'ఇవి కేసీఆర్ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు మధ్య జరిగే ఎన్నికలు'

ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఫొటో సోర్స్, uttam kumar/facebook

తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు స్పందించాయి. తన ప్రతిష్ట తగ్గడం వల్లే కేసీఆర్ 9 నెలల ముందే ఎన్నికల కోసం సిద్ధమయ్యారని టీపీసీసీ చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

ముఖ్యమంత్రి తన నిర్ణయంతో తెలంగాణ ప్రజల్లో అనవసర గందరగోళం సృష్టిస్తున్నారని తెలంగాణ జన సమితి వ్యవస్థాపకులు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. చేతకానితనం వల్లనే ఆయన అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు.

కేసీఆర్ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు మధ్య పోరాటమే ఈ ఎన్నికలు : ఉత్తమ్ కుమార్ రెడ్డి

అసెంబ్లీని రద్దు చేయాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి నిర్ణయంపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. దిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి కేసీఆర్ మీద విమర్శలు గుప్పించారు.

నాలుగున్నరేళ్ల పాటు తెలంగాణ ప్రజలను వంచించిన కేసీఆర్ పదవి నుంచి దిగిపోతూ కూడా మాటలతో దగా, మోసం చేస్తున్నారుని అన్నారు.

ముఖ్యమంత్రి అద్భుత ప్రగతి, వృద్ధి అనే పదాలు పదే పదే వాడారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఎక్కడ వృద్ధి సాధించింది. మద్యంలో నంబర్‌వన్ అయ్యింది. రైతుల ఆత్మహత్యల్లో నంబర్ వన్ అయ్యింది. నాలుగేళ్లలో అప్పులు తీసుకోవడవంలో నంబర్ వన్ అయ్యిందన్నారు.

దేశంలోనే తెలంగాణ నంబర్ వన్, అద్భుత ప్రగతి సాధించిందన్న కేసీఆర్ మాటలు అవాస్తవమని చెప్పిన ఉత్తమ్ కుమార్, జూన్ 2019 వరకూ పదవీకాలం ఉన్నా, సెప్టెంబర్ మొదటివారంలోనే కేసీఆర్ పదవి వదులుకుని ముందస్తు ఎన్నికలకు పోతున్నారటే.. రాను రాను తన ప్రతిష్ట తగ్గిపోతోందని భయపడ్డారని వ్యాఖ్యానించారు.

''కేసీఆర్ అన్నీ అవాస్తవాలు మాట్లాడారు. ఆత్మగౌరవ భవనాలు అని చెప్పిన కేసీఆర్, వాటిలో ఒక్కదానికి కూడా ఒక్క ఇటుక వేయలేదు. అవి శిలాఫలకాలు, ప్రకటనలకే పరిమితం అయ్యాయి. హైదరాబాద్ తమ పాలనలో ప్రశాంతంగా ఉన్నట్టు, కాంగ్రెస్ పాలనలో మత ఘర్షణలు జరిగాయని చెప్పారు. అది అవాస్తవం. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో హైదరాబాద్‌లో మత ఘర్షణలు జరగలేదు'' అని అన్నారు.

నెహ్రూ కుటుంబం గురించి మాట్లాడే స్థాయి కేసీఆర్‌కు లేదన్న ఉత్తమ్, ఆరోజు తెలంగాణ కోసం వాళ్ల కాళ్లు పట్టుకుని, ఈరోజు కళ్లు నెత్తికెక్కి ఆ కుటుంబం గురించి మాట్లాడడాన్ని తెలంగాణ సమాజం ఖండిస్తోందన్నారు.

''విభజన బిల్లు కాంగ్రెస్ పాస్ చేసి తెలంగాణ ఇస్తే, నాలుగున్నరేళ్ల తర్వాత ఆయన తనే తెలంగాణ కోసం పోరాటం చేసినట్టు, కాంగ్రెస్‌ను విలన్‌గా చిత్రీకరిస్తున్నారు. కేసీఆర్, ఆయన కుటుంబం నాలుగున్నరేళ్లుగా తెలంగాణను దోచుకుంది. తెలంగాణలో జరిగిన ప్రతి ప్రాజెక్టులో ఆరు శాతం కమిషన్లు తీసుకున్నారు'' అని ఆరోపించారు.

