ప్రెస్‌రివ్యూ: ‘లీటరు పెట్రోలు రూ.100 చేసేస్తారేమో.. మోదీది క్రమశిక్షణ కాదు, చేతకాని తనం’ - చంద్రబాబు

మోదీ, చంద్రబాబు

ఫొటో సోర్స్, Getty Images

'లీటరు పెట్రోలు వంద రూపాయలు చేసేస్తారేమో' అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారంటూ ఈనాడు దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

'డాలర్‌తో పోలిస్తే రూపాయి పతనమవుతోంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి వచ్చింది. దేశంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఆర్థిక వ్యవస్థ ఇంతకన్నా మెరుగ్గానే ఉండేది' అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెలగపూడి సచివాలయంలో సోమవారం రాత్రి ముఖ్యమంత్రి విలేకరుల సమావేశం అయ్యాక అనేకాంశాలపై పిచ్చాపాటిగా మాట్లాడారు.

'నోట్లు రద్దు చేసేటప్పుడు ప్రభావాలు ఆలోచించాలి కదా.. ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. ఈ రోజుకీ ఏటీఎంలలో డబ్బులు ఉండటం లేదు. ఆ రోజు నేను చెప్పిన దానికి పూర్తి వ్యతిరేకం చేశారు. డిజిటల్‌ కరెన్సీ తీసుకురావాలన్నా. రూ.2000 నోటు, రూ.500 నోటు రద్దు చేయమన్నా. డిజిటల్‌ కరెన్సీ వస్తే ప్రతి బదలాయింపు రికార్డు అయ్యేది. ఎన్నాళ్లయినా వెలికితీయడం సాధ్యమయ్యేది. నోట్లతో అవినీతి తగ్గించడం కష్టం' అని చంద్రబాబు అన్నారు.

క్రమశిక్షణాయుత నిర్ణయాలు తీసుకుంటున్నామని కేంద్రం అంటోందని ప్రస్తావించగా.. ''ఇదేం క్రమశిక్షణ? ఇది చేతకానితనం. మన దేశం గొప్పతనం వల్లే ఈ మాత్రమైనా ఆర్థిక వ్యవస్థ నిలబడింది. ఏం చేయకుండా ఉన్నా ఇంతకన్నా గొప్పగా ఉండేది. దేశంలో ఏ ఇతర ప్రభుత్వం ఉన్నా ఆర్థిక పరిస్థితి ఇంతకన్నా మెరుగ్గానే ఉండేది'' అని చంద్రబాబు అన్నట్లు ఈనాడు కథనం పేర్కొంది.

దొంగలు పడ్డారు

అచ్చం సినిమాల్లో లాగే నిజాం మ్యూజియంలో దొంగలు పడ్డారని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ఉపయోగించిన.. వజ్రాలతో పొదిగిన అత్యంత విలువైన వస్తువులు అపహరణకు గురయ్యాయి. వీటి విలువ కోట్లాది రూపాయలు ఉంటుందని అంచనా.

మ్యూజియం వెనకవైపు మొదటి అంతస్తులో ఉన్న వెంటిలేటర్‌ ఇనుప గ్రిల్‌ను తొలగించి తాడు సహాయంతో లోనికి ప్రవేశించి దొంగతనానికి పాల్పడ్డారు.

సాలార్‌జంగ్‌ మ్యూజియానికి వెనక సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని పురానీ హవేలీలో నిజాం మ్యూజియం ఉంది. హైదరాబాద్‌ పర్యటనకు వచ్చే సందర్శకుల్లో చాలామంది చార్మినార్‌, సాలార్‌జంగ్‌ మ్యూజియంతోపాటు నిజాం మ్యూజియంనూ సందర్శిస్తారు.

తన పాలన 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆఖరి నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ 1937లో నాంపల్లిలోని జూబ్లీహాల్‌లో సిల్వర్‌ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. ఆ సమయంలో దేశ విదేశీ రాజులు, ఆంగ్లేయులు ఉస్మాన్‌కు విలువైన బహుమతులు అందజేశారు. వాటితోనే మ్యూజియం నిర్వహిస్తున్నారు.

రోజూ మాదిరిగానే సోమవారం మ్యూజియంను తెరిచిన సిబ్బందికి వజ్రాలు పొదిగిన దాదాపు మూడు కేజీల బంగారు టిఫిన్‌ బాక్స్‌, వజ్రాలు, కెంపులు, పచ్చలు పొదిగిన బంగారు టీకప్పు, సాసర్‌, స్పూన్‌ కనిపించలేదు. వీటి విలువ అమూల్యమని మ్యూజియం అధికారులు చెబుతున్నట్లు సాక్షి కథనం.

ఫొటో సోర్స్, Getty Images

మీ ఉప్పులో ప్లాస్టిక్ ఉందా?

