C/o కంచరపాలెం : తెలుగు సినిమా ఎదుగుతోంది

  • జి.ఎస్.రామ్మోహన్
  • ఎడిటర్, బీబీసీ తెలుగు
కేరాఫ్ కంచరపాలెం

ఫొటో సోర్స్, Facebook/ C/o Kancharapalem

తెలుగు సినిమాకు మంచి రోజులు రాబోతున్నాయనే సంకేతాలు కొంత కాలంగా కనిపిస్తున్నాయి. కేరాఫ్ కంచరపాలెం అలాంటి బలమైన సంకేతం. ఇందులో తాటాకు చూరు నుంచి రాలిపడే వానచుక్కలాంటి గాఢత ఉంది. పుల్లయిసు లాంటి కరిగిపోయే రంగులున్నాయి. తొమ్మిదో తరగతి సోషల్ పుస్తకంలో దాచుకున్న నెమలీక లాంటి జ్ఞాపకాల దడి ఉంది. ముఖ్యంగా తెలుగుదనముంది. తెలుగు ఊరుంది.

తెలుగు ఊరంటే కొబ్బరిచెట్ల మధ్యలో 'హమ్ ఆప్కే హై కౌన్' తరహాలో వంద మంది ఆడవారు పోటీలు పడి తెరపై రంగులు చల్లుతూ ఆడి పాడే ఫేక్ వ్యవహారం కాదు. మన కట్టూ మన బొట్టూ, మన తలుపూ మన గొళ్లెం, మన పంచెకట్టు, మన మీసకట్టు, మన లంగా ఓణి, మన జానపదం, మన ఆట, మన పాట, మన గయ్యాళి గొంతూ... ఇది పక్కా లోకల్. మిలీనియల్స్‌కు ఎలా ఉంటుందో ఏమో కానీ, 30 నుంచి పైబడినవారు ఎక్కడో చోట కనెక్ట్ కాగలిగిన సినిమా. అక్కడక్కడా సమస్యలున్నా ఓవరాల్‌గా భవిష్యత్తును వాగ్దానం చేస్తున్న సినిమా.

ఫొటో సోర్స్, Facebook/ C/o Kancharapalem

ఇది ప్రేమకథ. నాలుగు జంటల ప్రేమ కథ. బాల్య చాపల్యపు ప్రీటీన్స్ కువకువ ఒకటి. పండిపోయిన జామకాయిలాగా అంతటా పాకిపోయిన గుభాళింపు ఇంకొకటి. మధ్యలో అథోజగత్తులోని ఆటుపోట్లకు బలయ్యేదొకటి. అంతరాలు దాటక ఆగిపోయింది మరోటి. 1 ఈజ్ ఈక్వల్స్ టు 4 అని చివర్లో దర్శకుడు సూత్రాన్ని వివరించే దాకా నాలుగు ప్రేమ కథలు అలా సాగిపోతూ ఉంటాయి కిందా మీదా పడుతూ. మన కళ్ల ముందు మరోచరిత్రలు, పాకీజాలు, ఇంకా ఏవేవో కదలాడుతూనే ఉంటాయి. చివరికి రైల్వే గేట్ సీనులో శివ కూడా గుర్తొస్తుంది.

ప్రేమ సినిమానే. కానీ ఒట్టి ఆడామగా ప్రేమ మాత్రమే కాదు. మొత్తంగానే మనుషుల మీద ప్రేమ. సున్నితమైన చాలా మంది దర్శకుల్లాగే ఆడపిల్లల మీద, వాళ్ల జీవితాల మీద ప్రత్యేకమైన ప్రేమ. మతమూ నమ్మకాలూ వాటి మాటున నలుగుతున్న బతుకుల మీద ప్రేమ. సంప్రదాయ వృత్తులకు ఆధునిక పరిశ్రమకు మధ్య నలుగుతున్న శ్రామికుల మీద ప్రేమ. హీరోని మైక్రోస్కోపిక్ ఫోకస్తో మిగిలిన వాళ్లను బైనాక్యులర్తో చూపించే మసాలా సినిమాలకు భిన్నంగా ఇందులో అన్ని పాత్రలు పుష్టిగానే ఉంటాయి.

