త్వరలోనే కీలక నిర్ణయం.. ముందస్తు ఊహాగానాలపై కేసీఆర్

ముందస్తు ఎన్నికలపై అనేక ఊహాగానాలు వస్తున్నాయని.. అయితే రాష్ట్ర ప్రజలకు, పార్టీకి మంచి చేసే నిర్ణయాన్ని త్వరలోనే తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
టీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్‌లో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో మాట్లాడుతూ కేసీఆర్.. రాష్ట్రంలో 465 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ బిడ్డలే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని, వారి కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చామని చెప్పారు. మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి తాగు నీరు అందిస్తున్నామని తెలిపారు.
కొందరు ప్రగతినిరోధకులు సాగు నీటి ప్రాజెక్టులకు అడ్డం వస్తూ కోర్టులో కేసులు వేస్తున్నారని విమర్శించారు.
తమిళుల స్ఫూర్తితో స్వయంపాలన
దిల్లీకి బానిసలు కాకుండా ఆత్మగౌరవంతో బతకాలని, తమిళ ప్రజలను స్ఫూర్తిగా తీసుకొని ఆత్మభిమానం, స్వయం అధికారంతో మనల్ని మనమే పాలించుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే టికెట్లు కావాలన్నా దిల్లీలో పార్టీ పెద్దలవైపు చూడాల్సిన పరిస్థితి ఉండకూడదన్నారు.
వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పథకాలు ప్రవేశపెడతామనేది ముఖ్యమంత్రి హోదాలో చెప్పడం సరికాదని అన్నారు.
''పార్టీ పథకాలు ఏంటో మేనిఫెస్టోలో పెడతాం. ఆ విధంగానే ఎన్నికల ప్రచారానికి వెళ్తాం'' అని తెలిపారు.
ఇంకా ఏం చెప్పారంటే..
స్థానికులకు 95శాతం ఉద్యోగాలు కావాలని ప్రధాని మోదీని నిలదీసి కొత్త జోనల్ వ్యవస్థకు అనుమతి సంపాదించామని కేసీఆర్ చెప్పారు. యువత పట్ల తమ పార్టీకి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనమని తెలిపారు.
''కేసీఆర్‌ని గద్దె దించడమే లక్ష్యమని ప్రతిపక్షాలు ప్రకటిస్తున్నాయి. రాష్ట్రానికి మంచి చేస్తామని ప్రజల్లోకి వెళ్లాల్సిన వారు నన్ను పదవి నుంచి దించడానికే పోరాడుతామనడం విడ్డూరంగా ఉంది'' అని ఆయన అన్నారు.
వచ్చే ఎన్నికలకు ముందే కృష్ణా, గోదావరి నీళ్లు అందిస్తామని స్పష్టం చేశారు.
‘‘తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరందించి ఆకుపచ్చ తెలంగాణగా చేసి చూపిస్తా. చిమ్మ చీకట్ల నుంచి 24 గంటల విద్యుత్ఇచ్చే స్థాయికి చేరాం. రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే’’ అన్నారు.
నా లేఖతో తెలంగాణతో ఉద్యమానికి బీజం పడింది
సమైక్య పాలనలో విద్యుత్ చార్జీలను ఇబ్బడిముబ్బడిగా పెంచినప్పుడు తాను అప్పటి ముఖ్యమంత్రికి లేఖ రాశానని.. అయినా, తన లేఖను పట్టించుకోలేదని.. తాను రాసిన ఆ లేఖతోనే తెలంగాణ ఉద్యమానికి బీజం పడిందని కేసీఆర్ చెప్పారు.
''తెలంగాణ కోసం నేను ఎక్కని కొండ లేదు.. మొక్కని బండ లేదు. ఎన్నో అవమానాలు ఎదుర్కొని, దీక్షతో 14 ఏళ్ల ఉద్యమం సాగించి తెలంగాణను సాధించుకున్నాం'' అన్నారు.
''పిడికెడు మందితో ఉద్యమాన్ని ప్రారంభించాను. రాజకీయ పంథాలో వెళ్లి 14 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత తెలంగాణ సాధించుకున్నాం. దిల్లీలో అన్ని పార్టీల మద్దతు కోసం తిరిగాను. తెలంగాణ సాధన కోసం 36 పార్టీలను ఒప్పించాను. ఆ విధంగా సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నాం. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో త్యాగాలు, రాజీనామాలు, ఉప ఎన్నికలు ఉన్నాయి'' అని కేసీఆర్ గుర్తు చేశారు.
మిషన్ కాకతీయ జయశంకర్ ఆలోచనే
మిషన్ కాకతీయ ప్రొఫెసర్ జయశంకర్ సూచన నుంచి పుట్టిందని.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సమస్యల పరిష్కారం ఎలా అన్నదానిపై తాను, జయశంకర్ కలిసి నిద్రపోకుండా చర్చించుకున్నామని కేసీఆర్ చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చిమ్మచీకట్లు తప్పవని అన్నారని, కానీ.. చిమ్మచీకటి నుంచి వెలుగుల్లోకి వచ్చామని ఆయన చెప్పారు.
నేతన్నల ఆత్మహత్యలు ఆపడానికి జోలెపట్టి బిక్షాటన చేశానని కేసీఆర్ అన్నారు.
