ప్రెస్‌రివ్యూ: కరెన్సీ నోట్లతో అంటువ్యాధులు.. ఆందోళనలో వ్యాపారులు

భారత కరెన్సీ

ఫొటో సోర్స్, Getty Images

కరెన్సీ నోట్ల ద్వారా కూడా అంటు వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని ప్రభుత్వ అధ్యయనం చెప్పింది. దీనిపై ఆందోళన చెందిన అఖిల భారత వ్యాపారుల సమాఖ్య(కెయిట్‌) తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి లేఖ రాసిందని తెలంగాణ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

గొలుసుకట్టుగా చేతులు మారే కరెన్సీ నోట్ల ద్వారా క్షయ(టీబీ), సెప్టీసీమియాసహా 78 రకాల వ్యాధులు వ్యాప్తి చెందుతాయని పరిశోధనలో వెల్లడైంది. ఈ నివేదికను వైజ్ఞానిక, పారిశ్రామిక పరిశోధనా మండలి(సీఎస్‌ఐఆర్‌) ఆధ్వర్యంలో పని చేసే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ) తయారు చేసింది.

2016లో మైక్రోబయోలజీ అండ్‌ అప్లయిడ్‌ సైన్స్‌ వెల్లడించిన నివేదికలోనూ కరెన్సీ నోట్ల ద్వారా అంటువ్యాధులు వ్యాప్తి చెందుతాయని తేలింది. ఈ నివేదిక తమిళనాడులోని తిరునవేల్వేలీ వైద్య కళాశాల నిర్వహించిన పరిశోధన ద్వారా రూపొందింది.

ఆ సందర్భంగా 120 కరెన్సీ నోట్లను ప్రయోగశాలలో పరీక్షించి చూడగా, 86.4 శాతం నోట్లపై వ్యాధికారక సూక్ష్మక్రిములున్నట్లు తేలింది. ఈ నోట్లను వ్యాపారులు, డాక్టర్లు, విద్యార్థులు, గృహిణుల నుంచి సేకరించారు.

కరెన్సీ నోట్లు ఎక్కువగా చేతులు మారేది వ్యాపారుల నుంచి. అందువల్ల వ్యాపారులు రోగాల బారిన పడటం అధికంగా ఉన్నట్టు నివేదికలో వెల్లడైంది.

దాంతో, ఆందోళన చెందిన అఖిల భారత వ్యాపారుల సమాఖ్య(కెయిట్‌) ఈ అంశంపై ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి లేఖ రాసింది. వ్యాపారుల ఆరోగ్య రక్షణ కోసం చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి కెయిట్‌ విజ్ఞప్తి చేసిందని నవతెలంగాణ కథనం పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images

ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక సరిహద్దు రికార్డులు గల్లంతు?

అత్యంత కీలకమైన సర్వే రికార్డులు గల్లంతయ్యాయంటూ ఆంధ్రజ్యోతి పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

రికార్డులు గల్లంతయ్యాయని చెప్పలేకనే సర్వే అధికారులు డొంకతిరుగుడుగా ‘ప్రస్తుతానికి అందుబాటులో లేవు’ అని చెబుతున్నారు.

అత్యంత కీలకమైన బళ్లారి అటవీప్రాంతంలో ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక సరిహద్దులను తేల్చే సర్వే రికార్డుల విషయంలోనూ ఇదే మాట అంటున్నారు.

అంతర్రాష్ట్ర సరిహద్దును ప్రభావితం చేసే కీలకమైన మూడు గ్రామాల ట్రావెర్స్‌ రికార్డులు గల్లంతయ్యాయి. గ్రామ మ్యాపులు, భూముల చిత్రపటాలు(ఎఫ్‌ఎమ్‌బీలు), ఆర్‌ఎస్‌ఆర్‌లు కూడా కనిపించడం లేదు. సెంట్రల్‌ సర్వే విభాగంలోనే అవి మాయమయ్యాయి. ఎంత వెతికినా వాటి ఆచూకీ కనిపించడం లేదు.

