కేరళ: వరద బాధితులకు ర్యాట్ ఫీవర్ గండం

కేరళ వరదలు, ర్యాట్ ఫీవర్

ఫొటో సోర్స్, Getty Images

గత రెండు రోజుల్లో కేరళలో ర్యాట్ ఫీవర్ అని పిలిచే లెప్టోస్పైరోసిస్ కారణంగా 11 మంది మరణించగా, వందలాది కేసులు నమోదయ్యాయి. ఇటీవలే కేరళలో పెద్ద ఎత్తున వచ్చిన వరదల కారణంగా సుమారు 4 వందల మంది మరణించారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.

ర్యాట్ ఫీవర్ విస్తృతంగా వ్యాపించే ప్రమాదం ఉండడంతో ప్రభుత్వం వైద్య శాఖను అప్రమత్తం చేసింది.

ఇప్పటికే ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా భాగంగా వరద నీటిలో తడిసిన వారందరికీ డాక్సీసైక్లిన్ మాత్రలను సరఫరా చేసింది. ఈ మాత్రలను వేసుకోని వారంతా ఇప్పుడు జ్వరం, కండరాల నొప్పులతో ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు తెలుస్తోంది.

అయితే, ర్యాట్ ఫీవర్ మరణాలు కేవలం 13 జిల్లాలలోని 5 జిల్లాలలో మాత్రమే సంభవించాయని, అందువల్ల ఆందోళన చెందనవసరం లేదని వైద్యులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

''రాష్ట్రంలో వరద అనంతర పరిస్థితుల కారణంగా అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రజలందరూ డాక్సీసైక్లిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం'' అని ప్రభుత్వ అదనపు చీఫ్ సెక్రటరీ రాజీవ్ సదానందన్ బీబీసీకి తెలిపారు.

ర్యాట్ ఫీవర్‌తో ఆదివారం ఏడు మంది మరణించగా, సోమవారం నలుగురు మరణించారని ఆయన వెల్లడించారు.

లెప్టోస్పైరా బ్యాక్టీరియా ఎలుకల్లో ఉంటుంది.

''వరద కారణంగా నీరు కలుషితమవుతుంది. ఎలుకలు ఆ నీటిలో మునిగి పోయినపుడు లెప్టోస్పైరా వాటి చర్మంలోకి ప్రవేశిస్తుంది'' అని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్‌కు చెందిన వైరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ వి.రవి తెలిపారు.

వరద నీరు తగిలిన వారు డాక్సీసైక్లిన్ తీసుకోవాలని, ఎందుకంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ దాదాపు రెండు వారాల పాటు మానవ శరీరంలో ఉంటుందని ఆయన తెలిపారు.

కేరళలో భారీ వర్షాలు, వివిధ డ్యాముల నుంచి నీటి విడుదల కారణంగా, దాదాపు 10 లక్షల మంది తమ ఇళ్లు వదిలి పునరావాస శిబిరాలలో తల దాచుకుంటున్నారు.

లెప్టోస్పైరోసిస్ సూచనలు కనిపిస్తున్న వారంతా ఇప్పుడు ఆసుపత్రులకు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ర్యాట్ ఫీవర్ కారణంగా జ్వరం, కండరాల నొప్పితో పాటు తలనొప్పి, ఊరికే అలసిపోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కిడ్నీ, కాలేయంపై కూడా ప్రభావం కనిపిస్తుంది.

వరద నీరు తగిలిన ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ ఒక డాక్సీసైక్లిన్ టాబ్లెట్ వంతున వారం రోజుల పాటు వేసుకోవాలని, దానితో పాటు పెన్సిలిన్ తీసుకోవాలని డాక్టర్ రవి సూచించారు.

న్యూరో సర్జన్, కేరళ ప్లానింగ్ బోర్డు సభ్యుడైన డాక్టర్ ఇక్బాల్ బాబుకుంజు.. వరదల అనంతరం కలరా, టైఫాయిడ్, అతిసార వ్యాధి, ర్యాట్ ఫీవర్‌లాంటి వ్యాధులు వ్యాపిస్తాయని తాము ముందే ఊహించామని తెలిపారు.

కేరళలోని అన్ని ఆసుపత్రుల్లో ఈ వ్యాధులన్నిటికీ పెన్సిలిన్‌తో పాటు అవసరమైన మందులు ఉన్నాయని కేరళ ఆరోగ్య సేవల డైరెక్టర్ డాక్టర్ సరిత వెల్లడించారు. ర్యాట్ ఫీవర్‌కు ఎలాంటి చికిత్స చేయాలో ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా సూచనలు చేశామని తెలిపారు.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)