గిరిజనులు, దళితుల కష్టాలను చూసి కళ్యాణలక్ష్మి పథకం తీసుకొచ్చామన్నారు.
నాయీ బ్రాహ్మణులకు తక్కువ ధరకే విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామన్నారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో చెప్పిన అంశాల కంటే అదనంగా మరో 76 సంక్షేమ పథకాలను అమలు చేశామని కేసీఆర్ తెలిపారు.
మంత్రివర్గ సమావేశంలో వివిధ వర్గాలకు వరాలు
ఈ సభకు ముందు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ, యాభై శాతానికి పైబడిన బీసీ కులాలకు హైదరాబాద్‌లో ఆత్మగౌరవ భవనాల కోసం 71 ఎకరాలను, రూ.68 కోట్లను కేటాయించామని తెలిపారు. ఈ వర్గాలను ఇంతవరకూ ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు.
గోపాల మిత్రల గౌరవ వేతనాన్ని రూ.3,500 నుంచి 8,500కు పెంచుతున్నామని, దేవాలయాల అర్చకుల పదవీ విరమణ పరిమితిని 65 ఏళ్లకు పెంచామని ఈటెల రాజేందర్ అన్నారు.
ఇదే సమావేశంలో మంత్రి హరీష్ రావు.. ఆశా వర్కర్ల గౌరవ వేతనం రూ.7,500కు పెంచినట్లు తెలిపారు. ఏఎన్ఎం, నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్‌లో పని చేస్తోన్నవారు, వైద్యులు, హెడ్ నర్సులు ఎందరో కాంట్రాక్ట్ విధానంలో పని చేస్తున్నారని.. వారి వేతనాన్నీ పెంచుతున్నట్లు వెల్లడించారు.
రెండో ఏఎన్ఎంల గౌరవ వేతనాన్ని రూ.11 వేల నుంచి రూ.21 వేలకు పెంచామని హరీష్ రావు అన్నారు.
ఫొటో సోర్స్, facebook/UttamKumarReddy
కేసీఆర్ హఠావ్.. తెలంగాణ బచావ్
మాయమాటలతో సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
టీఆర్ఎస్ బహిరంగ సభ అనంతరం హైదరాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ హఠావ్.. తెలంగాణ బచావ్ నినాదంతో తమ పార్టీ ఇకపై ప్రజల ముందుకు వెళుతుందని ప్రకటించారు.
టీఆర్ఎస్ పార్టీ ప్రగతి నివేదన సభ పూర్తిగా విఫలమైందని, ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని దీన్ని బట్టి అర్థం చేసుకోవాలని చెప్పారు.
ఉద్యోగాల విషయంలో మాయమాటలు చెప్పి నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారన్నారు.
ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించకపోతే దిల్లీలో భూకంపం సృష్టిస్తానన్న కేసీఆర్.. మోదీ ఏజెంట్‌గా మారి రాష్ట్రానికి అన్యాయం చేశారన్నారు. దిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టినా ఒక్క సాగు నీటి ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా తీసుకరాలేకపోయారని విమర్శించారు.
కేసీఆర్ పాలనలో ఒక్క విద్యుత్ ప్రాజెక్టు అయినా కొత్తగా ఒక్క యునిట్ అయినా ఉత్పత్తి చేసిందా అని ప్రశ్నించారు.
మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి నీళ్లు అందించకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటు అడగమని కేసీఆర్ శాసన సభ సాక్షిగా చెప్పారు. కానీ, ఈ పథకం ద్వారా 10 శాతం కుటుంబాలకు కూడా నల్లా నీళ్లు రావడం. దీనికి కేసీఆర్ ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.
తెలంగాణ ధనిక రాష్ట్రం అయిందంటే దానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ఉత్తమ్ అన్నారు.
అప్పుల్లో, రైతు ఆత్మహత్యల్లో, మద్యం అమ్మకాల్లో రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా నిలిపిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని విమర్శించారు.
ఇవి కూడా చదవండి
- సన్నీ లియోని ఇంటర్వ్యూ: 'రోడ్డు మీద నుంచున్న వేశ్యకు - పోర్న్ స్టార్‌కి తేడా ఏమిటి?'
- మీ గర్ల్ ఫ్రెండ్‌కు సారీ ఎలా చెబుతారు?
- తదుపరి ‘యాపిల్’ ఏది? భవిష్యత్తు నంబర్ వన్ కంపెనీ ఇప్పుడు ఎక్కడుంది?
- డైమండ్ నగరంలో 'గోల్డెన్ స్వీట్' - మరి రుచి చూస్తారా?
- ఆస్ట్రేలియా: పెట్రోలు అయిపోతోందా? అయిపోతే బండి నడిచేదెలా?
- ప్లాస్టిక్‌పై నిషేధం: ఆస్ట్రేలియాలో ఆగ్రహం
- పీవీ సింధు: ఆదాయంలో క్రికెట్ స్టార్లను వెనక్కు నెట్టిన బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి
- ఆసియా క్రీడలు: దీక్షా డాగర్.. అద్భుతమైన షాట్స్ కొట్టినా అభిమానుల చప్పట్లేమీ ఆమెకు వినపడవు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)