అమెరికా మంత్రుల పర్యటనతో భారత్‌కు లాభమేంటి?

అమెరికా భారత్ బంధం

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్, విదేశాంగ మంత్రి మైక్ పాంపియో భారత్ పర్యటన నేపథ్యంలో.. ఈ చర్చలు రెండు దేశాలకు ఎంత ప్రధానమో బీబీసీ ప్రతినిధి వికాస్ పాండే వివరిస్తున్నారు.

ఈ చర్చలను మీడియాలో 2+2 డైలాగ్‌గా వర్ణిస్తున్నారు. ఇటీవల రెండు దేశాల మధ్య టెన్షన్ వాతావరణం తర్వాత మళ్లీ అమెరికా, భారత్ మధ్య ఈ చర్చలు జరుగుతున్నాయి.

మొదట ఈ చర్చలు ఏప్రిల్‌లో జరుగుతాయని అనుకున్నారు. కానీ అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అప్పటి విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్‌ను పదవి నుంచి తొలగించడంతో అవి ఆగిపోయాయి. ఆ తర్వాత జులైలో కూడా ఈ చర్చలు మరోసారి వాయిదా పడ్డాయి.

ఫొటో సోర్స్, EPA

న్యూ వరల్డ్ ఆర్డర్

భారత్, రష్యా మధ్య జరగనున్న రక్షణ ఒప్పందాలపై అమెరికా హెచ్చరించింది.

దానితోపాటు భారత్‌ ఇరాన్ నుంచి ఇంధనం దిగుమతి చేసుకోవడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రస్తుతం రష్యా, ఇరాన్ దేశాలపై అమెరికా ఆంక్షలు కొనసాగుతున్నాయి.

మరోవైపు భారత ప్రధాని మోదీ ఉచ్ఛారణ గురించి కూడా ట్రంప్ జోకులు వేశారు. ఇది భారత దౌత్యవేత్తలకు నచ్చలేదు. అలాంటి సమయంలో ట్రంప్ అనూహ్య వైఖరి భారత దౌత్యవేత్తలను కాస్త ఆశ్చర్యంలో పడేసింది.

జార్జ్ బుష్, బరాక్ ఒబామా పాలనలో భారత్, అమెరికా మధ్య మెరుగైన సంబంధాలు ఉండేవి. అయితే, ట్రంప్ పాలనలో రెండు దేశాల మధ్య సంబంధాల గురించి అలా చెప్పడం మాత్రం తొందరపాటే అవుతుంది.

"అమెరికాతో చర్చల్లో భారత్ ఎప్పుడూ ఆశావాద వైఖరిని అనుసరించాల్సి ఉంటుంది" అని కంట్రోల్ రిస్క్స్ కన్సల్టెన్సీలో అసోసియేట్ డైరెక్టర్(భారత్, దక్షిణాసియా) ప్రత్యూష్ రావు అన్నారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. "ఒబామా, బుష్ పాలనలో భారత్ అమెరికా నుంచి పలు అంశాలలో లబ్ధి పొందింది. ముఖ్యంగా సివిల్ న్యూక్లియర్ డీల్, ఇరాన్‌ నుంచి ఇంధనం దిగుమతుల్లో రాయితీలు పొందింది. కానీ ఇప్పుడు భారత్ ముందు అసలైన సవాలు ఉంది. వ్యాపార విధానాల్లో తరచూ మార్పులు తీసుకొస్తున్న ట్రంప్ పాలనతో భారత్ ఎలా సర్దుకుపోగలదో చూడాలి" అన్నారు.

ప్రధాన మంత్రి మోదీ అమెరికా, భారత్ మధ్య సంబంధాలను మెరుగుపరచడం కోసం చాలా ప్రయత్నించారనేది కూడా నిజం. ఒబామా తన మిత్రుడని, ఒబామాతో కలిసి పనిచేయడం తనకు ఇష్టమని మోదీ చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ ఇప్పుడు ప్రపంచ రాజకీయ కోణం మారిపోయింది.

ఉత్తర కొరియాతో చేతులు కలపడం, 2015లో ప్యారిస్ ఒప్పందం (వాతావరణ మార్పులకు సంబంధించి) నుంచి స్వయంగా తప్పుకోవడం, ఇరాన్‌తో పరమాణు ఒప్పందంపై వెనకడుగు వేయడం లాంటి చర్యలతో అమెరికా తాము ఊహించని నిర్ణయాలు తీసుకోగలమని ప్రపంచానికి చాటింది.

