దాక్షాయణి: వంట చేయటమే కాదు.. అంగారకుడిపైకెళ్లే ఉపగ్రహాలకు దారి చూపగల రాకెట్ మహిళ
- గీతా పాండే
- బీబీసీ ప్రతినిధి

మీరు అంగారకుడి కక్ష్యలోకి వెళ్లే ఉపగ్రహానికి దారి చూపిస్తూ, రోజూ రెండు పూటలా ఎనిమిది మందికి వంట చేయగలరా. చేయచ్చు. కానీ అలా చేయాలంటే మీరు ఉదయం 5 గంటలకే లేవాలి.. మీ పేరు బీపీ దాక్షాయణి అయి ఉండాలి. ఇస్రో ఫ్లైట్ డైనమిక్స్, స్పేస్ నావిగేషన్ విభాగానికి మాజీ అధిపతి అయిన ఆమె.. ఇంటి పనులు కూడా ఎలా చక్కబెడుతున్నారో స్వయంగా వివరించారు.
నాలుగేళ్ల క్రితం అంగారక కక్ష్యలోకి భారత ఉపగ్రహం ప్రవేశించినపుడు చీరల్లో ఉన్న మహిళల బృందం సంబరాలు చేసుకుంటున్న ఫొటో వైరల్ అయ్యింది. భారత అంతరిక్ష కార్యక్రమంలో దేశ మహిళల పాత్ర ఎంత కీలకమో ప్రపంచానికి చాటి చెప్పింది. ఆ మహిళల్లో దాక్షాయణి ఒకరు. ఆ ఫొటోలో ఉన్న మహిళలు 'రాకెట్ విమెన్ లేదా విమెన్ ఫ్రం మార్స్' పేరుతో ఫేమస్ అయ్యారు.
ఉపగ్రహ గమనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వచ్చిన దాక్షాయణి తన బృందానికి నేతృత్వం వహించారు. అది సరిగ్గా ఎక్కడికి చేరుకోవాలో వారికి చెబుతూ, ఉపగ్రహం దారితప్పకుండా చూసుకున్నారు. దానిని భారతదేశం నుంచి ఒక గోల్ఫ్ బాల్‌ను లాస్ ఏంజెల్స్‌లో ఉన్న హోల్‌లోకి వెళ్లేలా కొట్టిన షాట్‌గా ఆమె సహచరుల్లో ఒకరు ( మహిళ ) వర్ణించారు. ఇంకా చెప్పాలంటే అది కొనసాగుతోంది.
ఫొటో సోర్స్, Getty Images
అంగారకుడిపైకి ఉపగ్రహ ప్రయోగం తర్వాత ఇస్రో మహిళా బృందం సంబరం
ఒక భారతీయ గృహిణి అలాంటి విధులు నిర్వహించడం చాలా కష్టం. కానీ ఎన్నో ఏళ్ల ముందు సనాతన సంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఒక బాలిక, సైన్స్‌ను తన కెరీర్‌గా ఎంచుకున్నప్పుడే ఆమెకు తన లక్ష్యం ఎంత బలమైనదో తెలుసు.
1960లో కర్ణాటకలోని భద్రావతిలో పుట్టిన దాక్షాయణికి సైన్స్ పట్ల ఉన్న ఆసక్తిని ఆమె తండ్రి చిన్నతనంలోనే గమనించారు. ఆయన ప్రోత్సాహంతో దాక్షాయణి సైన్స్‌లో ముందుకెళ్లారు. అప్పట్లో ఆ టౌన్‌లో ఇంజనీరింగ్ చదివిన ఒకే ఒక మహిళ ఉండేవారు. ఆమె ఎప్పుడైనా తమ ఇంటి ముందు నుంచి వెళ్తుంటే, దాక్షాయణి ఆమెను చూడ్డానికి పరుగులు తీసేవారు.
అప్పట్లో అమ్మాయిలకు చదువులో ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు. ఇక వారు యూనివర్సిటీల వరకూ వెళ్లడం అంటే అది పెద్ద వింతగా నిలిచేది. కానీ అకౌంటెంట్, గణితంలో అద్భుత నైపుణ్యం ఉన్న ఆమె తండ్రి మాత్రం తన కూతురిని బాగా చదివించాలని అనుకున్నారు. దాంతో ఆమె ఇంజనీరింగ్ చేయాలని నిర్ణయించుకున్నాకు. అందులో టాపర్‌గా నిలిచారు.
