అభిప్రాయం: ‘అర్బన్ నక్సల్ - ఈ పేరిట అరెస్టైన హక్కుల కార్యకర్తలు ప్రజా జీవితంలో ఉంటున్నవారే’
- నందినీ సుందర్
- సోషియాలజీ ప్రొఫెసర్, దిల్లీ యూనివర్సిటీ, బీబీసీ కోసం

ఫొటో సోర్స్, Getty Images
కొన్నేళ్ల క్రితం దంతెవాడలోని ఓ పాఠశాలను సందర్శించినపుడు, దాని ప్రిన్సిపాల్ ఆ పాఠశాలను మూసేయాలంటూ మావోయిస్టులు రాసినట్లుగా చెబుతున్న లేఖను నాకు చూపించారు. ఎర్ర రంగు ఇంకుతో రాసిన ఆ ఉత్తరం 'లాల్ సలామ్' అన్న పదంతో ముగిసింది.
విచారణ చేయగా ఆ ఉత్తరాన్ని ప్రిన్సిపాల్‌పై కోపం ఉన్న ఓ ఉపాధ్యాయుడే సెలవు కోసం రాసినట్లు తేలింది. అలాంటి 'మావోయిస్టుల' ఉత్తరాలు నేడు దేశంలో చాలానే కనిపిస్తున్నాయి. కొన్ని ఉత్తరాలను నిజంగా మావోయిస్టులే రాస్తే.. మరికొన్నింటిని పోలీసులు, ఇంకొన్నిటిని వ్యక్తిగత కక్షలు ఉన్న గ్రామస్తులే రాస్తున్నట్లు తేలింది.
గ్రామస్తులు అలాంటి ఉత్తరాలు రాసేటప్పుడు - మావోయిస్టులకు చదవడం, రాయడం బాగా వచ్చి ఉంటుందనే ఉద్దేశంతో చేతిరాతను వీలైనంత బాగా రాయడానికి ప్రయత్నిస్తారు. అదే విధంగా పోలీసులు మావోయిస్టుల ఉత్తరాలను సృష్టించినపుడు వారు నిరక్షరాస్యులు అని సూచించడానికి ప్రయత్నిస్తారు.
పుణె పోలీసులు విడుదల చేసిన ఉత్తరాలు వాళ్ల 'అర్బన్ నక్సల్స్' అన్న సృష్టికి అనుగుణంగా ఉన్నాయి. ఆ ఉత్తరాలకు నిజంగా అర్థంపర్థం లేదు. ఉదాహరణకు, 'కామ్రేడ్ సుధ', 'కామ్రేడ్ ప్రకాశ్'కు రాసినట్లుగా చెబుతున్న లేఖలో కొన్నిసార్లు మారుపేర్లను, కొన్నిసార్లు అసలు పేర్లను ఉపయోగించారు - ప్రత్యేకించి పోలీసులు అరెస్టు చేయాలని భావిస్తున్న వ్యక్తుల పేర్లు.
సుధా భరద్వాజ్ గురించి కొంచెం తెలిసిన ఎవరికైనా ఆమె తన కోసం కానీ, కూతురి కోసం కానీ ఎన్నడూ డబ్బును అడగరని తెలుసు. సుధ విడుదల చేసిన ప్రకటనలో చెప్పినట్లు - న్యాయ సహాయం, నిజనిర్ధారణ, సమావేశాలలాంటి చట్టబద్ధమైన చర్యలను కూడా పోలీసులు కుట్రలుగా పేర్కొన్నారు.
పోలీసులు అరెస్ట్ చేసిన వారిని పరిశీలిస్తే - గతంలో అరెస్టైన వారిలో అతి చిన్న వాడైన మహేశ్ రౌత్, అప్పట్లో ప్రధానమంత్రి గ్రామీణాభివృద్ధి ఫెలోషిప్ తీసుకున్నారు. డిసెంబర్, 2017కు చాలా కాలం ముందు నుంచే అతను ఎన్నో ఏళ్లుగా గడ్చిరోలిలో అటవీ హక్కుల చట్టం, పెసా చట్టంపై ఆదివాసీ గ్రామస్తులతో సమావేశాలు నిర్వహించేవాడు.
కానీ పోలీసులు మాత్రం వాస్తవాలను వక్రీకరించి ఇలాంటి వారందరికీ 'అర్బన్ నక్సల్' అన్న ముద్ర వేస్తున్నారు.
