స్వలింగ సంపర్కం నేరం కాదు: సెక్షన్ 377పై సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పు

  • 6 సెప్టెంబర్ 2018
lgbt Image copyright Getty Images

స్వలింగ సంపర్కం నేరంగా చెప్పే ఐపీసీ సెక్షన్-377పై సుప్రీంకోర్టులో విచారణ పూర్తయింది.

ఈ సందర్భంగా ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం చేసిన కీలక వ్యాఖ్యలు -

  • వ్యక్తుల లైంగిక స్వభావం అంతర్గతమైనది. అతను లేదా ఆమె ఎవరి పట్ల ఆకర్షితులవుతారన్న దానిపై వారి నియంత్రణ ఉండదు. దానిని అణచివేయడం వారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే.
  • శరీర లక్షణాలు అన్నవి వ్యక్తిగతమైనవి. అవి వారి ఇష్టపూర్వకం. అవి వాళ్ళ ఆత్మగౌరవంలోభాగం. సెక్షన్ 377 అన్నది ఆర్టికల్ 14 ఉల్లంఘనే.
  • జీవించే హక్కు అనేది జీవితంలో కీలకం.
  • పరస్పర అంగీకార, అంగీకారం లేని చర్యల విషయంలో తేడాను చూడడంలో సెక్షన్ 377 విఫలం.
  • ఎల్‌జీబీటీలను క్రిమినల్ బాధ్యులుగా చేయడం ద్వారా, వారిని వేధించడానికి సెక్షన్ 377 ఒక ఆయుధంగా మారింది.
  • సెక్షన్ 377 అహేతుకమైనది. మిగిలిన పౌరులకు లాగానే ఎల్జీబీటీ కమ్యూనిటీకీ లైంగిక హక్కులున్నాయి.
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఎల్‌జీబీటీ... తేడాలేంటి?

ఇకపై ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారంతో లైంగిక సంబంధం ఏర్పరచుకుంటే దానిని నేరంగా పరిగణించరు.

ఎవరి అనుమతైనా లేకుండా లైంగిక చర్యల్లో పాల్గొనడం మాత్రం నేరపూరితమే. ఈ విషయంలో పిల్లలకు పోస్కో చట్టం కింద రక్షణ లభిస్తుంది.

అయితే ఎవరైనా పశువులతో లైంగిక చర్యల్లో పాల్గొంటే మాత్రం దానిని నేరంగా పరిగణిస్తారు.

పిటిషనర్లలో ఒకరు, ఐఐటీ పూర్వ విద్యార్థి కృష్ణ ఈ తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు.

ముంబైలో బీబీసీతో మాట్లాడుతూ, ''నాకు ఐఐటీలో సీటు వచ్చినపుడు కూడా ఇంత సంతోషం కలగలేదు. తీర్పు వినగానే సంతోషం పట్టలేక కన్నీళ్లు వచ్చేశాయి. ఇకపై మేము కూడా ఎలాంటి భయం లేకుండా జీవించవచ్చు'' అని ఆయన అన్నారు.

ఈ తీర్పుపై నటి స్వరభాస్కర్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఎల్జీబీటీలకు అభినందనలు తెలిపిన ఆమె.. తీర్పునిచ్చిన సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు.

అంతకు ముందు.. ఐపీసీ సెక్షన్-377ను తొలగించాలని దాఖలైన ఎన్నో పిటిషన్లపై ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఒకేసారి విచారణ చేపట్టింది.

2013లో దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చిన సుప్రీంకోర్టు స్వలింగ సంపర్కాన్ని నేరస్మృతిలో చేర్చింది.

ఆ తర్వాత దీనికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఎన్నో పిటిషన్లు దాఖలయ్యాయి. ఐఐటీలోని 20 మంది విద్యార్థులు నాజ్ ఫౌండేషన్‌తో కలిసి పిటిషన్ వేశారు.

వీటితోపాటు విడివిడిగా చాలా మంది స్వలింగ సంపర్కులు న్యాయస్థానం తలుపు తట్టారు. వీరిలో లలిత్ గ్రూప్‌కు చెందిన కేశవ్ సూరీ కూడా ఉన్నారు. సెక్షన్-377కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఇప్పటివరకూ 30కి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి.

అందరి కంటే ముందు పిటిషన్లు వేసిన వారిలో నాజ్ ఫౌండేషన్ మొదటి స్థానంలో ఉంటుంది. ఇది 2001లో సెక్షన్-377ను నేరస్మృతి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది.

Image copyright Faisal Mohammed
చిత్రం శీర్షిక సుప్రీంకోర్టు వెలుపల ఎల్జీబీటీలు

సెక్షన్-377 అంటే?

ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ)లో స్వలింగ సంపర్కాన్ని నేరంగా భావించారు.

