స్వలింగ సంపర్కం - సెక్షన్ 377: పట్టణాల్లో సరే.. గ్రామాల్లో ఎల్జీబీటీల పరిస్థితి ఎలా ఉంది?
- వికాస్ పాండే
- బీబీసీ ప్రతినిధి

స్వలింగ సంపర్కం చట్టబద్ధమేనన్న సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకం అంటూ దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
దేశవ్యాప్తంగా ఉన్న ఎల్జీబీటీలు ఈ తీర్పును స్వాగతిస్తూ, ఒక కొత్త శకం ప్రారంభమైందని అంటున్నారు.
అయితే భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలో ఉంటున్న ఎల్జీబీటీల విషయం మాత్రం భిన్నంగా ఉంది. సమాజంలో తమ పట్ల ఉన్న చిన్నచూపు తొలగిపోవడానికి చాలా కాలం పడుతుందని వారు భావిస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాలకు చెందిన ముగ్గురు స్వలింగ సంపర్కులు తీర్పుపై ఏం చెబుతున్నారో వినండి..
అరుణ్ కుమార్, 28, ఉత్తర ప్రదేశ్
కోర్టు తీర్పుపై నాకు నిజంగా సంతోషంగా ఉంది. ఇప్పుడు నగరాలలోని ఎల్జీబీటీలు ఎలాంటి భయం లేకుండా తమ లైంగికత గురించి వెల్లడించొచ్చు.
కానీ, విషాదకరం ఏమిటంటే.. నాలా గ్రామాల్లో నివసించే వాళ్ల కథ వేరు.
మేం భయపడేది చట్టాల గురించి కాదు - మా పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయం గురించి. సుప్రీం తీర్పుకు మీడియా ఇస్తున్న ప్రాధాన్యత కారణంగా ప్రజలు స్వలింగ సంపర్కులను కూడా మామూలు మనుషులుగా గుర్తిస్తారని ఆశిస్తున్నాను.
కానీ ఎల్జీబీటీలు ఎలాంటి భయం లేకుండా జీవించాలంటే, అందుకోసం వాళ్లు ముందు ముందు చాలా పోరాటం చేయాల్సి ఉంటుంది. నేను నా జీవితం మొత్తం భయపడుతూనే జీవించాను. అది సమీప భవిష్యత్తులో మారకపోవచ్చు.
నాకు మగపిల్లల పట్ల ఆకర్షణ కలుగుతోందని తెలిసినపుడు నాకు 14 ఏళ్లు. మొదట నాకంతా గందరగోళంగా ఉండేది. దాంతో నేను దీనిపై ఒక స్నేహితునితో మాట్లాడాలనుకున్నాను.
అయితే అతని ప్రతిస్పందన నాకు శరాఘాతంలా తగిలింది. స్వలింగ సంపర్కం గురంచి తల్చుకోవడం కూడా అసహ్యమని అతనన్నాడు. ఆ తర్వాత నన్ను తప్పించుకుని తిరగడం ప్రారంభించాడు. ఆ తర్వాత మేం ఒకరితో ఒకరు మాట్లాడింది చాలా తక్కువ.
ఈ సంఘటన జరిగిన చాలా కాలం వరకు నేను నా లైంగిక స్వభావం గురించి ఎవరితోనూ మాట్లాడలేదు.
నాకు 18 ఏళ్లు వచ్చాక కాలేజీ కోసం దగ్గరలోని పట్టణానికి వెళ్లాల్సి వచ్చింది. కానీ అక్కడా పరిస్థితులు మారలేదు. ఈ ప్రపంచం నాకు అర్థం కాలేదు. నాకు చాలా గిల్టీగా అనిపించేది. కానీ ఎందుకో అర్థమయ్యేది కాదు. నేనేమీ చెడ్డ పని చేయడం లేదు.
చివరిగా నేను ఈ విషయాన్ని చాలా మంచివాడిగా కనిపించే ఒక ఉపాధ్యాయునితో పంచుకోవాలనుకున్నాను. కానీ అదే నా తప్పైంది.
