అభిప్రాయం: టీచర్‌తో ప్రేమలు... సినిమాల్లో చూపిస్తున్నదేమిటి? వాస్తవాలేమిటి?
- దివ్య ఆర్య
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Getty Images
ఖతర్నాక్ సినిమాలో ఉపాధ్యాయినిగా నటించారు హీరోయిన్ ఇలియానా
ఎర్ర రంగు షిఫాన్ చీర, ముందూ, వెనకా లోనెక్ స్లీవ్‌లెస్ బ్లౌజ్, గాల్లో ఎగురుతున్న వదిలేసిన జుత్తు, భుజం మీద నుంచి జారిపోతున్న పైట..
నేను కళ్లు మూసుకుని, మెదడులో గుర్రాలను పరిగెత్తించా, నా స్కూల్-కాలేజిలో వివిధ దశల్లో నా టీచర్లను గుర్తు చేసుకున్నా. కానీ వాళ్లెవరూ 2004లో రిలీజైన 'మై హూ నా' సినిమాలో ఎర్ర రంగు చీర కట్టుకున్న చాందినీ టీచర్ రోల్‌లో ఫిట్ కాలేకపోయారు.
కాటన్ చీర, సేఫ్టీ పిన్ పెట్టుకున్న పైట, బిగుతుగా అల్లిన జడ ఉన్న టీచర్‌ను మించి, అలా ఊహించే సాహసం కూడా చేయలేకపోయా.
బహుశా నేను మగవాడినయ్యుంటే, ఆ ఊహలకు వేరే దిశలో రెక్కలొచ్చుండేవి. అలా జరిగుండకపోవచ్చు కూడా.
స్కూల్-కాలేజ్‌లో మగ టీచర్లు కూడా ఉంటారు. కానీ బాలీవుడ్ వాళ్ల పాత్రలను అంత సెక్సీగా ఎప్పుడూ చూపించలేదు.
'మై హూనా' వచ్చిన మూడేళ్ల తర్వాత రిలీజైన 'తారే జమీన్ పర్' సినిమాలో నికుంబ్ సర్ స్మార్ట్ గా ఉంటారు. కానీ, సెక్సీగా ఉండరు, ఆయన షర్టు గుండీలు కూడా తీయరు. టీచర్లు, విద్యార్థులు ఎవరినీ మెరిసే కళ్లతో చూడరు.
కానీ ఆయన ఎంత మంచి టీచరో! ఆయన్ను తలచుకోగానే మనసులో ఒకేసారి అన్ని భావనలూ వచ్చేస్తాయి.
ఆయన ఒడిలో తల పెట్టుకుంటే బాధలన్నీ దూరమైపోతాయేమో అనిపిస్తుంది. ఆయన హత్తుకుంటే మనసులో బాధ తగ్గుతుందేమో అనిపిస్తుంది. ఆయనతో స్నేహం చేస్తే మనసులోని ప్రతి మాటా చెప్పాలనిపిస్తుంది.
అందులో సిగ్గు పడాల్సిందేం లేదు. ఎందుకంటే నా అమాయకత్వం, చిన్నతనం ఆయన అర్థం చేసుకోగలరు.
ఫొటో సోర్స్, EPA
'మై హూ నా'లో సుస్మితా సేన్ టీచర్ పాత్రను సెక్సీగా చూపించారు
అందమైన ఊహలు
టీచర్‌ను ప్రేమించడం అనే ఊహ కచ్చితంగా ఉంటుంది. స్కూల్ విద్యార్థుల వయసుతో పెరగడంతోపాటు ఈ ఊహ మరింత అందంగా మారడం కూడా చాలా సహజం.
బాలీవుడ్ లోనూ టాలీవుడ్ లోనూ ఇతర సినిమాల్లో మసాలా నింపి మరీ చూపించే టీచర్ల మాదిరి నిజజీవితంలో టీచర్లు ఉండరు. ఆ పాత్రలు కలిగించే ఊహలు నిజజీవితంలోని టీచర్లు కలిగించరు.
వయసుతోపాటూ ఆసక్తి పెరుగుతుంది. కొన్నిసార్లు తల్లిదండ్రులతో సరైన సంబంధాలు లేకపోవడం వల్ల ఒక పాత స్నేహితుడు లేదా సన్నిహితులు అవసరం అనిపిస్తుంది.
విద్యార్థి మనసులో తమ టీచర్ గురించి ఒక భావన ఏర్పడడానికి చదువుతోపాటు ఇంకా ఎన్నో కారణాలు ఉంటాయి.
గత ఏడాది అమెరికాలోని నేవాడా విశ్వవిద్యాలయంలో 131 మంది విద్యార్థులపై ఒక పరిశోధన చేశారు. టీచర్ల ఆకర్షణ వల్ల విద్యార్థులపై ఎలాంటి ప్రభావం పడుతోంది అనేది గమనించారు.
ఎక్కువ ఆకర్షణీయంగా ఉండే టీచర్లు చెప్పిన పాఠాలను పిల్లలు బాగా అర్థం చేసుకుంటున్నట్టు ఈ పరిశోధనలో తేలింది. కానీ ఆ ఆకర్షణను వారు సెక్సువల్‌గా భావించలేదు.
ఫొటో సోర్స్, Getty Images
ఆకర్షణ సర్వ సాధారణం
పరిశోధకులు వెల్లడించిన వివరాల ప్రకారం ఆ విద్యార్థులకు పాఠాలు బాగా అర్థం కావడానికి టీచర్ల పట్ల వారి ఆసక్తి పెరగడమే కారణం. తమను ఆకర్షించిన టీచర్లు చెప్పే మాటలను విద్యార్థులు శ్రద్ధగా విన్నారు.