బళ్లారి అటవీప్రాంతంలో రెండు రాష్ట్రాల అంతర్రాష్ట్ర సరిహద్దుపై గత నెలలో సర్వే పూర్తయింది. ఆంధ్రలోని మల్పనగుడి, హెచ్‌ సిద్ధాపురం. ఓబుళాపురం గ్రామాల సరిహద్దు రికార్డుల నకలు ప్రతిని సర్వేయర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌జీఐ)కి ఆంధ్రప్రదేశ్ అధికారులు అందించారు.

దీనిపై కర్ణాటక అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జిరాక్స్‌ కాపీలు కాదని.. అసలు పత్రాలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. వాటిని అందిస్తామని ఏపీ అధికారులు నివేదించారు. ఇక ఇక్కడి నుంచి అసలు కథ మొదలైంది.

ఆగస్టు 22వ తేదీ నుంచి ఏపీ సెంట్రల్‌ సర్వే ఆఫీసులో ఆ మూడు గ్రామాల ట్రావెర్స్‌ రికార్డుల కోసం అన్వేషిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఆర్కైవ్స్‌ నుంచి సర్వే అధికారులు వాటిని తీసుకెళ్లినట్లుగా రిజిస్టర్‌లో నమోదై ఉంది.

ఇప్పుడా రికార్డుల కోసం సెంట్రల్‌ సర్వే ఆఫీసులో ఎంత గాలించినా లభించడం లేదు. మరి ఇప్పుడేం చేయాలి? సర్వేయర్‌ జనరల్‌కు ఏమని నివేదించాలన్నదానిపై రాష్ట్ర సర్వే అధికారి తర్జనభర్జన పడుతున్నారు.

రికార్డులు గల్లంతయ్యాయని చెబితే ట్రావెర్స్‌ రికార్డు ఆధారంగా చేపట్టిన సర్వేకు కర్ణాటక అంగీకరించదు. దీనికితోడు రికార్డులు ఎలా పోగొట్టారనే ప్రశ్న ఉదయిస్తుంది.

ఈ సరిహద్దు కేసులో లబ్ధిపొందే మైనింగ్‌ కంపెనీకి మేలు చేసేందుకే వీటిని మాయం చేశారా అన్న అనుమానాలూ తలెత్తుతాయి. దీంతో ఈ వ్యవహారం ఎటు దారితీస్తుందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

ఫొటో సోర్స్, FACEBOOK/MADABHUSHI SRIDHAR

ఫొటో క్యాప్షన్,

మాడభూషి శ్రీధరాచార్యులు, కేంద్ర సమాచార కమిషనర్

శ్రీవారి ఆభరణాలెక్కడ?

శ్రీకృష్ణదేవరాయలు తిరుమల దేవస్థానానికి సమర్పించిన అత్యంత విలువైన ఆభరణాలు ఎక్కడున్నాయో చెప్పాలని కేంద్ర సమాచార కమిషన్‌(సీఐసీ).. ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(ఏఎస్‌ఐ), కేంద్ర సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని, టీటీడీని ప్రశ్నించినట్లు సాక్షి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం మేరకు..

తిరుమల ఆలయాలను ప్రాచీన కట్టడాలుగా ప్రకటించడానికి, శ్రీవారి ఆభరణాలను పరిరక్షించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో ప్రజలకు తెలియజేయాలని సీఐసీ.. ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఆదేశించింది.

తిరుమల ఆలయాలను చరిత్రాత్మక, జాతీయ వారసత్వ కట్టడాలుగా ప్రకటించడానికి తీసుకున్న చర్యలను తెలియజేయాలంటూ బీకేఎస్‌ఆర్‌ అయ్యంగార్‌ అనే వ్యక్తి తొలుత ప్రధానమంత్రి కార్యాలయాన్ని సంప్రదించారు.

అక్కడి నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో చివరకు కేంద్ర సమాచార కమిషన్‌ను ఆశ్రయించారు. 1500 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఆలయాలను టీటీడీ పాలక మండలి సంరక్షించడం లేదని పేర్కొన్నారు. శ్రీకృష్ణ దేవరాయలు సమర్పించిన ఆభరణాల భద్రతపైనా అయ్యంగార్‌ అనుమానాలు వ్యక్తం చేశారు.