అమెరికాతో చర్చలు జరిపే సమయంలో భారత దౌత్యవేత్తలు ఈ షాకింగ్ నిర్ణయాలన్నింటినీ గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది అని ప్రత్యూష్ రావు అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

డైలమాలో రక్షణశాఖ

దేశ రక్షణకు సంబంధించిన ఆయుధాలు, పరికరాలు కొనుగోలు చేయడంలో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా నిలిచింది.

భారతదేశం అత్యధికంగా రష్యా నుంచి వీటిని దిగుమతి చేసుకుంటుంది. భారతదేశానికి అందే సైనిక పరికరాలు లేదా ఆయుధాలలో ఎక్కువభాగం రష్యా నుంచే దిగుమతి అవుతున్నాయి.

అమెరికా ఈ సమీకరణాల్లో మార్పులు కోరుకుంటోంది. గత ఐదేళ్లలో అమెరికా నుంచి భారత్‌కు ఐదుసార్లకు పైగా ఎగుమతులు జరిగాయి. రక్షణ పరికరాలు, ఆయుధాల విషయంలో ఈ ఎగుమతులు పెరిగాయి. వీటివల్ల అమెరికా భారత్‌కు ఎగుమతి చేయబోయే రక్షణ ఒప్పందాల్లో 15 శాతం విస్తరణ జరిగింది.

మరోవైపు 'స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్' గణాంకాల ప్రకారం గత ఐదేళ్లలో రష్యా నుంచి భారత్‌కు జరిగిన ఎగుమతుల్లో 62 నుంచి 79 శాతం తగ్గుదల కనిపించింది. అయితే ఒకసారి గతంలోకి చూస్తే రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడంపై అమెరికా పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు.

"దక్షిణాసియాలో చైనాకు పోటీ ఇచ్చేలా భారత్ వ్యూహాత్మకంగా బలోపేతం కావల్సి ఉంటుందని అమెరికా ఎప్పుడూ భావిస్తోంది. ఆ ప్రయత్నంలో భారత్ రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేసినా ఫర్వాలేదనుకుంది. కానీ ఈ విషయంలో ట్రంప్ వైఖరి అంతకు ముందున్న అమెరికా ప్రభుత్వాల కంటే భిన్నంగా ఉంది" అని ప్రత్యూష్ రావు అన్నారు.

ఫొటో సోర్స్, EPA/GETTY

ఇటీవల భారత్ రష్యా నుంచి S-400 ఎయిర్ డిఫెన్స్ మిసైళ్లు కొనుగోళ్లు చేయాల్సి వచ్చింది.

ఈ డీల్‌ను ముందుకు తీసుకెళ్లడానికి అమెరికా ఆమోదం కూడా లభిస్తుందని భారత్ భావించింది. కానీ అలా జరగలేదు.

దీనిపై మాట్లాడిన అమెరికా సీనియర్ అధికారి ఒకరు "భారత్‌కు ఈ ఒప్పందం నుంచి మినహాయింపు ఇవ్వలేం. అదే కాదు, రష్యాలో అమెరికా ఆంక్షలు ఉన్న కంపెనీల నుంచి భారత్ చేసుకున్న ఒప్పందాలను కూడా మేం వ్యతిరేకిస్తున్నాం" అన్నారు.

"భారత్‌కు మినహాయింపులు లభిస్తాయా లేదా అనేది నేను ఇక్కడ కూర్చుని చెప్పలేను. దానిపై అమెరికా అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారు" అని ఏషియన్ అండ్ పసిఫిక్ సెక్యూరిటీ అఫైర్స్ అసిస్టెంట్ సెక్రటరీ(డిఫెన్స్) రాండల్ ష్రైవర్ అన్నారు.

ఇటు భారత దౌత్యవేత్తలు మాత్రం రష్యాతో చేసుకున్న ఒప్పందం నుంచి వెనకడుగు వేయడం ఉండదనే సంకేతాలు ఇస్తున్నారు. ఈ ఒప్పందాలు భారత వైమానిక రక్షణ వ్యవస్థకు చాలా ముఖ్యం అని చెబుతున్నారు.

ఫొటో సోర్స్, TWITTER

"ఇరు దేశాల నేతలు దీనికి పరిష్కారం వెతికే ప్రయత్నం చేస్తారని" ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ సీనియర్ విశ్లేషకులు డాక్టర్ శృతి బెనర్జీ భావిస్తున్నారు.