టీచర్ వైపు విద్యార్థులు ఆకర్షితులవడం సర్వసాధారణం. కానీ దాని నిర్వచనం, పరిధి వేరేలా ఉండవచ్చు. సినిమాలు చూపిస్తున్న రకంగానే ఉండాలనేమీ లేదు.
తరచూ విద్యార్థుల జీవితం స్నేహితులతో సరదాగా గడిపేలా ఉంటుంది. ఎప్పుడైనా అంతకు మించితే, అది ఫాంటసీ లేదా కలల రూపంలోకి మారవచ్చు.
ఆ హద్దులను దాటకపోవడం అనేది మంచిది. చాలా దేశాల్లో అది చట్టవిరుద్ధం
బ్రిటన్‌లో ఒక టీచర్, లేదా మైనర్ పిల్లల బాధ్యతలు చూసుకునే ఒక వ్యక్తి ఆ పిల్లలతో లైంగిక సంబంధాలు ఏర్పరుచుకోడానికి ప్రయత్నిస్తే, వారికి ఏడేళ్ల జైలు శిక్ష విధించవచ్చు.
18 ఏళ్ల లోపు పిల్లలు లైంగిక సంబంధాలకు సమ్మతి ఇవ్వలేరని భావిస్తున్నారు.
భారతదేశంలో పోక్సో యాక్ట్ 2012 ప్రకారం మైనర్ పిల్లలతో ఎలాంటి లైంగిక సంబంధాలు పెట్టుకున్నా, వారికి కనీసం ఏడేళ్ల జైలు శిక్ష విధించవచ్చు. అలా చేసినవారికి గరిష్టంగా జీవిత ఖైదు విధించవచ్చనే నిబంధన ఉంది.
ఈ బంధాన్ని ఏమనాలి?
ఆకర్షణ అనే సమస్య స్కూల్లో నాలుగు గోడలకే పరిమితం కాలేదు. కాలేజ్‌లో అలా జరిగే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయి.
కాలేజీలో విద్యార్థులు వయసులో ఉంటారు. సాధారణంగా, సహజంగా అనిపించే ఆ ఆకర్షణ సమ్మతి ఉన్నవారితో ఒక సీరియస్ బంధంలా మారవచ్చు.
అన్ని రకాల బంధాలు, ఇష్టాల గురించి బహిరంగంగా అభిప్రాయాలు చెప్పుకోగలిగినా, విద్యార్థి, టీచర్ మధ్య బంధం గురించి ప్రపంచం ఇప్పటికీ ఆందోళన చెందుతోంది.
2015లో అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, టీచర్ల మధ్య రొమాంటిక్, లేదా లైంగిక సంబంధాలను పూర్తిగా నిషేధించారు.
హార్వర్డ్ నియమాల ప్రకారం ఎవరైనా టీచర్ పాఠాలు చెప్పడం, గ్రేడ్స్ లేదా మార్కులు ఇవ్వడం చేస్తుంటే, వారు తమ విద్యార్థులతో లైంగిక సంబంధాలు నడిపించడానికి అనుమతి లేదు.
అమెరికాలోని చాలా విశ్వవిద్యాలయాలు కూడా అదే నిర్ణయం తీసుకున్నాయి.
ఫొటో సోర్స్, Getty Images
ప్రతీకాత్మక చిత్రం
ఈ నిషేధానికి అనుకూలంగా మాట్లాడకపోయినా, "ఇలాంటి బంధాల వల్ల దోపిడీ జరిగే అవకాశాలు పెరుగుతాయి" అని 'అమెరికా అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ' అభిప్రాయపడింది.
భారతదేశంలోని విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి నిషేధాలు లేవు. అంతమాత్రాన వాటికి ఆమోదం లభించినట్టు కూడా అనుకోకూడదు.
యౌవనంలో ఉన్న ఒక విద్యార్థికి తన టీచర్ అంటే కలిగే భావనలకు వాస్తవాలకు లంకె కుదరకపోవడం వల్ల ఆ ప్రయాణం కఠినంగానే ఉంటుంది. అంత తేలిక కాదు.
బాలీవుడ్‌లో చూపించే మహిళా టీచర్ల కంటే మన టీచర్లు భిన్నంగా ఉంటారు. వారికి మనసులోని భావనలు, కళ్లలో కనిపించే కోరిక కంటే చాలా లోతుగా ఉంటాయి.
ఇవికూడా చదవండి:
- ‘నేను అమ్మాయిలాగా మారుతున్నా.. ఇది సెక్స్‌కు సంబంధించినది కాదు’
- 'దళిత' పదం: అవమానకరమా... ఆత్మగౌరవ సంకేతమా?
- లక్షలాది మంది ముస్లింలను చైనా ఎందుకు నిర్బంధిస్తోంది?
- సిరియా యుద్ధం: అమెరికా హెచ్చరికల్ని ఖాతరు చేయని రష్యా
- కేరళ: వరద బాధితులకు ర్యాట్ ఫీవర్ గండం
- ఉమ్మడి పౌర స్మృతి: ‘ఇలా చేస్తే కర్రా విరగదు, పామూ చస్తుంది’
- రాకెట్ దాక్షాయణి: వంట మాత్రమే కాదు.. ఉపగ్రహాలకు దారి చూపగలరు
- ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్: ఇంటి ముంగిట్లోకి బ్యాకింగ్ సేవలు
- మెడిటేషన్‌తో మెదడు ఆకారంలో సానుకూల మార్పులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)