తెలంగాణ: అసెంబ్లీ రద్దుకు కేసీఆర్ మంత్రివర్గ తీర్మానం

kcr

ఫొటో సోర్స్, Getty Images

14.00 తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలకు తెరపడింది. తెలంగాణ తొట్టతొలి అసెంబ్లీని రద్దు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి గవర్నర్ ఆమోదం తెలిపారు. కేసీఆర్‌ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని సూచించారు.

13.40 : ముందస్తు ఎన్నికల ఊహాగానాలకు కేసీఆర్ తెరదించారు. అసెంబ్లీ రద్దుకు తీర్మానం చేసి.. గవర్నర్‌కు పంపించారు.

ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు కేసీఆర్ తెలంగాణ భవన్‌లో విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేశారు. స్థానిక విలేఖర్లు చెబుతున్న దాని ప్రకారం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం మొదలైంది.

13.00: ‘‘కేసీఆర్ నిర్ణయం వల్ల అనుకున్న పద్ధతిలో ముందుకు వెళ్లలేని పరిస్థితి వచ్చింది. మిగతా పార్టీల వారు వారి ప్రణాళికను కుదించుకోవాల్సిన అవసరం వస్తుంది, అంతకు మించి తేడా వస్తుందని నేను అనుకోవడం లేదు. ఏ కారణం లేకుండా ఆయన ఎన్నికలకు వెళ్తున్నాడని నేను అనుకోవడం లేదు. ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉన్నారు, మేం కూడా సిద్ధంగా ఉన్నాం. సెప్టంబర్ కార్యాచరణపై దృష్టిపెట్టి అప్పటి పరిస్థితులు చూసి నిర్ణయం తీసుకుంటాం.’’

- టీజేఎస్ కార్యాలయంలో కోదండరామ్

12.40: సుదీర్ఘ చర్చలు..: తెలంగాణ మంత్రులు, తెరాస కీలక నేతలతో సీఎం కేసీఆర్ సుదీర్ఘ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు పలువురు మంత్రులు ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. ఉదయం నుంచి ఒక్కొక్కరుగా ప్రగతి భవన్‌కు చేరుకుంటున్నారని హైదరాబాద్‌లో ఉన్న బీబీసీ ప్రతినిధి దీప్తి బత్తిని వెల్లడించారు.

ఇప్పుడు ప్రగతి భవన్‌లో డిప్యూటీ సీఎంలు, పార్టీ ముఖ్య నేతలు, ఎంపీ కవిత, మంత్రి కేటీఆర్ తదితరులు ఉన్నారు.

ఫొటో సోర్స్, Reventh

11.45: ఎమ్మెల్యే పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా. స్పీకర్‌ కార్యాలయంలో రాజీనామా లేఖ సమర్పణ

గత కొంతకాలంగా సెప్టెంబరు ఆరున తెలంగాణ అసెంబ్లీ రద్దు ప్రకటన వెలువడుతుందని స్థానిక మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి.

గురువారం ఉదయం ఆరున్నర గంటలకే ఈ నిర్ణయం వెలువడుతుందని చాలా మంది భావించారు.

అసెంబ్లీ రద్దు నేపథ్యంలో బుధవారం అటు అధికారులు.. ఇటు పార్టీ నేతలతో కేసీఆర్ సుదీర్ఘ చర్చలు జరిపారు. బుధవారం సాయంత్రం గవర్నర్‌ను కలుస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆయన కలవలేదు.

ప్రగతి నివేదనలోనే సూచన

ఇటీవల జరిగిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ తెలంగాణలో 465 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ బిడ్డలే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని, వారి కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చామని చెప్పారు. మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి తాగు నీరు అందిస్తున్నామని తెలిపారు.

దిల్లీకి బానిసలు కాకుండా ఆత్మగౌరవంతో బతకాలని, తమిళ ప్రజలను స్ఫూర్తిగా తీసుకొని ఆత్మాభిమానం, స్వయం అధికారంతో మనల్ని మనమే పాలించుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే టికెట్లు కావాలన్నా దిల్లీలో పార్టీ పెద్దలవైపు చూడాల్సిన పరిస్థితి ఉండకూడదన్నారు.

వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పథకాలు ప్రవేశపెడతామనేది ముఖ్యమంత్రి హోదాలో చెప్పడం సరికాదని అన్నారు.

''పార్టీ పథకాలు ఏంటో మేనిఫెస్టోలో పెడతాం. ఆ విధంగానే ఎన్నికల ప్రచారానికి వెళ్తాం'' అని తెలిపారు.

బలాబలాలు

తెలంగాణ శాసనసభలో మొత్తం సీట్లు - 119

తెలంగాణ రాష్ర్ట సమితి - 90 సీట్లు

కాంగ్రెస్‌ - 13 సీట్లు

ఎంఐఎం - 7 సీట్లు

బీజేపీ - 5 సీట్లు

టీడీపీ - 3 సీట్లు

సీపీఐ - 1

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)