బుద్ధగయలో మైనర్లపై బౌద్ధ భిక్షువుల ‘లైంగిక వేధింపులు’

  • సీటూ తివారీ
  • బీబీసీ కోసం
బౌద్ధ భిక్షువుల హస్త ప్రయోగం

ఫొటో సోర్స్, Getty Images

(గమనిక: ఈ వార్తలో బాధితుల పేర్లు మార్చాం. కొన్ని విషయాలు మీ మనసును బాధపెట్టేలా ఉండొచ్చు)

బిహార్‌ గయ జిల్లాలోని విష్ణుపద్ మందిరం దగ్గర అసోం భవన్‌లో కలకలంగా ఉంది. లోపలికి వెళ్తే, అక్కడ 15 మంది చిన్న పిల్లలు ఉండేవారని అంచనా వేయడం కూడా కష్టం.

ఒక గదిలో నేలపై వరుసగా పడుకుని ఉన్న పిల్లలు చాలా నీరసంగా ఉన్నారు. వారెవరికీ ఉలుకూపలుకూ లేదు. అందరి కళ్లలో తమ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో అనే దిగులు కనిపిస్తోంది.

ఆ పిల్లల తల్లిదండ్రుల పరిస్థితి కూడా సరిగ్గా అలాగే ఉంది.

అసోంకు చెందిన ఒక గ్రామం నుంచి నాలుగు రోజుల కిందట వాళ్లు ఇక్కడికి వచ్చారు. వారి పిల్లలు బుద్ధగయకు చెందిన మస్తీపూర్ గ్రామంలో ఉన్న ఒక బుద్ధిస్ట్ స్కూల్ అండ్ మెడిటేషన్ సెంటర్‌లో చదివేవారు.

ఈ మెడిటేషన్ సెంటర్‌లో చదువుకుంటున్న పిల్లలపై లైంగిక వేధింపులు జరిగినట్టు ఆగస్టు 29న ఆరోపణలు వచ్చాయి.

అసోంలోని లోగ్సోలియయే గ్రామానికి చెందిన 51 ఏళ్ల వ్యక్తికి ఆరుగురు పిల్లలు. వారిలో ఇద్దరు ఇక్కడ చదువుతున్నారు.

ఆయన బీబీసీ ప్రతినిధితో మాట్లాడుతూ.. "అబ్బాయిలను బౌద్ధ భిక్షువులు గదిలోకి పిలిపించి హస్త ప్రయోగం చేయించుకునేవారు. ఒక అబ్బాయిని వాళ్లు తమతోపాటూ కోల్‌కతా కూడా తీసుకెళ్లి కూడా అతడిపై వేధింపులకు పాల్పడ్డారు" అని చెప్పారు.

"మేం వ్యవసాయం చేసుకుంటాం. మా పిల్లలను డబ్బు ఖర్చు చేసి చదివించేంత స్తోమత లేదు. అందుకే ఉచితంగా చదువుకుంటారని ఏడాదిన్నరగా ఇక్కడ ఉంచాం"

ఇదే గ్రామానికి చెందిన మరో మహిళకు ఇద్దరు కుమారులు. 11, 9 ఏళ్ల వయసున్న వారు కూడా ఇదే మెడిటేషన్ సెంటర్‌లో చదివేవారు.

వారిలో 9 ఏళ్ల పిల్లాడికి శరీరం అంతా గాయాలు కనిపించాయి. తలకు గాయం అయిన గుర్తు కూడా ఉంది.

ఈ సందర్భంగా ఆ మహిళ మాట్లాడుతూ.. "29న మేం ఇక్కడకు వచ్చినప్పుడు పిల్లలందరూ ఏడ్చారు. తమను నగ్నంగా చేసి, కొడుతున్నారని, బౌద్ధ భిక్షువులు తమ జననాంగాన్ని లాగుతున్నారని నా కొడుకు చెప్పాడు. వాళ్లు తమ పిల్లలను అలా నగ్నంగా చేసి పెద్ద పిల్లలతో చాలాసార్లు కొట్టించారని తెలిసింది" అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, SEETU TEWARI/BBC

ఫొటో క్యాప్షన్,

అంతర్జాతీయ పర్యాటకులను బుద్ధగయలోని బౌద్ధ ఆరామాలు ఆకర్షిస్తాయి

ఈ ఘోరం ఎలా వెలుగులోకి వచ్చింది

అసోంకు చెందిన చక్మాకు సాధనానంద్ అనే బౌద్ధ భిక్షువు మొదటినుంచీ తెలుసు. సాధనానంద్ చెప్పడంతో ఆయన చాలా మంది పిల్లలను ఇక్కడ చేర్పించారు. కానీ ఆగస్టు 24న సాయంత్రం సాధనానంద్ దిలీప్‌కు ఫోన్ చేశారు. పిల్లల గురించి చెప్పారు. దాంతో దిలీప్ మిగతా పిల్లల కుటుంబ సభ్యులతో కలిసి ఆగస్టు 29న బుద్ధగయకు వెళ్లారు.

