క్రికెట్: ఇంగ్లండ్‌లో భారత జట్టు విజయాలను చేజార్చుకోవడానికి నాలుగు కారణాలు

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ఈ మ్యాచ్‌లో కోహ్లీ వ్యక్తిగత ఘనతలు సాధించినా, ఓటమితో అవి మరుగున పడిపోయాయి

ప్రపంచ నంబర్ వన్ టెస్ట్ టీమ్ భారత్‌కు సౌతాంప్టన్‌లో ఇంగ్లండ్‌పై చరిత్ర సృష్టించే అవకాశం వచ్చింది.

కేవలం నాలుగు రోజులే నడిచిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో రెండున్నర రోజులు భారత జట్టు ఆధిపత్యం ప్రదర్శించింది. కానీ కీలక సమయంలో ఆటగాళ్లు మ్యాచ్‌పై పట్టు బిగించలేకపోయారు. అదే సమయంలో మొదటి ఇన్నింగ్స్‌లో వెనకబడ్డ ఇంగ్లండ్ పుంజుకుంది. ఫలితంగా టెస్ట్ సిరీస్ భారత్ చేజారింది.

భారత జట్టు ఈ టెస్ట్ మ్యాచ్ గెలిచుంటే సిరీస్ 2-2తో సమం అయ్యుండేది. ఆఖరి మ్యాచ్‌ నిర్ణయాత్మకం అయ్యుండేది. కానీ ఇప్పుడు 3-1తో ఆధిక్యంతో ఈ సిరీస్ ఇంగ్లండ్ సొంతమైంది.

భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో ఎన్నో వ్యక్తిగత ఘనతలు సాధించాడు. ఈ సిరీస్‌లో 500 రన్స్ పూర్తి చేశాడు, టెస్టు మ్యాచుల్లో కెప్టెన్‌గా వేగంగా 4 వేల రన్స్ చేసిన మొదటి భారతీయుడు అయ్యాడు. కానీ భారత్ దాదాపు గెలవాల్సిన మ్యాచ్ చేజారడంతో వాటికి విలువ లేకుండాపోయింది.

మ్యాచ్ తర్వాత భారత కెప్టెన్ కోహ్లీ ఓటమికి కారణం చెప్పాడు. "రాత్రి మాకు గెలవడానికి 50 శాతం ఛాన్స్ ఉందనిపించింది. కానీ మేం ఎలా అనుకున్నామో, అలాంటి ప్రారంభం లభించలేదు. ఇంగ్లండ్ టీమ్ మాపై ఒత్తిడి కొనసాగించగలిగింది" అన్నాడు.

మెరుగైన ప్రదర్శన వల్లే ఇంగ్లండ్ గెలిచిందని కోహ్లీ చెప్పుండచ్చు. కానీ ఈ ఓటమికి ఎక్కువగా భారత జట్టు చేసిన పొరపాట్లే కారణం అయ్యాయి.

ఫొటో సోర్స్, ALLSPORT/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్,

'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' మొయిన్ అలీ

మొయిన్ అలీ జోరు

ప్లేయింగ్ ఎలెవన్‌లో పునరాగమనాన్ని నిరూపించుకున్న మొయిన్ అలీ భారతీయ బ్యాట్స్‌మెన్లను బెంబేలెత్తించాడు. ప్రపంచంలో అందరికంటే స్పిన్‌ బాగా ఆడతారనే పేరున్న భారత బ్యాట్స్‌మెన్లు ఈ మ్యాచ్‌లో మాత్రం తమ స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయారు.

మొయిన్ అలీ మొదటి ఇన్నింగ్స్‌లో 63 పరుగులకు 5, రెండో ఇన్నింగ్స్‌లో 71 పరుగులకు 4 వికెట్లు తీశాడు. ఇందులో కెప్టెన్ కోహ్లీ(58), అజింక్య రహానే(51) వికెట్లు కూడా ఉన్నాయి.

భారతీయ స్టార్ స్పిన్నర్ అశ్విన్ కేవలం మూడు వికెట్లు తీసిన అదే పిచ్‌పై మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మొయిన్ అలీ 9 వికెట్లు పడగొట్టాడు.

ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ మొయిన్‌పై ప్రశంసలు కురిపించాడు. "నేనీరోజు తను అద్భుతంగా బౌలింగ్ చేయడం చూశా" అన్నాడు.

