తెలంగాణ: అసెంబ్లీ రద్దయింది.. ఇకపై ఏం జరగనుంది?

కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీ రద్దుకు క్యాబినెట్ సిఫార్సు... గవర్నర్ ఆమోద ముద్ర, తెలంగాణ భవన్ లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్‌మీట్... 105 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటన. ఈ పరిణామాలన్నీ గురువారం చకచకా జరిగిపోయాయి.

తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ 105 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేశారు. కేసీఆర్ మళ్ళీ గజ్వేల్ నుంచే పోటీ చేస్తారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో బాల్క సుమన్, సంగారెడ్డి జిల్లా ఆందోల్‌లో క్రాంతికిరణ్‌‌కు కొత్తగా అవకాశమిచ్చారు. ఈ రెండు స్థానాలు మినహా మిగతా అన్నిచోట్లా సిటింగ్ ఎమ్మెల్యేలనే బరిలోకి దింపుతున్నారు. ఈ జాబితాలో నలుగురు మహిళా అభ్యర్థులు ఉన్నారు.

బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట టీఆర్ఎస్ ఇంకా తమ అభ్యర్థులను ఖరారు చేయలేదు. బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఐదు స్థానాల్లో ఒక నియోజకవర్గానికే అభ్యర్థిని ప్రకటించారు. మిగతా నాలుగు స్థానాలు పెండింగులో ఉంచారు.

ఫొటో సోర్స్, Telangana CMO

ఫొటో క్యాప్షన్,

మంత్రివర్గ సమావేశానికి ముందు ఆశీర్వాదం తీసుకుంటున్న కేసీఆర్ దంపతులు

నవంబరులో ఎన్నికలు, డిసెంబరులో ఫలితాలు

అసెంబ్లీ రద్దు అనంతరం గురువారం తెలంగాణ భవన్‌లో విలేఖరులతో కేసీఆర్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే: ‘‘కేంద్రంలో ఉన్నది మా ఫ్రెండ్లీ పార్టీ కాదు, దేశంలో తెలంగాణ నంబర్ వన్ అని కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. తెలంగాణకు 40 అవార్డులు వచ్చాయి, మిషన్ భగీరథకు అంతర్జాతీయ ఖ్యాతి కూడా దక్కింది. కానీ అన్నిటికీ కమిషన్ అని ఆరోపిస్తున్నారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో వాళ్లు కూడా పాత్రధారులు, ఈరోజు వరకూ చేసిన ఆరోపణల్లో ఒక్కటన్నా రుజువు చేయాలి’’

‘‘గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం నీటి పారుదల మీద చేసిన వ్యయం 25 వేల కోట్లు, మేం అధికారంలోకి వచ్చిన సమయానికి ఇరిగేషన్ అధికారుల దగ్గర సరైన పరికరాలు కూడా లేవు.

గత ప్రభుత్వాలు కరెంటు కోతలతో ఏడిపించాయి. నేను కూడా బాధితుడినే. 35 ఏళ్లుగా కరెంటు కోతలున్నాయి. రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయాల్సిన దుస్థితి వచ్చింది.

ఎన్నికలు దగ్గరికొచ్చేకొద్దీ మాపై ఆరోపణల తీవ్రత మరింత పెంచారు. అలాంటి ఆరోపణలతో అధికారుల్లో కూడా ధైర్యం కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఆరునూరైనా తెలంగాణ ప్రగతి చక్రం, అభివృద్ధి ప్రక్రియ ఆగకూడదు.

అందుకే, మా ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ మా నాలుగైదు నెలల పదవీకాలాన్ని త్యాగం చేశాం. మేం పదవుల కోసం లాలూచీ పడలేదు.

ఈరోజు తెలంగాణ ప్రగతి కోసం మంచి భవిష్యత్తును ఎవరైనా త్యాగం చేశారంటే అది మేమే..నా ఎమ్మెల్యేలు మినిస్టర్స్, ఎమ్మెల్యేలకు నేను సెల్యూట్ చేస్తున్నాను.’’

‘‘మా పార్టీలో ఒక్క నేత కూడా నేను నిర్ణయం తీసుకున్నాక, మాకు టైమివ్వండి, నాలుగురోజులాగి చేద్దాం అనలేదు. నా సహచరులందరికీ ధన్యవాదాలు

ఉద్యమంలో ఉన్న వారు చాలా మంది నా వెంట ఉన్నారు. వారికి తెలుసు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. గతంలో ఎన్నో ఊహాగానాలు ఉన్నా. ఈరోజు మేం చేసిన సర్వేల ఆధారంగా 105 మంది టీఆర్ఎస్ అభ్యర్థులను కూడా ప్రకటిస్తున్నాం.

మా అభ్యర్థుల జాబితాలో ఇద్దరు ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించాను. మంచిర్యాల జిల్లా చెన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యేకు, సంగారెడ్డి జిల్లా అందోల్ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వలేకపోయాం. ఆ ఇద్దరితో మాట్లాడాను. మీకు పార్టీలో సముచిత స్థానాలు ఇస్తాం అని చెప్పాను.

ఎన్నికలు వీలైనంత త్వరగా వచ్చే అవకాశం ఉంది. నాకున్న పరిజ్ఞానం మేరకు అక్టోబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ రావచ్చు. నవంబర్‌లో ఎన్నికలు జరుగుతాయి, డిసెంబర్ మొదటి వారంలో ఫలితాలు రావచ్చు.

