సెక్షన్ 377: చట్టం మారింది... మైండ్ సెట్ మారుతుందా?

  • పుష్పేశ్ పంత్
  • బీబీసీ కోసం
స్వలింగ సంపర్కం, సుప్రీంకోర్టు, సెక్షన్ 377

ఫొటో సోర్స్, Getty Images

సెక్షన్ 377 మీద సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన నేపథ్యంలో మరోసారి హిందూ సంస్కృతి, హోమోసెక్సువాలిటీపై చర్చ మొదలైంది.

కొన్నేళ్ల క్రితం దిల్లీ హైకోర్టు వలసపాలన కాలం నాటి ఆ చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొంది.

అయితే, దురదృష్టవశాత్తూ ఆ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం అప్పీలు దాఖలు చేయకున్నా, తమను తాము హిందూ సంస్కృతి, హిందూ మత సంరక్షకులుగా చెప్పుకునే కొంతమంది దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లారు.

విచిత్రమైన విషయం ఏమిటంటే, ఆ చట్టాన్ని మార్చే హక్కు కేవలం పార్లమెంటుకు, రాష్ట్రాల అసెంబ్లీలకు మాత్రమే ఉంటుందంటూ ఇద్దరు జడ్జీల బెంచ్ హైకోర్టు నిర్ణయాన్ని తోసిపుచ్చింది. ఈ వాదన చాలా అసంబద్ధమైనది. ఎందుకంటే, రాజ్యాంగానికి అనుగుణంగా ఏదైనా పాత లేదా కొత్త చట్టాలను రద్దు చేయడమో, కొనసాగించడమో చేసే అధికారం సుప్రీంకోర్టుకే ఉంది.

హోమోసెక్సువాలిటీ మీద వాదనలు ద్వంద్వ వైఖరి, కపటబుద్ధి కారణంగా ప్రతిసారీ తప్పుదారి పడుతున్నాయి. అందువల్ల ఈసారి కూడా తీర్పుపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి.

ఫొటో సోర్స్, Faisal Mohammed

దురదృష్టవశాత్తూ అన్ని మతాలూ కూడా హోమోసెక్సువల్ సంబంధాలను అసహజమైనవిగా, పాపంగా పరిగణిస్తాయి.

క్రైస్తవ మిషనరీలు, ఛాందసవాస ముస్లిం మతాధికారులు ఈ దేశంలో ప్రవేశించేంత వరకు ఇక్కడి హిందువులు హోమోసెక్సువాలిటీనేమీ పాపంగా పరిగణించలేదు.

శివుని మరో రూపమైన అర్థనారీశ్వరుడిని హిందువులు అంగీకరించలేదూ? మోహిని రూపంలోని శివుడిని విష్ణువు ఆరాధించడం భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తుందా?

మహాభారతంలో అర్జునుడు బృహన్నలగా మారినా, అతని పురుషత్వానికి భంగం కలగదు. వాత్సాయనుడి కామసూత్రలో మీసాలు లేని అందమైన బానిసలతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం గురించి విస్తృతంగా చర్చించారు. స్త్రీత్వం కలిగిన వారిని పాపాత్ములుగాను, నేరస్తులుగాను భావించలేదు.

ఫొటో సోర్స్, Getty Images

హిందూ సంస్కృతిలో స్వలింగ సంపర్కుల చర్యల గురించి ప్రస్తావనలు ఉన్నాయి. ఖజురహో ఆలయాలపై చెక్కిన శిల్పాలు హోమోసెక్సువాలిటీపై ఎన్నో ఆలోచనలకు ఆస్కారమిస్తాయి.

వీటన్నిటి సారం ఒక్కటే. హోమోసెక్సువాలిటీ కేవలం అబ్రహామీ మతాలు - క్రైస్తవం, ఇస్లాం, యూదు మతంలో మాత్రమే నిషేధం.

పాశ్చాత్య దేశాలైన రోమ్, గ్రీస్‌లో ఒకప్పుడు పెద్దలు, కౌమారంలో ఉండే పిల్లలతో సంబంధాలను పెట్టుకోవడం ఆమోదించేవారు.

ఆస్కార్ వైల్డ్ నుంచి క్రిస్టఫర్ ఇషర్‌వుడ్ వరకు 'బెడ్, బ్రేక్ ఫాస్ట్, బాయ్' కొరకు మొరాకో, మలయాలకు ప్రయాణించేవారు.

