రాహుల్ గాంధీ కైలాశ్ మానస సరోవర్ యాత్రకు నిజంగానే వెళ్లారా? - కేంద్ర మంత్రి ప్రశ్న, ఫొటోషాప్ చేశారని ఆరోపణ.. కాంగ్రెస్ సమాధానం

రాహుల్ కైలాశ్ మానస సరోవర్ యాత్ర

ఫొటో సోర్స్, TWITTER/@INCINDIA

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కైలాశ్ మానస సరోవర్ యాత్రపై వెల్లువెత్తుతున్న ప్రశ్నల మధ్య కాంగ్రెస్ శుక్రవారం తన ట్విటర్ హాండిల్ ద్వారా రాహుల్ గాంధీ ఫిట్‌బిట్ డేటా విడుదల చేసింది.

రాహుల్ ఎంత దూరం కాలినడకన ప్రయాణించారో, ఆ గణాంకాలతోపాటు కైలాశ్ పర్వతం ముందు ఆయన తీసుకున్న ఫొటోలను కూడా పోస్ట్ చేసింది.

ఫిట్‌బిట్ యాప్ గణాంకాల ప్రకారం రాహుల్ గాంధీ 463 నిమిషాల్లో 34.31 కిలోమీటర్లు కాలినడకన వెళ్లారు. అంటే ఆయన మొత్తం 46,433 అడుగులు వేసినట్టు అది చూపిస్తోంది.

దీనిపై కాంగ్రెస్ వ్యంగ్యంగా ఒక ట్వీట్ చేసింది. "అసూయ పడేవారి గురించి పట్టించుకోకుండా.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కైలాశ్ యాత్ర సమయంలో తన వేగాన్ని సెట్ చేసుకున్నారు. మీరూ అందుకోగలరా?" అని సవాల్ విసిరింది.

దీనితోపాటు వార్తా సంస్థ ఎఎన్ఐ కూడా రాహుల్ గాంధీ వేరే యాత్రికులతో కలిసి తీసుకున్న ఫొటోలను షేర్ చేసింది.

ఈ ట్వీట్ తర్వాత కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, రాహుల్ గాంధీ వేరే యాత్రికుడితో తీసుకున్న ఫొటోను షేర్ చేస్తూ "ఇది ఫొటోషాప్, చేతికర్ర నీడ మాయమైంది" అని ట్వీట్ చేశారు.

దీనికి బదులుగా ఉమాశంకర్ సింగ్ అనే ట్విటర్ హాండిల్ "మోదీ మంత్రులు రాహుల్ గాంధీ చేతికర్ర నీడను వెతికేంత ఖాళీగా ఉన్నారు" అని ట్వీట్ చేశారు.

అయితే, రాహుల్ గాంధీ కాలినడక గణాంకాలను షేర్ చేయడంపై ట్విటర్‌లో రకరకాల స్పందనలు వస్తున్నాయి.

గీతికా పేరుతో ఉన్న ఒక ట్విటర్ హాండిల్ "అడుగులు వేయడమే ప్రధాని అయ్యేందుకు అర్హత అయితే, రాహుల్ గాంధీ ఎక్కి ప్రయాణించిన ఆ గుర్రం పిల్లనే ప్రధాని చేయండి" అని పోస్ట్ చేశారు.

అనంత్ కృష్ణన్ అనే మరొకరు "రాహుల్ గాంధీ షేర్ చేసిన ఫిట్‌బిట్ స్క్రీన్ షాట్, ఆయన చైనా యూనికామ్ సెల్ నెట్‌వర్క్‌లో ఉన్నట్టు చూపిస్తోంది. అది ఆయన ఎప్పుడూ ఉపయోగించే ఫోన్ కాకూడదనే అనుకుంటున్నా. లేదంటే ఆయన మొత్తం సమాచారం చైనా రక్షణ మంత్రిత్వ శాఖకు చేరిపోయుంటుంది" అని పోస్ట్ చేశారు.

ఇటు, రాహుల్ గాంధీ కైలాశ్ మానస సరోవర్ యాత్రతో కాంగ్రెస్ నేతలు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రతినిధి ప్రియాంక చతుర్వేది బీజేపీ లక్ష్యంగా ఒక ట్వీట్ చేశారు. అందులో "పరమ శివభక్తులారా, హిందువుల్లా నటించే బీజేపీ వారిని బయటపెట్టడానికి రాహుల్ గాంధీకి సాక్షాత్తూ శివుడే మార్గం చూపిస్తున్నాడు" అన్నారు.

ఈ ట్వీట్స్ కాకుండా రాహుల్ గాంధీ స్వయంగా కైలాశ్ మానస సరోవర్ యాత్రకు సంబంధించిన ఒక వీడియోతో పాటు చాలా ఫొటోలను తన ట్విటర్‌లో షేర్ చేశారు.

ఒక ట్వీట్‌లో.. ‘ఇక్కడ విద్వేషం లేదు’ అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)