ఎల్జీబీటీ: సుప్రీం కోర్టు తీర్పుతో ఇప్పుడు స్వలింగ సంపర్కులు పెళ్లి చేసుకోగలరా?

స్వలింగ సంపర్కుల పెళ్లి కల తీరేనా

సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో స్వలింగ సంపర్కాన్ని నేరస్మృతి నుంచి తొలగించారు. ఇప్పుడు ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో స్వలింగ సంపర్కం పెట్టుకుంటే దాన్ని నేరంగా భావించరు.

కానీ ఈ తీర్పుకు అంత ప్రాధాన్యం ఎందుకు? ఈ విషయం గురించి ఆ బాధను భరించినవారు మాత్రమే చెప్పగలరు.

పూణెకు చెందిన సమీర్ సమృద్ధ్, అమిత్ గోఖలే 2010లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అమెరికాలో ఎల్జీబీటీ పెళ్లిళ్లకు చట్టబద్ధత లభించినపుడు 2014లో చట్టప్రకారం పెళ్లి చేసుకున్నారు. భారతదేశంలో సెక్షన్ 377పై సుప్రీంకోర్టు తీర్పు గురించి సమీర్, అమిత్ బీబీసీతో మాట్లాడారు.

"మాకు మాటలు రావడం లేదు. చాలా ఎమోషనల్‌గా ఉంది. భారత్‌లో రెండు రకాల పౌరులే ఉండేవారు. మేం నేరస్థులమేమోనని మాకు అనిపించేది. మా ప్రేమను సమాజం అంగీకరించకపోవడం చూస్తుంటే బాధగా ఉండేది. కానీ ఈరోజు తీర్పుతో మేం సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు మేం మన సమాజంలో ఎలాంటి భయం లేకుండా ఉండచ్చు. 1947లో స్వతంత్రం తర్వాత అందరికీ ఎలా అనిపించిందో ఈరోజు మాకు అలాంటి ఫీలింగే వస్తోంది" అని వారు చెప్పారు.

స్వలింగ సంపర్కులు ఇక పెళ్లి చేసుకోగలరా?

కానీ ఇంకా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి- సమీర్, అమిత్ వివాహాన్ని ఇప్పుడు భారత్‌లో అందరూ అంగీకరిస్తారా?

స్వలింగ సంపర్కులకు పెళ్లి చేసుకునే హక్కు లభిస్తుందా?

"ఈ తీర్పు తర్వాత ఈ సమాజంలో వారికి పెళ్లి చేసుకునే హక్కు లభిస్తుందనేం లేదు" అని సుప్రీంకోర్టులో పిటిషనర్ల తరఫు న్యాయవాది ఆనంద్ గ్రోవర్ అన్నారు.

స్వలింగ సంపర్కులు పెళ్లి చేసుకునేలా ప్రస్తుతం దేశంలో ఎలాంటి చట్టాలూ లేవు, బయట వేరే దేశంలో పెళ్లి చేసుకున్న వారు ఇక్కడికి వచ్చినపుడు, అక్కడ చట్టబద్ధమైన పెళ్లి, ఇక్కడ చెల్లుతుందా లేదా అనేదానిపై కూడా ఇప్పటికీ ప్రశ్నలు ఉన్నాయి అని ఆయన చెప్పారు.

అలాంటప్పుడు స్వలింగ సంపర్కులకు వివాహ హక్కు ఎలా లభిస్తుందనే ప్రశ్న తలెత్తుతోంది.

ఈ ప్రశ్నకు జవాబుగా "దీనికోసం ప్రభుత్వం చట్టాలను మార్చాల్సి ఉంటుంది. చట్టం పార్లమెంటులో అవుతుంది. చట్టం చేయాలని కోర్టు ప్రభుత్వాలను ఆదేశించలేదు" అని ఆనంద్ గ్రోవర్ చెప్పారు.

ట్రిపుల్ తలాక్ తీర్పును ఉటంకించిన ఆనంద్ గ్రోవర్ "కోర్టు ట్రిపుల్ తలాక్ రాజ్యాంగవిరుద్ధం అని చెప్పగానే, దానిపై ఎలా బిల్లు తీసుకొచ్చిందో, అలాగే ఈ అంశంలో కూడా ప్రభుత్వం చొరవ చూపాల్సి ఉంటుంది. అన్నారు.

స్వలింగ సంపర్కులకు పిల్లలను దత్తత తీసుకునే హక్కు ఉంటుందా? ఉండదా?

"అలా ఏం లేదు. ఇప్పటివరకూ ఈ సమాజంలో ఇష్టపూర్వకంగా సంబంధాలు పెట్టుకోడానికి అనుమతి లేదు. ఇప్పుడు అంగీకారంతో సంబంధాలు పెట్టుకోవడం నేరం కానప్పుడు, ఎల్జీబీటీ సమాజంలో వారిపై రేప్, లైంగిక వేధింపులు, లైంగిక హింసల కేసులు కూడా వెలుగులోకి రావచ్చు. అలాంటప్పుడు చట్టం వీటిని ఎలా డీల్ చేస్తుంది. దీనిపై కూడా ప్రభుత్వం ఇప్పుడు ఆలోచించాల్సి ఉంటుంది’’ అని ఆనంద్ గ్రోవర్ అంటారు.

దీని ప్రకారం ప్రస్తుతం న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కేవలం స్వలింగ సంపర్కుల సంబంధాలను నేరస్మృతి నుంచి తొలగించడానికి సంబంధించిందేనని చెప్పవచ్చు.