డీమానిటైజేషన్ మావోయిస్టులు, కశ్మీరీ వేర్పాటువాదుల వెన్ను విరిచిందని మనకు గతంలో చెప్పారు. అలాంటి సమయంలో ఇప్పుడు వీళ్లంతా ప్రధాని ప్రాణాలకు హాని తలపెట్టగలిగే స్థాయికి ఎలా చేరుకున్నారు?
మావోయిస్టులకు గ్రామీణ ప్రాంతాలలో పట్టు పోయిందని, అందుకే వాళ్లు పట్టణ ప్రాంతాలకు చాపకింద నీరులా విస్తరిస్తున్నారని హోంమంత్రి అంటున్నారు. కానీ ప్రస్తుతం అర్బన్ నక్సల్స్ పేరిట అరెస్ట్ చేసిన వారంతా ఎన్నో ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉంటూ రాజకీయాల్లో పాల్గొంటున్న వారే.
దిల్లీ హైకోర్టులో గౌతమ్ నవ్లాఖా రిమాండును సమర్థిస్తూ అదనపు సొలిసిటర్ జనరల్ అమన్ లేఖీ.. మొదట తాము ఐదుగురిని అరెస్ట్ చేయగా, ఆ అరెస్టుల ఆధారంగా మరో ఐదుగురికీ దీనితో సంబంధం ఉందని వెల్లడైందని వాదించారు. దీని వెనుక ఇది మరిన్ని అరెస్టులకు దారి తీయవచ్చనే అర్థం ఉంది.
ఈ మొత్తం వ్యవహారంలో కుట్ర ఏదైనా ఉందంటే అది అరెస్టైన మానవ హక్కులు కార్యకర్తలు పన్నిన కుట్ర కాదు.. పుణె పోలీసులు, మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, అధికారంలో ఉన్న బీజేపీ చేసిన కుట్ర ఉంది. అందువల్ల ఈ అరెస్టుల వెనుక ఉన్న కుట్రను లేదా కారణాలను ఛేదించే ప్రయత్నం చేద్దాం.
అప్పుడే -వీళ్లనే అరెస్ట్ చేయడం ఎందుకు? దీని ద్వారా ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటోంది? అన్నది స్పష్టం అవుతుంది.
ఫొటో సోర్స్, Getty Images
ఈ అణచివేతకు మొదటి కారణం - గౌరీ లంకేశ్, ఎంఎం కల్బుర్గీ, గోవింద్ పన్సారె, దభోల్కర్ లాంటి వారి హత్యలకు బాధ్యులైన సనాతన సంస్థ ఉగ్ర కార్యకలాపాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం.
భీమా కోరెగావ్ అల్లర్లకు కారకులుగా భావిస్తున్న శంభాజీ భిడే, మిలింద్ ఎగ్బోటేల అనుచరుడు తుషార్ దాంగుడె ఇచ్చిన ఒక ఫిర్యాదు ఆధారంగా ఈ మానవ హక్కుల కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్నారు.
2002 గుజరాత్ మారణహోమంలో మాయా కొద్నానీ నిర్దోషిగా విడుదల కావడం, ఇష్రత్ జహాన్, సోహ్రబుద్దీన్ కేసుల్లో అమిత్ షా, వంజారలపై ఆరోపణలు ఉపసంహరించుకోవడం, యోగి ఆదిత్యనాథ్ తనను తాను నిర్దోషిగా విముక్తుణ్ని చేసుకునే ప్రయత్నాలు చేయడం, జార్ఖండ్‌లో మూకహత్యలకు పాల్పడిన వారికి జయంత్ సిన్హా మాలలు వేయడం- వీటన్నిటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడం వీరి ప్రధాన లక్ష్యం.
ఇలాంటి చర్యల ద్వారా హింసాత్మక సంఘటనలను ప్రేరేపించిన వారికి ఎలాంటి చట్టబద్ధమైన సమస్యలూ రాకుండా చూస్తామని, వాళ్లు తమ చర్యలను యధావిధిగా కొనసాగించుకోవచ్చని ప్రభుత్వం సంకేతాలు ఇస్తోంది.
ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES
రెండు - ప్రభుత్వ లక్ష్యం కొన్ని రకాల హిందుత్వ అనుకూల దళిత, ఆదివాసీ వర్గాలను ప్రోత్సహించి, మిగతా వాటిని అణచివేయడం. దళిత, ఆదివాసీ ఓట్ల కోసం బీజేపీ చాలా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దళితుడిని రాష్ట్రపతిగా నియమించడం, ఎస్సీ, ఎస్టీ చట్టంలో మార్పులపై రివ్యూ పిటిషన్ వేయడం లాంటి చర్యల ద్వారా వాళ్లను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది.
అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని భీమ్ ఆర్మీకి చెందిన చంద్రశేఖర్ ఆజాద్, గుజరాత్లో జిగ్నేష్ మేవానీ, నవీన బ్రాహ్మణ పీష్వాలపై పోరాటం చేసిన ఎల్గార్ పరిషత్లాంటివి మాత్రం ఉపేక్షించేది లేదని సంకేతాలు పంపుతోంది.
మూడు - ‘జాతి వ్యతిరేక’, ‘తుక్డే తుక్డే గ్యాంగ్’, ‘అర్బన్ నక్సల్స్’ అన్న పదాల ద్వారా మానవ హక్కుల కార్యకర్తలు, విమర్శకులపై చట్టవ్యతిరేక ముద్రను వేయడం. దీనిలో భాగంగా దేశభక్తి అన్న భావాన్ని ఎంత పెంచి పోషించారంటే... ఉమర్ ఖాలిద్‌ను హత్య చేయడానికి ప్రయత్నించిన వ్యక్తులు తామేదో గొప్ప కార్యం చేస్తున్నామని విశ్వసించారు. అదే విధంగా బీజేపీ మద్దతుదారుడొకరు విమానంలో కన్హయ్య కుమార్ గొంతును నులమడానికి ప్రయత్నించారు.
పదేళ్ల క్రితం మావోయిస్టులను పక్కదారి పట్టిన ఆదర్శవాదులుగా భావించేవాళ్లు. ఒక దశాబ్దం పాటు పోలీసులు సాగించిన ప్రచారం కారణంగా వాళ్లు నేడు సమాజంలో అంటరానివాళ్లుగా మారారు. మానవ హక్కుల కార్యకర్తలకు కూడా భవిష్యత్తులో ఇదే పరిస్థితి ఎదురవుతుంది.
ఫొటో సోర్స్, Getty Images
నాలుగు - ఇటీవల మావోయిస్టులపై పోరాటం పేరుతో జరుగుతున్న మారణకాండ నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం
ఆగస్టు 6న ఛత్తీస్‌గడ్‌లోని సుకుమా జిల్లా నుల్కాటాంగ్ గ్రామం సమీపంలో భద్రతా బలగాలు 15 మంది ఆదివాసీ పిల్లలను కాల్చి చంపాయి. జర్నలిస్టులు, న్యాయవాదులు, పరిశోధకుల్లాంటి వారందరినీ అలాంటి సంఘటనలకు దూరంగా ఉంచడం ద్వారా మైనింగ్ తదితర కంపెనీలు సులభంగా భూమిని స్వాధీనం చేసుకొనేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది.
ఐదు - నరేంద్ర మోదీకి వ్యక్తిగత సానుభూతి సంపాదించుకోవడం. ఇది బహుశా యాదృచ్ఛికమే కావచ్చు కానీ, మోదీ ప్రాబల్యం తగ్గుతోందని అనిపించినప్పుడల్లా ఆయనను చంపడానికి ప్రయత్నించే కుట్రలు బయటపడుతుంటాయి.
అయితే ఇలాంటి కుట్రలు చెప్పేదేమిటంటే - పోలీసు శాఖ, హోంశాఖ తమ బాధ్యతలను సరిగా నిర్వర్తించడం లేదని. ఈ విషయంలో అవి రెండూ తామే విశ్వసించని ఒక కట్టుకథను వినిపిస్తున్నాయి. పోలీసుల కథనం ప్రకారమే ఏప్రిల్ 17న రోనా విల్సన్ ఇంటి నుంచి మోదీ హత్యకు కుట్రకు సంబంధించిన పత్రం బయటపడింది. మరి అలాంటప్పుడు రోనా విల్సన్, ఇతరులను అరెస్ట్ చేయడానికి జూన్ 6 వరకు ఎందుకు కాలయాపన జరిగింది?
అందువల్ల బీజేపీ ప్రభుత్వం, పోలీసులు తామే నమ్మని కట్టుకథలను చెప్పడం మానేసి, అరెస్ట్ చేసిన మానవ హక్కుల కార్యకర్తలందర్నీ విడుదల చేయాలి.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)