నూర్ జహాన్: ఏకైక మొఘల్ సామ్రాజ్ఞి... జహంగీర్‌కు 20వ భార్య

ఫొటో సోర్స్, Penguin
మొఘల్ సామ్రాజ్యంలో ఏకైక సామ్రాజ్ఞి నూర్ జహాన్
17వ శతాబ్దపు భారతదేశంలో నూర్ జహాన్ అత్యంత శక్తిమంతమైన మహిళ. విస్తారమైన మొఘల్ సామ్రాజ్యాన్ని ఆమె విజయవంతంగా పాలించారు. నేడు ఆమె నాయకత్వాన్ని అర్థం చేసుకోవడం ఎందుకు అవసరమో చరిత్ర అధ్యాపకుడు రూబీ లాల్ వివరిస్తున్నారు.
పుట్టినపుడు నూర్ పేరు మొహరున్నీసా. భర్త, మొఘల్ చక్రవర్తి జహంగీర్ 'నూర్ జహాన్' (ప్రపంచానికి వెలుగు) అని పేర్కొన్న ఆమె, మొదటి ఎలిజబెత్ రాణి పుట్టిన కొన్ని దశాబ్దాల అనంతరం జన్మించారు. అయినా ఎలిజబెత్ రాణికన్నా వైవిధ్యమైన భూభాగాన్ని ఆమె పాలించారు.
16వ శతాబ్దంలో అధికారంలోకి వచ్చాక, మొఘల్ పాలకులు సుమారు 300 ఏళ్లపాటు భారత ఉపఖండాన్ని పాలించారు. భారతదేశపు అతి పెద్ద, అతి శక్తివంతమైన సామ్రాజ్యాల్లో మొఘల్ సామ్రాజ్యం ఒకటి. ఆ సామ్రాజ్య పాలకుల్లో నూర్ జహాన్‌తో పాటు చాలా మంది చక్రవర్తులు, రాజవంశానికి చెందిన మహిళలు - కళలు, సంగీతం, వాస్తుశాస్త్రాన్ని ప్రోత్సహించారు. అనేక పెద్ద పెద్ద నగరాలు, కోటలు, మసీదులు, సమాధులు నిర్మించారు.
ఫొటో సోర్స్, Courtesy of Rampur Raza Library
తుపాకీ పట్టిన వీరవనిత : ఒక చిత్రకారుని ఊహల్లో నూర్ జహాన్
ఏకైక మొఘల్ సామ్రాజ్ఞి
మొఘల్ సామ్రాజ్య ఏకైక మహిళా పాలకురాలిగా నూర్ జహాన్ పేరు భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ చరిత్ర అంతటా కనిపిస్తుంది.
మొఘల్ సామ్రాజ్యంలోని రెండు ప్రధాన నగరాలు - ఉత్తర భారతదేశంలోని ఆగ్రా, ఉత్తర పాకిస్తాన్‌లోని లాహోర్‌లో ఆమె గురించి ఎన్నో కథలు వినవచ్చు. నూర్, జహంగీర్ ఎలా ప్రేమలో పడ్డారో టూరిస్ట్ గైడ్‌లు కథలుకథలుగా చెబుతారు.
ఒక గ్రామంపై పడి మనుషులను చంపుతున్న పులిని ఆమె ఒక ఏనుగు పై నుంచి ఈటెతో ఎలా చంపారో కథలుగా వివరిస్తారు.
ఆమె ప్రేమ గురించి చాలా కథలే ఉన్నా, ఆమె రాజకీయ జీవితం గురించి, ఆమె సమోన్నత ఆశయాల గురించి మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. ఆమె ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ కూడా ఒక సామ్రాజ్యాన్ని విజయవంతంగా పాలించిన మహిళ.
ఆమె ఒక కవయిత్రి, వేటలో నిపుణురాలు, వాస్తుశిల్పి. ఆగ్రాలో తన తల్లిదండ్రుల సమాధుల కోసం ఆమె చేసిన డిజైన్లే తర్వాత కాలంలో తాజ్ మహల్ నిర్మాణానికి ప్రేరణగా నిలిచాయి.
ఫొటో సోర్స్, IndiaPictures/UIG via Getty Images
నూర్ మొదట 1594లో ఒక మొఘల్ ప్రభుత్వ అధికారిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె భర్తతో పాటు భారతదేశంలోని తూర్పు ప్రాంతంలో ఉన్న బెంగాల్‌కు తరలివెళ్లారు
రాజవంశం నుంచి రాలేదు
పురుషాధిక్య ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన మహిళా నేతగా పేరు తెచ్చుకున్న నూర్.. నిజానికి రాజవంశం నుంచి రాలేదు. అయినా జహంగీర్ భార్యగా, కార్యదక్షత కలిగిన నాయకురాలిగా ఆమె మొఘల్ సామ్రాజ్యాన్ని పాలించారు.
అసలు ప్రజాజీవితంలో మహిళలు కనిపించడమే అరుదైన ఆ రోజుల్లో ఆమె అంత శక్తిమంతంగా ఎలా ఎదిగారు?
ఆమె బాల్యం ఎలా గడిచింది? ఆమెకు తోడుగా ఉన్న వారి సహకారం ఎలా ఉండేది? జహంగీర్‌తో ఆమెకున్న ప్రత్యేక బంధం గురించి, ఆమె ఆశయాల గురించి చెప్పుకోవాల్సింది చాలా ఉంది.
నాడు అరబ్బులు, పర్షియన్లు ఉత్తర భారతదేశంగా పేర్కొన్న ఆ నేల, అన్ని సంస్కృతులనూ ఆదరించేది. అక్కడ అన్ని మతాలు, సంప్రదాయాలను పాటించేవారు. ప్రజలు కలిసి మెలిసి జీవించేవారు.
ఫొటో సోర్స్, SM Mansoor
నూర్ జహాన్ ఇతర మహిళలతో కలిసి పోలో ఆడుతున్న పెయింటింగ్
జహంగీర్ 20వ భార్య
నూర్ 1577లో (ప్రస్తుతం అఫ్ఘానిస్తాన్‌లోని) కాందహార్‌లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు సఫావిద్ సామ్రాజ్య పాలకుల కాలంలో ఉదారవాదులైన మొఘల్ పాలకుల వద్ద ఆశ్రయం పొందడానికి భారతదేశం వచ్చేశారు.
అనేక సంప్రదాయాల సమ్మేళనంలో పెరిగిన నూర్ మొదట 1594లో ఒక మొఘల్ ప్రభుత్వ అధికారిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె భర్తతో పాటు భారతదేశంలోని తూర్పు ప్రాంతంలో ఉన్న బెంగాల్‌కు తరలివెళ్లారు.
అయితే మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారన్న అనుమానంతో ఆమె భర్తను ఆగ్రాకు పట్టుకురావాలని జహంగీర్ బెంగాల్ గవర్నర్‌ను ఆజ్ఞాపించారు. దీంతో గవర్నర్ సైన్యంతో పోరాడే క్రమంలో నూర్ భర్త మరణించారు.
వితంతువుగా మారిన నూర్‌కు జహంగీర్ అంతఃపురంలో ఆశ్రయం కల్పించారు. అక్కడే క్రమక్రమంగా ఆమె అందరి విశ్వాసాన్ని చూరగొన్నారు. 1611లో ఆమె జహంగీర్‌ను వివాహం చేసుకుని ఆయన 20వ భార్యగా మారారు.
చాలా మంది చరిత్రకారులు జహంగీర్ ఒక తాగుబోతు అని, రాజ్యాన్ని పాలించే శక్తి ఆయనకు ఉండేది కాదని, అందుకే పాలనా పగ్గాలను నూర్‌కు ఇచ్చేశారని భావిస్తారు. కానీ అది పూర్తిగా నిజం కాదు.
ఫొటో సోర్స్, Fine Art Images/Heritage Images/Getty Images
నూర్ జహాన్‌తో జహంగీర్, యువరాజు ఖుర్రం (షాజహాన్)లు సమావేశమైన పెయింటింగ్
జహంగీర్ తాగుబోతే.. కానీ
నిజమే, జహంగీర్ తాగుబోతే. ఆయన మాదకద్రవ్యాలను కూడా ఉపయోగించేవారు. అయితే కేవలం అందువల్లే నూర్ జహాన్ మొఘల్ సామ్రాజ్యాన్ని పాలించలేదు.
