భారత్-అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రుల సమావేశం సాధించిందేమిటి?

భారత్ - అమెరికా 2+2 సమావేశాలు

ఫొటో సోర్స్, TWITTER.COM/MEAINDIA

భారత్, అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రుల మధ్య ఎంతోకాలం నుంచీ ఎదురుచూసిన 2+2 సమావేశాలు గురువారం దిల్లీలో జరిగాయి. ఇందులో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్ పాల్గొన్నారు.

ఈ సమావేశంలో రెండు దేశాల నేతల మధ్య ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిగాయి. సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న కొన్ని ఒప్పందాలపై కూడా సంతకాలు చేశారు. ఈ సమావేశాల్లో వాణిజ్య, రక్షణ, తీవ్రవాద అంశాలపై కూడా చర్చించారు.

కమ్యూనికేషన్స్, కంపాటబిలిటీ, సెక్యూరిటీ అగ్రిమెంట్ (COMCASA)ను రెండు దేశాల సంబంధాల్లో మైలురాయిగా పాంపియో వర్ణించారు. ఈ ఒప్పందంతో భారతదేశ రక్షణ సామర్థ్యం పెరుగుతుందని దేశ రక్షణశాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ తెలిపారు.

బీబీసీ ప్రతినిధి ఆదర్శ్ రాఠోర్, రక్షణ అంశాల నిపుణులు సుశాంత్ సరీన్‌తో మాట్లాడారు. అసలు ఈ సమావేశాల్లో ఏయే అంశాలు చర్చకు వచ్చాయో, రెండు దేశాల మధ్య ఏ ఒప్పందాలు జరిగాయో తెలుసుకునే ప్రయత్నం చేశారు.

ఈ సమావేశాలపై సుశాంత్ సరీన్ అభిప్రాయం:

'COMCASA భారీ విజయం'

ఈ సమావేశాల్లో అతిపెద్ద విజయం COMCASAపై భారత్-అమెరికా ఒప్పందం. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే భారత్-అమెరికా సంబంధాలను అది తర్వాత స్థాయికి తీసుకెళ్తుంది. రక్షణ సంబంధిత విషయాల్లో, దౌత్యపరమైన అంశాల్లో కూడా దీని ప్రాధాన్యం ఉంటుంది.

రెండు దేశాల మధ్య చాలా అంశాలు చాలా కాలం నుంచీ పెండింగులో ఉన్నాయి. వాటిని అమెరికా ప్రాథమిక ఒప్పందాలుగా చెబుతారు. కానీ వాటి గురించి భారత్ కు కొన్ని ఆందోళనలు ఉండేవి.

  • COMCASAను అమెరికా సైనిక సంబంధాల కోసం చేసుకునే మూడు ప్రాథమిక ఒప్పందాలలో ఒకటిగా భావిస్తారు. భారత్ ముందు నుంచే లాజిస్టిక్స్ ఎక్స్ఛేంజ్ మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్(LEMOA)పై సంతకం చేసింది.

మూడు ఒప్పందాలలో రెండింటిలో అమెరికా సంతకాలు చేసింది. ఇక మూడో ఒప్పందమైన బేసిక్ ఎక్స్ఛేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ ఫర్ జియో-స్పెషల్ కోఆపరేషన్ (BECA) కోసం చర్చలు కొనసాగుతాయి. ఎందుకంటే వీటిలో LEMOA, COMCASA చాలా ప్రధానమైనవి. భారత్-అమెరికా మధ్య రక్షణ రంగంలో దౌత్య సంబంధాలున్నాయి. అవి ఇప్పుడు ఇంకా మెరుగుపడతాయి. ఈ సమావేశాల్లో దక్కిన అతిపెద్ద విజయం ఇదే.

ఫొటో సోర్స్, TWITTER.COM/MEAINDIA

ఎన్ఎస్‌జీ సభ్యత్వం

ఎన్ఎస్‌జీ సభ్యత్వం పొందే విషయంలో కలిసి ప్రయత్నం చేయాలనేదానిపై కూడా అమెరికాతో అంగీకారం కుదిరిందని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు.

తమ స్థాయిలో దానికోసం చాలా ప్రయత్నాలు చేశామని అమెరికా భారత్‌కు చెప్పింది. కానీ దీనికి అతిపెద్ద దీనికి అడ్డంకి చైనానే అవుతుంది. దానిపై అమెరికా ఎంత ప్రభావం చూపించగలదు అనేది ఇప్పుడు చెప్పడం కష్టం. కానీ అమెరికా ఈ విషయంలో అమెరికా కమిట్‌మెంట్ అలాగే కొనసాగిస్తోంది.

