ప్రెస్‌రివ్యూ: తెలంగాణ ముందస్తు ‘ఎన్నికల తేదీలు నిర్ణయించాల్సింది కేసీఆర్‌ కాదు.. ఆయన తప్పు చేశారు’ - సీఈసీ ఓపీ రావత్

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఓమ్ ప్రకాశ్ రావత్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ఎన్నికల నిర్వహణపై కేసీఆర్‌ వ్యాఖ్యలు అర్ధరహితం, అనుచితమని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఓమ్ ప్రకాశ్ రావత్‌ అన్నారు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలో నిర్ణయించే రాజ్యాంగపరమైన అధికారం కేంద్ర ఎన్నికల కమిషన్‌కే ఉందని, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేదని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఓమ్ ప్రకాశ్ రావత్‌ వ్యాఖ్యానించారని 'ఆంధ్రజ్యోతి' ఒక కథనంలో పేర్కొంది.

ఎన్నికలు ఫలానా తేదీల్లో జరుగుతాయని చెప్పడం ద్వారా కేసీఆర్‌ తప్పు చేశారని శుక్రవారం ఓపీ రావత్‌ చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్న విషయం తేల్చేందుకు మరో ఐదారు రోజుల సమయం పడుతుందన్నారు. ఎన్నికల నిర్వహణపై కేసీఆర్‌ వ్యాఖ్యలు అర్ధరహితం, అనుచితమని వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకులు ఎన్నికల షెడ్యూలును ప్రకటించరాదన్నారు. అక్టోబరులో నోటిఫికేషన్‌ వస్తుందని, నవంబరులో ఎన్నికలు జరుగుతాయని, డిసెంబరులో ఫలితాలు వెలువడతాయని కేసీఆర్‌ చెప్పినట్లు మీడియాలో వచ్చిందని, ఆయన వ్యాఖ్యలు ఈసీకి ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. అలా చెప్పడం ద్వారా కేసీఆర్‌ తప్పు చేశారని అన్నారు.

''ప్రతి ఒక్కరు చెప్పిందీ వినడం, ప్రతి భాగస్వామితో మాట్లాడడం మా విధి. అందువల్ల, ప్రతి ఒక్కరినీ మేం కలుస్తాం. సీఎస్‌ వచ్చారు. కమిషన్‌ ఆయనతో మాట్లాడింది. అయితే, మీరు అలా చేస్తే మేం ఇలా చేస్తాం..! అంటూ ఊహాజనిత పరిస్థితులకు కమిషన్‌ ఎప్పుడూ జవాబు చెప్పదు. ఇప్పుడు అసెంబ్లీని రద్దు చేశారు కాబట్టి, ప్రక్రియ ప్రారంభించాం. సన్నద్ధతను మేం అంచనా వేస్తున్నాం. ఆ తర్వాత ఎన్నికల నిర్వహణపై ఆలోచిస్తాం'' అని వివరించారు. తేదీలు నిర్ణయించిన తర్వాత తామే మీడియాకు వెల్లడిస్తామని చెప్పారు. హడావిడిగా పైపైన సమీక్షించి నిర్ణయం తీసుకుంటే అంతా కమిషన్‌ను తప్పుపడతారని, అందుకే, ప్రతి అంశంపై కమిషన్‌ స్వయంగా నిర్ధరణకు రావాల్సి ఉంటుందని చెప్పారు.

మిగతా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కమిషన్‌ ఇప్పటికే పరిస్థితులను బేరీజు వేసిందని, తెలంగాణకు సంబంధించి బహుశా వచ్చే శుక్రవారం జరిగే పూర్తి స్థాయి సమావేశంలోనే ఒక నిర్ణయానికి వస్తామని వివరించారు. కాగా, 2013లో మాదిరే వచ్చే అక్టోబరు 3న మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటిస్తారా అన్న ప్రశ్నకు.. పది రోజులు అటు ఇటుగా షెడ్యూలు ఉంటుందని సూచనప్రాయంగా వెల్లడించారు.

ఫొటో సోర్స్, Getty Images

కర్నూలు మార్కెట్‌కు భారీగా ఉల్లి.. కొనుగోళ్లలో జాప్యంతో పాడవుతున్న సరకు

‘ఉల్లి రైతుకు కన్నీరే మిగులుతోంది. పంట బాగా పండినా మార్కెట్‌లో కొనుగోలు జాప్యం వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొనుగోలు సకాలంలో జరగక ఉల్లి కుళ్లిపోతోంది. ఈ పరిస్థితిలో సరకును తక్కువ ధరకే అమ్ముకోవడమో, వృథాగా పారబోయడమో చేస్తున్నారు. సరకును వెంటనే కొనుగోలు చేయాలని వేడుకుంటున్నారు’ అని ఈనాడు ఒక కథనంలో పేర్కొంది.

