తెలంగాణ అసెంబ్లీ రద్దు వెనుక ఉన్నదేమిటి :ఎడిటర్స్ కామెంట్

  • జి.ఎస్. రామ్మోహన్
  • ఎడిటర్, బీబీసీ తెలుగు
తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు

ఫొటో సోర్స్, Telangana CMO/Facebook

తెలంగాణ అసెంబ్లీ రద్దు కాబోతున్నదని కొంతకాలంగా మీడియా కోడై కూస్తూనే ఉన్నది. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణకు పార్లమెంటుతో పాటే ఎన్నికలు జరిగాయి. రాష్ర్ట విభజన తర్వాత తొలి తెలంగాణ ప్రభుత్వం కె చంద్రశేఖరరావు నేతృత్వంలో 2014 జూన్ 2న ఏర్పాటైంది. అధికారికంగా గడువు పూర్తవడానికి తొమ్మిది నెలలు ఉండగానే ముఖ్యమంత్రి అసెంబ్లీని రద్దుచేసి ముందస్తుకు సిఫారసు చేశారు.

ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది ఎన్నికల కమిషన్ చేతుల్లో ఉన్నప్పటికీ కేంద్ర ప్రమేయం కూడా ఉంటుంది. సందర్భానుసారం విమర్శలు చేసినా సారాంశంలో కేసీఆర్ ప్రధానితో మంచిగా ఉండే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఆంధ్రకు ప్రత్యేక హోదాపై చర్చ సందర్భంగా ప్రధాని ఇచ్చిన జవాబులో ఈ సఖ్యత కనిపించింది, కెసిఆర్‌పై ప్రశంస వినిపించింది.

అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకోవడానికి ముందు ఇటీవలే కెసిఆర్ దిల్లీకి వెళ్లి ప్రధానిని కలిసి వచ్చారు. ఈ ఏడాది చివరలో నాలుగు రాష్ర్టాలతో పాటు అంటే మిజోరం, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ ఎన్నికలతో పాటు నిర్వహించవచ్చని అంచనా.

ఫొటో సోర్స్, telanganacmo

ముందస్తు ఎందుకు?

ఇంతకీ ఎందుకు కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు? ఏ బలమైన కారణం లేకుండా ముందస్తు తెచ్చిపెట్టి ఎందుకు ప్రజాధనం వృధా చేస్తున్నట్టు? కేసీఆర్ ఏది చెప్పినా ప్రధాన కారణాలైతే రాజకీయ పరమైనవే.

కేసీఆర్‌కు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఆశ పెరిగిందని వినిపిస్తున్నది. రాష్ర్టంలో కుమారుడికి పగ్గాలు అప్పగించి కేంద్రంలో కీలకస్థానానికి ఎదగాలనే కోరిక ఉన్నట్టు కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే కుమారుడి ఎలివేషన్ సాగుతున్నది. ఆయన పవర్ సెంటర్‌గా మారి చాలా కాలమే అయ్యింది. ప్రస్తుతం కేంద్రంలో ప్రస్తుతం నెలకొన్న మోదీ ప్రభ తగ్గడం మొదలైందని, ఆ స్థాయిలో కాంగ్రెస్ పుంజుకోవట్లేదనే భావన ఇటీవల చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఇదిగో ఈ వాతావరణం వల్ల చాలామంది ప్రాంతీయ పార్టీల నేతలకు ఆశలు మొగ్గలేస్తున్నాయి.

ఏమో గుర్రం ఎగురావచ్చు అని అనిపిస్తున్నది. మన పక్కనే దేవెగౌడ ఉదాహరణ కనిపిస్తున్నది. అలా జాతీయ రాజకీయాల్లో దూసుకుని రావాలంటే తాను టాకింగ్ పాయింట్‌గా మారాలి. పార్లమెంట్, అసెంబ్లీ రెంటికీ ఒక్కసారే ఎన్నికలు జరిగితే ఫోకస్ మోదీ, రాహుల్ గాంధీల మీదకు మళ్లుతుంది. జాతీయ అంశాలు, వాటికి సంబంధించిన పోలరైజేషన్ పనిచేస్తుంది. అది తన ఇమేజ్ పెరగడానికి ఏ మాత్రం దోహదపడదు.

