బిగ్ బాస్ 2: ‘‘ఏంటీ అసభ్యత? అమ్మ అని పిలిచే అమ్మాయిని ఇలా ఎవరైనా చేస్తారా?''
బిగ్ బాస్ 2లో శుక్రవారం రాత్రి ప్రసారమైన కార్ టాస్క్ వివాదాస్పదమైంది.
ఈ టాస్క్‌లో భాగంగా ''తనీశ్, సామ్రాట్లు దీప్తి, శ్యామలపై బలప్రయోగం'' చేశారని.. మహిళలపై ఇలా చేయడం దారుణమని పలువురు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
జెండర్ ఇష్యూస్‌పై పోరాడేవారు కూడా ఈ టాస్క్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ అంశంపై గ్లోబల్ ఎయిడ్ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎడ్వొకేట్ ఆన్ జండర్ ఇష్యూస్ సాయి పద్మ బీబీసీ తెలుగుతో మాట్లాడుతూ..
ఫొటో సోర్స్, facebook
దీప్తి
''కారులోనో బస్సులోనో.. మహిళలపై భౌతిక దాడులు జరుగుతున్న కేసుల నేపథ్యంలో నిర్భయ చట్టం వచ్చింది. దీని ఉద్దేశం మహిళలపై భౌతిక, మానసిక, లైంగిక దాడులను ఆపడం.
తాజాగా బిగ్ బాస్‌లో కారు టాస్క్‌లో దీప్తి, శ్యామలపై భౌతిక దాడి జరిగింది. ఇది దారుణం. ఇలాంటి టాస్క్‌లలో ఉద్దేశం మహిళలపై పురుషులను భౌతిక దాడికి పురికొల్పడమే అవుతుంది.
అలా లేదనుకుంటే.. దీప్తి.. శ్యామలను తనీష్, సామ్రాట్లు వారిని కారు నుంచి బయటకు పంపాలని బలప్రయోగం చేస్తున్నపుడు బిగ్ బాస్ ఎందుకు ఆపలేదు?'' అని ప్రశ్నించారు.
వాస్తవానికి ఇదో పైశాచిక చర్యని వ్యాఖ్యానించారు.
మాటలు, చేతలు, అధికారం, బలం చూపిస్తూ.. మహిళలను బాధపెట్టడం.. హింసించి వాళ్లంతట వాళ్లు వెళ్లిపోయేలా చేయాలనుకోవడం.. దాన్ని ఇలా చూపడం హేయమని పేర్కొన్నారు. ఇది పైశాచికత్వానికి పరాకాష్ఠ.'' అని పద్మ అన్నారు.
ఫొటో సోర్స్, facebook/anchorshyamala
అసలేం జరిగింది?
శుక్రవారం రాత్రి ప్రసారమైన షో ప్రకారం.. బిగ్ బాస్ హౌజ్‌లో కంటెస్టెంట్స్‌కి కార్ టాస్క్ ఇచ్చారు.
మొత్తం కౌశల్ మినహా మొత్తం ఏడుగురు పోటీదారుల్లో అయిదుగురు కారులో కూర్చోవాలి. అలా కూర్చుకున్న వారిలో చివరి వరకూ కారులో ఎవరుంటారో వారు టాస్క్ విజేత. ఈ టాస్క్‌లో గెలిస్తే నేరుగా ఫైనల్‌కు చేరే అవకాశం ఉంటుంది.
ఈ టాస్క్‌లో భాగంగా గీతామాధురి, శ్యామల, దీప్తి, తనీశ్, సామ్రాట్లు కారులో కూర్చొన్నారు. వీరిలో గీతామాధురి నిద్రపోయి టాస్క్ నుంచి వైదొలిగింది.
చివరకు కారులో తనీశ్, దీప్తి, సామ్రాట్, శ్యామల మిగిలారు.
ఒక దశలో తనీశ్ దీప్తిని, సామ్రాట్ శ్యామలను బలవంతంగా కారు నుంచి బయటకు తోసేయాలని చూడడంతో వీరి మధ్య తీవ్రమైన పెనుగులాట జరిగింది.
తనీశ్ దీప్తిపై బలప్రయోగం చేయగా ఆమె చేతిపై గాయమైంది.( ఈ విషయాన్ని దీప్తి షోలోనే గీతామాధురి వద్ద చెప్పారు.)
చివరకు నలుగురూ కారులోనే ఉండటం వల్ల ఎవరూ విజేత కాలేదు.
ఈ బలప్రయోగం .. దారుణం
అన్విత్ అనే ట్విటర్ హ్యాండిల్.. '' తనకంటా బలహీనంగా ఉన్నవారిపై బల ప్రయోగం చేయడం మానవ సభ్యత కాదు..'' అని ట్వీట్ చేశారు. ఎన్బీకే అనే ట్విటర్ హ్యాండిల్ తనీశ్, సామ్రాట్లు మహిళలపై బలప్రయోగం చేసి తమ క్యారెక్టర్ కోల్పోయారని వ్యాఖ్యానించింది.
రవి23 అనే హ్యాండిల్.. షోలో భాగంగా ఒక అమ్మాయిపై అబ్బాయి దాడి చేయడానికి బిగ్ బాస్ అనుమతించడం దారుణమని ట్వీట్ చేసింది. బిగ్ బాస్‌పై కేసు పెట్టాలని పేర్కొంది.
సురేశ్ అనే అనే ట్విటర్ హ్యాండిల్.. మీరు అమ్మ అని పిలిచే అమ్మాయిని ఇలా చేస్తారా? అని తనీశ్‌ని ప్రశ్నించారు.
కార్తిక్ అనే నెటిజన్ ట్విటర్లో.. తనీశ్, దీప్తి తల్లీ కుమారుల రిలేషన్‌షిప్‌కి చెడ్డ ఉదాహరణ అని వ్యాఖ్యనించారు.
ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్ కౌశల్‌కు మద్దతిస్తోందని చెబుతున్న కౌశల్ ఆర్మీ అనే ట్విటర్ హ్యాండిల్.. అయితే ''కేవలం ఒక టాస్క్ కోసం ఒక మహిళలపై ఇంత క్రూరంగా ఎలా ప్రవర్తిస్తారు. ఇది గేమ్ షో అయినా దానికీ ఓ హద్దు ఉండాలి.'' అని ట్వీట్ చేసింది.
ఫొటో సోర్స్, facebook
గీతా మాధురిపై ట్రోలింగ్..
ఇంతకుముందు సోషల్ మీడియాలో గీతామాధురిపై ట్రోలింగ్ జరిగింది. ఆమె భర్త నందూ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
. ''బిగ్ బాస్ అనేది కేవలం గేమ్ షో. వ్యక్తిగతమైన కామెంట్లు చేయడం సరికాదు.'' అని నందూ అన్నారు.
'' గీతా మాధురిపై ట్రోలింగ్ చాలా బాధాకరం. నా మనసును చాలా బాధపెట్టింది. ఈ ట్రోలింగ్.. గేమ్ ఇదంతా కొన్నాళ్లకు మాయమైపోతుంది.'' అని వ్యాఖ్యానించారు.
'ఈ పార్టిసిపెంట్స్ ప్రతి వారం రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. గేమ్ ఆడుతున్నారు. కానీ బయటి జనాలు మాత్రం అన్నీ ఊహాగానాలు చేస్తున్నారు.' అని నందూ పేర్కొన్నారు.
మరిన్ని కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)