అభిప్రాయం: మోదీ ప్రతి ప్రసంగంలోనూ 2022 ప్రస్తావన ఎందుకు తెస్తున్నారు?

  • కింగ్‌షుక్ నాగ్
  • బీబీసీ కోసం
నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

2018, 2013లా కాదు. 2019, 2014లా ఉండదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా సరిగ్గా ఇలాగే ఆలోచిస్తుంటారని ఇప్పుడు చాలా మందికి అర్థమవుతోంది.

2014లో బీజేపీకి, అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్, మిగతా విపక్షాల కంటే స్పష్టమైన ఆధిక్యం లభించింది. కానీ 2019లో చాలా మార్పులు జరిగే అవకాశం ఉంది.

ఈసారీ బీజేపీ అధికారంలో ఉంది, ఒంటరిగానే స్పష్టమైన ఆధిక్యం సంపాదించిన ప్రభుత్వం తన ఐదేళ్లు పూర్తి చేసిన తర్వాత ఎన్నికల్లోకి దిగుతోంది. అయితే ప్రజలు ఈసారీ ఆ పార్టీని 2014లో చూసినట్టు చూడడం లేదు.

ఇటు, విపక్షాలు మాత్రం పూర్తి సన్నాహాలతో అధికార పార్టీని ఓడించే ప్రయత్నాల్లో నిమగ్నమైపోయి ఉన్నాయి.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక సంపూర్ణ రాజకీయ నాయకుడు. ఆయనకు ఇదంతా చాలా బాగా తెలుసు. అందుకే ఆయన 2019 ఎన్నికల్లో తన పార్టీ విజయం కోసం వ్యూహమే మార్చేశారు.

ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికల్లో పోటీపడినా తన పనితీరు ఆధారంగానే ముందుకు వెళ్తుంది. అయితే విపక్షాలు మాత్రం ప్రభుత్వం పనితీరును విమర్శిస్తూ ఎన్నికల్లోకి దిగుతాయి.

వీటన్నిటి మధ్య అన్నిటికంటే అసాధరణమైన విషయం ఒకటుంది. ఈసారీ నరేంద్ర మోదీ స్వయంగా తన పాలనలో ప్రణాళికల గురించి చెప్పుకుంటున్నారు. 2022 వరకూ అధికారం తన దగ్గరే ఉంటుందని అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

2022లో స్వతంత్ర భారతదేశానికి 75 ఏళ్లు

స్వాతంత్య్ర దినోత్సవం రోజున తన ప్రసంగంలో మోదీ 2022లో భారతీయులను అంతరిక్షంలోకి పంపిస్తామని ప్రకటించారు. ఎర్రకోటపై నుంచి మాట్లాడుతూ "2022లో భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సవ సమయంలో దేశానికి చెందిన ఒక కొడుకో, కూతురో గగనయాన్ ద్వారా జాతీయ జెండా పట్టుకుని అంతరిక్షంలోకి వెళ్తారు" అన్నారు.

ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. అంతరిక్షంలోకి మానవుడిని పంపించాలనే గగనయాన్ ప్రాజెక్టు 2004 నుంచీ నడుస్తోంది. యూపీఏ ప్రభుత్వం దీనిని అమలు చేసే లోపే అధికారానికి దూరమైంది.

ఇప్పుడు 2022 గురించి ప్రస్తావిస్తున్న మోదీ, ఈ ప్రణాళికపై తను చాలా సీరియస్‌గా దృష్టి పెట్టానని చెబుతున్నారు.

గుజరాత్ వల్సాడ్ జిల్లాలోని ఒక బహిరంగ సభలో ప్రసంగించిన మోదీ "ఇప్పటివరకూ మనం రాజకీయ నేతలకు ఇళ్లు ఇచ్చారనే వింటూ వచ్చాం. ఇప్పుడు పేదలకు కూడా సొంత ఇళ్లు అందించారనే మాటలు వింటున్నాం" అన్నారు.

ఆయన ఈ ప్రకటన కేవలం అనుకున్న దానికంటే తక్కువ శాతం మద్దతు ఉన్న ఓటర్ల కోసమే చేశారు. అంతే కాదు, అందరికీ 24 గంటల నిరంతర విద్యుత్ అందించడానికి కూడా మోదీ 2022నే లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, ఇప్పుడు ఆయన ఆ లక్ష్యాన్ని త్వరగా అంటే, 2019లోనే పూర్తి చేసే సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఆశలు, ఆకాంక్షల సంవత్సరం

కానీ పార్టీకి ఎలాంటి నష్టం జరగకుండా ఉండడానికే ఆయన 2022ను లక్ష్యంగా ఎంచుకున్నట్టు కనిపిస్తోంది.

2017 ప్రారంభంలోనే బీజేపీ ఉత్తర్‌ ప్రదేశ్, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది. గెలిచిన కొన్ని రోజులకే దిల్లీలో ఉన్న పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ "ఎన్నికల ఫలితాలు నవ భారతదేశానికి పునాదులు వేశాయి" అన్నారు

మోదీ తన పదవీకాలం పూర్తైన మూడేళ్ల తర్వాత వచ్చే 2022 నాటికి నవ భారతాన్ని నిర్మిద్దామని కార్యకర్తలతో ప్రతిజ్ఞ కూడా చేయించారు.