సీట్ల సంఖ్య మీద ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది. అప్పటికి మూడు రాష్ర్టాల ఎన్నికల్లో బిజెపికి ప్రతికూల ఫలితాలొచ్చి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఇంకాస్త పుంజుకుంటే అది రాష్ర్టంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌కు కూడా కొత్త ఊపిరులూదొచ్చు. పైగా అప్పటికి ఎండాకాలం మండుతూ ఉంటుంది. పొలాలూ చెట్లూ పుట్టలూ వాటితో ముడిపడిన మనుషులు ,ముఖ్యంగా రైతులు ఉస్సూరుమనే సీజన్ అది. ఎన్నికలకు వెళ్లడానికి అదంత శుభప్రదమైన సీజన్ కాదు. కెసిఆర్‌కు జోస్యాల మీదా ముహూర్తాల మీద ఉన్న విపరీత నమ్మకాన్ని కొందరు ప్రస్తావిస్తున్నారు కానీ అవేవీ ప్రధాన కారణాలు కాకపోవచ్చు. అవన్నీ నిర్ణయాన్ని ప్రకటించడానికి అవసరమైన సమయాన్ని ఎంచుకోవడానికి మాత్రమే పరిమితం కావచ్చు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తే లోక్ సభ ఎన్నికల నాటికి పూర్తి స్థాయి అధికారంలో ఉంటే దూకుడు చూపించి అందులో హవా చూపించాలని, మెరుగైన సంఖ్యలో సీట్లు సాధించగలిగితే కేంద్రంలో ఏర్పడబోయే పరిస్థితులను బట్టి కీలక పాత్ర పోషించవచ్చని ఒక అంచనాగా కనిపిస్తున్నది.

17 లోక్ సభ సీట్లలో 16 సాధిస్తామని అపుడే కెటిఆర్ ధీమాగా ప్రకటనలు ఇస్తూ(అంటే అసదుద్దీన్ ప్రాతినిధ్యం వహించే హైదరాబాద్ నియోజకవర్గం తప్ప అని) శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. అటు కాంగ్రెస్ కూడా సమావేశాల్లో సమాలోచనల్లో మునిగితేలుతున్నది.

దీని వెనుక ఉన్న రాజకీయ వ్యూహం ఏమిటి?

ప్రస్తుతం టీఆర్ఎస్ స్ర్టాంగ్ వికెట్ మీద ఉందని కెసిఆర్, ఇతర నేతలు బలంగా నమ్ముతున్నారు.

తమ సంక్షేమ పథకాలు తిరుగులేనివని అవి ఓట్లు కురిపిస్తాయని వారు అనుకుంటున్నారు. ప్రత్యేకించి రైతుబంధు పథకంపై టిఆర్‌ఎస్ నేతలు పెద్ద ఆశలే పెట్టుకున్నారు.

లబ్దిదారులకు నేరుగా నగదు రూపంలో సాయం అందిచడం వల్ల మధ్యలో ఖర్చయ్యే వ్యయాన్ని తగ్గించుకోవాలని పాలకులు ఆలోచిస్తున్న నేపథ్యంలో చాలామంది ఆర్థిక వేత్తలు వ్యవసాయానికి సంబంధించి ఇది మోడల్ అని నమ్ముతున్నారు.

అప్పటి కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం ప్రశంసించడమే కాక వ్యవసాయ విధానానికి సంబంధించి భారతదేశం మొత్తానికి భవిష్యత్తు మోడల్ అని కూడా అభివర్ణించారు.

భూమి ఉన్న ప్రతిరైతుకు సీజన్‌కు ఎకరాకు 4 వేల రూపాయల చొప్పున ఏడాదికి 8వేలు సాయం అందిస్తున్నదీ పథకం. మొత్తం ల్యాండ్ రికార్డులన్నీ డిజిటలైజ్ అయిన తెలంగాణలో నేరుగా రైతుల బ్యాంక్ ఎకౌంట్లలోకి ఈ డబ్బును డిపాజిట్ చేస్తున్నారు. అలాగే రాజీవ్ విద్యా మిషన్ కింద ప్రభుత్వ హస్టళ్లకు స్కూళ్ల యూనిఫారాలకు, మ్యాట్లు, దుప్పట్లు తదితరాలు, బతుకమ్మ చీరలు వంటివి స్థానిక నేతవారికి ఇవ్వడం వల్ల ప్రధానమైన ఆ రంగంలో ఉపాధి కాస్త మెరుగుపడింది.

యాదవులకు గొర్రెల పంపిణీ కూడా భారీగా చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత భారీస్థాయిలో చేపట్టిన ఇంటింటి సర్వేలో కులాలవారీ లెక్కలతో పాటు చాలా లెక్కలు బయటపడ్డాయి. అవి పాలనా సౌలభ్యం కోసం అని చెప్పినప్పటికీ రాజకీయంగా కూడా ఆ లెక్కలను టిఆర్‌ఎస్ ఉపయోగించుకుంటున్నది. కులాల వారీ లెక్కలను బయటపెట్టని పాలకులు వాటి ఆధారంగా పథకాలు, వాటితో పాటు ఎన్నికల వ్యూహాలు కూడా రచిస్తున్నారు.