కానీ తర్వాత ఆమెకు అసమ్మతి ఎదురైంది. దాక్షాయణి మాస్టర్ డిగ్రీ చేయాలనుకున్నారు. కానీ ఆమె తండ్రి మాత్రం బీఎస్సీ చేస్తే చాలనుకున్నారు. కానీ, చివరికి దాక్షాయణి తను కోరుకున్న దారిలోనే ముందుకెళ్లారు. మరోసారి టాప్ గ్రేడ్స్‌తో పట్టా అందుకున్నారు.
ఫొటో సోర్స్, Getty Images
ఆర్బిటర్ గమనాన్ని పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు
ఆ తర్వాత దాక్షాయణి ఒక కాలేజీలో మాథ్స్ లెక్చరర్‌గా పనిచేశారు. కానీ ఆమె ఆసక్తి ఎప్పుడూ అంతరిక్షం, ఉపగ్రహాల మీదే ఉండేది. ఒక రోజు ఆమె ఇస్రోలో ఒక ఉద్యోగ ప్రకటన చూశారు. దానికి అప్లై చేసి, అందులో చేరిన తర్వాత తన లక్ష్యం దిశగా అడుగులు వేశారు.
అది 1984, దాక్షాయణికి ఆర్బిటల్ డైనమిక్స్ విధులు అప్పగించారు. ఇప్పుడు అందులో ఆమె స్పెషలిస్టుగా నిలిచినా, మొదట్లో ఉద్యోగం ప్రారంభించినపుడు ఆమెకు అందులో బేసిక్స్ తెలుసుకోవడం కూడా చాలా కష్టమైంది.
దాక్షాయణికి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కూడా అప్పగించేవారు. కానీ అక్కడ ఆమెకు ఒక సమస్య ఎదురైంది. ఆమె అప్పటివరకూ అసలు కంప్యూటరే చూళ్లేదు. ఆ రోజుల్లో ఎక్కువ మంది ఇళ్లలో కంప్యూటర్లు ఉండేవి కావు. అప్పట్లో స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్స్ కూడా లేవు. కానీ ఆమె పుస్తకాల నుంచి ఎన్నో నేర్చుకున్నారు. ప్రతిరోజూ పని తర్వాత ఇంటికి వెళ్లాక కంప్యూటర్ ప్రోగ్రామింగ్ పుస్తకాలు చదివేవారు. అందులో నైపుణ్యం ఎలా సంపాదించాలో తెలుసుకునేవారు.
తర్వాత కొన్ని రోజులకే దాక్షాయణి మిగతా హోంవర్క్ కూడా నేర్చుకోవాల్సి వచ్చింది.
ఇస్రోలో పనిచేయడం ప్రారంభించిన ఏడాది తర్వాత ఆమె తల్లిదండ్రులు దాక్షాయణికి ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మంజునాథ్ బసవలింగప్పతో పెళ్లి నిశ్చయం చేశారు. అంటే, ఆమె హఠాత్తుగా ఇంటి బాధ్యతలు నెత్తికెత్తికోవాల్సి వచ్చింది.
ఆఫీసులో ఉపగ్రహాలను గైడ్ చేసేందుకు క్లిష్టమైన కాలుక్యులేషన్స్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చూసుకునే దాక్షాయణి, ఇంటికి వచ్చాక ఒక పెద్ద కుటుంబంలో అన్ని అవసరాలూ చూసుకునేవారు. ఇంట్లో అత్తమామలతోపాటూ భర్త, ఆయన ఐదుగురు తోబుట్టువులు ఉండేవారు. కొన్నేళ్లకు ఆమె ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయ్యారు.
"నేను ఉదయం 5 గంటలకే లేచేదాన్ని. ఎందుకంటే ఏడు గంటలకల్లా 8 మందికి వంట చేయాలంటే మాటలు కాదు. అంతే కాదు.. మా ఆహారపు అలవాట్లు కూడా వేరువేరుగా ఉండేవి. మాకు చపాతీలు చేయాలంటే చాలా టైం పడుతుంది. దాంతో నేను మొత్తం కుటుంబానికి వంట చేశాక ఆఫీసుకు వెళ్లేదాన్ని అన్నారు" దాక్షాయణి.
"ఒకప్పుడు ఆఫీసుకు వచ్చేస్తే ఇంటి గురించి ఆలోచించడానికి చాలా తక్కువ టైం ఉండేది. మధ్యాహ్నం ఒకసారి ఇంటికి ఫోన్ చేసి పిల్లలేం చేస్తున్నారని అడిగేదాన్ని. సాయంత్రం ఇంటికెళ్లాక మళ్లీ వంట పని మొదలెట్టేదాన్ని" అన్నారు.