ఆ ఉపాధ్యాయుడు నా తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్లు వచ్చి నన్ను తిరగి ఇంటికి తీసుకెళ్లారు. మా నాన్నకు చాలా కోపం వచ్చింది. దానినో జబ్బుగా పరిగణించి, ఆయన నన్ను నాటు వైద్యుల వద్దకు తీసుకెళ్లాడు. వాళ్ళు ఏవేవో మందులు ఇచ్చారు. వాళ్లలో ఒకరు నన్ను ఓ వారం పాటు గదిలో పెట్టి బంధించమని చెప్పాడు. మా నాన్న ఆ పని చేశాడు కూడా.
నేనింకా మా గ్రామంలో ఉంటున్నా. నాకు ఇటీవలే ఒక నగరం నుంచి ఉద్యోగంలో చేరమని కబురు వచ్చింది. బహుశా, ఇకనైనా పరిస్థితులు మారతాయేమో.
నాకు ఒక భాగస్వామి రావాలి. నాకూ ప్రేమ కావాలి.
కిరణ్ యాదవ్, 30, బిహార్
గురువారం వరకు నాకు సెక్షన్ 377 గురించి ఏమీ తెలీదు. స్వలింగ సంపర్కం నేరం అని కూడా నాకు తెలీదు. నాకు తెలిసిందల్లా, నేనుండే గ్రామీణ ప్రాంతంలో నేను ఒక స్వలింగ సంపర్కురాలైన మహిళగా జీవించలేనని మాత్రమే.
ఈ తీర్పు ఆహ్వానించదగ్గదే అయినా, దీని వల్ల నాకేమీ ప్రయోజనం ఉండదు. అయితే ఈ చర్చ గ్రామీణ ప్రాంతాలకు కూడా వ్యాపించాలని నేను కోరుకుంటున్నాను.
నేను లెస్బియన్‌ను అని నాకు 15 ఏళ్లు వచ్చాక తెలిసింది. నేను బాలికనైనా, నాకు మగపిల్లల్లా షర్ట్, ట్రౌజర్ వేసుకోవడం ఇష్టముండేది.
దీనికి నా తల్లిదండ్రులు ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. నాకు అన్నలు, తమ్ముళ్లెవరూ లేరు. అందువల్ల అబ్బాయి దుస్తులు వేసుకోవడం వల్ల వాళ్లకేమీ ఇబ్బంది కలగలేదు.
అయితే నా లైంగిక ధోరణి గురించి మాత్రం వాళ్లకు తెలియలేదు.
నిజం చెప్పాలంటే, నాకు కూడా అప్పుడు దీనంతటి గురించి ఎక్కువగా తెలీదు. నాకు ఆడపిల్లలంటే ఆకర్షణ కలుగుతోందని తెలుసు, అది సరైంది కాదని కూడా నాకు తెలుసు. అందువల్ల నా తల్లిదండ్రులకు నేనెప్పుడూ దీని గురించి చెప్పలేదు. వాళ్లకు ఇప్పటికీ నా గురించి పూర్తిగా తెలీదు. నాకు దగ్గరగా ఉండేవాళ్లకు కూడా తెలీదు.
పెళ్లిళ్ల సమయంలో ఆడవాళ్లు నాకు ఆకర్షణీయంగా కనిపిస్తారు కానీ నేనెప్పుడూ వాళ్లతో మాట్లాడే ధైర్యం చేయలేదు.
నాకు 20 ఏళ్లు వచ్చాక, నన్ను నేను వ్యక్తీకరించుకోవడానకి ఏదో ఒక దారి కావాల్సి వచ్చింది. నేను నా స్వభావాన్ని గురించి ఎవరితోనూ చర్చించలేకపోయేదాన్ని. కానీ మొబైల్ ఫోన్లు నాకు సహాయం చేశాయి. నేను ఏదో ఒక నెంబర్‌కు ఫోన్ చేసి, కొత్త వాళ్లకు నా కథను చెప్పుకునే దాన్ని. కొంతమంది సానుభూతితో వినేవాళ్లు. అలా నేను ఫోన్ చేసిన వాళ్లలో ఒక యువతి నా గొంతును ఇష్టపడింది. దీంతో నాకు సంతోషం కలిగింది. ఒక యువతి నుంచి ప్రశంస లభించడం అదే మొదటిసారి.
అయితే అలాంటివి చాలా అరుదు. నా లోలోపల మాత్రం దు:ఖం గూడు కట్టుకుని ఉంది.
24 ఏళ్ల వయసులో నేను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాను. నాకు పెళ్లి కావడం లేదనే నేను అలాంటి ప్రయత్నం చేశానని నా తల్లిదండ్రులు భావించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు నాకు వివాహం చేశారు. కానీ ఏడాదిలోపే నాకు విడాకులయ్యాయి.