తినే ఉప్పులోనూ ప్లాస్టిక్ భూతం అంటూ సాక్షి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

ఐఐటీ బాంబేలోని సెంటర్‌ ఫర్‌ ఎన్విరాన్మెంటల్‌ సైన్స్‌ విభాగం(సీఈఎస్‌ఈ) చేపట్టిన ఈ పరిశోధనలో నిజాలు వెలుగులోకి వచ్చాయి. సీఈఎస్‌ఈ చేపట్టిన పరిశోధనలో 8 కంపెనీలకు సంబంధించిన ఉప్పు ప్యాకెట్లను పరిశీలించగా వాటిలో 626 ప్లాస్టిక్‌ రేణువులు లభ్యమయ్యాయి.

ఈ ప్లాస్టిక్‌ రేణువుల సగటు పరిమాణం 5 మిల్లీమీటర్లుగా ఉంది. నదులు, కాలువల ద్వారా సముద్రాల్లో కలుస్తున్న ప్లాస్టిక్‌ కాలక్రమేణా విచ్ఛిన్నం కావడంతో ఈ సూక్ష్మ రేణువులు ఏర్పడ్డాయని ఈ పరిశోధనలో పాల్గొన్న ప్రొ. అమ్రితాన్షు శ్రీవాత్సవ్, చందన్‌కృష్ణ సేత్‌ తెలిపారు. ఈ కలుషిత నీటితో ఉప్పును తయారుచేయడంతో ప్లాస్టిక్‌ రేణువులు ఇంటింటికి చేరాయని వెల్లడించారు.

ఇందులో భాగంగా పరిశోధకులు తొలుత ముంబైలోని సూపర్‌మార్కెట్లు, దుకాణాల్లో 8 కంపెనీలకు చెందిన 24 ఉప్పు ప్యాకెట్లను(ఒక్కో బ్రాండ్‌కు మూడు చొప్పున) కొనుగోలు చేశారు.

ఇవన్నీ ఒకే నెలలో తయారైనవి కాకుండా జాగ్రత్త తీసుకున్నారు. అలాగే ఈ 8 సంస్థల్లో ఆరు గుజరాత్‌కు చెందినవి కాగా, కేరళకు చెందిన రెండు కంపెనీలు, మహారాష్ట్రకు సంబంధించి ఓ కంపెనీ ఉంది.

వీటిని ప్రయోగశాలలో పరీక్షించగా.. మొత్తం 626 సూక్ష్మ ప్లాస్టిక్‌ రేణువులు బయటపడ్డాయి. ఈ ప్లాస్టిక్‌లో 63 శాతం చిన్నచిన్న రేణువుల రూపంలో, మిగిలింది ప్లాస్టిక్‌ ఫైబర్‌ రూపంలో ఉన్నాయి.

ఈ ఉప్పు ప్యాకెట్లలో లభ్యమైన ప్లాస్టిక్‌లో 80 శాతం రేణువులు 2 మి.మీ కంటే తక్కువ పరిమాణంలో ఉండటాన్ని పరిశోధకులు గుర్తించారు. ఈ లెక్కన ప్రతిఏటా 0.117 మిల్లీగ్రాముల ప్లాస్టిక్‌ను భారతీయులు తమకు తెలియకుండా ఆహారంలో తీసుకుంటున్నట్లు నిర్ధారించినట్లు సాక్షి కథనం పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images

జమిలి ఎన్నికల ఖర్చు ఎంత?

జమిలి ఎన్నికలకు అవసరమయ్యే ఈవీఎంల కొనుగోలు ఖర్చును లా కమిషన్ వెల్లడించిందని నవతెలంగాణ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

ఒకవేళ దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు నిర్వహిస్తే దానికి అవసరమయ్యే ఈవీఎంలు, పేపర్‌ ట్రయల్‌ మిషన్‌లను కొనడానికి రూ. 4,555 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని లా కమిషన్‌ వెల్లడించింది.

జమిలి ఎన్నికలపై లా కమిషన్‌ గతవారం ఒక ముసాయిదాను విడుదల చేసింది. జమిలిపై ఎన్నికల కమిషన్‌(ఈసీ) తెలిపిన విషయాలను లా కమిషన్‌ తన ముసాయిదాలో పేర్కొన్నది. దీని ప్రకారం..

దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది సాధారణ ఎన్నికల కోసం 10,60,000 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. అయితే ఒక వేళ జమిలి ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే 12.9 లక్షల బ్యాలెట్‌ యూనిట్లు, 9.4 లక్షల కంట్రోల్‌ యూనిట్లు 12.3 లక్షల వీవీప్యాట్‌ యంత్రాల కొరత ఉన్నది.

ఒక్క ఈవీఎం(బీయూ, సీయూ, వీవీప్యాట్‌తో కలుపుకొని) ధర దాదాపు రూ. 33,200గా ఉంది. ఒక్క ఈవీఎం సగటు జీవిత కాలం 15 ఏండ్లు అనకుంటే.. 2024లో రెండో జమిలికి రూ.1751.17 కోట్లు, 2029లో మూడో జమిలికి 2017.93 కోట్లు, 2034లో నాలుగో జమిలికి రూ.13,981.58 కోట్లు కొత్త ఈవీఎంలు కొనడానికి అవసరం అవుతాయని ఈసీ అంచనా వేసిందని నవతెలంగాణ పత్రిక పేర్కొంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)