మహిళల ఆరోగ్యం: ఇంటిపని చేయడం వ్యాయామం కిందకు వస్తుందా?

 • భూమికా రాయ్
 • బీబీసీ ప్రతినిధి

మీరు ఇంట్లో వంటంతా చేసి, బూజు దులిపి, ఇల్లు ఊడ్చి, పిల్లలను బడికి పంపి, ఉద్యోగానికి కూడా వెళుతూ, చాలా 'చురుకు'గా ఉన్నారనుకుంటే అది పొరపాటే.

చాలాసార్లు ఆడవాళ్లు తాము శారీరక వ్యాయామం చేయకపోవడానికి ఇంటి పనులను సాకుగా చూపుతుంటారు. అయితే అది అనారోగ్యాన్ని ఆహ్వానించడమే అంటున్నారు డాక్టర్లు.

చాలా మంది మహిళలు తాము చురుకుగా ఉండేందుకు అవసరమైనంత పని చేస్తున్నామని అనుకుంటారు. కానీ అది నిజం కాదని దిల్లీకి చెందిన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ షాలినీ సింఘాల్ అంటారు.

''పల్లెలలోని మహిళలతో పోలిస్తే పట్టణాల్లోని మహిళలు తక్కువ చురుకుగా ఉంటారు. నగరాలలో బరువైన పనులు చేయడానికి పనివాళ్లను నియమించుకుంటారు. అందువల్ల మహిళలు చేసే పనిలో మొత్తం శరీర కదలికలు ఉండవు. మొత్తం శరీరావయవాలు కదిలితే కానీ హృదయస్పందన పెరగదు'' అని ఆమె వివరించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ఏం చెబుతోంది?

ఇటీవల లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్ ప్రచురించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తోంది.

ఈ నివేదిక ప్రకారం - ప్రపంచంలో ప్రతి నలుగురిలో ఒకరు ఉండాల్సినంత చురుకుగా లేరు. ఈ నివేదికలో వెల్లడైన విస్మయపరిచే విషయం ఏమిటంటే, పురుషులకన్నా మహిళలు తక్కువగా చురుకుగా ఉంటున్నారు. అంతే కాకుండా మధ్య, తక్కువ ఆదాయం ఉన్న దేశాలలోని ప్రజలు, ధనిక దేశాల ప్రజలకన్నా చురుకుగా ఉన్నారు.

ఈ నివేదిక ప్రకారం, తక్కువ చురుకుగా ఉండేవారికి గుండెజబ్బులు, మధుమేహ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. కొన్ని రకాల కేన్సర్ కూడా రావచ్చు. ఈ పరిశోధనలో తక్కువ చురుకుదనం అనేది ఆలోచనా స్థాయి మీద కూడా ప్రభావం చూపుతుందని వెల్లడైంది.

భారతదేశంలో 43 శాతం మహిళలు చురుకుగా లేరు. అదే పురుషుల విషయానికి వస్తే అది 23.5 శాతమే. ఈ నివేదిక ప్రకారం కువైట్ అతి తక్కువ చురుకుగా ఉండే దేశం కాగా, ఉగాండా అత్యంత చురుకైన దేశం.

శారీరకంగా చురుకుగా లేకపోవడం అంటే ఏమిటి?

శారీరక కార్యకలాపాలు అంటే, శరీరంలోని ప్రతి భాగం కదలడం. వేగంగా నడవడం, వాటర్ ఎయిరోబిక్స్, సైకిల్ తొక్కడం, టెన్నిస్ ఆడడంలాంటవి శారీరక కార్యకలాపాల కిందకు వస్తాయి.

పెద్దవాళ్లు వారానికి కనీసం వారానికి 150 నిమిషాలు శారీరక వ్యాయామం చేయాలి. అప్పుడే వాళ్లు చురుకుగా ఉన్నట్లు లెక్క. ఈ వ్యాయామాల వల్ల హృదయస్పందన, ఉచ్ఛ్వాసనిశ్వాసాల వేగం పెరగడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం జరుగుతుంది. చురుకుగా ఉన్నామని చెప్పడానికి ఇదే ప్రాతిపదిక.

షాపింగ్, వంట చేయడం లేదా ఇంట్లో చేసే చిన్నచిన్న పనులను శారీరక కార్యకలాపాలుగా పేర్కొనలేం. అయితే వీటి వల్ల బొత్తిగా లాభం లేదని కాదు. ఇలాంటి పనుల వల్ల శరీర కదలికలు ఉంటాయి.

