కఠువా అత్యాచారం మరిచిపోకముందే కశ్మీర్‌లో మరో దారుణం

మహిళలపై నేరాలను అరికట్టాలంటూ జరుగుతున్న ఆందోళనలు

ఫొటో సోర్స్, AFP

దేశం కఠువా అత్యాచార ఘటనను మర్చిపోకముందే అదే కశ్మీర్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి చంపేశారు.

ఈ దారుణానికి కుట్ర పన్నింది బాలిక సవతి తల్లే కావడం అందరినీ షాక్‌కు గురిచేసింది.

భర్త తనను కాదని అతని రెండో భార్య, ఆమె పిల్లలపై ప్రేమానురాగాలు కురిపిస్తున్నాడన్న అసూయతో నిందితురాలు ఈ దారుణానికి ఒడిగట్టిందని పోలీసులు వెల్లడించారు.

కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా 'ఉరి'లో చోటుచేసుకున్న ఈ కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు.

''కఠువా అత్యాచార ఘటన కంటే ఇది ఇంకా కిరాతకమైనది'' అని జమ్ముకశ్మీర్ పోలీస్ చీఫ్ శీష్ పాల్ వేద్ అన్నారు.

సింబాలిక్ ఇలస్ట్రేషన్

ఫొటో సోర్స్, BBC/Shoonya

పోలీసుల కథనం ప్రకారం.. 'ఉరి'కి చెందిన ముస్తాక్ అహ్మద్ 2003లో అదే ప్రాంతానికి చెందిన ఫమ్హీదాను పెళ్లాడాడు. వారిద్దరికీ ఒక కుమారుడున్నారు.

అనంతరం ముస్తాక్ 2008లో ఝార్ఖండ్‌‌కు చెందిన ఖుష్బూ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వారిద్దరికీ ఒక కుమార్తె ఉంది.

కొన్నాళ్లుగా ముస్తాక్ తన రెండో భార్య ఖుష్బూ, ఆమె కుమార్తెతోనే ఎక్కువగా ఉంటూ, వారిపైనే ప్రేమాభిమానాలు చూపుతున్నాడంటూ ఫమ్హీదా అసూయతో రగిలిపోతోంది.

దీంతో ఆమె తన పద్నాలుగేళ్ల కుమారుడిని రెచ్చగొట్టి, అతని స్నేహితులు మరో నలుగురితో కలిసి ఖుష్బూ కుమార్తెపై అత్యాచారం చేయించిందని పోలీసులు తెలిపారు.

''బాలికపై అత్యాచారం జరిగేటప్పుడు ఫమ్హీదా అక్కడే ఉంది. ఆమె కుమారుడు, మరో నలుగురు బాలికపై అత్యాచారానికి పాల్పడి మొహంపై యాసిడ్ చల్లారు. మృతదేహాన్ని పొదల్లోకి విసిరేశారు'' అని పోలీసులు ధ్రువీకరించారు.

కథువా ఘటన అనంతరం చోటుచేసుకున్న ఆందోళనలు, నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

కుమార్తె పది రోజులుగా కనిపించకపోవడంతో ముస్తాక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు.

''అనేకమంది అనుమానితులను విచారించాక చివరికి బాలిక సవతి తల్లి, ఆమె కుమారుడు, అతని స్నేహితులు నలుగురు కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు నిర్ధారించుకుని వారిని అరెస్ట్ చేశాం'' అని పోలీస్ అధికారి ఒకరు 'బీబీసీ'తో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)