లబ్బు..డబ్బు: ఒంటరి మహిళలు ఎంత ఆదా చేయాలి?
ఆర్థికంగా ఎవ్వరి మీదా ఆధారపడకుండా సొంత కాళ్ళ మీదే నిలబడాలనుకుంటారు చాలా మంది మహిళలు.
అయితే మహిళలు ఆర్థికంగా తమ ప్రణాళికలను ఎలా రూపొందించుకోవాలి?
రిటైర్మెంట్ ఫండ్స్ సమకూర్చుకోవడానికి పురుషులతో పోలిస్తే మహిళలు రెండింతలు ఎక్కువ డబ్బు ఆదా చేయాలని అంటున్నారు ఆర్థిక నిపుణులు.
దానికి కారణాలు ఏంటి?
మాన్‌స్టర్ సాలరీ ఇండెక్స్ నివేదిక ప్రకారం భారత్‌లో మహిళల ఆదాయం పురుషులతో పోల్చి చూస్తే దాదాపు 20% తక్కువ.
ఒంటరి మహిళలకు సేవింగ్స్ మరింత ముఖ్యం. 2011 జనాభా లెక్కల ప్రకారం భారత్‌లో ఏడున్నర కోట్ల మంది ఒంటరి మహిళలు ఉన్నారు. వారిలో పెళ్లికాని మహిళలు, విడాకులు తీసుకున్న మహిళలు, వితంతువులు లేదా ఇతర కారణాల వల్ల తమ జీవిత భాగస్వాములకు దూరంగా ఉంటున్న వారున్నారు.
ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో పురుషుల సగటు ఆయుస్సు 66.9 ఏళ్ళయితే మహిళల సగటు ఆయుస్సు 69.9 ఏళ్ళు.
అనేక కారణాల వల్ల మహిళలు తమ వృత్తి నుంచి, చేసే ఉద్యోగాల నుంచి విరామం తీసుకోవాల్సి వస్తుంది. అది వారి సేవింగ్స్‌ను ప్రభావితం చేస్తుంది.
అలాగే చాలా మంది మహిళలు తమ జీవిత భాగస్వాముల మీదే ఆర్థికంగా ఆధారపడతారు. వీరంతా తమ ఆర్థిక ప్రణాళికలను ఎలా రూపొందించుకోవాలో చూద్దాం..
ఆర్థిక నిపుణులు చెబుతున్నదాని ప్రకారం మహిళలు ఎక్కువ డబ్బు పొదుపు చేయడం, ఆరోగ్య బీమా తీసుకోవడం, ఉద్యోగాలలో చేరే ముందే జీతాలకు సంబంధించి స్పష్టంగా చర్చించడం, ఎంత వీలైతే అంత కాలం వృత్తిలో కొనసాగడం, సరైన విధంగా పెట్టుబడులు పెట్టడం వంటివి చేయాలి .
ఉదాహరణకు ఇళ్లలోనే ఉండే మహిళలు తాము దాచుకున్న డబ్బును సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ వంటి మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టొచ్చు.
మహిళలు అధిక లాభాలు పొందేందుకు, ఎక్కువ డబ్బును పొదుపు చేసుకునేందుకు ఎన్నో బ్యాంకులు కస్టమైజ్డ్ అకౌంట్లు ఓపెన్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. అలాగే కాష్ బ్యాక్ ఆఫర్లు , రివార్డ్ పాయింట్స్‌లాంటి అవకాశాలూ ఉన్నాయి.
ఫొటో సోర్స్, Getty Images
ఇక మరొక ప్రత్యామ్నాయం - టర్మ్ ఇన్సూరెన్స్. ఎన్నో బీమా కంపెనీలు పురుషులతో పోల్చి చూస్తే మహిళలకు బీమా పాలసీ ప్రీమియంలో ఎక్కువ డిస్కౌంట్లు అందిస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం మహిళల సగటు ఆయుషు పురుషులకంటే ఎక్కువ ఉండడం.
అంతే కాదు ఇంకా ఎన్నో ఆకర్షణీయ ఆఫర్లు కూడా మహిళల కోసం అందుబాటులో ఉన్నాయి.
ఇక 2018 బడ్జెట్‌లో మహిళల ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్‌ను 8% చేసింది ప్రభుత్వం . ఆ మహిళలు ఉద్యోగం చేస్తున్న కంపెనీలు 12% ఈపీఎఫ్ జమ చేయాలని ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగంలో చేరిన మొదటి మూడేళ్లు మాత్రమే ఇది అమలులో ఉంటుంది.
ఇలాంటివన్నీ ఉపయోగించుకుంటే మహిళలు అవసరమైతే వృద్ధాప్యంలో కూడా ఎవరి మీదా ఆధారపడకుండా జీవించవచ్చు.
(గమనిక: ఇందులో పేర్కొన్న అభిప్రాయాలు.. సలహాలు.. సూచనలు ఆయా రంగాల నిపుణులవి. కేవలం వీటి ఆధారంగా పెట్టబుడులు చేయకుండా సొంత కసరత్తు కూడా చేయడం ఉత్తమం)
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)