ప్రెస్‌రివ్యూ: వీఆర్వో పోస్టులకు పీహెచ్‌డీ అభ్యర్థులు.. తెలంగాణలో 700 పోస్టులకు 10,58,868 దరఖాస్తులు

తెలంగాణ వీఆర్వో పరీక్షలు

ఫొటో సోర్స్, Getty Images

తెలంగాణలో వీఆర్వో ఉద్యోగాల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 700 పోస్టులకు గాను 10,58,868 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని సాక్షి తెలిపింది.

పోస్టులకు కనీస విద్యార్హత ఇంటర్మీడియట్‌ అయినా డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, ఎంఫిల్‌ చేసిన వారూ పోటీ పడుతున్నారు.

అత్యధికంగా 4,49,439 మంది డిగ్రీ చేసిన వారు దరఖాస్తు చేసుకోగా.. ఇంటర్‌ పూర్తి చేసిన వారు 4,17,870 మంది ఉన్నారు.

పీహెచ్‌డీ చేసిన అభ్యర్థులు 372 మంది, ఎంఫిల్‌ చేసిన వారు 539 మంది, పీజీ పూర్తి చేసిన వారు 1,51,735 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 16న జరగనున్న పరీక్ష కోసం టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది.

పాత జిల్లాల ప్రకారం చూస్తే ఉమ్మడి కరీంనగర్‌ నుంచి అత్యధికంగా 1,56,856 మంది అభ్యర్థులు వీఆర్వో పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు.

ఆ తరువాత స్థానంలో మహబూబ్‌నగర్‌ ఉంది. ఈ జిల్లా నుంచి 1,56,096 దరఖాస్తులొచ్చాయి. హైదరాబాద్‌ జిల్లా నుంచి తక్కువ మంది (47,059) దరఖాస్తు చేసుకున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 14,042 మంది దరఖాస్తు చేసుకున్నారని సాక్షి పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images

పెట్రో మంట.. ఎందుకీ తంటా

అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధర తగ్గినా ఎక్సైజ్‌ సుంకం పెంచి సామాన్యుడికి ఆ ఫలం దక్కకుండా కేంద్రప్రభుత్వం చేస్తోందని ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రచురించింది.

ప్రధాని మోదీ అధికారంలోకి రాకముందు (2013లో) బ్యారల్‌ క్రూడాయిల్‌ ధర 108.76 డాలర్లు ఉండగా, మంగళవారం నాటికి 79.33 డాలర్ల వద్దే ఉంది. దీని ప్రకారం అప్పటితో పోల్చితే పెట్రో ధరలు తగ్గాలి. అయితే, క్రూడాయిల్‌ ధర తగ్గినా ఎడాపెడా పన్నులు విధించింది గానీ, ధర మాత్రం తగ్గించలేదు.

2013 సెప్టెంబరులో ఢిల్లీలో రూ.74.1గా ఉన్న పెట్రోలు ధర మంగళవారం ఢిల్లీలో రూ.79.31 ఉండటం గమనార్హం. పెట్రోల్‌పై కేంద్ర ఎక్సైజ్‌ సుంకం లీటరుకు రూ.19.48 వసూలు చేస్తుంటే దాంట్లో ప్రాథమిక ఎక్సైజ్‌ సుంకం రూ.4.48, రోడ్డు సెస్‌ రూ.8, ప్రత్యేక సర్‌చార్జి పేరుతో అదనంగా మరో రూ.7 వడ్డిస్తోంది.

డీజిల్‌పై రూ.15.33 వసూలు చేస్తుంటే దాంట్లో ప్రాథమిక ఎక్సైజ్‌ సుంకం రూ.6.33, రోడ్డు సెస్‌ రూ.8, ప్రత్యేక సర్‌చార్జి రూ.7 బాదుతోంది. అయితే, సమీప కాలంలో అంతర్జాతీయంగా మళ్లీ క్రూడాయిల్‌ ధరలు పెరగడంతో వినియోగదారుడిపై భారీగా భారం పడుతోంది. గతంలో పెంచిన ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించాలని కోరుతున్నా కేంద్రం ససేమిరా అంటోంది.