అయితే స్వలింగ సంపర్కులకు పిల్లలను దత్తత తీసుకునే హక్కు కూడా ఉండదా? ఈ ప్రశ్నకు జవాబుగా "ఈ తీర్పు తర్వాత దత్తత తీసుకోవడంపై ఎలాంటి నిషేధం ఉండదు" అని గ్రోవర్ చెప్పారు.

దీని ప్రకారం ఆస్తిలో భాగం పంచుకోవడానికి కూడా ఇక ఎలాంటి అడ్డంకులూ ఉండవు. ఈ తీర్పుతో దానిపై ఎలాంటి ప్రభావం పడదు.

సమాజానికి సంబంధించిన వారేమంటున్నారు?

ఆరిఫ్ జఫర్ లాంటి వారికి సెక్షన్ 377 కింద జైలుకు కూడా వెళ్లాల్సొచ్చింది.

దేశంలోనే ఇలాంటి మొదటి గ్రూప్ తమదేనని ఆయన చెబుతారు. 1991లో ఆయన ఒక గ్రూప్ ప్రారంభించారు. చాలా కష్టపడి కొంతమందిని ఈ గ్రూప్‌లో జోడించారు. ప్రభుత్వానికి అలాంటి ఒక గ్రూప్ ఉండడం ఇష్టం లేదని ఆయన చెప్పారు. అందుకే ఆయనను, ఆయనతోపాటూ ఉన్నవారిని జైల్లో పెట్టారు.

హమ్‌సఫర్ గ్రూప్‌కు సంబంధించిన అలీది కూడా అలాంటి కథే. తన పార్ట్‌నర్‌పై రేప్ జరిగినప్పుడు, తను పోలీస్ స్టేషన్ వెళ్లానని, అప్పుడు తనతో చాలా దారుణంగా ప్రవర్తించారని ఆయన చెప్పారు. ఆరోజు తనపై సెక్షన్ 377 కేసు పెడతారేమోనని వణికిపోయానని అలీ చెప్పారు.

కానీ ఇప్పడు సుప్రీంకోర్టు స్వలింగ సంపర్కుల సంబంధాలను నేరస్మృతి నుంచి తొలగించడంతో ఈ సమాజంలో వారికి స్వేచ్ఛ లభించినట్టయ్యింది.

"ఇప్పుడు కనీసం సాయం అడగడానికైనా భయపడకుండా ఉండగలం" అని అలీ అంటారు.

సుప్రీంకోర్టులో ఈ సంబంధాలపై 30కి పైగా పిటిషన్లు వేశారు. వీటిలో స్వలింగ సంపర్కుల సంబంధాలను నేరస్మృతి నుంచి తొలగించడంతోపాటు మరికొన్ని డిమాండ్లు కూడా ఉన్నాయి. వీటిలో పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని దత్తత తీసుకోవడంపై చట్టం చేయాలని కూడా కోరారు. కానీ కోర్టు వాటిపై ఎలాంటి తీర్పూ ఇవ్వలేదు.

కోర్టు తీర్పుతో ఎల్జీబీటీ సమాజం చాలా సంతోషించింది. కానీ తమ పోరాటం ఇంకా ముగిసిపోలేదని వారు భావిస్తున్నారు. ఎల్జీబీటీ సమాజానికి చెందిన బేబో "మేం సంతోషంగా ఉండడానికి చట్టం ఒక కానుక ఇచ్చింది. కానీ సమాజం కూడా మమ్మల్ని అంగీకరించాలి. అది లేకుంటే ఎలాంటి మార్పూ జరగదు" అన్నారు.

తీర్పు ఒక వైపు, లోపాలు ఒకవైపు

ఈ అంశంపై వ్యాఖ్యానించిన సీనియర్ అడ్వకేట్ అవని బంసల్ "సుప్రీంకోర్టు సెక్షన్ 377పై ఇచ్చిన తీర్పు కేవలం స్వలింగ సంపర్కంపై వచ్చిన తీర్పు మాత్రమే" అన్నారు.

"మనం పంచుకునే సమాజంలో అన్ని వర్గాల వారూ భాగస్వాములు కావాలని మనం అనుకోవాలి. ఈ సమాజం ఎన్నో ఏళ్ల నుంచీ అణచివేతకు గురైంది. ఇప్పుడు దానికి ముగింపు పలకాలి. సమాజంలో ఇలాంటి ఆలోచన కూడా రావాల్సిన అవసరం ఉంది" అన్నారు.

లా కమిషన్ ఆఫ్ ఇండియాలో సలహాదారు అయిన సౌమ్యా సక్సెనా కూడా అలాగే అనుకుంటున్నారు. "న్యాయస్థానం తన తీర్పు వినిపించి ఉండచ్చు. కానీ అది సమాజం స్థాయిలోకి రావడం ఇంకా మిగిలే ఉంది. అయితే ఇది తొలి అడుగేనని, దీనిని స్వాగతించాలని సమాజం తప్పనిసరిగా తెలుసుకుంటుంది" అన్నారు.

ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనంలోని జస్టిస్ నారిమన్ ఇది ఎలాంటి మానసిక వ్యాధీ కాదన్నారు. ఎల్జీబీటీ సమాజంపై చిన్నచూపు లేకుండా ఉండాలంటే, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర ప్రభుత్వం సరిగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)