తెలంగాణ ప్రజలు రాబోయే ఎన్నికలను కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్‌గా భావించకూడదని, అవి కేసీఆర్ కుటుంబం వర్సెస్ తెలంగాణ ప్రజల మధ్య జరిగే ఎన్నికలుగా భావించాలని ఉత్తమ్ కుమార్ పిలుపునిచ్చారు. నలుగురు ఉన్న కుటుంబం నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల్ని ఎన్నో విధాలుగా అణచివేసే ప్రయత్నం చేసిందని విమర్శించారు.

ఫొటో సోర్స్, NOAH SEELAM/Getty Images

అనవసర రాజకీయ గందరగోళం: కోదండరాం

కేసీఆర్ నిర్ణయం ఆయన చేతకానితనాన్ని సూచిస్తుందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఈ అసమర్థ పాలనకు అంతం పలకడమే తమ లక్ష్యమని కోదండరామ్ అన్నారు.

ఏ కారణం లేకుండా ఆయన ఎన్నికలకు వెళ్తున్నాడని నేను అనుకోవడం లేదు. కేసులు ముంచుకొస్తాయనో, లేదంటే జాతకం బాగుందని ఎవరైనా చెబితే ఇలా చేస్తున్నాడేమో నాకు తెలీదు.

మేం కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం. సెప్టెంబర్ కార్యాచరణపై దృష్టి పెట్టి అప్పటి పరిస్థితులు చూసి నిర్ణయం తీసుకుంటాం.

అనవసరంగా అసెంబ్లీని రద్దు చేసి రాజకీయ గందరగోళాన్ని సృష్టించారు. వ్యక్తిగత ప్రయాజనాల కోసం, పార్టీ ప్రయోజనాల కోసమే ఇలా చేస్తున్నారు. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. వాటికి ముందు పరిష్కారం వెతకాలి.

కేసీఆర్ నీతి ఆయోగ్ కు ఒకేసారి ఎన్నికలు పెడితే మంచిదన్నారు. కానీ ఇప్పుడు ఇలా చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్లీ పార్లమెంటు ఎన్నికలు వస్తాయి. వీటివల్ల ప్రజల్లో గందరగోళం ఏర్పడుతుంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను కొనసాగించడం సరికాదన్న జనసమితి నేత, గవర్నర్‌ను కలిసి రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతామన్నారు.

ఫొటో సోర్స్, facebook

తెరాసకు భంగపాటు తప్పదు: ఎల్.రమణ

ముందస్తు ఎన్నికలకు వెళ్తున్న తెరాసకు భంగపాటు తప్పదని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. ఏ ముఖ్యమంత్రయినా సచివాలయం నుంచే పాలన సాగిస్తారని, కానీ, కేసీఆర్ మాత్రం సచివాలయానికి వెళ్లడమే మహా పాపం అన్నట్టుగా ప్రగతి భవన్ నుంచి పాలన సాగించారని ఆరోపించారు.

2019లో తెదేపా మద్దతు లేకుండా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడదని అన్నారు.

కేసీఆర్ పాలనలో సబ్బండ వర్గాలకు ఒరిగిందేమీ లేదని.. ఉన్నతవర్గాలకే ఆయన పట్టం కట్టారని ఆరోపించిన రమణ.. కేసీఆర్ కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉందా? అని కేసీఆర్ అనడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు.

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 8న చంద్రబాబు ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహిస్తారని రమణ తెలిపారు.

ఫొటో సోర్స్, facebook

కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు: దత్తాత్రేయ

తెలంగాణలో శాసనసభను రద్దు చేయడం అప్రజాస్వామికమని కేంద్ర మాజీమంత్రి, భాజపా సీనియర్‌ నేత దత్తాత్రేయ అన్నారు. తె

ఐదేళ్ల పాటు పాలించాలని ప్రజలు తీర్పు ఇస్తే నాలుగేళ్లకే ఎందుకు రద్దు చేశారని కేసీఆర్‌ను ప్రశ్నించారు.

ప్రభుత్వ యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు.

కేసీఆర్ మంత్రివర్గ అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు.

గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏవీ పూర్తి చేయలేదని విమర్శించారు.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)