నిజానికి నూర్, జహంగీర్‌లు ఇద్దరూ ఒకరికి ఒకరు తోడుగా ఉన్నారు. పాలన విషయంలో పెరుగుతున్న నూర్ ప్రాబల్యం గురించి ఆయన ఎన్నడూ ఆందోళన చెందలేదు.
వివాహమైన వెంటనే నూర్ భూమి హక్కులను సంరక్షించే విధంగా ఆజ్ఞలు జారీ చేశారు. ఆమె ‘నూర్ జహాన్ పాద్షాహ్ బేగమ్’ అని సంతకం చేసేవారు. దాని అర్థం.. నూర్ జహాన్, సామ్రాజ్ఞి.
ఆమె అధికారం క్రమక్రమంగా ఎలా పెరుగుతూ పోయిందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.
1617లో జహంగీర్‌తో పాటు ఆమె బొమ్మ కూడా ఉన్న బంగారు, వెండి నాణేలు చలామణిలోకి వచ్చాయి. దీంతో విదేశీ దౌత్యవేత్తలు, వాణిజ్యవేత్తలు, రాజస్థానంలోని ప్రముఖులు ఆమె ప్రాబల్యాన్ని గుర్తించడం ప్రారంభించారు.
ఫొటో సోర్స్, Silver
నూర్ జహాన్, జహంగీర్‌ల పేర్లు ఉన్న నాణేలు
వేట విషయం కావచ్చు, చక్రవర్తి తరపున ఆదేశాలు జారీ చేయడం కావచ్చు, ప్రభుత్వ భవనాల రూపకల్పన కావచ్చు, పేద మహిళలు,నిర్భాగ్యుల కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు.. ఆ రోజుల్లో పాలనలోని ప్రతి విషయంలోనూ నూర్ ముద్ర కనిపిస్తుంది.
ఆ రోజుల్లో మహిళలు అసలు ఊహించలేని జీవితాన్ని నూర్ జహాన్ జీవించారు.
చక్రవర్తిని బందీగా పట్టుకున్నపుడు ఆయననను రక్షించడానికి ఆమె ముందుండి సైన్యాన్ని నడిపించారు. ఇలాంటి ఎన్నో కారణాలతో ఆమె పేరు చరిత్రలో చెరిగిపోని విధంగా నిలబడిపోయింది.
(ఎమరీ యూనివర్సిటీలో రూబీ లాల్ చరిత్రను బోధిస్తారు. ఆమె రచించిన 'ఎంప్రెస్: ద అస్టానిషింగ్ రెయిన్ ఆఫ్ నూర్ జహాన్' అన్న పుస్తకం ఇటీవలే విడుదలైంది.)
ఇవికూడా చదవండి:
- జలాలుద్దీన్: అఫ్ఘానిస్తాన్ హక్కానీ మిలిటెంట్ నెట్వర్క్ వ్యవస్థాపకుడు మృతి
- బుద్ధగయలో మైనర్లపై బౌద్ధ భిక్షువుల ‘లైంగిక దోపిడీ’
- మియన్మార్‌లో రాయిటర్స్ జర్నలిస్టులకు ఏడేళ్ల జైలు శిక్ష
- తాజ్ రంగును మార్చుతోందెవరు?
- కోహినూర్ వజ్రాన్ని ఎలా కొట్టేశారు?
- ఆఫ్రికా నుంచి హబ్సిగూడ దాకా!
- ఇంతకూ బిర్యానీ హైదరాబాద్‌ది కాదా?
- తాజ్‌మహల్: కళ్లు తెరవకుంటే కనుమరుగే
- టిప్పు సుల్తాన్ హిందువులకు శత్రువా?
- హైదరాబాద్‌కు 500 ఏళ్లు: ఎక్కడ మొదలైంది? ఎలా ఎదిగింది?
- ఉగాది: మనం ఉన్నది 2018లో కాదు... 1940 లేదా 2075!
- ఉమ్మడి పౌర స్మృతి: ‘ఇలా చేస్తే కర్రా విరగదు, పామూ చస్తుంది’
- సర్దార్ వల్లభాయ్ పటేల్: ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం.. నిర్మాణం ఎలా జరుగుతోందంటే..
- అభిప్రాయం: ‘అర్బన్ నక్సల్ - ఈ పేరిట అరెస్టైన వారంతా ప్రజా జీవితంలో ఉంటున్నవారే’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)