ముంబయిలో నివసించే సాధనానంద్ బీబీసీకి ఫోన్‌లో "నేను ఆగస్టు 22న మెడిటేషన్ సెంటర్‌కు వెళ్లా. అక్కడ పిల్లల శరీరంపై చాలా గుర్తులు కనిపించాయి. దాని గురించి నేను పిల్లల కుటుంబ సభ్యులకు చెప్పాను. మెడిటేషన్ స్కూల్ నడిపే ఆ సోషల్ వెల్‌ఫేర్ ట్రస్ట్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు. వారు కూడా నాకు బుద్ధగయలోనే పరిచయం అయ్యారు" అని చెప్పారు.

నగరంలోని ప్రధాన ప్రాంతానికి దూరంగా ఉండే ఈ మెడిటేషన్ సెంటర్ దగ్గరకు చేరుకోవాలంటే మంచి రోడ్డు కూడా లేదు. రెండేళ్ల నుంచీ నడుస్తున్న ఈ సెంటర్లో 32 మంది పిల్లలు ఉండేవారు. ప్రస్తుతం అక్కడ 17 మంది పిల్లలు ఉంటున్నారు. వీరిలో త్రిపుర నుంచి 14 మంది, అరుణాచల్ నుంచి ఇద్దరు, అసోం నుంచి ఒకరు ఉన్నారు.

త్రిపురకు చెందిన గము చినో ఈ సెంటర్ పనులు చూసుకుంటున్నారు. ఆయన "పోలీసులు నన్ను లైంగిక వేధింపుల గురించి అడుగుతున్నారు. నేను నెలన్నర క్రితమే ఇక్కడికి వచ్చా. నాకేం తెలీదు. ఇదంతా కొలిక్కి వస్తే నేను పిల్లల్ని తీసుకుని త్రిపుర వెళ్లిపోతా" అన్నారు.

ఫొటో సోర్స్, SEETU TEWARI/BBC

ఫొటో క్యాప్షన్,

ఈ కేసులో బౌద్ధ భిక్షువును అరెస్టు చేశారు

ఆరోపణలతో పిల్లల్ని బయట తీసుకొచ్చారు

పిల్లలపై లైంగిక వేధింపులు జరిగినట్టు ఆరోపణలు వచ్చేవరకూ తల్లిదండ్రులు మౌనంగానే ఉన్నారు. వారు బౌద్ధ భిక్షువు, వేధింపుల కేసులో నిందితుడు అయిన మెడిటేషన్ స్కూల్ నడిపే సుజాయ్ చౌదరిని స్కూల్ వదిలి వెళ్లిపొమ్మని చెప్పారు. ఆ తర్వాత మెడిటేషన్ స్కూల్ చీఫ్ పిల్లలను నగ్నంగానే సెంటర్ నుంచి వెళ్లగొట్టారు.

"సుమారు 8 గంటలకు పిల్లలందరినీ బయటకు తరిమేశారు. కానీ బౌద్ధ భిక్షువు పిల్లలు ఎవరితో అయినా మాట్లాడితే ఒప్పుకోడు. అందుకే మేం వాళ్లను ఏదీ అడగలేదు అని సెంటర్ దగ్గరే ఉండే సునందా దేవి, నమిత్ కుమార్ చెప్పారు.

అయితే కేంద్రం నుంచి బయటకు పంపించిన పిల్లలను తీసుకుని ప్రధాన ఆలయం దగ్గరకు వెళ్లిన తల్లిదండ్రులను స్థానికులు ఏం జరిగిందని అడిగారు. ఆ తర్వాత ఈ విషయం స్థానిక మీడియాకు తెలిసింది.

నిస్సహాయ స్థితిలో ఉన్న దిలీప్ బీబీసీతో "మేం పట్నా రాజేంద్రనగర్‌లో రైలెక్కి అసోం వెళ్లిపోయేవాళ్లం. ఇక్కడ ఫిర్యాదు చేయడం ఎలా? ఇక్కడ మాకు ఎవరూ తెలీదు. అందుకే ఏం మాట్లాడకుండా వెళ్లిపోవాలనుకున్నాం. కానీ ఇప్పుడు పోలీసులు చెప్పందే మేం వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు" అన్నారు.

