ఉండవల్లి అరుణ్‌కుమార్: ‘వైఎస్ సత్యవంతుడని నేనెప్పుడూ అనలేదు’ - ప్రెస్‌రివ్యూ

వైఎస్ రాజశేఖరరెడ్డి

ఫొటో సోర్స్, Getty Images

వైఎస్ రాజశేఖరరెడ్డికి అవినీతి తెలీదని తానెప్పుడూ, ఎక్కడా చెప్పలేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నట్లు ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రచురించింది.

ఆయన నిప్పు, వివేకానందుదు, గాంధీలా సత్యవంతుడని నేను అనలేదు. అయితే డబ్బు తీసుకోవడం వేరు, డబ్బు చేసుకోవడం వేరు అని ఉండవల్లి పేర్కొన్నారు.

'రాజా ఆఫ్ కరప్షన్ పుస్తకంపై చర్చకు సిద్ధమా' అని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు విసిరిన సవాలును స్వీకరిస్తానని ఉండవల్లి తెలిపారు.

''ఎన్నికల్లో పోటీ చేసిన వారందరికీ కాంట్రాక్టర్లు డబ్బులు ఇస్తారు. నేనూ డబ్బులు తీసుకున్నాను. కానీ డబ్బుతో కార్లూ, భవనాలు కొనడం, వ్యాపారాలు పెంచుకోవడం చేస్తే తప్పు. ఎన్నికల్లో కమ్యూనిస్టులు కూడా డబ్బులు తీసుకుంటారు'' అని ఉండవల్లి అన్నట్లు ఆంధ్రజ్యోతి కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, BBC/Naveen Kumar K

పోలవరంపై కేంద్ర కమిటీ అసంతృప్తి

పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే పనుల్లో లోపాలపై కేంద్ర నిపుణుల కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సాక్షి ఒక కథనం ప్రచురించింది.

స్పిల్ వే పనుల్లో ఉపయోగిస్తున్న సిమెంట్, స్టీల్ నాసిరకంగా ఉన్నాయని తేల్చింది. క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించిన నిపుణులు స్పిల్ వేలో అక్కడక్కడా చీలికలు గుర్తించారు.

అత్యంత కీలకమైన హెడ్ వర్క్స్ పనులపై మరింత శ్రద్ధ వహించాల్సి ఉందన్నారు.

సగటున రోజుకు 6 వేల క్యూబిక్ మీటర్ల చొప్పున కాంక్రీట్ పనులు చేస్తున్నామని అధికారులు తెలుపగా, ఇలాగేతే స్పిల్ వే పనులు నవంబర్ నాటికి పూర్తయ్యే అవకాశమే లేదని కమిటీ సభ్యులు అన్నారు.

పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించకపోవడంపై అధికారులను నిలదీసినట్లు సాక్షి కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

‘ఆ తీర్పుతో హెచ్ఐవీ కేసులు పెరుగుతాయి’

స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల హెచ్‌ఐవీ కేసులు పెరుగుతాయని బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు సూర్య కథనాన్ని ప్రచురించింది.

కోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన స్వామి.. ఇది తుది తీర్పు కాదని, దీనిని సవాలు చేయొచ్చని తెలిపారు.

స్వలింగ సంపర్కం జన్యుపరమైన లోపం అని స్వామి అన్నారు. కోర్టు తీర్పుతో గే బార్స్ ఎక్కువైపోతాయని తెలిపారు.

పరస్పర అంగీకారంతో ఇద్దరు వయోజనుల మధ్య జరిగే శృంగారాన్ని నేరంగా పరిగణించకపోతే సామాజికంగా సమస్యలు ఎదురవుతాయని స్వామి అన్నట్లు సూర్య పేర్కొంది.

ఒయూలో సంబరాలు

శాసనసభ రద్దుతో ఓయూలో సంబరాలు చేసుకున్నట్లు ఈనాడు కథనాన్ని ప్రచురించింది.

తెలంగాణ సీఎం కేసీఆర్ రద్దు విషయాన్ని ప్రకటించగానే విద్యార్థులు టపాకాయలు కాల్చి, మిఠాయిలు పంచి సంబురాలు చేసుకున్నారు.

విద్యార్థులను, నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారని ఆరోపిస్తూ కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాష్ట్రంలో నియంత పాలన అంతం అయిందని, టీఆర్‌ఎస్ పాలనలో విద్యవ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యం అయిందని అన్నారు.

నిరుద్యోగులను మోసం చేసి, ఉద్యోగాల ప్రకటనలు జారీ చేయనందుకు నిరసనగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నట్లు ఈనాడు పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)