అమెరికాకు మిత్రులుగా ఉన్న చిన్న దేశాలు లేదా అమెరికా ప్రభావం ఉన్న దేశాలను ఆ దేశం ఒప్పించాలి. ఒంటరి అయిన చైనా తను ఒక్కటే భారత్ సభ్యత్వాన్ని వ్యతిరేకించాలి అనేది తెలుసుకునేలా చేయాలి. ఈ అంశంలో మిగతా దేశాలకు ఉన్న అనుమానాలను దూరం చేయగలిగితే, చైనా ఒంటరిగానే దీనిని అడ్డుకోవాలని చూస్తుందేమో చూడాలి.

అయితే, అమెరికా తన మాటకు కట్టుబడి ఉంది కానీ అందులో కొత్త విషయమేం కాదు.

ఫొటో సోర్స్, TWITTER.COM/MEAINDIA

తీవ్రవాదంపై పోరు

మరోవైపు పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి చొరబడుతున్న తీవ్రవాదంపై అమెరికా ఏ దేశం చేయనంత ఒత్తిడి తెస్తోంది. కానీ పాకిస్తాన్ పట్ల అమెరికా కొన్ని విషయాల్లో బాగానే ఉన్నా కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి.

అందుకే ఈ విషయం గురించి కొన్ని క్వశ్చన్ మార్కులు కచ్చితంగా ఉన్నాయి. కానీ భారత్‌కు తీవ్రవాదుల గురించి ఎంత నిఘా సమాచారం వస్తుందో, భారత్-అమెరికా మధ్య అలాంటి సమాచారాన్ని ఎంత ఇచ్చిపుచ్చుకుంటాయో, అందులో తేడా వచ్చింది.

పాకిస్తాన్ లోపల క్రియాశీలకంగా ఉన్న తీవ్రవాదులను ఎంచుకోవడం, వారిపై అరెస్ట్ వారెంట్ జారీ చేయడం లాంటివి. ఇటీవల దావూద్ ఇబ్రహీం కోసం మనీ ల్యాండరింగ్ పని చేసే అథడి సహచరుడిపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అమెరికా దానిపై నిఘా పెట్టిందో, భారత్ స్వయంగా అంత చేయలేకపోయింది.

కానీ అమెరికానే తీవ్రవాద స్థావరాలను ధ్వంసంచేస్తుందా లేక ఆ పని చేయడానికి భారతదేశానికి సాయం చేస్తుందా అనే ప్రశ్న కూడా ఉంది. దాని గురించి ఇప్పుడు చెప్పడం తొందరపాటే అవుతుంది. అయినా, తీవ్రవాదులపై పోరాటంలో భారత్-అమెరికా దగ్గరయ్యాయి. పాత హామీలను గుర్తుచేయడంలో కూడా ఎలాంటి అభ్యంతరాలూ ఉండకూడదు. కమిట్‌మెంట్స్ గురించి గుర్తు చేసినా వాటిని స్వాగతించాలి.

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES

రష్యా, ఇరాన్ సంబంధాలపై ప్రభావం

ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షల వల్ల ఆ దేశంతో వాణిజ్యం చేసే దేశాలపై ప్రభావం పడుతోంది. వీటిలో భారత్ కూడా ఉంది. అదే విధంగా భారత్ రష్యా నుంచి ఎస్-400 మిసైల్ సిస్టమ్ కొనుగోలు చేయాలనుకుంటోంది. కానీ అలా చేయడంపై అమెరికా ఆంక్షలను ఎదుర్కోవాల్సి రావచ్చు. అలాంటప్పుడు 2+2 సమావేశాల తర్వాత ఈ విషయంలో స్పష్టత వస్తుందని ఆశించవచ్చు.

రష్యాతో జరగబోయే ఒప్పందంపై అమెరికా భారత్‌ పట్ల మృదువుగానే వ్యవహరిస్తుందని భావిస్తున్నారు. కానీ అప్పుడే ఏదీ చెప్పలేం. ఇక ఇరాన్ విషయానికి వస్తే, అమెరికాకు దగ్గరవడం వల్ల భారత్‌కు ఇరాన్‌తో తన బంధాన్ని పూర్తిగా తెంచుకోవాల్సిన అవసరం లేకుండా ఏదైనా మినహాయింపు లభిస్తుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.

ఈ సమావేశాల్లో భారత్-అమెరికా మధ్య సాన్నిహిత్యం పెరిగింది అనేది మాత్రం కచ్చితం. ఇక COMCASA ఒప్పందంపై సంతకాలు జరగడం దానికి సంకేతం. ఈ ఒప్పందం చాలా కాలం నుంచీ పెండింగులో ఉంది. అమెరికా ఈ విషయం గురించి ఆందోళన వ్యక్తం చేసేది.

భారత్ తమతోపాటూ మెరుగైన సంబంధాలు కోరుకుంటే, ఈ ఒప్పందాల విషయంలో తన పక్షపాత ధోరణిని వదులుకుంటామని అమెరికా చెబుతోంది. కానీ నాకు మాత్రం ఈ సమావేశాల తర్వాత ఆ ఆందోళన చాలావరకూ సమసిపోయిందనే అనిపిస్తోంది. ఇప్పుడు రెండు దేశాల బంధం ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)