తెలంగాణలో ప్రగతి నివేదన సభ: 25 లక్షల మంది వస్తే ఎంత స్థలం కావాలి?

  • బీబీసీ
  • తెలుగు డెస్క్
కొంగడ కలాన్

హైదరాబాద్ శివారు కొంగరకలాన్‌లో తెలంగాణ రాష్ర్ట సమితి ప్రగతి నివేదన సభ పేరిట భారీ సభను నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఈ సభకు రాష్ర్ట వ్యాప్తంగా కార్యకర్తలు, ప్రజలు మొత్తం 25 లక్షల మంది హాజరవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇంత భారీ సందోహాన్ని దృష్టిలో పెట్టుకుని దాదాపు 2000 ఎకరాల విస్తీర్ణంలో సభను ఏర్పాటు చేశారు.

నిర్వాహకులు చెబుతున్న ప్రకారం.. ఇందులో వాహనాల పార్కింగ్, వాటి రవాణా.. ఇతరత్రా లాజిస్టిక్స్‌కి 1400 ఎకరాలు కేటాయించారు.

ఫొటో క్యాప్షన్,

భద్రతా ఏర్పాట్లు

కేవలం జనం నిల్చోవడానికి 600 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు చెబుతున్నారు.

వీరి కోసం 15000 విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇప్పటికే 4 లక్షల మంది సభా స్థలికి చేరుకున్నారని తెలంగాణ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

నిర్వాహకులు అనుకుంటున్నట్లు 25 లక్షల మంది సభా స్థలం వద్దకు వస్తే.. 600 ఎకరాలు సరిపోతుందా?

ఫొటో సోర్స్, Getty Images

ఇది తెలియాలంటే మనం ముందుగా ఒక వ్యక్తి సౌకర్యవంతంగా నిల్చోవడానికి ఎంత స్థలం అవసరమో లెక్క గట్టాలి.

ఈ అంశాలపై ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడయ్యాయి.

వీటిలో బ్రిటన్‌లోని మాంచెస్టర్ మెట్రోపాలిటన్ యూనివర్శిటీ ప్రొఫెసర్ జి.కెయిత్ స్టిల్ అధ్యయనం చూద్దాం. ఈ అధ్యయనం ప్రకారం.. పాతిక లక్షల మంది జనానికి ఎంత స్థలం అవసరమవుతుందో చూద్దాం.

క్రౌడ్ సేఫ్టీ విషయంలో.. ఒక చదరపు మీటరుకు ఎంత మంది జనం పడతారు.. అనే విషయం చాలా కీలకం. నిల్చుంటే ఎంత మంది పడతారు.. కదులుతుంటే ఎంత మంది పడతారు.. అనే లెక్క ఆధారంగా క్రౌడ్ సేఫ్టీ చర్యలు తీసుకుంటారు.

ఫొటో సోర్స్, G.KEITSTILL

చదరపు మీటరుకు ఎంత మంది పడతారు?

సాధారణ బహిరంగ సభల్లో ఈ చిత్రంలో చూపినట్లు ఒక చదరపు మీటరుకు ఒక వ్యక్తి ఉంటారు.

వీరు అటూ ఇటూ కదిలినా.. కింద చిత్రంలో ఉన్నట్లు.. ఉంటుంది. అంటే ముందస్తు ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన వంటి సభల్లో ఒక వ్యక్తికి సుమారు చదరపు మీటరు స్థలం అవసరం అవుతుంది.

ఫొటో సోర్స్, G.KEITSTILL

మరి ఒక ఎకరాకు..? ఎంత మంది పడతారు?

ఇది తెలియాలంటే మళ్లీ ఎకరాకు ఎన్ని చదరపు మీటర్లు ఉంటాయో లెక్క వేయాలి. ఈ లెక్కన ఒక ఎకరాకు 4046 చదరపు మీటర్ల స్థలం ఉంటుంది. అంటే సగటున ఒక ఎకరాకు 4000 మంది జనం పడతారు. ఏమాత్రం తోపుడు లేకుండా సౌకర్యంగా నిల్చోవచ్చు.

ఈ లెక్కన 25 లక్షల మందికి సరిపడా స్థలం కావాలంటే.. కనీసం 600 ఎకరాల స్థలం అవసరం అవుతుంది.

ప్రస్తుతం కొంగరకలాన్‌లో ఉన్న పరిస్థితి..

ప్రస్తుతం బీబీసీ ప్రతినిధి దీప్తి బత్తిని కొంగరకలాన్‌లో ఉన్నారు. ఆమె అందించిన తాజా సమాచారం మేరకు.. అక్కడకు జనం భారీగా తరలి వస్తున్నారు.

వీరి కోసం 10,500 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. 100కుపైగా ట్రాక్టర్లలో రైతులు తరలి వచ్చారు.

ఆర్టీసీ బస్సుల ఏర్పాటుపై కొన్ని విమర్శలు వచ్చాయి. ప్రజల అవసరాలకు బస్సులు లేకుండా చేశారని కొందరు విమర్శించారు.

వాతావరణాన్ని చూస్తుంటే.. వర్షం వచ్చే అవకాశముంది. దీంతో అక్కడ మీడియా సిబ్బంది అందరూ గొడుగులు చేతపట్టుకుని తమ విధులు నిర్వహిస్తున్నారు.

ప్రజలు కూడా ఈ వర్షంపై ఆందోళనగా ఉన్నట్లు తెలుస్తోంది.

తేలికపాటి వర్షం వచ్చినా సభా ప్రాంగణ పరిసరాలు బురదమయం కాకుండా మ్యాట్లు ఏర్పాటు చేశారు.

మరిన్ని అప్‌డేట్స్‌ కోసం బీబీసీ న్యూస్ తెలుగు వెబ్‌సైట్‌ను చూస్తూ ఉండండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)