‘బీజేపీ రాజకీయ పార్టీ కాదు, రాజకీయ విపత్తు’: జస్టిస్ పి.బి.సావంత్

పీబీ సావంత్

ఎల్గార్ అంటే మరాఠీ వ్యవహారంలో ‘అంకితభావంతో కూడిన పోరాటం’ అని అర్థం. 2015, అక్టోబర్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచాక ‘రాజ్యాంగాన్ని కాపాడండి, దేశాన్ని కాపాడండి’ అనే నినాదంతో మేం ఒక సమావేశం నిర్వహించాం. రెండేళ్ల తరువాత, అంటే 2017 డిసెంబరు 31న అదే ప్రదేశంలో, అదే ఎజెండాతో ఎల్గార్ పరిషత్తును నిర్వహించారు.

ఆ రెండు కార్యక్రమాల నిర్వాహక సభ్యుల్లో నేనూ ఒకడిని. ఎల్గార్ పరిషత్తు నిర్వహణకు కబీర్ కళా మంచ్ కూడా మాకు తోడైంది. ఎల్గార్ పరిషత్తుకు భారీగా జనం హాజరయ్యారు. 200ఏళ్ల క్రితం జరిగిన యుద్ధంలో అమరులైన వారికి ఎల్గార్ పరిషత్తును నిర్వహించిన మరుసటి రోజున నివాళులు అర్పించేందుకు వందలాది ప్రజలు బృందాలుగా బయల్దేరారు. వాళ్లంతా ఈ పరిషత్తుకు హాజరు కావడంతో జనం రద్దీ బాగా పెరిగింది.

2018 జనవరి 1న పుణేకు చెందిన ‘ఎంఐటి’ అనే విద్యాసంస్థ తమ కార్యక్రమాన్ని అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసుకుంది. దానికోసం వాళ్లు ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. దాంతో ఆ కుర్చీలే మా పరిషత్తు నిర్వహణకూ ఉపయోగపడ్డాయి. ఈ పరిషత్తు నిర్వహణకు సమకూరిన నిధుల గురించి కూడా పోలీసులు విచారిస్తున్నారు. అందుకే ఈ విషయాన్ని ప్రస్తావించడం చాలా ముఖ్యం.

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల రాజ్యాంగ ఉల్లంఘనల గురించి చర్చించి, రాజ్యాంగం సక్రమంగా అమలయ్యేలా డిమాండ్ చేయడమే మా సమావేశం ప్రధాన ఉద్దేశం. అందులో చాలామంది వక్తలు ప్రసంగించారు. రాజ్యంగాన్ని అమలు చేయడంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎలా విఫలమయ్యాయో వివరిస్తూ, అందరూ రాజ్యాంగ బద్ధంగానే నడుచుకోవాలని డిమాండ్ చేశారు. ఆ సమావేశం ముగిసేసరికి... ‘బీజేపీ గద్దె దిగేవరకు విశ్రాంతి తీసుకునేది లేదు’ అని అందరూ ప్రమాణం చేశారు.

ఆ సమావేశం ముగిసిన అయిదు నెలల తరువాత, అంటే 2018 జూన్ 6న కబీర్ కళా మంచ్ ఉద్యమకారుల ఇళ్లపై పోలీసులు దాడులు చేసి కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వాళ్లు నక్సలైట్లనీ, లేదా వాళ్లకు నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు అనుమానించారు. కానీ నక్సలైట్లతో సంబంధం ఉన్నట్లు తెలిపే ఎలాంటి సాక్ష్యాలు తమకు దొరకలేదని రెండు వారాల క్రితం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పోలీసులు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images

ఆ తరువాత ఆగస్టు 28న పోలీసులు దేశవ్యాప్తంగా కొందరు ఉద్యమకారులు, ప్రజా సంఘాల నేతల ఇళ్లపై దాడులు చేసి వారిని అరెస్టు చేశారు. అదృష్టవశాత్తూ సుప్రీం కోర్టు ఆ అరెస్టులపై స్టే విధించింది.

నక్సలైట్లు, వారి సానుభూతిపరులతో ఎల్గార్ పరిషత్తు నిర్వహణకు సంబంధం ఉందని పోలీసులు ఆరోపించారు. కానీ దాన్ని రుజువు చేసేందుకు అవసరమైన ఒక్క సాక్ష్యం కూడా ఇప్పటివరకు వారికి లభించలేదు. నిజానికి మాకు ఏ నక్సలైట్లతోనూ సంబంధం లేదు. 2015 అక్టోబరులో కూడా అలాంటి సమావేశాన్నే నిర్వహించాం. కానీ అప్పుడు ఎలాంటి సమస్యలూ తలెత్తలేదు.

ఇప్పుడు ఈ ఆరోపణలు ఎదురుకావడానికి కారణం ప్రభుత్వ వైఫల్యమే. వాళ్లు తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కొందరిని బలిపశువులను చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దానికి తోడు బాంబుల తయారీకి పాల్పడుతున్న కొన్ని హిందుత్వ సంస్థల గుట్టును పోలీసులు ఇటీవలే బయటపెట్టారు. వారి విషయంలో సాక్ష్యాలు ఉన్నప్పటికీ నిందితుల్ని అరెస్టు చేయలేదు.

ఎల్గార్ పరిషత్ విషయంలో జరిపిన అరెస్టులు కూడా రాజకీయంగా ప్రేరేపితమైవనే. ఈ విషయంలో ప్రస్తుతం స్పందించాల్సింది ప్రజలే. ఈ ఏడాది ఆగస్టు 16న, కొందరు హిందుత్వ కార్యకర్తలు రాజ్యాంగ ప్రతిని తగులబెట్టి, ‘అంబేడ్కర్ ముర్దాబాద్’, ‘మనుస్మృతి జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు.

బీజేపీ రాజకీయ పార్టీ కాదు, రాజకీయ విపత్తు. నిజానికి బీజేపీ దేశ ప్రస్తుత మూలాలనే మార్చేసి, మనుస్మృతి రాజ్యమేలిన రోజులనాటికి మళ్లీ దేశాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది.

(గమనిక: ఈ వ్యాసం సుప్రీంకోర్టు మాజీ జడ్జి, పి.బి.సావంత్ వ్యక్తిగత అభిప్రాయం)

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)