ఐపీసీ సెక్షన్-377 ప్రకారం, పురుషులు, మహిళలు లేదా పశువులతో ఎవరైనా సంబంధాలు ఏర్పరచుకుంటే, ఆ నేరానికి వారికి పదేళ్ల శిక్ష లేదా జీవిత ఖైదు విధిస్తారు. దీన్లో జరిమానా నియమం కూడా ఉంది. ఈ నేరంలో బెయిల్ లభించదు.

స్వలింగ సంపర్కం గురించి నియమాలు ఏం చెబుతాయి?

భారతదేశంలో స్వలింగ సంపర్కంను ఇప్పటి వరకూ నేరస్మృతిలో ఉంచారు.

గోప్యత హక్కుపై 2017లో విచారించిన సుప్రీంకోర్టు "సెక్సువల్ ఓరియెంటేషన్, లైంగిక ధోరణి అనే వాటికి నేరుగా గోప్యత అంశంతో సంబంధం ఉంటుంది. లైంగిక ధోరణి ఆధారంగా వివక్ష చూపడం వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీస్తుంది". అని చెప్పింది.

2013లో సుప్రీంకోర్టు స్వలింగ సంపర్కం ప్రకృతి విరుద్ధం అని, ఇది ఒక నేరమని చెప్పింది.

చిత్రం శీర్షిక తీర్పుపై ముంబైలో ఎల్జీబీటీల ప్రతిస్పందన

ఈ అంశంపై ఎల్‌జీబీటీక్యూఐ(లెస్బియన్, గే, బై సెక్సువల్, క్వీర్ ఆర్ క్వశ్చనింగ్ అండ్ ఇంటర్ సెక్స్) కోసం పనిచేసే ఉద్యమకారుడు, న్యాయవాది ఆదిత్య బందోపాధ్యాయ "''మీ వ్యక్తిగత పరిధిలో మీరు స్వలింగ సంపర్కులుగా ఉండడం వరకు ఫర్వాలేదు. కానీ అలాంటి లైంగిక భావాలను మీరు బయట ప్రదర్శించడానికి ప్రయత్నించినపుడు చట్టం దాన్ని నేరంగా భావిస్తుంది'' అన్నారు

ఈ సమాజం కోసం పనిచేస్తున్న నక్షత్ర భాగ్వే స్వలింగ సంపర్కుల ఈ డిమాండ్, సెక్స్ కోసమే అని అందరూ అనుకుంటారు. కానీ అది నిజం కాదు. "మేం సెక్స్ కోసం పోరాడడం లేదు. మేం మా గుర్తింపు కోసం పోరాటం చేస్తున్నాం". అన్నారు.

స్వలింగ సంపర్కుల గురించి భయపడాల్సిన అవసరం లేదని మానసిక నిపుణులు చెబుతున్నారు. సమాజం వారిని కూడా అంగీరించాలని అంటున్నారు.

Image copyright Getty Images

స్వలింగ సంపర్కం వ్యాధా?

ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తాము విడుదల చేసిన ఒక అధికారిక ప్రకటనలో "ఇప్పుడు స్వలింగ సంపర్కం వ్యాధి అనుకోవడం సరికాదు అంది".

"గత 50 ఏళ్లలో స్వలింగ సంపర్కం ఒక వ్యాధి అనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లభించలేదు" అని సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ అజిత్ భిడే చెప్పారు.

"స్వలింగ సంపర్కులుగా ఉండడం భిన్నంగా ఉంటుంది. అది ప్రకృతి విరుద్ధం, అసహజం కాదు" అని భిడే అన్నారు.. అయితే ఐపీసీ సెక్షన్-377 మాత్రం స్వలింగ సంపర్క సంబంధాలను అసహజం, శిక్షార్హమైన నేరంగా భావిస్తుంది.

Image copyright Getty Images

మిగతా దేశాల్లో పరిస్థితి?

ఐక్యరాజ్యసమితి ఒక కాంపైన్(మానవ హక్కుగా వచ్చే ఫ్రీ అండ్ ఈక్వల్ కాంపైన్) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 76 దేశాల్లో స్వలింగ సంపర్కుల పట్ల వివక్ష చూపేలా చట్టాలు ఉన్నాయి.

ఐదు దేశాల్లో దీనికి మరణ శిక్ష విధించే నియమాలు కూడా ఉన్నాయి.

అయితే గత కొన్నేళ్లుగా స్వలింగ సంపర్కులను సమాజంలో ఆమోదిస్తున్నారు. ఆస్ట్రేలియాలో ఇటీవల గే మేరేజ్ చట్టబద్ధత కోసం ఓటింగ్ కూడా జరిగింది. బర్ముడాలో కూడా గే వివాహాలకు అడ్డుగా ఉన్న చట్టాలను మార్చారు.

కానీ స్వలింగ సంపర్కులు మాత్రం "తమ లక్ష్యం పెళ్లికి చట్టబద్ధత కల్పించడం కాదంటున్నారు. తమ పోరాటం గుర్తింపు కోసమే" అని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు