చోరీకి గురైన నిజాం బంగారు టిఫిన్ బాక్సు దొరికింది : ‘ఆ మ్యూజియంలో రూ. 400 కోట్ల విలువైన కళాఖండాలు’
- శ్యాం మోహన్
- బీబీసీ కోసం

మేలిమి బంగారంతో కళాత్మకంగా తయారు చేసిన అందమైన టిఫిన్ బాక్స్ హైదరాబాద్‌లోని నిజాం మ్యూజియం నుంచి అపహరణకు గురైంది. చారిత్రక నగరమైన హైదరాబాద్‌లోని పురానీ హవేలీ మసరత్ మహల్‌లో ఉందీ నిజాం మ్యూజియం. చారిత్రక ప్రాధాన్యం ఉన్న అరుదైన-విలువైన వస్తువులెన్నో ఉన్న ఈ మ్యూజియంలో దొంగలు పడి పసిడి టిఫిన్ డబ్బాతో పాటు రత్నాలు పొదిగిన బంగారు టీ కప్పు, సాసర్, చెంచాను తీసుకుపోయారు. పోలీసులు ప్రస్తుతం దొంగలను పట్టుకున్నారు.
నిజాం రాచ మందిరాల్లో ఒకటైన ఈ మ్యుజియంకు ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉంది. ఎన్నో ఆభరణాలు, కళాఖండాలు, పెయింటింగ్స్, అలాగే పురాతన కార్లు ఈ పురావస్తు ప్రదర్శనశాలలో ఉన్నాయి. ఇలాంటి ఎన్నో విలువైన వస్తువులున్న నిజాం మ్యూజియం ప్రత్యేకతను, ఆ వస్తువులతో నిజాంకు ఉన్న అనుబంధాన్ని ఆయన మునిమనవడు నవాబ్ నజఫ్ అలీఖాన్ ఇలా వివరించారు.
‘‘ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహుదూర్ పాతికేళ్ళ పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా 1936లో రజతోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ సందర్భంగా పబ్లిక్ గార్డెన్‌లోని జూబ్లీహాలులో సామంతులు, నవాబులు, ఇతరదేశాల ప్రతినిధులు ఆయనకు ఎన్నో జ్ఞాపికలు, విలువైన బహుమతులను అందించారు. తనకు లభించిన బహుమతులు, కళాఖండాలు జనం చూడటం కోసం ప్రదర్శించాలని నిజాం అనుకున్నారు. ఆయన ఇష్టానికి అనుగుణంగా ప్రజలకు నిజాం పాలన, సంస్కతి, సంప్రదాయాలు తెలిసేలా మ్యూజియం ఆవిర్భవించింది.’’

ఫొటో సోర్స్, NAZAF ALI KHAN
నిజాం మునిమనుమడు నవాబ్ నజఫ్ అలీ ఖాన్
కోట్ల రూపాయల విలువైన కళా సంపద
నిజాం మ్యూజియం చార్మినార్ సమీపంలోని పురానీహవేలిలో ఉంది. గతంలో ఇది నిజాంల ప్యాలెస్‌గా ఉండేది. అనంతరం నిజాం ట్రస్టు ఆధ్వర్యంలో 2000 ఫిబ్రవరి 18న మ్యూజియంగా మార్చారు. అక్కడ ప్రదర్శనకు పెట్టిన నిజాంకు చెందిన వస్తువుల విలువ సుమారు రూ. 400 కోట్లు. పురావస్తు శాఖ నిపుణులతో అంచనా వేయిస్తే కచ్చితమైన సమాచారం తెలుస్తుంది.

నిజాంకు ఇష్టమైనవి...
మ్యూజియంలో ఉన్న ప్రతీ వస్తువుతో నిజాంకు అనుబంధం ఉంది. ఫలానా వస్తువే ఇష్టమైనది అని చెప్పడానికి లేదు. నిజాం వినియోగించిన దుస్తులతో పాటు పలురకాల సెంట్లు, పాదరక్షలు, టోపీలు, బ్యాగులు ఉన్నాయి. సిక్కులు, రోమన్ కాథలిక్కులు, ఇతర మతస్తులు నిజాంకు బహుకరించిన బంగారు, వెండి కళాఖండాలు ఉన్నాయి. నిజాంకు వివిధ అభివద్ధి పనులు ప్రారంభించినప్పుడు బంగారు తాపీలు, డబ్బాలు బహుకరించారు. ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల భవనం, మొజంజాహీ మార్కెట్, నాంపల్లి రైల్వేస్టేషన్, హైకోర్టు భవనం, ఉస్మానియా ఆస్పత్రి, నిలోఫర్ ఆస్పత్రి తదితర కట్టడాల నమూనాలను వెండితో తయారు చేయించి, ఆయనకు బహుమతులుగా వాటిని అందజేశారు. ఇవి సుమారు 500 వరకు ఉంటాయి.