అప్పటికి నాకు జీవితం మీద విరక్తి కలిగింది. రోజురోజుకీ బతకడం కష్టమైపోయింది. 30 ఏళ్ల పాటు నేను జీవితంలో భాగస్వామి లేకుండానే గడిపేసాను. ఇప్పుడు నేను బతకడానికి నాకొక ఉద్యోగం కావాలి.. అంతే. నేను లెస్బియన్‌ను అని బహిరంగంగా చెప్పుకోలేను కనుక నాకో భాగస్వామి దొరుకుతారన్న నమ్మకం లేదు.
రాహుల్ సింగ్, 32, బిహార్
ఈ తీర్పు చాలా ఆనందం కలిగిస్తోంది. కానీ నాకెన్నడూ సెక్షన్ 377 ఒక సమస్య కాలేదు. మా గ్రామంలో పోలీసులు ఎప్పుడూ ఆ చట్టం పేరు చెప్పి వేధించలేదు. మా సమస్యల్లా సమాజమే.
నాకు 16 ఏళ్లు వచ్చినపుడు నేను గే అని తెలిసింది. రెండేళ్ల తర్వాత నాకు పెళ్లైంది. అయితే నేను దీని గురించి నా భార్యకు కానీ, తల్లిదండ్రులకు కానీ చెప్పలేకపోయాను. నాకిప్పుడు ఇద్దరు పిల్లలు.
కానీ నా భార్యకు నా గురించి చెప్పలేకపోయినందుకు నేను చాలా బాధ పడుతున్నాను. నేను గే అని ఆమెకు తెలుసు. కానీ ఆమె కేవలం పిల్లల కోసం నాతో కలిసి జీవిస్తోంది.
గ్రామంలో నాకు భాగస్వామి దొరకడం చాలా కష్టం. పెద్ద పెద్ద నగరాల్లో మాదిరి ఇక్కడ గే క్లబ్బులు ఉండవు. నాకు కొంత మంది గేల గురించి తెలిసినా వాళ్లు సమాజం వెలివేస్తుందని భయపడుతూ జీవిస్తుంటారు.
ఒక గే కు కూడా ప్రేమ, గౌరవం అవసరం అని ఈ సమాజం గుర్తించదు.
నేను ఇతరుల పట్ల ఎంత మంచిగా ఉన్నా, ఎంత సహాయం చేసినా, నేను గే అని తెలిస్తే మాత్రం నా నుంచి దూరంగా పారిపోతారు.
కొంత మంది మా పట్ల జాలి చూపుతారు కానీ వాళ్లింకా దాన్ని ఒక వ్యాధిగా భావిస్తూ, మాకు చికిత్స అవసరమని భావిస్తారు. కానీ ఎవరూ కూడా మా భావాలు అలా ఎందుకుంటాయో అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు.
ఇలా జీవించడం చాలా బాధాకరం. నేనెప్పుడూ నన్నెవరైనా గమనిస్తున్నారా అని పరిశీలిస్తూ ఉంటాను. నేను గే ను అయిన కారణంగా ఎవరో ఒకరు నా దగ్గరకు వచ్చి నన్ను కొడతారని లేదా ఏదో ఒకటి చేస్తారని నాకెప్పుడూ భయం.
భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలో గే జీవితం గడపడమంటే బంధించినట్లుగా అనిపిస్తుంది.
నా పిల్లలు పెద్దవారైతే వాళ్లను కూడా ఏడిపిస్తారని నాకు భయం కలుగుతుంటుంది. ఇప్పటికే అలాంటి భయం వల్ల నేను ఒకసారి ఇల్లు మార్చాను. కొన్నిసార్లు నేను నా జీవితాన్ని అంతం చేసుకోవాలనుకుంటాను కానీ పిల్లలు గుర్తుకొచ్చి ఆగిపోతాను.
వెనక్కి తిరిగి చూసుకుంటే నేను నా తల్లిదండ్రులకు నిజం చెప్పేసి ఉంటే బాగుణ్ను, పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుణ్ను అనిపిస్తుంది.
(గోప్యత కోసం వ్యక్తుల పేర్లను మార్చాం. చిత్రాలు: పునీత్ కుమార్)
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)