బంధువులు కొందరైతే ఆమె ఉద్యోగం వదిలేస్తారేమో అనుకున్నారు. "కానీ నేను దేన్నీ అంత తేలిగ్గా వదిలేదాన్ని కాను" అంటారు దాక్షాయణి.
"మా నాన్న కూడా మనం ఏదైనా చివరి వరకూ ప్రయత్నించాలి అంటుంటారు. టెక్నికల్ విషయాలైనా సరే, నాకు అర్థం కానివి ఏవైనా ఉంటే, దానిని చేసేవరకూ వాటి గురించి చాలా సార్లు చదువుతాను"
కొన్నిసార్లు ఆమె పడుకునేసరికి రాత్రి ఒంటిగంట, రెండు కూడా అయిపోతుంది. కానీ విధులకు వెళ్లడానికి ఉదయం మళ్లీ 5 గంటలకే లేవాలి.
దాక్షాయణి వాటిపై ఎలాంటి ఫిర్యాదూ చేయరు. బదులుగా.. ఇంట్లో, విధుల్లో తన ఉరుకుల పరుగుల గురించి చెబుతున్నప్పుడు ఆమె మరింత ఉత్సాహంగా కనిపిస్తారు. కిచెన్‌లో వంట చేయడాన్ని ఎంత ఆస్వాదిస్తానో, విధుల్లో ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించినప్పుడు కూడా అంతే సంతోషంగా ఉంటానని చెబుతారు.
"నేను చిన్న చిన్న మార్పులు చేస్తూ కొత్తవి తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటా. చెప్పాలంటే వంట కూడా కాస్త కోడింగ్ లాగే ఉంటుంది. కోడ్‌లో ఒక చిన్న మార్పు చేస్తే ఫలితంలో అంకెలు మారుతాయి. అలాగే దినుసుల్లో చిన్న మార్పు చేస్తే రుచిలో మార్పు వస్తుంది" అంటారు దాక్షాయణి.
ఒక సాయంత్రం బెంగళూరులో ఉన్న తమ ఇంటికి రావాలని దాక్షాయణి నన్ను ఆహ్వానించారు. ఆమె భర్తను నాకు పరిచయం చేశారు. టీ, స్నాక్స్ తీసుకుంటుంటే, వారిద్దరూ దశాబ్దాలపాటు కలిసి గడిపిన తమ జీవితం గురించి చెప్పారు. క్లిష్టమైన పరిస్థితుల్లో ఒకరికొకరు ఎలా అండగా నిలిచామో, కాలంతోపాటూ ఒకరి వృత్తిపై మరొకరికి ఎంత గౌరవం పెరిగిందో నాతో పంచుకున్నారు.
"మొదట్లో నేను ఆఫీసులో అసలు ఏం చేస్తానో మా ఆయనకు అర్థమయ్యేది కాదు, కొన్నిసార్లు నేను శనివారం ఆఫీసుకు వెళ్తే, నా పని మిగిలిపోవడం వల్లే మళ్లీ వెళ్లానని ఆనుకునేవారు" అని దాక్షాయణి చెప్పారు.
కానీ క్రమంగా భార్య వర్క్ షెడ్యూలును ఉపగ్రహాలే శాసిస్తుంటాయని, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆమె ఇంటికి రాలేని పరిస్థితుల్లో ఉందని ఆయన అర్థం చేసుకున్నారు. భార్య సాధించిన విజయాలను చూస్తే ఇప్పుడు తనకు గర్వంగా ఉంటుందని డాక్టర్ బసవలింగప్ప అంటారు.
ఫొటో సోర్స్, Getty Images
దాక్షాయణి మార్స్ మిషన్‌తోపాటూ స్పేస్ రికవరీ ప్రాజెక్టుకు కూడా నేతృత్వం వహించారు. అంతరిక్షంలోకి పంపిన వ్యోమనౌక తిరిగి వచ్చేటపుడు భూవాతావరణంలోకి రాగానే మండిపోకుండా, దానిని సురక్షితంగా సముద్రంలోకి ఎలా దించాలో కాలుక్యులేట్ చేశారు.