ఫొటో సోర్స్, SEETU TEWARI/BBC

ఫొటో క్యాప్షన్,

కలెక్టర్ అభిషేక్ సింగ్ ప్రత్యేక కమిటీని నియమించారు

బాలల హక్కుల పరిరక్షణ సమితి నిర్లక్ష్యం

లైంగిక వేధింపులపై బుద్ధగయ పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్ 377, 341, 323, 504, 506 పోస్కో యాక్ట్ 4, 6, 8, 10, 12 ప్రకారం కేసులు నమోదు చేశారు. నిందితుడు సుజయ్ అలియాస్ సంఘప్రియ్‌ను అరెస్టు చేశారు.

గయ ఎఎస్పీ రమణ్ కుమార్ చౌదరి బీబీసీతో "పిల్లలందరికీ మెడికల్ పరీక్షలు చేయించాం. 164 మంది వాంగ్మూలం కూడా రికార్డు చేశాం. నిందితుడిని 14 రోజుల రిమాండుకు తరలించాం" అని తెలిపారు.

"పట్నా నుంచి వచ్చిన ఫోరెన్సిక్ టీమ్, బౌద్ధ భిక్షువు గది నుంచి కంబళి, బెడ్‌షీట్, మరికొన్ని వస్తువులు సీజ్ చేశారు. ఆయన మొబైల్ నుంచి అభ్యంతరకరమైన వీడియోలు, దృశ్యాలు ఏవీ లభించలేదు".

ఇటు కలెక్టర్ అభిషేక్ సింగ్ "విచారణ వీలైనంత త్వరగా పూర్తి చేసి, ఛార్జిషీటు ఫైల్ చేస్తాం. పిల్లల సంరక్షణ బాలల హక్కుల పరిరక్షణ సమితికి అప్పగిస్తాం" అన్నారు.

బాలల హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు గీతా మండల్‌ను ఈ వేధింపుల గురించి అడిగినప్పుడు "మేం కొత్తగా వచ్చాం. మాకు ఏ విషయం తెలీదు" అని నిర్లక్ష్యంగా చెప్పారు.

ఫొటో సోర్స్, SEETU TEWARI/BBC

ఫొటో క్యాప్షన్,

అంతర్జాతీయ బౌద్ధ భిక్షు సంఘం కార్యదర్శి ప్రజ్ఞాదీప్

మొదటి నుంచి సంఘంపై ప్రశ్నలు

ఇదే విషయంపై అంతర్జాతీయ బౌద్ధ సంఘం కూడా బోనులో నిలిచింది. 2015లో కూడా థాయ్‌లాండ్‌కు చెందిన ఒక బౌద్ధ భిక్షువు పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ విషయం వెలుగులోకి వచ్చింది.

బుద్ధగయలో మొత్తం 160 మఠాలు ఉన్నాయి. వీటిలో కేవలం 70లో మాత్రమే సంఘంతో రిజిస్టర్ అయి ఉన్నాయి. అసలు 20 ఏళ్ల నుంచీ నడుస్తున్న ఈ సంఘం రిజిస్ట్రేషన్ కూడా మూడు నెలల క్రితమే జరిగింది. ఈ సంఘం కార్యదర్శి ప్రజ్ఞాదీప్ బుద్ధగయలో సుమారు 400 మంది పిల్లలు ధార్మిక శిక్షణ పొందుతున్నారని తెలిపారు. అయితే, ఈ గణాంకాలను నమ్మడం కష్టం.

"మెడిటేషన్ సెంటర్‌లో చక్మా సమాజానికి చెందిన పిల్లలు ఉంటున్నారు. వీరి ఆర్థిక స్థితి అంతంతమాత్రంగానే ఉంటుంది. రెండేళ్ల నుంచి ఈ సెంటర్‌ను అద్దె ఇంటిలో నడుపుతున్న కేంద్రం చీఫ్ బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చారు. ఆయన సెంటర్ సంఘ్ నుంచి రిజిస్టర్డ్ కాలేదు. వాళ్లు ట్రస్ట్ ఏర్పాటు చేసి తమ పనులు తాము చేసుకుంటున్నారు. దాన్ని చూడడం ప్రభుత్వం బాధ్యత" అని ప్రజ్ఞాదీప్ అన్నారు.

ఇటు జిల్లా కలెక్టర్ అభిషేక్ సింగ్ "దీనిపై కమిటీని నియమించాం. అది ట్రస్ట్ కార్యకలాపాలపై దర్యాప్తు చేస్తుంది" అని చెప్పారు.

అయితే బుద్ధగయలో మఠాలు, స్థానికుల మధ్య వివాదాలు కొత్త కాదు. బుద్ధగయలోని బౌద్ధ ఆలయాలు మతం పేరుతో వ్యాపారం చేస్తున్నాయని అక్కడి హోటల్ అసోసియేషన్ ఆరోపిస్తోంది. 2016లో అప్పటి కలెక్టర్ కూడా తన రిపోర్టులో అది నిజమేనని చెప్పారు.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)