చాకోలెట్ ఫేసులు, దట్టమైన మేకప్పులూ, అదిరిపోయే సీన్లు, అర్రె అనిపించే సీనరీలు, ఐటం సాంగులూ, హెలికాప్టర్ ఫైట్లు, డ్రోన్ షాట్లు, పంచ్ డైలాగులూ లాంటివేవీ లేని సినిమా ఇది. మన ముఖాలే తెరంతా పరుచుకున్నసినిమా. సినిమా అంతా వైజాగ్ పక్కనే కదా అని సముద్రాన్నో, కైలాసగిరి టాప్ యాంగిల్ నుంచి విశాఖ అందాలనో చూపించాలని అనుకోలే. జీవితంలోని అందం తప్ప ప్రత్యేకించి అందం జోలికి పోలే. ఇదేం చిన్న విషయం కాదు.

చాలా డెలికేట్ సబ్జెక్ట్స్‌ని హాయిగా డీల్ చేశారు. మామూలుగా బూతు అనిపించే మాటలు కూడా ఇందులో పద్ధతిగా ఒదిగిపోయాయి. నట్టుగాడు అనే పదాన్ని వాడిన పద్ధతి గురించి పొలిటికల్ చర్చ చేయొచ్చు గానీ అది గ్రే ఏరియా. గ్రామాల్లో వాతావరణం, మాటలు అయితే అలాగే ఉంటాయి.

ఫొటో సోర్స్, Facebook/ C/o Kancharapalem

నిర్మాత ప్రవీణ సెక్స్ వర్కర్ పాత్రలో ఒదిగిపోయారు. మిగిలిన అమ్మాయిలు కూడా బాగా చేశారు. అటెండర్ పాత్రకు సుబ్బారావు న్యాయం చేశారు. ఆ ప్రీ టీన్స్ పిల్లాడు సహా మిగిలిన ముగ్గురూ బాగా చేశారు. నత్తి కళాకారుడు, అతని భార్య, అమ్మోరు, అంతా ఊరిని మన ముందు నిలబెట్టారు. సినిమాతో మన మమేకాన్ని చెడగొట్టకుండా సంగీతం శుభ్రంగా ఉంది.

చాలా సీన్లు బాగున్నాయి. కొన్ని మరీ బాగున్నాయి. కొన్ని పేలవంగానూ ఉన్నాయి. నిన్ను అటూ ఇటూ చూడనివ్వను, ఆవులించడమో ఫోను వైపు చూడ్డమో చెయ్యకుండా నాతో ఈ ఊరిలోకి తీసికెళ్లిపోతాను అని దర్శకుడు మనకు హామీ ఇచ్చినట్టుగా ఉంటుంది తొలి దృశ్యం. కానీ అక్కడక్కడా డాక్యుమెంటరీ లెవెల్కి వెళ్లిపోయి పేస్ తగ్గిపోవడం వల్ల సంభాషణల్లో సహజత్వం లోపించడం వల్ల సినిమా అనే లోకం నుంచి బయటకొచ్చి దిక్కులు చూడాల్సి వస్తుంది. బిగుతు అంటామో అలాంటిదేదో అక్కడక్కడా తప్పిపోతుంది. నాన్ లీనియర్ నెరేషన్తో వచ్చిన సమస్య కాదు. వేరే. అక్కడక్కడా సంభాషణలు, సీన్లు మరీ మూసలోకే పడిపోయినట్టు అనిపిస్తుంది. కొన్ని సీన్లలో డైలాగ్ డెలివరీలో సహజత్వం లోపించి అప్పజెప్పినట్టుగా ఉంటుంది. 50 మంది కొత్తవాళ్లను, అదీ అక్కడి ఊరివాళ్లను తీసుకుని ట్రైన్ చేసి వాళ్లతో సినిమా తీయడం ఎంత కష్టమో ఊహించొచ్చు. అలాగే చిన్న బడ్జెట్ సినిమాలకుండే పరిమితులను లోటుపాట్లను అర్థం చేసుకోవచ్చు. ఆ రకంగా చూసినపుడు వాళ్లు అందరూ చాలా బాగా చేసినట్టు లెక్క. కానీ ప్రేక్షకుడికి అవన్నీ అనవసరం కదా!