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES

ఆటపై పట్టు సడలింది

సౌతాంప్టన్‌లో భారతీయ బౌలర్లు ఇంగ్లండ్‌పై ఒత్తిడి పెంచాక, మ్యాచ్‌పై పట్టు సడలించారు. జట్టు ఆ మూల్యాన్ని చెల్లించుకుంది. ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 86 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన దశలో భారత బౌలర్లు ఇంగ్లండ్‌ చివరి నాలుగు వికెట్లు పడగొట్టేందుకు 160 రన్స్ ఇచ్చుకున్నారు. దాంతో ఇంగ్లండ్ 246 పరుగులు గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది.

అదే విధంగా రెండో ఇన్నింగ్స్‌లో కూడా 92 పరుగులకు ముందు 4 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ తర్వాత 271 స్కోర్ వరకూ వెళ్లగలిగింది. భారత బౌలర్లు రెండు ఇన్నింగ్సుల్లో శామ్ కరన్‌ను అడ్డుకునే ఫార్ములా కనిపెట్టలేకపోయారు. కరన్ మొదటి ఇన్నింగ్స్‌లో 78, రెండో ఇన్నింగ్స్‌లో 46 పరుగులు చేశాడు. భారత కెప్టెన్ కోహ్లీ కూడా కరన్‌పై ప్రశంసలు కురిపించాడు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

ఓపెనర్లు విఫలమవడం కెప్టెన్ జీర్ణించుకోలేకపోయాడు. మ్యాచ్‌ ఓటమికి అది కూడా ఒక కారణమని కోహ్లీ చెప్పాడు

చేతులెత్తేసిన బ్యాట్స్‌మెన్లు

సౌతాంప్టన్‌లో భారత్ కేవలం ముగ్గురు బ్యాట్స్‌మెన్లు ఉన్న జట్టులాగే కనిపించింది. మొదటి ఇన్నింగ్స్‌లో చతేశ్వర్ పుజారా(132 నాటౌట్), కోహ్లీ(46) మాత్రమే క్రీజులో నిలబడగలిగారు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ కోహ్లీ, అజింక్య రహానే మాత్రమే ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కోగలిగారు.

ఓపెనర్లు విఫలమవడం కెప్టెన్ జీర్ణించుకోలేకపోయాడు. మ్యాచ్‌ ఓటమికి అది కూడా ఒక కారణమని కోహ్లీ చెప్పాడు. దినేష్ కార్తీక్ స్థానంలో జట్టులోకి వచ్చిన రిషబ్ పంత్, ఆల్ రౌండర్ అనిపించుకున్న హార్దిక్ పాండ్యా కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు.

ఫొటో సోర్స్, ALLSPORT/GETTY IMAGES

సెలక్షన్‌లో లోపాలు

భారతీయ బ్యాట్స్‌మెన్లు స్పిన్‌ బాగా ఆడతారని అందరికీ తెలుసు. అయినా పిచ్ బాగా పరిశీలించిన ఇంగ్లండ్ తమ జట్టులో ఇద్దరు స్పిన్నర్లు మొయిన్ అలీ, ఆదిల్ రషీద్‌కు చోటిచ్చింది. అదే భారత జట్టు మాత్రం కేవలం ఒకే స్పిన్నర్ అశ్విన్‌తో మైదానంలోకి దిగింది. అశ్విన్ కూడా తన స్పిన్ మాయ చూపించలేకపోయాడు. రవీంద్ర జడేజా స్థానంలో చోటు దక్కించుకున్న హార్దిక్ పాండ్యా కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. బ్యాట్‌తో కూడా విఫలమయ్యాడు.

ఫొటో సోర్స్, Reuters

కొనసాగిన ఓటమి

ర్యాంకింగ్‌, స్టామినా ప్రకారం భారత జట్టు సిరీస్ మొదలవక ముందు ఇంగ్లండ్ టీమ్ కంటే మెరుగైన స్థితిలో కనిపించింది. కానీ బర్మింగ్‌హాంలో ఆడిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ భారత జట్టు పొరపాట్లను అనుకూలంగా మలుచుకుంది. ఈ మ్యాచ్‌లో కేవలం 31 పరుగులతో విజయం సాధించింది.

లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ టీమ్ పూర్తిగా జోరు కొనసాగించింది. ఇన్నింగ్స్ 159 పరుగుల తేడాతో గెలిచింది.

మూడో టెస్టులో మాత్రం భారత్ పుంజుకుంది. ఇంగ్లండ్‌ను 203 పరుగులతో ఓడించింది.

నాలుగో టెస్టులో భారత్‌కు ఈ సిరీస్ సమం చేసే అవకాశం కూడా వచ్చింది. కానీ ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో వెనకబడ్డప్పటికీ, తిరిగి పుంజుకుని 60 పరుగులుతో మ్యాచ్‌ విన్నర్‌గా నిలిచింది.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)