అమిత్ పంఘల్: ఒకప్పటి స్ట్రీట్ ఫైటర్.. నేడు ఆసియా క్రీడల గోల్డ్ మెడలిస్ట్

  • 2 సెప్టెంబర్ 2018
అమిత్ సాధించిన స్వర్ణ పతకాన్ని చూస్తున్న ఓ అభిమాని
చిత్రం శీర్షిక అమిత్ సాధించిన స్వర్ణ పతకాన్ని చూస్తున్న ఓ అభిమాని

మహార్ రెజిమెంట్‌కు చెందిన 22ఏళ్ల జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ అమిత్ పంఘల్ ఆసియా క్రీడల్లో బాక్సింగ్ రింగ్‌లోకి దిగడంతో హరియాణాలోని ఆయన స్వగ్రామం మైనాలో ప్రజలంతా టీవీలకు అతుక్కుపోయారు.

ఉజ్బెకిస్తాన్‌కు చెందిన దుస్మతోవ్ హసన్‌బోయ్‌ను ఫైనల్లో ఓడించిన అమిత్ పంఘల్ జకార్తాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో స్వర్ణాన్ని సొంతం చేసుకున్నారు.

అమిత్ గెలుస్తాడని ముందే ఊహించిన తల్లిదండ్రులు ఉష, విజేందర్ పంఘల్, తాత సీహెచ్ జాగ్రమ్, సోదరుడు అజయ్‌లు స్వీట్లతో సిద్ధంగా ఉన్నారు. విజయం సాధించిన వెంటనే ఆనందంతో వాటిని ఇరుగుపొరుగుకు పంచిపెట్టారు.

కొద్ది సేపట్లోనే అమిత్ ఇంటికి రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖుల వెల్లువ మొదలైంది. కానీ అమిత్ ఉండే ఇల్లు ఓ చిన్న వీధిలో ఉంటుంది. అదంతా బురద, గుంతలమయం. దీంతో దూరంలోనే వారు తమ కార్లను ఆపేయాల్సి వచ్చింది.

"నేను నా జీవితంలో సాధించలేనిది నా మనవడు సాధించాడు. నా మనవళ్లిద్దరూ మంచి బాక్సర్లు. కానీ అమిత్‌కు కొంత ప్రోత్సాహం లభించడంతో మరింత మెరుగయ్యాడు" అని రాష్ట్ర స్థాయి మాజీ రెజ్లర్, ఆర్మీ మాజీ కెప్టెన్, అమిత్ తాత జాగ్రమ్ తెలిపారు.

"వారికోసం నేనేం చేశానంటే... క్రీడాకారులకు శరీరం బలంగా ఉండటం చాలా అవసరం. దీనికి శుద్ధమైన పాలు, నెయ్యి కావాలి. అందుకే ముర్రా జాతి పశువులను పెంచుకోవాలని సలహా ఇచ్చా" అంటారు జాగ్రమ్.

చిత్రం శీర్షిక కుమారుడు అమిత్ ఇప్పటివరకూ సాధించిన పతకాలతో తల్లి ఉష

అందరితో ఫైటింగ్ చేసేవాడు: ఉష, అమిత్ తల్లి

అమిత్ చిన్నతనంలో చాలా చలాకీగా ఉండేవాడు. అందరితో ఫైటింగ్ చేసేవాడు. తనకన్నా పెద్దవారితో కూడా తరచూ ఫైట్ చేసేవాడు. ఇది చూసి మేము పదేళ్ల వయసులో అమిత్‌ను బాక్సింగ్ అకాడెమీకి పంపించాం.

భారత సైన్యంలో నాయక్ హోదాలో పనిచేస్తున్న నా మరో కుమారుడు అజయ్ కూడా బాక్సింగ్ అకాడెమీకి వెళ్లేవాడు. తనతో పాటే అమిత్‌ను కూడా తీసుకెళ్లేవాడు. అదే ఇప్పటి స్వర్ణానికి పునాదులు వేసింది.

చిత్రం శీర్షిక నా త్యాగం వృధా కాలేదు: అమిత్ సోదరుడు అజయ్

నేనూ బాక్సర్‌నే, కానీ మధ్యలోనే వదిలేశా: అజయ్, అమిత్ సోదరుడు

మేమిద్దరం చాలా బాగా బాక్సింగ్ చేసేవాళ్లం. నేను కూడా జాతీయ స్థాయివరకూ చేరగలిగాను. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా మధ్యలోనే వదిలేశాను. ఇద్దరికీ శిక్షణ అంటే కుటుంబానికి భారమైంది.

మా నాన్న ఓ డ్రైవర్. చాలీచాలని ఆదాయంతో కుటుంబ పోషణ, మా శిక్షణ కష్టమైంది. అందుకే నేను క్రీడలను పక్కనపెట్టి, అమిత్‌కు తోడ్పాటునివ్వడానికి ఆర్మీలో ఉద్యోగంలో చేరా.

నేను చేసిన త్యాగం వృధా కాలేదు. ఈ సంవత్సరం జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌లో రజత పతకం సాధించిన తర్వాత మళ్లీ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత మెరుగైన ఆటగాడిని ఓడించి అమిత్ ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలుచుకున్నాడు. 2009లో సబ్‌జూనియర్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న తర్వాత అమిత్‌కు వెనక్కితిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో జరిగిన అన్ని పోటీల్లో స్వర్ణాలు గెల్చుకున్నాడు. దీంతో 2017లో భారత సైన్యంలో జేసీవో ఉద్యోగాన్నిచ్చారు.

చిత్రం శీర్షిక అమిత్ ప్రాక్టీస్ చేసిన ప్రదేశం ఇదే

నా తర్వాత లక్ష్యం ఇదే: అమిత్

ఇప్పుడు నా లక్ష్యం 2019లో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్. ఆ తర్వాత 2010లో టోక్యోలో జరిగే ఒలింపిక్స్. అక్కడ కూడా ఇలాంటి ప్రదర్శనే ఇవ్వాలనుకుంటున్నా.

నా విజయాల్లో మా నాన్న విజేందర్, కోచ్ అనిల్ ధన్కర్‌ల పాత్ర ఎంతో ఉంది.

కోచ్ అనిల్ ధన్కర్ మైనా గ్రామంలో ఏర్పాటు చేసిన అకాడెమీలోనే అమిత్, అజయ్ ఐదేళ్లపాటు శిక్షణ తీసుకున్నారు.

చిత్రం శీర్షిక కోచ్‌ అనిల్ ధన్కర్‌తో అమిత్ ఉన్న ఫొటోతో కుటుంబ సభ్యులు

అమిత్‌లో ఉన్న గొప్పలక్షణమిదే: కోచ్ అనిల్ ధన్కర్

2017లో ఇదే హసన్‌బోయ్ చేతిలో ఓడాక, అమిత్ అతడిని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకుని మరింత కఠోరంగా సాధన చేశాడు. అమిత్‌లో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే... అతని కౌంటర్ అటాక్. తన కదలికలతో ప్రత్యర్థిని రెచ్చగొట్టి, అతను దాడి చేసేలోపే ప్రతిదాడి చేసి విజయాన్ని సొంతం చేసుకుంటాడు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)