అంత చురుకైన ధైర్యవంతురాలైన సలీమా పాత్రను ఎందుకు చంపారో అర్థంకాదు. మతానికి వ్యతిరేకంగా ప్రేక్షకుడిలో సానుభూతి రేకెత్తించడానికైతే మాత్రం ఆ చావు అవసరమా అనిపిస్తుంది. ఆవిడను అడ్డుకుని కొట్టిన వారి వేషభాషలు మరీ సినిమాటిక్‌గా ఉన్నాయి. ''ఇవాళ స్వాతంత్ర్య దినోత్సవం కదండీ, సాంస్కృతిక కార్యక్రమాలు మొదలెట్టారు'' అని కిల్లీ కొట్టు అతను హైస్కూల్‌కు వెళ్లే ఆడపిల్ల తండ్రికి చెప్పే డైలాగుల లాంటివి కాస్త కృతకంగా తెలుగు సీరియళ్ల డైలాగుల మాదిరి ఉన్నాయి.

ఫొటో సోర్స్, Facebook/ C/o Kancharapalem

తండ్రీకూతురు గొడవ, తమ్ముడు అక్కయ్యను లోపలవేసి గడియపెట్టడం- ఆమె చీర కొంగుసాయంతో దూకేయడం లాంటి సీన్లలో సినిమాటిక్ ప్రిడిక్టబిలిటీ ఉంది. అటువంటి కొన్ని సీన్లలో మూస పరిధిని దాటి కొత్తగా ఆలోచించలేకపోయారేమో అనిపిస్తుంది.

ఇవన్నీచిన్న సమస్యలే. పెట్టుబడి, శ్రమ రెంటిలోనూ ఉండే పరిమితుల వల్ల తలెత్తిన సమస్యలు కావచ్చు. సినిమా మీద నిజమైన ప్రేమ, ప్రయత్నంలో నిజాయతీలే ప్రధానంగా కనిపించే విషయాలు. వైజాగ్ లో ఎండాకాలం ఉక్కకు తట్టుకోలేక సాయంత్రం బీచ్లో కూర్చుంటే రిలీఫ్ ఉంటది చూడూ, అంత ఫ్రెష్ బ్రీజ్ ఈ సినిమా.

దండిగా డబ్బులు పెట్టి ఆడిన జూదం కాదిది. సినిమా మీద, మనిషి మీద, జీవితం మీద ప్రేమ ఉన్న కొంత మంది మనుషులు ఒకరినొకరు నమ్ముకుని కట్టిన విశ్వాసపు పిరమిడ్ ఇది. ప్రేమ లాగే విశ్వాసం కూడా అన్ని సార్లూ గెలవకపోవచ్చు. కొన్ని పిరమిడ్లు కూలిపోవచ్చు. కొన్ని అసలు మన ముందుకే రాకపోవచ్చు. కానీ ఏదో ఒక ఆసరాతో వచ్చి నిలిచిన పిరమిడ్ మిగిలిన చేతులకు ఆశ కలిగిస్తుంది. మంచి చేతులకు మంచి చేతలకు ఆశ మిగిలి ఉండడం అవసరం.

(ఈ వార్తను మొదట 2018 సెప్టెంబరు 9న పబ్లిష్ చేశాం.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)