సిరియా రసాయన ఆయుధాలు తయారు చేస్తోంది : అమెరికా

వీడియో క్యాప్షన్,

క్లోరిన్ నుంచి నోవిచోక్ వరకూ: రసాయన ఆయుధాలకు 100 ఏళ్లు

ఇడ్లిబ్‌లో సిరియా సైన్యం రసాయన ఆయుధాలు ఉపయోగించడానికి సన్నాహాలు చేస్తోందనడానికి చాలా ఆధారాలున్నాయని ఆ దేశంలో ఉన్న అమెరికా రాయబారి తెలిపారు.

తిరుగుబాటుదారుల పట్టున్న ప్రాంతంలో సైన్యం వారిపై రసాయన దాడులకు దిగనున్నట్టు జిమ్ జెఫ్రీ చెప్పారని రాయిటర్స్ తెలిపింది.

సిరియా ప్రభుత్వం మాత్రం తామెప్పుడూ రసాయన ఆయుధాలు ఉపయోగించలేదని చెబుతోంది.

తిరుగుబాటుదారుల నుంచి దాడులు జరగవచ్చని భావిస్తున్న వాయవ్య ప్రాంతాల్లో రష్యా విమానాలు బాంబుల వర్షం కురిపించాయి.

రష్యా, ఇరాన్ నేతల మధ్య ఇరాన్‌లో శుక్రవారం చర్చలు జరుగుతుండగా.. ఈ దాడులు జరిగాయి.

ఈ దాడులను సిరియా అధ్యక్షుడు బషర్-అల్-అసద్‌ సమర్థిస్తున్నారు. ఇటు ఈ ప్రాంతంలోని కొన్ని తిరుగుబాటు వర్గాలకు టర్కీ మద్దతిస్తోంది.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

ఇడ్లిబ్‌లో గ్యాస్ మాస్కుల కోసం ప్రయత్నాలు

సిరియాలో జరుగుతున్న దాడులను ఐక్యరాజ్యసమితి మానవ హననంగా పేర్కొంది. ఇటు టర్కీ తమ సరిహద్దుల్లోకి కొత్తగా శరణార్థులు చొరబడుతారేమోనని ఆందోళన వ్యక్తం చేస్తోంది.

కచ్చితంగా పక్కా ఆధారాలు లభించడం వల్లే ఐక్యరాజ్యసమితి ఈ హెచ్చరికలు చేసి ఉంటుందని జెఫ్రీ అన్నారు.

ఎలాంటి దాడి అయినా మా దృష్టిలో తీవ్రమైన నిర్లక్ష్యం, అభ్యంతరకరమే. సిరియా రసాయన ఆయుధాలు సిద్ధం చేస్తున్నట్టు మా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి అన్నారు.

కానీ ఆయన ఏ ఆధారాల గురించి చెబుతున్నారో ఆ వివరాలు మాత్రం ఇవ్వలేదు.

దౌత్య జోక్యం కోసం పిలుపు

సిరియా ప్రభుత్వం, దాని మిత్ర దేశాలు చేసే ఎలాంటి రసాయన దాడులనైనా తిప్పికొడతామని అమెరికా ఇటీవల ప్రకటించింది.

రసాయన ఆయుధాలు లేవని సిరియా ఖండిస్తున్నప్పటికీ, తిరుగుబాటుదారుల పట్టున్న దక్షిణ ఇడ్లిబ్‌పై 2017 ఏప్రిల్లో జరిగిన దాడిలో నర్వ్ ఏజెంట్ సారిన్ ప్రమేయం ఉండడం వెనుక ప్రభుత్వ దళాల హస్తం ఉందని ఐక్యరాజ్యసమితి, ఆర్గనైజేషన్ ఫర్ ది ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్(ఓపీసీడబ్ల్యు) నిపుణులు చెబుతున్నారు.

ఈ దాడిలో 80 మందికి పైగా మరణించారు.

సిరియాలో ఏడేళ్ల అంతర్యుద్ధానికి తెరదించేందుకు దౌత్య జోక్యం చాలా అవసరం అని జెఫ్రీ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, AFP

"ఇస్లామిక్ స్టేట్ గ్రూప్(ఐఎస్) ఓటమి వరకూ, యుద్ధంలో సిరియా ప్రభుత్వానికి సహకరిస్తున్న ఇరాన్ సైన్యం, ఆ దేశాన్ని విడిచి వెళ్లేవరకూ అక్కడే ఉండాలని అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ భావిస్తున్నట్టు జెఫ్రీ తెలిపారు.

"అధ్యక్షుడు అసద్‌కు సిరియా పాలకుడిగా ఎలాంటి భవిష్యత్తు లేదు" అని జెఫ్రీ అన్నారు. కానీ అతడిని తొలగించడం అమెరికా పనికాదన్నారు. ఆ దేశంలో రాజకీయ మార్పు కోసం అమెరికా రష్యాతో కలిసి పనిచేస్తుందని చెప్పారు.

సిరియాలో ఉన్న తిరుగుబాటు దళాలు చాలావరకూ ఓటమి పాలవడంతో, ఏడేళ్ల అంతర్యుద్ధంలో ఇడ్లిబ్ వాయవ్య ప్రాంతంలో జరుగుతున్నదే చివరి యుద్ధం అయ్యింది.

ఇడ్లిబ్‌లో 30 వేల మందికి పైగా జీహాదీ సైన్యం యుద్ధం చేస్తున్నట్టు భావిస్తున్నారు.

ఈ ప్రాంతంలో 29 లక్షల మంది వరకూ నివసిస్తున్నారు. వీరిలో పది లక్షల మంది పిల్లలున్నారు. సిరియాలోని మిగతా ప్రాంతాల నుంచి దాదాపు సగం మంది వేరే ప్రాంతాలకు చేరుకోడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఎటూ వెళ్లలేకపోతున్నారు.

8 లక్షల మందికి పైగా ఇతర ప్రాంతాలకు చేరుకుంటున్నారని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. సహాయం అవసరమైన వారి సంఖ్య కూడా భారీగా పెరిగవచ్చని అంటోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)