"మనం నవ భారత నిర్మాణంలో విజయవంతం అయితే, భారతదేశాన్ని సూపర్ పవర్‌గా మార్చడాన్ని ఎవరూ అడ్డుకోలేరు" అని మోదీ అదే సమావేశంలో చెప్పారు.

అలాగే, 2017 జులైలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన దేశ ముఖ్యమంత్రులను ఉద్దేశించి మాట్లాడిన మోదీ "2022లో నవ భారత నిర్మాణం, ప్రజల సంకల్పం"గా వర్ణించారు.

"ఇది భారతదేశ ఆశలను, ఆకాంక్షలను ప్రతిబింబిస్తుంది. అధికారంలో ఎవరు ఉంటే, వారు ఈ బాధ్యతను పూర్తి చేయాల్సి ఉంటుంది" అని సీఎంలకు చెప్పారు.

ఒక నెల తర్వాత సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ చీఫ్‌లతో జరిగిన ఒక సమావేశంలో వారికి, 2022 నవ భారత నిర్మాణానికి రోడ్ మ్యాప్ తయారు చేయాలని ప్రధాని మోదీ ఆదేశించారు.

ఫొటో సోర్స్, Getty Images

మోదీ చాతుర్యం, మారిన లక్ష్యం

"స్వతంత్ర భారత 75వ సంవత్సరం అంటే 2022 వరకూ నేతృత్వం వహించడం గురించి మనం మోదీని ఏమాత్రం తప్పుబట్టలేం" అని హైదరాబాద్‌లో పనిచేసే కార్తీక్ సుబ్రమణ్యం అన్నారు.

కానీ 2022 కోసం తన లక్ష్యాన్ని నిర్దేశించుకున్న మోదీ ప్రభుత్వం డెడ్‌లైన్‌ను మార్చేశారు. అంటే దానర్థం ఆయన ఇవన్నీ 2019లో తన పార్టీకి ఓట్లు రాబట్టడానికే చేస్తున్నారు.

"మోదీ మొదట అచ్ఛే దిన్ గురించి మాట్లాడారు, కానీ చాలా మందికి ఇంకా మంచి రోజులు రానట్టు అనిపిస్తోంది. అందుకే మోదీ చాలా తెలివిగా ప్రభుత్వ లక్ష్యాన్ని 2022 కు తీసుకెళ్లారు" అని ముంబైలోని ఒక కార్పొరేట్ కంపెనీలో పనిచేసే ఆర్ చావ్లా అన్నారు.

"ఆయన నా పనితీరుకు 2022లో మార్కులు వేయండి అంటారు. అంటే దానర్థం 2019 ఎన్నికల్లో ఆయన తనకు మరో ఐదేళ్లు ఇవ్వమని అడుగుతున్నారు".

ఫొటో సోర్స్, Getty Images

75వ సంవత్సరంలో స్వతంత్ర సంబరాలు

మోదీ 2022 లక్ష్యం గురించి సోషల్ మీడియా సైట్ కోరాలో కూడా జనం చర్చించుకుంటున్నారు.

ఈ లక్ష్యానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన ఇండిపెండెంట్ సలహాదారు మిహిర్ జోషి "దేశంలో మార్పు తీసుకురావడానికి 2019 సరిపోదు అని చెప్పడానికి ఇది చాలా సురక్షితమైన పద్ధతి. ప్రజలు మార్పు కోరుకుంటే ఆయనకు మరోసారి అవకాశం ఇవ్వాలి" అన్నారు.

అయితే, ఒక లక్ష్యాన్ని చేరుకోడానికి ఒక నిర్ధారిత సమయం, నిరంతర ప్రయత్నం ఉండాలని కూడా ఆయన చెప్పారు.

కోరాలో నిరంజన్ నానావతి అనే ఒక యూజర్ "2022లో దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతుంది. ఆయన ఆ సందర్భంగా భారీ సంబరాలు చేయాలనుకుంటున్నారు. అందుకే తన లక్ష్యాలన్నింటినీ అప్పటికి నిర్దేశించుకున్నారు. ఆ సంవత్సరం అందరికీ గుర్తుండిపోవాలని మోదీ భావిస్తున్నారు" అన్నారు

వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మోదీ 2022 లక్ష్యం నిర్దేశించుకున్నారని చెప్పడంలో అర్థం లేకుండా పోలేదు. ప్రభుత్వం చాలా ప్రణాళికలను ప్రజల ముందుకు తెచ్చింది. వచ్చే ఐదేళ్లలో మరిన్ని ప్రణాళికలను ప్రారంభించే ప్రయత్నాల్లో ఉంది.

ఈ ప్రణాళికలన్నింటికీ ప్రత్యేకత ఉంటుంది. ప్రత్యేక ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని వీటిని రూపొందిస్తారు.

అసలు న్యూ ఇండియాలో ఏం జరుగుతుంది? అనేది మాత్రం బీజేపీ ఇంకా ప్రకటించకపోవడం ఆశ్చర్యంగా ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)