పెట్రోలు, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గిస్తే తప్ప ధరలు దిగివచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. అయితే తాము ఇందుకు సుముఖంగా లేమని కేంద్రం స్పష్టం చేసిందని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images

నిరుద్యోగులకు 'వయో'గండం!

'ఆంధ్రప్రదేశ్‌లో మూడేళ్లుగా ఖాళీగా ఉన్న లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఇంకా నోటిఫికేషన్లు విడుదల చేయలేదు. దీంతో వయోపరిమితి దాటిపోతోందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు' అని సాక్షి ఒక కథనాన్ని ప్రచురించింది.

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు గరిష్ఠ వయోపరిమితి 34 ఏళ్లుగా ఉంది. రాష్ట్ర విభజన అనంతరం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి తొలుత 40 ఏళ్లకు, ఆ తరువాత 42 ఏళ్లకు పెంచారు.

మొదటిసారి పెంపు గడువు 2016 సెప్టెంబర్‌ 30 వరకు ఇచ్చినా ఒక్క నోటిఫికేషన్‌ కూడా జారీ చేయలేదు. తర్వాత 2016 అక్టోబర్‌ 17న జీవో 381 ద్వారా వయోపరిమితి పెంపును మరో ఏడాది పొడిగించారు. ఈ మధ్యకాలంలో 4,275 పోస్టులకు 32 నోటిఫికేషన్లు జారీ చేసినా ఆ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు.

లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నా ఆ తరువాత మళ్లీ ఒక్క నోటిఫికేషనూ కూడా వెలువడలేదు. రెండో జీవో గడువు కూడా దాటిపోవడంతో గత ఏడాది డిసెంబర్‌ 4న జీవో 182 ద్వారా వయోపరిమితిని పెంపు గడువును మూడోసారి పెంచారు. ఆ గడువు కూడా ఈ నెలాఖరుతో ముగిసిపోనుంది. వయోపరిమితి పెంపు జీవోలు మూడుసార్లు ఇచ్చినా నోటిఫికేషన్లు మాత్రం వెలువడక పోవటంతో ఉపయోగం ఏమిటని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు ఉద్యోగాల భర్తీలో వయో పరిమితి పెంపును అనుమతించవద్దని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రభుత్వానికి సూచించడం అభ్యర్థుల్లో ఆందోళన కలిగిస్తోందని సాక్షి వెల్లడించింది.

'దూకుడుగా నడిపి ప్రమాదం చేస్తే బీమా వర్తించదు'

నిర్లక్ష్యపూరితంగా, దూకుడుగా వాహనాన్ని నడిపిస్తూ రహదారి ప్రమాదానికి పాల్పడినవారు బీమా పరిహారాన్ని కోరలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని ఈనాడు తెలిపింది.

వ్యక్తిగత ప్రమాద బీమా కవచం కింద లభించే పరిహారాన్ని పొందడానికి మాత్రం బాధితుడు అర్హుడేనని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ల ధర్మాసనం తేల్చిచెప్పింది.

2012 మే 20న జరిగిన రహదారి ప్రమాదంలో చనిపోయిన దిలీప్‌ భౌమిక్‌ అనే వ్యక్తి కుటుంబీకులకు రూ.10.57 లక్షల పరిహారం చెల్లించాలంటూ నేషనల్‌ ఇన్స్యూరెన్స్‌ కంపెనీకి త్రిపుర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.

భౌమిక్‌ సొంత నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందనీ, మోటారు వాహన చట్టంలోని తృతీయ పక్షం అనే నిర్వచనం కిందికి ఆయన రారనీ బీమా సంస్థ సుప్రీంకోర్టులో వాదించింది.

ఈ అప్పీలుతో ధర్మాసనం ఏకీభవించింది. వ్యక్తిగత ప్రమాద బీమా కింద మాత్రం వడ్డీతో కలిపి రూ.2 లక్షలు బాధితుని కుటుంబానికి చెల్లించాలని తెలిపిందని ఈనాడు వెల్లడిచింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)