దొంగలు ఎత్తుకుపోయిన బంగారు టిఫిన్ డబ్బా
నిజాం వాడినవి...
నిత్యం నిజాం వాడిన వాటిల్లో ముఖ్యమైనది మేడమీదకు వెళ్లే లిఫ్ట్ ఒకటి. గిలకబావిపై చెక్కతో చేసిన చక్రంలా ఉండే.. పైకి, కిందకు వచ్చేలా తాళ్లతో లాగే మ్యానువల్ లిప్టును తయారు చేశారు. నిజాం ఆ లిఫ్టులో మస్రత్‌మహల్ పైఅంతస్తుకు వెళ్లి వచ్చేవారు. 150 ఏళ్లనాటి ఈ లిఫ్ట్ కూడా మ్యూజియంలో ఉంది.
నిజాం వ్యక్తిగతంగా వాడే, వస్తువుల్లో ప్రధానమైనది. టిఫిన్ బాక్స్. దీనిని పూర్తిగా బంగారంతో తయారు చేసి, వజ్ర వైడూర్యాలు పొందుపరిచారు. ఇది రెండు కిలోల బరువు ఉంటుంది. అలాగే కప్పు, సాసర్, బంగారు స్పూన్. ఇవి నిజాం నిత్యం వాడేవి. ఈ నెల 2వ తేదీ వరకు ఇవి మ్యూజియంలో ఎందరినో ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ వస్తువులు చోరీకి గురికావడం సెంటిమెంటల్‌గా మా కుటుంబానికి తీవ్ర వేదన కలిగించింది.
నిజాం దుస్తులు భద్రపరుచుకోవడానికి టేకుతో రూపొందించిన అతిపెద్ద అల్మారా కూడా విశిష్టమనదే, ఇది విశాలంగా ఉండి, సుమారు 140 అరలు ఉన్నాయి. నిజాం ఎక్కువగా వాడిన రోల్స్ రాయ్స్, జాగ్వార్ మార్క్ కార్లు ఇప్పటికీ ఫలక్‌నుమా ప్యాలెస్ వెనుక భాగంలో ఉన్నాయి.

శిధిలావస్థలో చెక్కమెట్లు
వందల ఏళ్ల క్రితం నాటి విలువైన వస్తువులు నిజాం మ్యూజియంలో ఉన్నాయనే విషయం అందరికీ తెలుసు. ట్రస్ట్ నిర్వాహకులు సరైన భద్రత కల్పించలేదు. అంతులేని నిర్లక్ష్యం వల్లే ఈ చోరీ జరిగింది. పోలీసు కమిషనర్‌కి ఫిర్యాదు చేశాం. మ్యూజియంలో అడుగు పెడితే శిథిలావస్థలో ఉన్న చెక్కమెట్లు దర్శనమిస్తాయి. దీని బట్టే ఇది ఎంతగా నిర్లక్ష్యానికి గురవుతుందో అర్థమవుతుంది'' అని ముగించారు నజఫ్ అలీఖాన్.