హైదరాబాద్‌, తాడేపల్లి గూడెంలో ధరల కంటే కర్నూలు మార్కెట్‌లో ధర రూ.200 ఎక్కువగా ఉండటంతో పదిరోజుల క్రితం దిగుబడులు అధికంగా తరలివచ్చాయి. గతేడాది ఆగస్టులో 1,09,569 క్వింటాళ్లు రాగా, ఈ ఏడాది ఆగస్టులో ఏకంగా 1,78,344 క్వింటాళ్లు అంటే 70 వేల క్వింటాళ్లు అదనంగా సరకు మార్కెట్‌కు వచ్చింది. కర్నూలు మార్కెట్‌ సామర్థ్యం ప్రకారం ప్రతి రోజూ 700 టన్నులు మాత్రమే వేలంలో కొనుగోలు చేస్తారు. కానీ మార్కెట్‌కు ప్రతి రోజూ 1000 టన్నుల వరకు వస్తుండటంతో కొనుగోలులో జాప్యం ఏర్పడింది. మరోవైపు వేలం వేసిన సరకు వెంటనే తరలించకపోవడం వల్ల ఉల్లి బస్తాలతో మార్కెట్‌ అంతా నిండిపోతోంది. దీంతో తమ సరకు అమ్మకానికి రైతులు రోజుల తరబడి మార్కెట్‌లో ఎదురుచూడాల్సిన పరిస్థితి.

జిల్లాలో ఉల్లి సాధారణ సాగు 24 వేల హెక్టార్లు కాగా...ఈ ఏడాది ఖరీఫ్‌లో అత్యధికంగా 26,700 హెక్టార్లలో ఉల్లి సాగు చేశారు. నారుపోయడం నుంచి పంట తీసేవరకు ఎకరాకు దాదాపు రూ.54,500 వరకు ఖర్చు అవుతోంది. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో ఉల్లి ఎకరాకు 35 నుంచి 50 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోంది. తొలి దశలో అత్యధికంగా క్వింటా రూ.1230 వరకు పలుకుతుండటంతో కనీసం పెట్టుబడి ఖర్చులతోనైనా బయటపడొచ్చు అనుకున్నారు అన్నదాతలు. తీరా మార్కెట్‌లో చూస్తే వ్యాపారులు ఎక్కువగా మధ్యస్తంగా రూ.800-900 చొప్పున తీసుకుంటున్నారు. దీంతో క్వింటాకు ఉల్లి క్వింటా రూ.400 వరకు నష్టపోతున్నారు. 2016లో క్వింటా రూ.600 కంటే తక్కువ పలికింది. అప్పట్లో ప్రభుత్వం మిగిలిన నగదు వేసి సాయం చేసినట్లుగా ప్రస్తుతం ఇవ్వాలనే ఆలోచనలో ఉంది అని ఈనాడు పేర్కొంది.

దీనిపై మార్కెటింగ్ శాఖ ఏడీ సత్యనారాయణ చౌదరి స్పందిస్తూ.. ‘ప్రస్తుతం హైదరాబాద్‌, తాడేపల్లిగూడెం అన్ని మార్కెట్లలో ఒకే ధర నడుస్తోంది. దీంతో కర్నూలు మార్కెట్‌లో ప్రతి రోజూ వెయ్యి టన్నుల వరకు సరకు వస్తోంది. ప్రతిరోజూ 700 టన్నులు వరకు కొనుగోలు చేస్తున్నాం. ఉల్లి గోదాములపై అవగాహన కల్గించినా రైతులు ఉపయోగించుకోవడం లేదు’ అని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images

పెట్రో మంటలకు నిరసనగా 10వ తేదీన వామపక్షాల హర్తాళ్, కాంగ్రెస్ ‘భారత్ బంద్’

‘అనూహ్యంగా పెరుగుతున్న పెట్రో ధరలతో పాటు, నరేంద్రమోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వామపక్షాలు ఈ నెల 10 వతేది (సోమవారం) దేశ వ్యాప్త హర్తాళ్‌కు పిలుపునిచ్చాయి. అదే రోజు భారత్‌ బంద్‌ నిర్వహించనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా వివిధ పార్టీలు ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కానున్నట్లు తెలిపాయి’ అని ప్రజాశక్తి ఒక కథనంలో పేర్కొంది.