ఎన్నికల కమిషనర్లతో మాట్లాడాం. ఎన్నికలు ఆగవు. అభ్యర్థులు వారి వారి పనులు చేసుకోవాలి. కచ్చితంగా నాలుగు రాష్ట్రాలతోపాటే తెలంగాణ ఎన్నికలు కూడా జరుగుతాయి. వారం పది రోజుల్లో మిగతా స్థానాల్లో అభ్యర్థులను కూడా సెటిల్ చేస్తాం’’

అసెంబ్లీ రద్దు నిర్ణయం

గురువారం మంత్రివర్గ సమావేశం నిర్వహించిన కేసీఆర్ అందులోనే అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకున్నారు. ఏకవాక్య తీర్మానం ద్వారా శాసనసభ రద్దుకు సిఫార్సు చేసినట్లు సమాచారం.

మంత్రి వర్గ సమావేశం అయిన వెంటనే కేసీఆర్ గవర్నర్ నరసింహన్‌ను కలిసి అసెంబ్లీ రద్దు తీర్మానాన్ని ఆయనకు అందజేశారు.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సంబంధించి కొంతకాలంగా పలు వార్తలు వచ్చాయి. ఇటీవల రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్‌లో ప్రగతి నివేదన సభ పేరిట ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ముందస్తుపై నిర్ణయం త్వరలోనే తీసుకుంటామని చెప్పారు.

ఫొటో క్యాప్షన్,

గవర్నర్ ముఖ్య కార్యదర్శి లేఖ

గురువారం ఉదయం ఆరున్నర గంటలకే ఈ నిర్ణయం వెలువడుతుందని చాలా మంది భావించారు.

అసెంబ్లీ రద్దు నేపథ్యంలో బుధవారం కేసీఆర్ అటు అధికారులు.. ఇటు పార్టీ నేతలతో సుదీర్ఘ చర్చలు జరిపారు. బుధవారం సాయంత్రం గవర్నర్‌ను కలుస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆయన కలవలేదు.

తెలంగాణ శాసనసభలో మొత్తం సీట్లు 119. ఇందులో తెలంగాణ రాష్ర్ట సమితికి 90 సీట్లు, కాంగ్రెస్‌కు 13 సీట్లు ఉన్నాయి. ఎంఐఎంకు 7 సీట్లు, బీజేపీకి 5 సీట్లు, టీడీపీకి 3 సీట్లు, సీపీఐకి ఒకటి ఉన్నాయి.

ప్రగతి నివేదనలోనే సూచన

ఇటీవల జరిగిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ తెలంగాణలో 465 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ బిడ్డలే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని, వారి కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చామని చెప్పారు. మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి తాగు నీరు అందిస్తున్నామని తెలిపారు.

దిల్లీకి బానిసలు కాకుండా ఆత్మగౌరవంతో బతకాలని, తమిళ ప్రజలను స్ఫూర్తిగా తీసుకొని ఆత్మభిమానం, స్వయం అధికారంతో మనల్ని మనమే పాలించుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే టికెట్లు కావాలన్నా దిల్లీలో పార్టీ పెద్దలవైపు చూడాల్సిన పరిస్థితి ఉండకూడదన్నారు.

వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పథకాలు ప్రవేశపెడతామనేది ముఖ్యమంత్రి హోదాలో చెప్పడం సరికాదని అన్నారు.

''పార్టీ పథకాలు ఏంటో మేనిఫెస్టోలో పెడతాం. ఆ విధంగానే ఎన్నికల ప్రచారానికి వెళ్తాం'' అని తెలిపారు.

తర్వాత ఏంటి?

తెలంగాణ ప్రస్తుత శాసనసభ పదవీ కాలం 2014 జూన్ 9వ తేదీ నుంచి మొదలయింది. రాజ్యాంగంలోని 172వ అధికరణ ప్రకారం ఎన్నికైన శాసనసభ మొదటిసారి సమావేశమైన తేదీ నుంచి ఐదేళ్ల పాటు కొనసాగుతుంది. ఆ ప్రకారం.. శాసనసభ గడువు ముగియటానికి 2019 జూన్ 8వ తేదీ వరకూ సమయముంది.

శాసనసభలో పూర్తి మెజారిటీ ఉన్న రాష్ట్ర మంత్రివర్గం సిఫారసులను పాటించాల్సిన విధి గవర్నర్‌కు ఉంటుందని 163వ అధికరణ నిర్దేశిస్తోంది. రాజ్యాంగంలోని 174 (2) అధికరణ కింద రాష్ట్ర శాసనసభను రద్దు చేసే అధికారం గవర్నర్‌కు ఉంది. ఈ నేపథ్యంలో శాసనసభను రద్దు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం సిఫారసు చేసినపుడు దానిని గవర్నర్ ఆమోదించాల్సి ఉంటుంది.

సభలో మెజారిటీ ఉన్న ప్రభుత్వమే సిఫారసు చేసినందున.. శాసనసభను రద్దు చేసిన తర్వాత రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసే వీలుండదు. అయితే.. రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాన్ని, దానితో పాటు తన నివేదికను రాష్ట్రపతికి, కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తారు. శాసనసభను రద్దు చేసి ప్రస్తుత ముఖ్యమంత్రినే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ కోరుతారు.

శాసనసభ రద్దయిన తర్వాత ఆరు నెలలలోగా కొత్త శాసనసభ కొలువుదీరాల్సి ఉంటుంది. అలా జరిగేలా చూసే బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘానిది. అసెంబ్లీ రద్దయిన ఆరు నెలల్లోగా కొత్త శాసనసభ ఎన్నికల ప్రక్రియను ఈసీ పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)