అభిప్రాయం: ఉమ్మడి పౌర స్మృతి - ‘పరిష్కారం కావాలంటే చేయాల్సింది ఇదే’

మహిళలు, ఉమ్మడి పౌర స్మృతి, హిందువులు, ముస్లింలు

ఇటీవల భారత లా కమిషన్ పర్సనల్ లా మరియు ఉమ్మడి పౌర స్మృతిపై కన్సల్టేషన్ పేపర్‌ను జారీ చేస్తూ అనేక సూచనలు చేసింది. దానిలో ఈ దశలో ఉమ్మడి పౌర స్మృతి అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తం చేసింది. దీనిపై పలువురి అభిప్రాయాలు తెలుసుకొనే క్రమంలో భాగంగా నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా వైస్ ఛాన్సెలర్ డాక్టర్ ఫజన్ ముస్తఫాతో బీబీసీ ప్రతినిధి మహమ్మద్ షహీద్ సంభాషించారు. ఆ సంభాషణలోని ముఖ్యాంశాలు ముస్తఫా మాటల్లోనే..

నేను ఎన్నో ఏళ్లుగా చెబుతున్న విషయాన్నే లా కమిషన్ తిరిగి చెప్పింది. భిన్నత్వం కలిగిన భారతదేశంలాంటి పెద్ద దేశంలో ఉమ్మడి పౌర స్మృతి ఆమోదయోగ్యం కాదు.

అయితే ఏ చట్టమైనా న్యాయబద్ధంగా ఉండాలి. మన చట్టాల్లో స్త్రీపురుషులిద్దరికీ సమానన్యాయం జరుగుతోందా అన్నది చూడాలి. మనకు కావాల్సింది న్యాయబద్ధమైన కోడ్ కానీ యూనిఫామ్ కోడ్ కాదని నేను ఇదివరకే చెప్పాను.

రెండోది, మనం తీసుకునే చర్యలు చట్టాలను సంస్కరించేవిగా ఉండాలి. అలా కాకుండా మనం ఒకేసారి ఉమ్మడి పౌర స్మృతి గురించి మాట్లాడితే ఛాందసవాదులు ఈ మొత్తం చర్చను పక్కదారి పట్టించే అవకాశం ఉంది. కొన్ని మతాలు పర్సనల్ లాను అనుసరిస్తూ ఏదో నేరాన్ని చేస్తున్నాయన్న భావనను వీళ్లు కల్పిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

కర్రా విరగదు.. పామూ చస్తుంది

దానికి బదులుగా మనం చట్టాలను కొంచెం కొంచెంగా సంస్కరించుకుంటూ పోవాలి. మొదట వివాహ వయస్సును సవరించాలి. ఆ తర్వాత విడాకుల అంశాన్ని, ఆ తర్వాత వివాహ రిజిస్ట్రేషన్ విధానాలను సంస్కరించాలి. దీని వల్ల ఎక్కువ వ్యతిరేకత రాదు. ఇలా కర్ర విరగకుండా, పామును చంపొచ్చు.

భారతదేశంలోని భిన్నత్వాన్ని చూసే లా కమిషన్ సరైన మాట చెప్పిందని నేను భావిస్తున్నాను.

ప్రస్తుతం అన్ని మతాలకు చెందిన 'పర్సనల్ లా'లను సంస్కరించడం మన ప్రాథమిక ప్రాధాన్యతగా ఉండాలి - అది హిందూవులది కావచ్చు, ముస్లింలది కావచ్చు, క్రైస్తవులది కావచ్చు.

ఫొటో సోర్స్, AFP/Getty

నేను లా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ జస్టిస్ చౌహాన్‌తో కలిసి పని చేసారు. ఆయన చాలా మంచి నివేదికను వెలువరించారు.

ప్రభుత్వానికి నిజంగా 'పర్సనల్ లా'లను మెరుగుపరచాలనే ఆలోచన ఉంటే, లా కమిషన్ సూచనలను పాటించాలి.

ఉదాహరణకు, హిందూ కోడ్ బిల్లు గురించి మాట్లాడితే 1954-55లో అది అమలులోకి వచ్చింది. కానీ దానికి ముందు 1941లో 'హిందూ లా రిఫార్మ్ కమిటీ'ని ఏర్పాటు చేయడం జరిగింది. అది వెలువరించిన నివేదికపై చాలా పెద్ద చర్చ జరిగింది.