ఎవరు ఎంత సమయం వ్యాయామం చేయాలి?

 • 5 నుంచి 18 ఏళ్ల వరకు సుమారు 60 నిమిషాల శారీరక వ్యాయామం అవసరం.
 • 19 నుంచి 64 ఏళ్ల వయసు వరకు వారానికి 150 నిమిషాల తగుమాత్రం ఎయిరోబిక్ వ్యాయామాలు చేయాలి.
 • 65 ఏళ్లకు పైబడిన వారు - 150 నిమిషాల ఎయిరోబిక్స్, బలం కోసం వారానికి రెండుసార్లు శారీరక వ్యాయామం.

వేగంగా నడవడం, ఈత కొట్టడం, సైక్లింగ్, టెన్నిస్, హైకింగ్, స్కేట్ బోర్డింగ్, వాలీబాల్, బాస్కెల్ బాల్ లాంటివాటిని తగుమాత్రం ఎయిరోబిక్ కార్యకలాపాలుగా పేర్కొనవచ్చు.

వ్యాయామం ఎందుకు అవసరం?

 • గుండెపోటు, గుండె జబ్బులు వచ్చే అవకాశం 35 శాతం తగ్గుతాయి.
 • టైప్ 2 మధుమేహ వ్యాధి వచ్చే అవకాశాలు 50 శాతం తగ్గుతాయి.
 • కొలోన్ లేదా రెక్టల్ కేన్సర్ వచ్చే అవకాశాలు 50 శాతం తగ్గుతాయి.
 • రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశం 20 శాతం తగ్గుతుంది.
 • హఠాత్తుగా మరణించే అవకాశాలు 30 శాతం తగ్గుతాయి.
 • ఎముకలకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం 83 శాతం తగ్గుతుంది.
 • డిప్రెషన్ వచ్చే అవకాశాలు 30 శాతం తగ్గుతాయి.

కానీ ఎందుకు మహిళలు చురుకుగా ఉండడం లేదు?

మహిళలు పురుషులకన్నా ఎక్కువ పని చేస్తారు కాబట్టి ఇద్దరిలో మహిళలే ఎక్కువగా చురుకుగా ఉంటారనుకుంటాం. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, మహిళలే తక్కువ చురుకుగా ఉన్నారు.

దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. ఉదాహరణకు, సాధారణంగా ఇంటి వద్ద పిల్లలను తల్లులే చూసుకుంటుంటారు. అదే కాకుండా, సామాజిక పరిసరాల కూడా మహిళలు శారీరక వ్యాయామం చేయడానికి అడ్డంకులుగా ఉంటాయి.

అందువల్ల వాళ్లు శరీరం వ్యాయామం తక్కువగా చేయడం పెద్ద వింతేమీ కాదు.

శారీరక కార్యకలాపాలు తక్కువైతే ప్రమాదాలేమిటి?

శారీరకంగా చురుకుగా లేకపోవడం అనేది జీవన విధానానికి సంబంధించిన పెద్ద సమస్య. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే దీని వల్ల ఈ క్రింది వ్యాధులు వచ్చే అవకాశం ఉంది:

 • గుండెజబ్బులు
 • మధుమేహ వ్యాధి
 • ఊబకాయం
 • రక్తపోటు
 • కొలెస్టరాల్ సమస్యలు
 • కండరాల నొప్పులు

మహిళలు చురుకుగా ఎలా మారచ్చు?

భారతీయ సమాజంలోని మహిళలు తమకంటూ సమయం సంపాదించుకోవడం కష్టమని డాక్టర్ షాలిని అంటారు. అందువల్ల ఈ పరిస్థితిలో మార్పు తీసుకువచ్చే దిశగా పని చేయడం ముఖ్యం.

ఉదాహరణకు, మహిళలు కూరగాయలు తీసుకురావడానికి వెళితే, కాలినడకన వెళ్లడం ఉత్తమం. దుస్తులు వాషింగ్ మెషీన్‌లో ఉతకాల్సి వస్తే, ఫుటర్ ను పక్కన పెట్టుకుని దాని పైకి ఎక్కి దిగుతూ ఉండాలి.

అయితే ఒక విషయం మీద దృష్టి ఉంచాలని డాక్టర్ షాలిని చెబుతారు. పట్టణాలలో నేడు చాలా పనులను యంత్రాల సహాయంతోనే చేస్తున్నారు. అందువల్ల యంత్రాలపై ఆధారపడడం తగ్గించమని ఆమె సూచిస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)