మీ జీవితాల్లో ఒకరు ఇంకొకరికి ఎన్ని మార్కులు ఇస్తారు అని ఆ దంపతులను అడిగినప్పుడు భార్యకు "పదికి పది" మార్కులు వేస్తానని డాక్టర్ బసవలింగప్ప చెప్పారు.
దాక్షాయణి మాత్రం భర్తకు 9.5 మార్కులే వేస్తానన్నారు. ఎందుకంటే "ఇంటి పనుల్లో మీరు నాకు ఎప్పుడైనా ఏదైనా సాయం చేశారా" అంటూ నవ్వేశారు.
సంప్రదాయ భారతీయ కుటుంబాల్లో చాలా ఇళ్లలో ఇంటి బాధ్యత ఎక్కువగా ఇల్లాలే చూసుకుంటుంది. దానిని వారు ఎలాంటి ఫిర్యాదూ లేకుండానే చేస్తుంటారు. దాక్షాయణికి కూడా అందులో మినహాయింపు లేదు.
భర్త డాక్టర్ మంజునాథ్ బసవలింగప్పతో దాక్షాయణి
భార్య ఆఫీస్ విధుల్లో బిజీగా ఉంటే, డాక్టరుగా తను కూడా తరచూ 18 గంటల వరకూ పనిచేయాల్సి ఉంటుందని డాక్టర్ బసవలింగప్ప చెబుతారు. ఆయన వివరణకు ఆమె సంతృప్తి చెందినట్టే కనిపిస్తారు.
ఇంటి విషయానికి వస్తే ప్రస్తుతం అంత ఎక్కువ పని ఉండదని దాక్షాయణి చెప్పారు. ఆమె కొడుకు, కూతురు ఇద్దరూ ఇంజనీర్లే. వారిద్దరూ ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటున్నారు.
"ఉద్యోగ విరమణ తర్వాత మీకు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా" అని నేను ఆమెను అడిగాను. కానీ పూర్తిగా విధులకు దూరం కావడం అనేది ఆమె అజెండా కానట్టు అనిపించింది.
దాక్షాయణి అంగారకుడిపై తన అధ్యయనం కొనసాగించాలని భావిస్తున్నారు. భూమికి, అరుణ గ్రహానికి మధ్య ఉన్న పోలికలు, వ్యత్యాసాల గురించి ఆమె ఒక జాబితా రూపొందించారు.
ఆమెకు, ఎంతోమంది భారతీయ యువతులకు ప్రేరణ ఇచ్చే గ్రహాల్లో అది ఒకటి. అక్కడ నివసించడం తనకు ఇష్టం అని ఆమె చెబుతున్నారు. ఎందుకంటే ఆమెను "వుమెన్ ఫ్రం మార్స్"గా నిలిపింది ఆ గ్రహమే.
ఇవికూడా చదవండి:
- ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్: ఇంటి ముంగిట్లోకి బ్యాకింగ్ సేవలు
- మెడిటేషన్‌తో మెదడు ఆకారంలో సానుకూల మార్పులు
- రిక్షావాలా కూతురు రికార్డు బద్దలుకొట్టింది
- సిగరెట్ మానేయాలనుకునే వారు ఇది చదవాలి
- కుమారస్వామి: వంద రోజుల్లో 50 ఆలయాలు.. భయంతోనా లేక భక్తితోనా?
- జీడీపీ: అంచనాలను మించి అత్యధిక ఆర్థిక వృద్ధి సాధించిన భారత్
- అమిత్ పంఘల్: ఒకప్పటి స్ట్రీట్ ఫైటర్.. నేడు ఆసియా క్రీడల గోల్డ్ మెడలిస్ట్
- శరణార్థి శిబిరాల్లో పిల్లల ఆత్మహత్యాయత్నాలు
- ‘పరిశోధన’ కలలను బతికించుకున్న గృహిణులు
- మహిళల ఉద్యోగాలను ఆటోమేషన్ మింగేస్తుందా?
- స్వప్న సాక్షాత్కారం: నిద్రలో కలలకు వలవేసి పట్టుకునే పరికరం ఇదిగో..
- #గమ్యం: వైజ్ఞానిక పరిశోధకులకు అండ.. కేవీపీవై స్కాలర్షిప్
- దివ్య సూర్యదేవర: ఒకప్పుడు డబ్బుల్లేక ఇబ్బందులు పడ్డారు.. నేడు రూ.లక్షల కోట్ల కంపెనీని చక్కబెడుతున్నారు
- మహిళల రేడియో: మీరు వింటున్నారు.. 90.4 ఎఫ్ఎం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)