అయితే ఆ నివేదిక చేసిన సిఫార్సులను అన్నీ ఒకేసారి ఆమోదించడం కుదరలేదు. ఆనాడు డాక్టర్ అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా ఉన్నా, దానికి వ్యతిరేకత ఎదురైంది. దాంతో దానిని మూడుదశల్లో ఆమోదించారు.

ఫొటో సోర్స్, Getty Images

సమాజం సిద్ధంగా ఉందా?

ఉమ్మడి పౌర స్మృతిపై చాలా కాలంగా చర్చ నడుస్తోంది. కానీ స్వాతంత్ర్యం వచ్చిన ఈ 70 ఏళ్లలో ఏ ప్రభుత్వం కూడా దానిపై ఒక నిర్దిష్టమైన ముసాయిదాను రూపొందించలేకపోయింది.

నిజంగా ముస్లిం పర్సనల్ లాను సంస్కరించాలని ప్రభుత్వం భావిస్తుంటే, హిందూ చట్టం సంస్కరణ కోసం ఏర్పాటు చేసిన కమిటీ తరహాలో మొదట దానిపై ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలి.

ఆ కమిటీ ఇచ్చిన ప్రతిపాదలను పరిశీలించి, వాటిపై చర్చించాలి. అప్పుడు వాటిలో సంస్కరణలు తీసుకురావాలి. ఇవన్నీ జరిగినప్పుడే వాటికి ఎక్కువ శాతం జనామోదం లభిస్తుంది.

కేవలం చట్టాలను మార్చినంత మాత్రాన సమాజం మారిపోదు. సమాజంలో మార్పు రావాలంటే సమాజం దానికి సిద్ధంగా ఉండాలి. అందుకోసం సమాజాన్ని సిద్ధం చేయాలి. ప్రస్తుతం అలా సమాజాన్ని సిద్ధం చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయో స్పష్టత లేదు.

ఫొటో సోర్స్, Getty Images

చట్టాలన్నీ ఒకే రకంగా లేవు

ఉమ్మడి పౌర స్మృతి అన్నది ఉమ్మడి జాబితాలో ఉంది. అంటే కేంద్రం, రాష్ట్రాలు రెండూ కూడా దీనిపై చట్టాలు చేసుకోవచ్చు. అంటే, 29 రాష్ట్రాలలో 29 రకాల చట్టాలు ఉండొచ్చు.

దేశవ్యాప్తంగా ఒకే హిందూ చట్టం ఉందని మనం అనుకుంటాం కానీ అది వాస్తవం కాదు. అదే విధంగా క్రిమినల్ లా కూడా దేశవ్యాప్తంగా ఒకేరకంగా లేదు, భారతీయ శిక్ష్మాస్మృతీ ఒకే విధంగా లేదు.

ఇటీవల పంజాబ్ దైవదూషణపై చట్టాన్ని సవరించింది. దీనిలో భాగంగా ఐపీసీలో 295ఎఎ ను జోడించడం జరిగింది. కొన్ని చానెళ్లలో వారాల తరబడి 'ఒకే దేశం- ఒకే చట్టం' అంటూ వార్తలను ప్రసారం చేయడం జరుగుతోంది. కానీ అది వాళ్ల అజ్ఞానాన్ని సూచిస్తుంది.

'ఒకే దేశం- ఒకే చట్టం' విషయంలో లా కమిషన్ సిఫార్సులు చాలా మందికి మింగుడు పడవని నాకు తెలుసు.

జనాభా విపరీతంగా పెరిగిపోతున్న నేటి పరిస్థితుల్లో బాలికల వివాహ వయస్సు 18 ఏళ్లు ఉందన్న కారణంగా బాలుర వివాహ వయస్సును కూడా 18 ఏళ్లకు తగ్గించడం తర్కం అనిపించుకోదు.

దానికి బదులుగా బాలికల వివాహ వయస్సునే 21 ఏళ్లకు పెంచాలనేది సరైన నిర్ణయం కాగలదు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)