పౌరహక్కుల నేతల గృహ నిర్బంధం 12 సెప్టెంబర్ వరకు పొడిగింపు

ఫొటో సోర్స్, Getty Images
ఐదుగురు పౌరహక్కుల నేతల గృహ నిర్బంధాన్ని సుప్రీంకోర్టు ఈ నెల 12 వరకు పొడిగించింది.
మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయంటూ పుణె పోలీసులు ఆగస్టు 28న దేశవ్యాప్తంగా దాడులు చేసి వరవరరావు, సుధా భరద్వాజ్, గౌతమ్ నవ్‌లఖా, వెర్నాన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరాలను అరెస్ట్ చేశారు. వారి అరెస్టుపై దేశవ్యాప్తంగా మానవ హక్కుల కార్యకర్తలు, విపక్ష నేతలు నిరసన వ్యక్తం చేశారు.
ఈ అరెస్టులపై చరిత్రకారిణి రొమీలా థాపర్, పలువురు న్యాయవాదులు, హక్కుల కార్యకర్తలు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయటంతో.. వరవరరావు సహా ఐదుగురు ఉద్యమకారులనూ సెప్టెంబర్ 6వ తేదీ వరకు వారి వారి ఇళ్లలోనే గృహనిర్బంధంలోనే ఉంచాలని ఆగస్టు 29 న మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. తాజాగా దానిని 12 వరకు పొడిగించారు.
ఫొటో సోర్స్, Getty Images
సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా పుణె పోలీసుల తీరుపై చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర పోలీసులు బాధ్యతాయుతంగా ప్రవర్తించేలా చూడాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అరెస్టులకు వ్యతిరేకంగా పిటిషన్ వేసిన రొమిలా థాపర్ తదితరులను.. ఒక క్రిమినల్ కేసులో థర్డ్ పార్టీలు జోక్యం చేసుకోవచ్చా అన్నదానిపై సంతృప్తికరమైన సమాధానం ఇవ్వాలని కోరింది.
ఈ అరెస్టులపై దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ జరిగింది.
ప్రభుత్వ అనుకూల భావాలున్న వారంతా ఈ అరెస్టులను సమర్ధిస్తే... వ్యతిరేకులంతా దీనిపై నిరనస గళం విప్పారు. ఈ అరెస్టుల కారణంగా అర్బన్ నక్సల్ అనే పదం మరోసారి ప్రాచుర్యంలోకి వచ్చింది. #MeTooUrbanNaxal హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ పోస్టులు వైరల్ అయ్యాయి.
ఇవికూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)