తత్వశాస్త్రానికి కొత్త అర్థం చెప్పిన మైకేల్ ఫుకో ఎన్నడూ తన హోమోసెక్సువాలిటీని దాచుకోలేదు. దురదృష్టవశాత్తూ గణితంలో అపూర్వమైన ప్రావీణ్యం కలిగిన అలెన్ ట్యూరింగ్ అలాంటి హిపోక్రసీ, ద్వంద్వ వైఖరి కారణంగా వేధింపులను ఎదుర్కొని ఆత్మహత్య చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Sameer Samudra and Amit Gokhale

1960లలో బ్రిటన్‌లో వుల్ఫెన్‌డన్ కమిషన్ హోమోసెక్సువాలిటీపై అప్పటివరకు ఉన్న విక్టోరియన్ కాలం నాటి చట్టాలను రద్దు చేసింది. కానీ భారతదేశం మాత్రం స్వాతంత్ర్యానంతరం కూడా బ్రిటిష్ కాలం నాటి భావాలతోనే ఆ చట్టాన్ని కొనసాగిస్తూ వచ్చింది.

గోప్యత, ప్రత్యేకంగా ఉండడం అనేవి ప్రాథమిక హక్కులని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో, ఇకపై హోమోసెక్సువల్స్ విషయంలో పోలీసుల వైఖరి ఎలా ఉంటుందో చూడాలి.

ఈ చట్టం కారణంగా భారతదేశంలోని 'థర్డ్ సెక్స్'ను వేధించడం, శిక్షించడం జరిగింది. సెక్షన్ 377 పై సుప్రీం తీర్పుతో వాళ్లంతా ఇప్పుడు సగర్వంగా తలెత్తుకుని జీవించే అవకాశం లభిస్తుంది.

ఇప్పటికే, అమెరికాలోని చాలా రాష్ట్రాలు హోమోసెక్సువాలిటీని నేరాల జాబితా నుంచి తొలగించాయని, కొన్ని రాష్ట్రాలు వారి వివాహాలను కూడా చట్టబద్ధంగా ఆమోదిస్తున్నాయని మనం గుర్తుంచుకోవాలి.

పోప్ స్వయంగా - హోమోసెక్సువల్స్ కూడా మనం ప్రార్థించే దేవుని పిల్లలే అని, అందువల్ల వాళ్లను చులకనగా చూడరాదని చెప్పారు. అయితే, దురదృశ్టవశాత్తూ అదే సమయంలో కౌమారంలోని పిల్లలపై లైంగిక వేధింపుల విషయాలు వెల్లడయ్యాయి. అందువల్ల పోప్ కానీ, కార్డినల్ బిషప్స్ కానీ హోమోసెక్సువాలిటీపై వ్యాఖ్యానించడానికి వెనకాడుతున్నారు.

ఇద్దరు వయోజనులు మధ్య అంగీకారంతో జరిగే లైంగిక చర్యలకు, కౌమారంలో ఉన్న వారిని లైంగిక అవసరాలకు ఉపయోగించుకోవడానికి మధ్య చాలా తేడా ఉంది. సెక్షన్ 377ను కొనసాగించడానికి ఈ వాదన ప్రాతిపదిక కాకూడదు.

21వ శతాబ్దం ప్రారంభంలో జరిగిన పరిశోధనల్లో హోమోసెక్సువాలిటీ ఒక వ్యాధి కానీ మానసిక వైకల్యం కాదనీ నిరూపితమైంది. అందువల్ల దానిని అసహజం అని పేర్కొనలేము. అలాంటి లక్షణాలు కలిగిన వాళ్లు తమ ఇష్టప్రకారం జీవించే ప్రాథమిక హక్కును నిరాకరించలేము.

దురదృష్టకరం ఏమిటంటే, మన కేబినెట్‌లో డార్విన్ మానవ పరిణామ సిద్ధాంతం అంతా హాస్యాస్పదమని, నెమలి కన్నీళ్ల నుంచి దానికి పిల్లలు పుడతాయని నమ్మే ప్రముఖులకు కొదవ లేదు. వాళ్లు శాస్త్రవిజ్ఞానానికి అనుగుణంగా వాళ్లు నిర్ణయాలు తీసుకుంటారని అనుకోవడం మూర్ఖత్వం.

మత విశ్వాసాలకు అతీతంగా, రాజ్యాంగానికి అనుగుణంగా చట్టాలను రూపొందించుకోవాలి. ఈసారి సమతుల్యత కలిగిన ఐదుగురు జడ్జీల బెంచ్ స్వలింగ సంపర్కం నేరం కాదు అన్న తీర్పునివ్వడం ఆహ్వానించదగ్గ పరిణామం. లౌకిక రాజ్యం అని చెప్పుకునే భారతదేశంలో, ఏదో ఒక ప్రత్యేకమైన మతానికి అనుగుణమైన చట్టాలను అమలు చేయలేరు.

ఈ విషయం కేవలం హోమోసెక్సువల్స్‌తో మాత్రమే ముడిపడి లేదు. చట్టం ముందు అందరూ సమానులే అన్న న్యాయపాలన(రూల్ ఆఫ్ లా)తో ముడిపడి ఉంది. హోమోసెక్సువల్స్ ఈ దేశ ప్రజలు కాదా? వాళ్లకు కూడా చట్టం నుంచి ప్రాథమిక రక్షణ లభించాల్సిందే కదా?

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)