బిగ్‌ బాస్‌ 2: గీతా మాధురి దేశాన్ని ఉద్ధరించడానికి గేమ్‌ షోకి వెళ్లలేదు, ఆమెపై ట్రోలింగ్ అనవసరం - BBC తెలుగుతో నందూ

geetha

ఫొటో సోర్స్, facebook

ఫేస్‌బుక్‌లో ట్రోలింగ్ హద్దు మీరుతోంది. ముఖ్యంగా బిగ్ బాస్‌ షో కంటెస్టెంట్స్ విషయంలో మరీ దారుణంగా ఉంది. గతంలో నటుడు శివ బాలాజీ లక్ష్యంగా ట్రోలింగ్ జరిగింది. దీంతో ఆయన తన భార్యపై అసభ్యకర కామెంట్లు చేశారని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈసారి బిగ్‌బాస్‌ కంటెస్టెంట్ గీతా మాధురిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఆమెపై అసభ్యకర కామెంట్లు చేయడంతో ఆమె భర్త నందూ స్పందించారు.

బీబీసీ తెలుగు ప్రతినిధి పద్మ మీనాక్షితో మాట్లాడుతూ.. ‘‘బిగ్ బాస్ అనేది కేవలం గేమ్ షో. వ్యక్తిగతమైన కామెంట్లు చేయడం సరికాదు.’’ అన్నారు.

ఫొటో సోర్స్, facebook

వారానికి ఇంతని తీసుకుంటున్నారు ఆడుతున్నారు.. అంతే

‘‘ గీతా మాధురిపై ట్రోలింగ్ చాలా బాధాకరం. నా మనసును చాలా బాధపెట్టింది. ఈ ట్రోలింగ్.. గేమ్ ఇదంతా కొన్నాళ్లకు మాయమైపోతుంది.’’ అని నందూ వ్యాఖ్యానించారు.

''మీనాక్షిగారూ.. నాకె చెప్పాలో అర్థం కావడం లేదు. గీతామాధురి దేశాన్ని ఉద్ధరించడానికి.. దేశం కోసం పోరాడటానికి అక్కడకు వెళ్లలేదు. ఇది కేవలం గేమ్ షో. దీనిపై ట్రోలింగ్ అనవసరం.'' అన్నారు.

ఇలాంటి గేమ్స్ కేవలం ఆనందాన్నిస్తాయి. అంతేకానీ.. వీటితో రాత్రికి రాత్రే ఆమెకు పెద్ద ఖ్యాతి వచ్చేయదని చెప్పారు.

‘ఈ పార్టిసిపెంట్స్ ప్రతి వారం రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. గేమ్ ఆడుతున్నారు. కానీ బయటి జనాలు మాత్రం అన్నీ ఊహాగానాలు చేస్తున్నారు.’ అని అన్నారు.

ఒక మహిళను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం మన సంస్కారం కాదు..’’ అని పేర్కొంటూ ఓ వీడియోను పోస్ట్ చేసి డిలీట్ చేశారన్న వార్తలనూ ఖండించారు.

ఇటీవల పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌ని కూడా ట్రోల్ చేశారు. ఆమె రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నపుడు తీవ్రమైన ట్రోలింగ్ జరిగింది. దీనిపై ఆమె కాస్త గట్టిగానే స్పందించారు.

ఫొటో సోర్స్, Getty Images

మరి సోషల్ మీడియాలో మీరు చేస్తున్న పోస్ట్‌లో తేడా వస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మూడు నుంచి ఏడేళ్లు జైలుకు వెళ్లాల్సి రావొచ్చు. మీరు గతంలో చేసిన పోస్ట్ వల్ల మీకు భవిష్యత్తులో ఉద్యోగం రాకపోవచ్చు.

అంత సీనుందా.. అనుకోవద్దు. ఉందనే అంటున్నారు సైబర్ నేరాలకు సంబంధించిన న్యాయ నిపుణులు పవన్ దుగ్గల్. ఆయన సోషల్ మీడియాలో ట్రోలింగ్‌పై గతంలో బీబీసీ న్యూస్ తెలుగుతో మాట్లాడారు.

భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా.. అని ఫేస్‌బుక్, ట్విటర్ ఇతర సోషల్ వేదికల్లో ఏది పడితే అది రాయడానికి లేదన్నారు.చివరకు పోస్టే కాదు.. ఓ కామెంట్ తేడా వచ్చినా తర్వాత ఇబ్బందులు తప్పకపోవచ్చని తెలిపారు.