హైదరాబాద్ ఘన చరిత్రకు ఆనవాళ్లు
''తన ఆశయాలకు తగినట్లు మ్యూజియం ఏర్పాటు చేయాలని ఏడో నిజాం కన్న కలను ఆయన కోడలు ప్రిన్స్ దుర్రెషహవ్వార్, తనయుడు-మ్యూజియం ట్రస్టు ఛైర్మన్ ముకఫంజా నెరవేర్చారు'' అంటారు నిజాం చరిత్ర పరిశోధకులు మహ్మద్ సఫీవుల్లా.
''ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాతికేళ్ల వయస్సులో 1911 ఆగస్టు 29న దక్కన్ సింహాసనాన్ని అధిష్టించారు. 1911 నుంచి 1948 సెప్టెంబరు 17 వరకు దక్కన్ సంస్థానాన్ని ఆయన పాలించారు. 1937 నాటికి తన పాలన 25 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవాలు నిర్వహించినపుడు దేశ, విదేశీ రాజకీయ ప్రముఖులు, దక్కన సంస్థానంలోని జాగీర్‌దారులు, సామంతులు, అతిథులతో పాటు సాధారణ జనం హాజరై ఆయనకు విలువైన, అరుదైన కళాఖండాలను బహుమతులుగా ఇచ్చారు. వాటినే మ్యూజియంలో ఉంచారు. హైదరాబాద్ నగర చారిత్రక ఆనవాళ్ళు ఇక్కడున్నాయి. బంగారపు పూతతో చేసిన సింహాసనం, అత్తరు కోసం అత్యద్భుతంగా చెక్కిన వెండి సీసాలు, నిజాంకు భద్రాచలం పాల్వంచ రాజులు బహుకరించిన వెండి సీసాలు, మైసూర్ రాజులు ఇచ్చిన ఏనుగు దంతాలతో చేసిన చార్మినార్, ఫ్రాన్సులో తయారైన టీకప్పులు, లండన్‌లో చేసిన కాఫీసెట్, బస్రా పట్టణంలో అతిపెద్ద సైజులోని ముత్యంతో చేసిన వాకింగ్ స్టిక్.. ఇలా ఇక్కడ ఉన్న ప్రతీ వస్తువుకు ఏదో ఒక ప్రత్యేకత ఉంది. దక్కన్ చరిత్రను కళ్లకు కట్టినట్లు విశదీకరిస్తుంటాయి. ఈ మ్యూజియం 1750లో రెండో నిజాం.. అలీఖాన్ నిర్మించిన మస్రత్ మహల్ భవన సముదాయంలో ఉంది'' అని చెప్పారు మహ్మద్ సఫీవుల్లా.
ఈయన నిజాంల చరిత్ర పై అనేక పుస్తకాలు రాయడంతో పాటు ఆనాటి నాణేలను, నిజాంలు రాసిన లేఖలను సేకరించారు. ది దక్కన్ హెరిటేజ్ సంస్ధకు మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నారు.
(ఫొటోలు.. నిజాం మునిమనుమడు నవాబ్ నజఫ్ అలీ ఖాన్)
ఇవి కూడా చదవండి:
- చరిత్రలో అత్యంత ధనికుడు ఇతనేనా!!
- హైదరాబాద్‌కు 500 ఏళ్లు: ఎక్కడ మొదలైంది? ఎలా ఎదిగింది?
- 'మా చాయ్ ఇరానీ.. మేం మాత్రం పక్కా హైదరాబాదీ!'
- హ్యారీపోటర్ ఎక్స్‌ప్రెస్: పాత ఇనుము కింద అమ్మేసినా మళ్లీ ప్రాణం పోసుకుంది
- మేధావుల్లేని భారతదేశమే మోదీ లక్ష్యం: ఆనంద్ తెల్దుంబ్డే
- మళ్లీ ఫైవ్ స్టార్ హోటల్‌గా మారనున్న జైలు
- హైదరాబాద్ పేరెత్తకుంటే.. కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు వదిలేస్తామని పటేల్ చెప్పింది నిజమేనా?
- వెనెజ్వేలా: శృంగార జీవితంపై సంక్షోభం ప్రభావం
- లక్షలాది మంది ముస్లింలను చైనా ఎందుకు నిర్బంధిస్తోంది?
- చరిత్ర: భారత్ నుంచి బ్రిటన్ ఎంత సంపద దోచుకెళ్లింది?
- ‘జీవితాన్ని ధారపోయడమే నక్సలిజం అయితే, నక్సలైట్లు చాలా మంచి వాళ్లు’
- తెలంగాణ ముందస్తు ఎన్నికలు: విలీన మండలాల ఓటర్లు ఎటు?
- జెఫ్ బెజోస్: సెకండ్ హ్యాండ్ పుస్తకాలు అమ్ముకునే స్థాయి నుంచి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడయ్యారిలా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)