప్రెస్ మీట్లో పోలీసులు తాజాగా రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని తెలిపారు. వీటితో సహా ఇప్పటివరకూ మొత్తం ఆరు ఎఫ్ ఐఆర్‌లు నమోదు చేశామన్నారు. ఢిల్లీ, నాగ్‌పూర్ పుణె సహా మొత్తం ఆరు ప్రాంతాల్లో సోదాలు జరిపామన్నారు. తనిఖీలను మొత్తం వీడియో తీశామని తెలిపారు.
తమకు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరెటరీకి పంపినట్టు అధికారులు తెలిపారు.
దర్యాప్తులో మావోయిస్టు సంస్థలు ఒక పెద్ద కుట్రకు పథకం వేశాయని గుర్తించామన్నారు. దర్యాప్తులో తమకు లభించిన కొత్త పేర్లను బట్టే అరెస్టులు చేశామన్నారు.
దర్యాప్తులో మేం కొత్త పేర్లు గుర్తించాం. జూన్ 6న మొదట నలుగురిని అరెస్ట్ చేశాం. వారికి మావోయిస్టు సెంట్రల్ కమిటీతో కమ్యూనికేషన్స్ ఉన్నాయన్నారు.
‘మేం సీజ్ చేసిన డివైస్ల ద్వారా ఈ కమ్యూనికేషన్స్ డీకోడ్ చేసేందుకు ప్రయత్నించాం. మా దగ్గరున్న ఆధారాల ద్వారా మావోయిస్టుల కుట్రలో అరెస్టు చేసిన వారి పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది.’ అని వివరించారు.
రోనా విల్సన్ కామ్రేడ్ ప్రకాష్‌కు రాసిన లేఖలో "మోడీ రాజ్ నో ఎండ్ కర్నా పడేగా.. అంటే రాజివ్ గాంధీ హత్య విధానం గురించి కూడా మేం ఆలోచిస్తున్నాం" అని ఉందని పోలీసులు పేర్కొన్నారు.
ఈ డాక్యుమెంట్లు మాకు రోనా విల్సన్ ల్యాప్‌టాప్ నుంచి లభించాయన్నారు.
కొన్ని లేఖల్లో కోరేగాం ప్రోగ్రాం గురించి కూడా ప్రస్తావించారు. వాటిలో ఎల్గార్ పరిషద్‌కు జరిగిన చెల్లింపుల గురించి కూడా ఉందని పోలీసులు తెలిపారు. ఈ లేఖలు 2018 మార్చి 18న రాసినట్టు ఉందని, వీటిని కామ్రేజ్ ప్రకాశ్ ఆనంద్ తెల్దుంబ్దేకి రాసినట్టు పోలీసులు తెలిపారు.
ఇవికూడా చదవండి:
- ‘అధికారాన్ని, వ్యవస్థను ప్రశ్నించేవారంతా అర్బన్ నక్సలైట్లైతే నేనూ అర్బన్ నక్సల్‌నే’
- క్వీన్ నీలగిరి: ఆకుపచ్చని ప్రపంచంలో అందాల రాణి
- డ్రోన్లు ఎగరేయాలంటే ఈ రూల్స్ పాటించాల్సిందే
- ఉద్యమకారుల అరెస్టు: మహారాష్ట్ర ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
- నాగ్‌పూర్ అత్యాచారం: 'పాతికేళ్ల నా సర్వీసులో అంత క్రూరత్వాన్ని ఎప్పుడూ చూడలేదు’
- ‘కొత్త రకం మోసం’: శిక్షణ అని చెప్పి ముక్కూమొహం తెలియని వ్యక్తితో పెళ్లి చేసేశారు
- వెనెజ్వేలా: శృంగార జీవితంపై సంక్షోభం ప్రభావం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)