ప్రెస్‌రివ్యూ: నాకు, కేసీఆర్‌కు మధ్య తగాదా పెడతారా? - చంద్రబాబు

ఫొటో సోర్స్, TDP/Facebook
దేశంలోనే అత్యధిక పన్నులు హైదరాబాద్ నుంచే వసూలవుతున్నాయని అయినా ఐదేళ్లలో తెలంగాణకు ప్రధాని మోదీ ఏం చేశారని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు నిలదీశారని ‘ఆంధ్రజ్యోతి’ ఒక కథనంలో పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. ''తెలుగు రాష్ట్రాల్లో విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలని కోరితే నాకు, కేసీఆర్‌కు మధ్య తగాదా పెడతారా? ఇది న్యాయమా? రాజకీయమా? టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా పార్లమెంటులో మోదీ మాట్లాడుతూ నాకు పరిణతి లేదని, తెలంగాణ సీఎంకు పరిణతి ఉందని అన్నారు. మా మధ్య తగాదా పెట్టే ప్రయత్నం చేశారు'' అంటూ చంద్రబాబు మండిపడ్డారు.
విజ్ఞత, వ్యక్తిత్వాన్ని దివంగత ప్రధాని వాజ్‌పేయిని చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. టీడీపీ-టీఎస్ అధ్యక్షుడు ఎల్.రమణ అధ్యక్షతన శనివారం ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.
''రాష్ట్రపతి ఎన్నికల్లో అలెగ్జాండర్ పేరును అప్పటి ప్రధాని వాజ్‌పేయి ప్రతిపాదించారు. అబ్దుల్ కలాం పేరును నేను ప్రతిపాదించా. అలెగ్జాండర్‌ను ఎంపిక చేస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని సూచించా. వాజ్‌పేయి ప్రతిపాదనను నేను విభేదిస్తే.. ఆయన సరిచేసుకున్నారు తప్ప, ద్వేషం పెంచుకోలేదు. అదీ విజ్ఞత! దేశం కోసం విభేదించాను. తన ప్రతిపాదనను సరిచేసుకున్న వాజ్‌పేయి, మరుసటి రోజు ఫోన్ చేసి, 'కలాంను ఎంపిక చేశాం. మీకు సంతోషమేనా?' అని చెప్పడంతోపాటు వ్యక్తిగతంగా ఢిల్లీకి ఆహ్వానించారు. అదీ వ్యక్తిత్వమంటే..'' అని వ్యాఖ్యానించారు.
నాలుగున్నరేళ్లలో ఎన్డీయే ప్రభుత్వం మోసం చేసిందని, కుట్రలు చేస్తోందని, అవినీతిపరులను పక్కనబెట్టుకుంటోందని మండిపడ్డారు. ఏపీతోపాటు తెలంగాణకూ న్యాయం చేయాలని కోరానని, తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరానని తెలిపారు.
''తెలుగు జాతి మధ్య విభేదాలు వద్దని చెప్పాను. ఇద్దర్నీ మెప్పించి విభజన చేయమన్నాను'' అని చంద్రబాబు అన్నారు. విభజన తర్వాత కూడా దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో తొలి రెండు స్థానాల్లో ఆంధ్రా, తెలంగాణ ఉండాలన్నదే తన ఉద్దేశమన్నారు. ''తెలంగాణ కావాలని ఇక్కడి ప్రజల మనోభావం. తమకు న్యాయం చేయాలని ఏపీ ప్రజలు కోరారు. అందుకే నేను సమ న్యాయం చేయమన్నా. ఎప్పుడు కూడా విభజన వద్దని గానీ, చెయ్యాలని గానీ చెప్పలేదు'' అని చంద్రబాబు తెలిపినట్లు ‘ఆంధ్రజ్యోతి’ కథనం పేర్కొంది.