దేశ రాజధాని ఢిల్లీలో సిపిఎం, సిపిఐ, సిపిఐ(ఎంఎల్‌) లిబరేషన్‌, ఎస్‌యుసిఐ (సి), రివల్యూషనరీ సోషలిస్టు పార్టీలు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో కోట్లాదిమంది భారతీయుల జీవితాలను పెట్రో ధరలు అతలాకుతలం చేస్తున్నాయని, వారి కష్టార్జితం దోపిడికి గురవుతోందని పేర్కొన్నాయి. ప్రజల కష్టాలను ఏమాత్రం పట్టించుకోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకు నేందుకు, ప్రజల దృష్టిని మళ్లించడానికి మతతత్వ, విద్వేష పూరిత హింసను రెచ్చగొడు తోందని, విచక్షణా రహితంగా అరెస్ట్‌లకు దిగుతూ భయోత్పాతాన్ని సృష్టిస్తోందని విమర్శించాయి. 10 వ తేది జరగనున్న హర్తాళ్‌కు, బంద్‌కు వివిధ పార్టీలు మద్దతు ప్రకటించాయి. సమాజ్‌వాది , డిఎంకె, బిఎస్‌పి, ఎన్‌సిపి. ఆర్‌జెడి, జెడి(ఎస్‌), జెవిఎం, జెఎంఎం, ఆప్‌ పార్టీలు సంపూర్ణ మద్దతు తెలియచేశాయి. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన, లోక్‌సత్తా పార్టీలు హర్తాళ్‌లో పాల్గొననున్నాయి. కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి కార్యదర్శి అశోక్‌ గెహ్లాట్‌ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ 'అనేక పార్టీలు ఇప్పటికే మద్దతు తెలిపాయి. మరికొన్ని పార్టీలతో చర్చలు జరుపుతున్నాం. అని అన్నారు. జెడి(యు) నేత శరద్‌యాదవ్‌ మాట్లాడుతూ 'దాదాపుగా అన్ని ప్రతిపక్ష పార్టీలు నిరసన కార్యమ్రాల్లో పాల్గొంటాయి'అని చెప్పారు. దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంపునకు నిరసనగా ఈనెల 10న 'భారత్‌ బంద్‌'ను విజయవంతం చేయాలని ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు . దీనికి మద్దతు కోరుతూ అన్ని రాజకీయ పార్టీలకు రఘువీరారెడ్డి లేఖలు రాశారు.

గరిష్టానికి పెట్రోలు ధరలు

తీవ్ర స్ధాయిలో ఆందోళన వ్యక్తమవుతున్నప్పటికీ పెట్రో మంటలు మాత్రం ఆగడం లేదని, దేశ వ్యాప్తంగా శుక్రవారం గరిష్ట స్థాయికి చేరుకున్నాయని ప్రజాశక్తి వెల్లడించింది. ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ 87.39 రూపాయలకు డీజిల్‌ 76.51కి చేరింది. ఢిల్లీలో లీటరు పెట్రోలు 79.99కి, డీజిల్‌ 72.07కు విక్రయించారు. కోల్‌కతాలో పెట్రోల్‌ 82.88కి, డీజిల్‌ 74.92కు, చెన్నైలో పెట్రోల్‌ 83.14, డీజిల్‌.76.18 రూపాయలకు విక్రయించారు. విజయవాడలో లీటరు పెట్రోలు 85.96, డీజిల్‌ లీటర్‌ 79.22 రూపాయలకు చేరింది.

ఫొటో సోర్స్, Getty Images

ప్రయాణికుల ముఖమే బోర్డింగ్‌ పాస్‌.. బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఫేస్‌రికగ్నిషన్‌

దేశ చరిత్రలో తొలిసారిగా 2019 ప్రథమార్ధంలో బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో ఈ ' ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ'ని ప్రారంభించనున్నారని, ప్రయాణికుల ముఖమే బోర్డింగ్‌ పాస్‌గా మారనుందని సాక్షి ఒక కథనంలో పేర్కొంది.

ముందుగా జెట్‌ ఎయిర్‌వేస్, ఎయిర్‌ ఆసియా, స్పైస్‌జెట్‌ ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వాడుకోనున్నారు. కాగితరహిత విమానప్రయాణ విధానాన్ని (ఎండ్‌ టు ఎండ్‌ సొల్యూషన్‌ ఫర్‌ పేపర్‌లెస్‌ ఎయిర్‌ ట్రావెల్‌లో భాగంగా) అమలుచేస్తున్న మొదటి ఎయిర్‌పోర్ట్‌గా బెంగళూరు నిలవనుంది.

ఈ సాంకేతికత అమలు ఒప్పందంపై పోర్చుగల్‌లోని లిస్బన్‌లో బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (బీఐఏఎల్‌)-విజన్‌బాక్స్‌ సంస్థలు సంతకాలు చేశాయి. 'ఎయిర్‌పోర్ట్‌లో క్యూలైన్‌లో వేచి ఉండే అవసరం లేకుండా, బోర్డింగ్‌ కోసం రిజర్వేషన్, ఇతర ఇబ్బందులు లేకుండా ఇది సాయపడుతుంది' అని బీఐఏఎల్‌ ఎండీ, సీఈఓ హరి మరార్‌ వ్యాఖ్యానించారు. ఎయిర్‌పోర్టుల్లో రిజిస్ట్రేషన్‌ మొదలుకుని బోర్డింగ్‌ వరకు పేపర్‌రహిత విధానం అమలే లక్ష్యంగా ఈ పద్ధతిని అమలుచేస్తున్నట్టు విజన్‌బాక్స్‌ సంస్థ వెల్లడించింది. ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ముఖాలను బయోమెట్రిక్‌ టెక్నాలజీ ద్వారా గుర్తించి వారు విమానం ఎక్కేందుకు అనుమతించనున్నట్టు తెలియజేసింది. ఈ టెక్నాలజీ అమల్లోకి వస్తే ఇకపై ఎయిర్‌పోర్ట్‌లో బోర్డింగ్‌పాస్, పాస్‌పోర్టు, వ్యక్తిగత గుర్తింపు కార్డులను పదేపదే చూపాల్సిన అవసరం ఉండదని సాక్షి వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)