తెలంగాణ మంత్రివర్గ సమావేశం నిర్ణయాలు - ‘ముందస్తుపై మరింత సస్పెన్స్’

ఈటెల రాజేందర్

ఫొటో సోర్స్, Govt of Telangana

ప్రగతి నివేదన బహిరంగ సభకు ముందు కేసీఆర్ తన మంత్రివర్గంతో సమావేశమయ్యారు. అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడి, సమావేశంలో చర్చించిన అంశాలను, నిర్ణయాలను మీడియాకు చెబుతారని స్థానిక మీడియా భావించింది. కానీ, మీడియా సమావేశానికి కేసీఆర్ హాజరు కాలేదు. మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్ రావు, కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడారు. మీడియా సమావేశంలోని కొన్ని ముఖ్యాంశాలు..

01. యాభై శాతానికి పైబడిన బీసీ కులాలకు హైదరాబాద్‌లో ఆత్మగౌరవ భవనాల కోసం 71 ఎకరాలను, రూ.68 కోట్లను కేటాయించారు. ఈ వర్గాలను ఇంతవరకూ ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోలేదని, కేసీఆర్ బీసీ కులాల వారి పట్ల నిలబడ్డారన్నారు.

02. గోపాల మిత్రల గౌరవ వేతనాన్ని రూ.3,500 నుంచి 8,500కు పెంచుతున్నాం. దేవాలయాల అర్చకుల పదవీ విరమణ పరిమితిని 65 ఏళ్లకు పెంచామని ఈటెల రాజేందర్ అన్నారు.

ఇదే సమావేశంలో మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ..

03. ఆశా వర్కర్ల గౌరవ వేతనం రూ.7,500కు పెంచాం. ఏఎన్ఎం, నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్‌లో పని చేస్తోన్నవారు, వైద్యులు, హెడ్ నర్సులు ఎందరో కాంట్రాక్ట్ విధానంలో పని చేస్తున్నారు. వీరి వేతనాన్ని కూడా పెంచారని తెలిపారు.

04.సెకెండ్ ఏఎన్ఎంల గౌరవ వేతనాన్ని రూ.11 వేల నుంచి రూ.21 వేలకు పెంచాం అని హరీష్ రావు అన్నారు.

05. అయితే.. ముందస్తు ఎన్నికల గురించి, మరిన్ని కీలక నిర్ణయాల గురించి మీడియా సమావేశంలో ఎవ్వరూ మాట్లాడలేదు.

ఫొటో క్యాప్షన్,

టీఆర్ఎస్ పార్టీ ప్రగతి నివేదన సభలో కళాకారులు పాటల రూపంలో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేస్తున్నారు.

'సస్పెన్స్ సినిమాను తలపిస్తోంది'

గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యవహారశైలి సస్పెన్స్ సినిమాను తలపిస్తోందని సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు బండారు శ్రీనివాసరావు బీబీసీతో చెప్పారు.

''ముందస్తు ఎన్నికలపై మీడియాలో ఊహాగానాలు వస్తోన్నా.. కేసీఆర్ వాటిని ఖండించడం లేదు. అలానే ముందస్తుకు వెళుతున్నాం అని ఆయన చెప్పలేదు. కానీ, జరుగుతున్న పరిణామాలు మాత్రం ముందస్తు సంకేతాలను ఇస్తున్నాయి'' అని అన్నారు.

''మంత్రుల మీడియా సమావేశంలో వివిధ వర్గాలకు కొన్ని వరాలు ప్రకటించారు. అయితే, ఇవేమీ అంతముఖ్యమైనవికావు. కానీ, సమావేశం చివర్లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మంత్రివర్గ సమావేశం మళ్లీ ఉంటుంది అని సస్పెన్స్‌కు తెర లేపారు. అంటే ఎన్నికలే లక్ష్యంగా మరిన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉండొచ్చు'' అని ఆయన విశ్లేషించారు.

''దిల్లీలో ఎన్నికల సంఘం సమావేశానికి తన ప్రతినిధులను పంపడం, కేబినెట్ మీటింగ్, భారీ బహిరంగ సభ వీటన్నింటిని ఒక క్రమంలో పరిశిలిస్తే కేసీఆర్ అడుగులు ఎటు వైపు అర్థం చేసుకోవచ్చు. అయితే, సాయంత్రం బహిరంగ సభలో కేసీఆర్ నిర్ణయం ఏంటో తెలిసే వరకు ఈ సస్పెన్స్ కొనసాగుతుంది'' అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)