రెండు దేశాలూ ఈ అంశంపై చాలా కఠిన వైఖరి అవలంబిస్తాయి. అయితే రెండు దేశాల దగ్గర దీనికి పరిష్కారం వెతకడం తప్ప మరో దారి లేదు. అమెరికా, భారత్ మధ్య కొన్ని అంశాలపై విభేదాలు, సందేహాలు కచ్చితంగా ఉన్నాయి. కానీ విశ్వాసం కూడా తక్కువేం లేదు అన్నారు.

ఈ చర్చలతో కొన్ని అనుకూల ప్రయోజనాలు కూడా ఉంటాయని ఆశించవచ్చు.

రెండు దేశాల మధ్య 'కమ్యూనికేషన్స్ కంపాటబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్'పై సంతకం కోసం చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఈ డీల్ పూర్తైతే, అమెరికా, భారత్ సైన్యం మధ్య కమ్యూనికేషన్, సమన్వయం మరింత మెరుగుపడుతుంది.

ఫొటో సోర్స్, Getty Images

ఇరాన్ నుంచి ఇంధన ఎగుమతి

భారత్ ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతి చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామని అమెరికా స్పష్టంగా చెబుతోంది. అమెరికా డిమాండుకు ఒప్పుకోవడం భారత్‌కు కష్టం కావచ్చు. ఇరాన్ నుంచి ఇంధనం కొనుగోళ్లు ఆపేయడాన్ని భారత్ అఫర్ చేయలేదని డాక్టర్ బెనర్జీ చెబుతున్నారు.

"భారత్ ఇరాన్‌లోని చాబహార్లో హార్బర్ ఏర్పాటుకు 50 కోట్ల డాలర్లకు పైగా పెట్టుబడులు పెడతామని ఆ దేశానికి మాట ఇచ్చింది. ఈ రేవు మీదుగా మిగతా ఆసియా దేశాలకు వెళ్లడం భారత్‌కు సులభం అవుతుంది, ఆ దేశాలతో వ్యాపారం కూడా పెరుగుతుంది.

"భారత్‌కు ఇరాన్ ప్రధాన వ్యూహాత్మక భాగస్వామి. ఆ దేశం నుంచి ఇంధనం దిగుమతి చేసుకోవడం ఆపేస్తే ఇరాన్‌కు కోపం రావచ్చు. భారత్ దేశానికి దిగుమతి చేసుకునే ఇంధనం పరిణామాన్ని తగ్గించుకోవచ్చు. కానీ అది చాలావరకూ ఈ నిర్ణయంపై అమెరికా ఎలా స్పందిస్తుందనేదానిపై ఆధారపడి ఉంటుంది" అని డాక్టర్ బెనర్జీ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

వాణిజ్యం, రక్షణ

"భారత్, అఫ్గానిస్తాన్ పట్ల తమ విధానాల్లో కూడా అమెరికా తేడాలు చూపిస్తోంది. ఇటీవల ఆ దేశ సీనియర్ సైనికాధికారి ఒకరు తాలిబన్లతో నేరుగా చర్చలు జరపడానికి అమెరికా సిద్ధంగా ఉందని అన్నారు. అదే భారత్ అలా చేస్తుంటే మాత్రం అమెరికా ఎప్పుడూ అడ్డుకుంటోంది" అని బెనర్జీ అన్నారు.

"అఫ్గానిస్తాన్‌కు ఎక్కువ సాయం చేసే దేశాల్లో భారత్ ఒకటి. అందుకే అక్కడి శాంతి ప్రక్రియలో కీలక భాగస్వామిగా ఉండాలనుకుంటోంది. అందుకే అమెరికా పాకిస్తాన్ అండ ఉన్న తాలిబన్లతో నేరుగా చర్చలు జరపడం అనేది భారత్‌కు నచ్చదు" అని బెనర్జీ అన్నారు.

ఇక రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల విషయానికి వస్తే, అది ఈ చర్చల్లో ప్రధాన ఎజెండాగా ఉండకపోవచ్చు. అయితే కొన్ని అవసరమైన అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.

అమెరికా ఈ ఏడాది భారత్‌ నుంచి దిగుమతి చేసుకున్న స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై పన్నులు పెంచింది. బదులుగా భారత్ కూడా అమెరికా నుంచి దేశానికి దిగుమతి అయ్యే ఎన్నో వస్తువులపై సుంకం పెంచింది.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)