కులాల వారీగా తాయిలాలు అందివ్వడంలో కెసిఆర్ తన పూర్వీకులనందరినీ అంటే అంతకుముందు పాలించిన వారినందరినీ మించిపోయారు. కోట్ల విజయభాస్కరరెడ్డి కులసంఘాల మీటింగులకు పరిమితమయితే కెసిఆర్ ఒక అడుగు ముందుకేసి అందరికీ ఆత్మ గౌరవ భవనాల పేరుతో కులానికింతని డబ్బులు కేటాయిస్తున్నారు. సంక్షేమ పథకాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఎన్టీఆర్, వైస్సార్ల కలబోత కెసిఆర్. వ్యక్తి కేంద్రకంగా పాలన నడిపించడంలో కూడా . ఈ విషయంలో వారిద్దరి కంటే ఒక మెట్టు ఎక్కువే అని చెప్పుకోవచ్చు.

కొందరు కేబినెట్ మంత్రులు కూడా పాలనలో ఏం జరుగుతుందనే సమాచారం తెలుసుకోవడానికి పాత్రికేయులను వాకబు చేస్తున్నారని మీడియాలో వార్తలొస్తున్నాయి.

తాను కోరుకున్నప్ప్పుడు కోరుకున్న విషయాన్ని బయటపెట్టి చప్పట్లతో ఓకె అనిపించుకోవడం తప్ప చర్చించి నిర్ణయాలు తీసుకోవడం అనేదాని మీద అంత నమ్మకమున్న నాయకుడిగా కెసిఆర్ కనిపించరు. దర్బారు తరహా పాలనను ఇష్టపడతారని ప్రతీతి. పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన సెక్రటేరియెట్‌కు వచ్చింది తక్కువ. ఫాంహౌస్‌ నుంచే దర్బార్ నడిపిస్తూ ఉంటారని విమర్శకులు తరచుగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు.

తెలంగాణ కేబినెట్లో ఒక్క మహిళ ఎందుకు లేరన్న విషయంపై ఎన్ని విమర్శలొచ్చినా కెసిఆర్ పట్టించుకున్నది లేదు. కుమారుడు, కుమార్తె, మేనల్లుడు, ఇలా కుటుంబ పాలన ఏమిటి అనే ప్రశ్నకు నిర్దిష్టంగా జవాబు చెప్పింది లేదు. ఆయనకు రెస్పాండ్ కావాలని అనిపిస్తే తప్ప దానివల్ల తాను కోరుకున్న సందేశాన్ని జనంలోకి పంపించాలి అనుకుంటే తప్ప విమర్శలకు జవాబులివ్వరు.

ఫొటో సోర్స్, facebook/UttamKumarReddy

ఎన్నికలు అందరికీ సవాలే

టిఆర్ ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో దూసుకుపోతున్నప్పటికీ అదే స్థాయిలో అప్పులు కూడా పెరిగిపోతున్నాయి. కౌలు రైతులు, రైతు కూలీలు, కార్మికవర్గాల్లో సానుకూలత ఎంత ఉన్నది ప్రశ్నార్థకం. బడ్జెట్ లెక్కల ప్రకారం మార్చి 2018కి తెలంగాణ ప్రభుత్వం లక్షా 80 వేల కోట్ల లోటులో ఉంది. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 సీట్లకు గాను టిఆర్‌ఎస్ గెలిచిన సీట్లు 63. ఇవాళ వారి బలం 90.

పాతిక మంది ఇతర పార్టీల వాళ్లే. తెలంగాణలో వ్యంగ్యంగా పాపులర్ అయిన పరిభాషలో చెప్పాలంటే ఎక్కువమంది బంగారు తెలంగాణ బ్యాచ్. బంగారు తెలంగాణను వాగ్దానం చేసిన టిఆర్ఎస్‌లో ఇతర పార్టీల నాయకులు సడన్ గా చేరి పెద్ద పదవులు చేపడుతున్నారన్న భావనతో కొందరు దాన్ని వ్యంగ్యంగా అన్వయించి వారికి బంగారు తెలంగాణ బ్యాచ్ అని నామకరణం చేశారు.

