తెలంగాణ ముందస్తు ఎన్నికలు: విలీన మండలాల ఓటర్లు ఎటు?

  • 8 సెప్టెంబర్ 2018
తెలంగాణ మ్యాప్ చూపుతున్న వ్యక్తి Image copyright Getty Images

తెలంగాణలో ముందస్తు ఎన్నికల సందడి మొదలైంది. ఇదే సమయంలో రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కలిపిన ఏడు మండలాల విషయం చర్చకొస్తోంది.

విలీన మండలాల ఓటర్లు తెలంగాణ ఎన్నికల్లో పాల్గొంటారా? లేదంటే వారు ఏపీలోని నియోజకవర్గాల పరిధిలోకి వస్తారా అన్నది చర్చనీయమవుతోంది.

ఈ మండలాలను ఏపీలోని రెండు నియోజకవర్గాల్లో కలిపామని, ఇకపై వారు ఏపీలోనే ఓటు హక్కు వినియోగించుకుంటారని అధికారులు చెబుతున్నారు.

రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలోని ఏడు మండలాలకు చెందిన గ్రామాలను ఏపీలో విలీనం చేశారు. ఈ ఏడు మండలాలు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఉండేవి.

Image copyright Govt of AP/Telangana

భద్రాచలం నియోజకవర్గంలోని భద్రాచలం పట్టణం మినహా మిగతా మండలం అంతా, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాలు.. పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు, అశ్వారావు పేట నియోజకవర్గంలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాలను ఏపీలో కలిపారు. వీటిలో కొన్ని మండలాలు పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా ఏపీలో కలిశాయి.

వీటిలో భద్రాచలం నియోజకవర్గం నుంచి వేరయిన నాలుగు మండలాలను ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో.. పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాల్లోని మండలాలను పశ్చిమగోదావరి జిల్లాలో కలిపారు.

ఈ ఏడు మండలాల్లోని 211 గ్రామాల బదలాయింపునకు సంబంధించి కేంద్రం చట్టం కూడా చేసింది.

Image copyright NITI Aayog

‘ఇప్పుడు వారు రంపచోడవరం, పోలవరం నియోజకవర్గాల ఓటర్లు’

ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు వస్తుండడంతో ఈ గ్రామాలు ఏపీలోకి మారినా నియోజకవర్గాల పరంగా ఏ పరిధిలోకి వస్తాయన్నది చర్చనీయమైంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి తాజాగా విడుదల చేసిన ప్రకటన దీనిపై స్పష్టత ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన ఏడు మండలాల ఓటర్లను ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాలో చేర్చినట్లు ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి ఆర్పీ సిసోడియా వెల్లడించారు.

కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల మేరకు ఆ ఏడు మండలాలను ఏపీలోని రంపచోడవరం(ఎస్టీ), పోలవరం(ఎస్టీ) అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపారని.. ఆ మండలాల్లోని ఓటర్ల వివరాలను తెలంగాణ ఎన్నికల సంఘం నుంచి తీసుకుని ఆంధ్రప్రదేశ్‌ ఓటర్ల జాబితాలో కలిపామని ఆయన వెల్లడించారు. వీరు ఓటు హక్కు వినియోగించుకునే పోలింగ్‌ కేంద్రాలు కూడా ఏపీలోనే ఉన్నాయని చెప్పారు.

Image copyright facebook
చిత్రం శీర్షిక సున్నం రాజయ్య

విలీన మండలాల ఓటర్ల పేర్లు ఏపీలోనే: ఎమ్మెల్యే సున్నం రాజయ్య

విలీనానికి ముందు 2014 ఎన్నికల్లో భద్రాచలం నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే సున్నం రాజయ్య దీనిపై 'బీబీసీ'తో మాట్లాడారు.

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న భద్రాచలం నియోజకవర్గం నుంచి వేరు చేసిన నాలుగు మండలాలను ఏపీలోని రంపచోడవరం నియోజకవర్గంలో కలిపారని ఆయన తెలిపారు.

ఆ మండలాల పరిధిలోని గ్రామాల్లో ఓటర్ల వివరాలు తెలిపే జాబితాలను ఆయా పంచాయతీ కార్యాలయాల్లో శుక్రవారం ప్రదర్శనకు ఉంచారని ఆయన ధ్రువీకరించారు.

తాను తెలంగాణ అధికారులను సంప్రదించగా అక్కడ భద్రాచలం నియోజకవర్గం పరిధిలో ఈ మండలాలు, వాటిలోని గ్రామాలు లేవని వారు ధ్రువీకరించారంటూ రాజయ్య తెలిపారు.

''ప్రస్తుతం తెలంగాణలోని భద్రాచలం నియోజకవర్గం పరిధిలో వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం టౌన్ మాత్రమే ఉన్నాయని.. ఆ నియోజకవర్గంలో 1.26 లక్షల ఓటర్లు ఉన్నారని అధికారులు చెప్పారంటూ ఎమ్మెల్యే సున్నం రాజయ్య 'బీబీసీ'కి వివరించారు.

పోలవరం ముంపు మండలాలపై సీఈసీ రావత్ ఏమన్నారంటే..

ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన ఏడు మండలాలకు సంబంధించిన సమస్యను ఇంకా పరిష్కరించాల్సి ఉందని, ఆ ప్రకారం తెలంగాణ శాసనసభ నియోజకవర్గాల ఓటర్ల జాబితాను సవరించాల్సి ఉంటుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ అన్నారని ‘ఈనాడు’ దినపత్రిక పేర్కొంది.

‘చాలా ముఖ్యమైన ఈ అంశాన్ని చాలామంది మరిచిపోయారు. అది హోంశాఖ దగ్గరుంది. దానిపై కొన్ని నెలలుగా కమిషన్‌ మాట్లాడుతోంది. త్వరలో దానికి పరిష్కారం లభిస్తుందని రెండురోజుల క్రితం మాకు సమాచారం అందింది. ఈ అంశం కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉంది. అందువల్ల పరిష్కారానికి ఎక్కువ సమయం పడుతుందని అనుకోవడంలేదు’ అని ఆయన తెలిపారు.

‘రాష్ట్ర విభజన సమయంలో ఏడు మండలాలను తెలంగాణ నుంచి ఆంధ్రలో, మూడు మండలాలను ఆంధ్ర నుంచి తెలంగాణలో కలిపారు. అప్పుడు విడుదలచేసిన హోంశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌లో కొన్ని చిన్నచిన్న తప్పులున్నాయి. వాటికి సవరణలను విడుదల చేయాల్సి ఉంది. ఇప్పటికే చాలా సమయం తీసుకున్నందున.. అతి త్వరలో పూర్తిచేస్తామని మాకు వాగ్దానం చేశారు. సవరణ జారీకి మళ్లీ పార్లమెంటుకు వెళ్లాల్సిన అవసరంలేదు. హోంశాఖ కార్యనిర్వాహక ఉత్తర్వులు సరిపోతాయి’ అని రావత్ చెప్పారని ‘ఈనాడు’ పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)