ఫొటో సోర్స్, KTR/Facebook
అవును డిష్ వాషర్‌నే!: కేటీఆర్
అమెరికాలో ఉన్నప్పుడు ప్రతి భారతీయుడిలాగ తాను కూడా ఇంట్లో గిన్నెలు శుభ్రం చేశానని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పినట్లు ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. అమెరికాలో ఉన్న సమయంలో గిన్నెలు తోమారంటూ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో గట్టి కౌంటర్ ఇచ్చారు. అమెరికాలో ఉండే భారతీయులందరూ వారి పనులు వారే చేసుకుంటారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఇంట్లో గిన్నెలు శుభ్రంచేసేవారని పేర్కొనే కథనాన్ని పోస్ట్‌చేశారు. మీ పప్పు(రాహుల్‌గాంధీ)లా కాకుండా.. కష్టపడి సంపాదించిన డబ్బుతో గౌరవప్రదమైన జీవితం గడిపానని చెప్పుకోవటానికి గర్వపడుతున్నాను అని ట్వీట్ చేశారు.
ఫొటో సోర్స్, ktujm.ac.in
ఛత్తీస్‌గఢ్ వర్సిటీలో 'హనుమంతుడి'పై సెమినార్
బీజేపీ అధికారంలో ఉన్న చత్తీస్‌గఢ్‌లోని రారుపూర్‌లో కుషాబౌ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ యూనివర్సిటీ సిలబస్‌లో హనుమంతుడిని పాఠ్యాంశంగా చేర్చటంపై విమర్శలు వస్తున్నాయని ‘నవ తెలంగాణ’ దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. ఈ యూనివర్సిటీ హనుమంతుడి అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ సెమినార్‌ను సెప్టెంబర్ 7, 8 తేదీల్లో నిర్వహించింది. ఇందుకోసం హనుమంతుడికి సంబంధించి 19 అంశాల మీద ప్రపంచ వ్యాప్తంగా స్కాలర్స్‌ను ఆహ్వానించింది. ఈ అంశంపై దేశవ్యాప్తంగా దాదాపు 50 నుంచి 60 మధ్య పరిశోధనా పత్రాలు అందాయని సెమినార్ నిర్వాహకుడు, వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అశుతోశ్ మండవి తెలిపారు.
వర్సిటీ చర్యను పలు రాజకీయ పార్టీలు తప్పుబట్టాయి. ఇది 'విద్వేషం పతాక స్థాయి' అని మధ్యప్రదేశ్ సీపీఐ(ఎం) సెక్రెటరీ, బాదల్ సరోజ్ అన్నారు. విద్యను కాషాయీకరణ చేయడానికే బీజేపీ ఇలాంటి చర్యలకు దిగుతున్నదని కాంగ్రెస్ ప్రతినిధి కెకె మిశ్రా ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ అధికారంలో మరో రాష్ట్రం మధ్యప్రదేశ్‌లో నారదుడు 'మొదటి జర్నలిస్టు' అంటూ ఆయన పాత్రను ఇప్పటికే ఓ వర్సిటీ సిలబస్‌లో చేర్చిందని ‘నవ తెలంగాణ’ తన కథనంలో ఉటంకించింది.
ఇవి కూడా చదవండి:
- ‘జీవితాన్ని ధారపోయడమే నక్సలిజం అయితే, నక్సలైట్లు చాలా మంచి వాళ్లు’
- శారీరక వ్యాయామం చేయని ప్రతి నలుగురిలో ఒకరికి ముప్పు
- మార్కెట్లో అమ్మే పెరుగు మంచిదేనా?
- బిగ్ బాస్ 2: ‘‘ఏంటీ అసభ్యత? అమ్మ అని పిలిచే అమ్మాయిని ఇలా ఎవరైనా చేస్తారా?''
- స్వలింగ సంపర్కం - సెక్షన్ 377: పట్టణాల్లో సరే.. గ్రామాల్లో ఎల్జీబీటీల పరిస్థితి ఎలా ఉంది?
- సియెర్రా లియోన్: రూ.42 కోట్ల వజ్రం దొరికినా కనీస సౌకర్యాలకు నోచుకోని గ్రామం
- తెలంగాణ ముందస్తు ఎన్నికలు: విలీన మండలాల ఓటర్లు ఎటు?
- ‘రాహుల్ గాంధీ కైలాశ్ మానస సరోవర్ యాత్రకు నిజంగానే వెళ్లారా? ఫొటోషాప్ చేస్తున్నారా?’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)