శ్రీవారి ఆలయాలు, ఆభరణాల పరిరక్షణ విషయంలో జస్టిస్‌ వాద్వా, జస్టిస్‌ జగన్నాథరావు కమిటీలు ఇచ్చిన నివేదికలను ఇప్పటిదాకా ఎందుకు బహిర్గతం చేయడం లేదని సమాచార కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ టీటీడీని ప్రశ్నించారు.

సమాచార హక్కు చట్టం కింద దాఖలయ్యే వినతులకు టీటీడీ పాలక మండలి గతంలో స్పందించేదని, ఇప్పుడు సమాధానం ఇచ్చేందుకు నిరాకరిస్తోందని శ్రీధర్ అన్నట్లు సాక్షి పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images

బంగారు మార్గాలు!

విదేశాల నుంచి అడ్డదారుల్లో బంగారాన్ని తరలించేందుకు అంతర్జాతీయ స్మగ్లర్లు విమానాశ్రయాలను వినియోగించుకుంటున్నారంటూ ఈనాడు దినపత్రిక కథనం పేర్కొంది. అందులో..

తనిఖీలకు చిక్కకుండా ఉండేందుకు ముఠాలు నిరంతరం కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. బంగారాన్ని వివిధ రూపాల్లోకి మార్చి, తనిఖీ అధికారుల కళ్లుగప్పుతున్నాయి.

ఈ ఏడాది తొలి ఏడు నెలల వ్యవధిలోనే దేశంలోని 25 అంతర్జాతీయ విమానాశ్రయాల్లో బంగారం అక్రమ రవాణా చేస్తున్న వారిపై 986 కేసులు నమోదు చేసి, రూ.248.10 కోట్ల విలువైన పసిడిని కస్టమ్స్‌, డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిని బట్టి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయాలూ ఈ స్మగ్లింగ్‌కు కేంద్రాలుగా మారుతున్నాయి. ఈ రెండు చోట్ల ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు 19 కేసుల్లో రూ.3.81 కోట్ల విలువైన పుత్తడి పట్టుబడింది. ప్రధానంగా దుబాయ్‌, సింగపూర్‌, మలేషియా తదితర దేశాల నుంచి వస్తున్న విమానాలను స్మగ్లర్లు అక్రమ రవాణాకు వినియోగించుకుంటున్నారు.

ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల లోపలుండే విడిభాగాలను బంగారంతో చేయించి పైకి అవి సాధారణ వస్తువుల్లా కనిపించేలా చేస్తున్నారు. మైక్రో ఓవెన్లు, వాషింగ్‌ మిషన్లు, మ్యూజిక్‌ సిస్టమ్‌లు తదితర పరికరాల్లో ఉండే అయస్కాంతాలు, ఆంప్లిఫియర్లు, రాడ్లు, పుల్లీలు వంటి వాటి లోపల బంగారాన్ని దాచి రవాణా చేస్తున్నారు.

నిశితంగా పరిశీలిస్తే తప్ప అవి బంగారంతో తయారైనవని గుర్తించలేని పరిస్థితి. విశాఖపట్నం విమానాశ్రయంలో గతంలో ఈ తరహాలో జరుగుతున్న అక్రమ రవాణా గుట్టురట్టైంది. కొంతమంది బంగారాన్ని మలద్వారాల్లో దాచి అక్రమంగా తరలిస్తుండగా, ఇంకొంతమంది పేస్ట్‌లు, జెల్లీల రూపంలో ముద్దగా చేసి తీసుకొస్తున్నారు.

విదేశాల నుంచి బంగారాన్ని స్మగ్లింగ్‌ చేసుకుంటే కిలోకు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు సుంకం రూపంలో ప్రభుత్వానికి చెల్లించాలి. అక్రమ రవాణా వల్ల ఆ సొమ్ము మిగులుతుంది. ఆభరణాలుగా మార్చి విక్రయిస్తే మరింత లాభం చేకూరుతుంది.. అని ఈనాడు కథనం పేర్కొంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేసుకోండి.)