కోర్టులు కూడా ఆయా కామెంట్లకు తగినట్లు.. ఇతర చట్టాలను కూడా ఐటీ చట్టానికి అన్వయిస్తూ ప్రజల్లో 'సోషల్' సభ్యతను పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయని వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images

అచ్చంగా దుగ్గల్ మాటల్లో చెప్పాలంటే.. చూడ్డానికి బాగుంది కదా.. అని మీరు భావించి నెట్‌లో దొరికిన ఒక అసభ్యకరమైన ఫొటోను మీ ఫేస్‌బుక్‌లో పెట్టారంటే మీ 'ఫేస్'కూడా బుక్కయిపోయినట్టే.

ఎందుకంటే.. అది తర్వాత మిమ్మల్ని ఎప్పుడైనా ఇబ్బంది పెట్టవచ్చు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. మీరు జైలుకు వెళ్లాల్సి రావొచ్చు.

ఇది ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద నేరమవుతుంది.. మూడేళ్ల జైలు, 5 లక్షల రూపాయల జరిమానా కూడా పడొచ్చు అని పవన్ దుగ్గల్ చెబుతున్నారు.

ఇటీవల సెలబ్రిటీలు, క్రికెటర్లు, ఇతర ప్రముఖుల పేరిట నకిలీ ఖాతాలు సృష్టించడం బాగా పెరిగింది. ఇది కూడా ఐటీ చట్టంలోని సెక్షన్ 66 (సి) కింద నేరమే. ఇలా చేస్తే ఒకటి కాదు.. రెండు మూడు కేసులు మెడకు చుట్టుకునే ప్రమాదముంది.

ఇక ఇతరుల ప్రైవసీకి భంగం కలిగించేలా పోస్ట్‌లు, ఫొటోలు పెట్టినా.. అశ్లీల, నగ్న చిత్రాలు పెట్టినా ఐటీ సెక్షన్లోని 66 ఈ, 67 ఎ ప్రకారం మూడు నుంచి 14 ఏళ్ల వరకు జైలు శిక్ష పడవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images

ఒక్క మాటలో చెప్పాలంటే.. మీరు రాసిన పోస్ట్ లేదా కామెంట్.. వ్యక్తులు, సంస్థల పరువుకు కానీ, భద్రత కానీ ఇబ్బంది కలిగించినా.. ప్రజలను భయపెట్టే విధంగా ఉన్నా, అసభ్యకరమైనా.. మీరు ఇబ్బందుల్లో పడినట్టే.

ఈ అంశంపై పవన్ దుగ్గల్ మాట్లాడుతూ.. ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని మరీ పోస్ట్‌లు పెట్టాలన్నారు.

ఇంటర్నెట్‌లో ఎక్కడైనా సరే ఏమి రాసినా.. అది చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది కనుక.. 'పోస్ట్'ల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

ఇంకా ఫేస్‌బుక్ ఎందుకు మాకు వాట్సాప్ గ్రూపులున్నాయి అక్కడ ఇష్టం వచ్చినట్లు రాసుకుంటామన్నా కుదరదు. అక్కడా చట్టం తన పనిని తాను చేసుకుపోతుందని న్యాయనిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఇలాగైతే ఇంకేం రాస్తాం.. అనుకోవద్దు.చాలా రాయొచ్చు. మీ అభిప్రాయాలను పంచుకోవచ్చు. కాకుంటే మీరు రాసిన ప్రతి అక్షరానికీ తగిన ఆధారం లేకుంటే హేతుబద్ధత ఉండాలని దుగ్గల్ అన్నారు. ఇవి రెండూ లేకుంటే మీ పోస్ట్ వల్ల ఇతరులకు.. తర్వాత మీకూ ప్రమాదం ముంచుకు రావొచ్చు.

ఈ 4 గుర్తుంచుకోండి

భావ ప్రకటనా స్వేచ్ఛకూ పరిమితులున్నాయి. ఎక్కడ ఎలా పడితే అలా మాట్లాడానికి రాయడానికి వీల్లేదు.

విమర్శలు చేయొచ్చు కాని దానివల్ల అవతలి వారి పరువుకు భంగం, నష్టం కలగకూడదు.

సోషల్ మీడియా చాలా సెన్సిటివ్ ఇక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చాలా ప్రమాదకరం.

సోషల్ మీడియాకూ నియమ నిబంధనలు ఉంటాయి. వాటిని తెలుసుకోండి.

మరిన్ని కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)