వేరే పార్టీల గుర్తులపై గెలిచిన ఎమ్మెల్యేలే కాకుండా తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ నుంచి ప్రధాన నాయకులు అనేకులు అధికార తెలంగాణ రాష్ర్ట సమితిలోకి వలసబాట పట్టారు. ఈ వలస ఎంత తీవ్రంగా ఉందంటే ప్రస్తుతం తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నామమాత్రంగానే మిగిలిపోయింది. కాకపోతే అంతమంది నేతలు ఉన్నపుడు రేపు ఎన్నికల్లో సీట్ల సమరం తప్పకపోవచ్చు. ఆ రణగొణ ధ్వనులు అప్పుడే మొదలయ్యాయి కూడా.

మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌లో అనైక్యత వారికి శాపంగా పరిణమించింది.

రాష్ర్ట విభజన నాటినుంచి ఏదీ కాంగ్రెస్కు కలిసి రావడం లేదు. ప్రత్యేక రాష్ర్టం ఇస్తే టిఆర్ఎస్‌ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానన్న కెసిఆర్ విలీనమూ చేయలేదు.

రాష్ర్టం ఇచ్చిన క్రెడిట్టూ కాంగ్రెస్‌కు మిగల్లేదు. తెచ్చుకున్న పార్టీగా టిఆర్ఎస్ అదంతా కొట్టేసింది. అటు ఆంధ్రలో కాంగ్రెస్ పూర్తిగా కుప్పకూలిపోయింది. ఉభయ బ్రష్టత్వం సంప్రాప్తించింది అని చెప్పొచ్చు.

ఫొటో సోర్స్, NOAH SEELAM/Getty Images

ఫొటో క్యాప్షన్,

కోదండరామ్

తెలంగాణలో ప్రభుత్వ విధానాలపై సునిశితమైన విమర్శలతో ప్రజల్లోకి చొచ్చుకువెళ్లే నాయకత్వ లేమి స్పష్టంగా కనిపిస్తోంది. చూడ్డానికి అందరూ నాయకులే. పదిమంది దాకా ముఖ్యమంత్రి సీటుకోసం పోటీపడే వారు ఉన్నారు. కానీ పాపులర్ మద్దతు సంపాదించగలిగిన నేత కరవు అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

తెలంగాణ ఉద్యమ సందర్భంగా జెఎసి కన్వీనర్‌గా పనిచేసిన కోదండరామ్‌కు మంచిపేరే ఉన్నప్పటికీ ఎన్నికల రాజకీయాలకు అవసరమైన నైపుణ్యాలు, వనరులు, సాధనాలు ఎంతవరకున్నాయి అనేది సందేహం అనేది సర్వత్రా వినిపిస్తున్న వ్యాఖ్య.

విపక్షాల బలహీనత కెసిఆర్‌కు అదనంగా కలిసి వచ్చే బలం. కాకపోతే కెసిఆర్ కుటుంబంలో ఇంటిపోరు కోసం ఆయన వ్యతిరేకులు ఎదురుచూస్తున్నారు.

కుమారుడు కెటిఆర్ రంగప్రవేశం చేసే దాకా రెండో స్థానం మేనల్లుడు హరీష్ రావుదే. అన్ని మీటింగుల నిర్వహణ భారం ఆయనదే, ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించే బాధ్యత ఆయనకే. ఇపుడు పరిస్థితి మారింది. కొంతకాలంగా ఆయన ప్రాధాన్యాన్ని తగ్గిస్తూ కుమారుడు కెటిఆర్ ప్రాధాన్యాన్ని పెంచుతూ వచ్చారు. అసంతృప్తితో హరీష్ తిరుగుబాటు చేస్తే చూద్దామని కొందరు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైతే హరీష్ రావు మామ మాటే శిరోధార్యం అని చెపుతూ వచ్చారు. మొన్నటికి మొన్న కెసిఆర్కు అత్యంత సన్నిహితులైన సీనియర్ పాత్రికేయులు, చానెల్ యజమానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కెటిఆర్ను ముఖ్యమంత్రిని చేసినా తనకు అభ్యంతరం లేదనే మాట కూడా నిర్దిష్టంగా చెప్పారు.

అధికార రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. పదవీ కాదు, అభిప్రాయమూ కాదు. అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, అలా చేయకపోతే రాళ్లతో కొట్టండని కెసిఆర్ గట్టిగట్టిగా వేదికలపై చెప్పేవారు. ఆ మాటేమైనా నిజమైందా! హైదరాబాద్ ఈజ్ ఎ హాపెనింగ్ సిటీ అని స్థానికులు ప్రేమగా పిల్చుకుంటూ ఉంటారు. ఇపుడు నిజమైన అర్థంలో అది హాపెనింగ్ సిటీ.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)