BBC SPECIAL: ఆత్మహత్యకు పాల్పడిన రైతుల పిల్లలకు తల్లి ఒడి లాంటి బడి 'శాంతివన్'

  • ప్రియాంక దూబే
  • బీబీసీ ప్రతినిధి
రైతుల ఆత్మహత్యలు, మహారాష్ట్ర

ఫొటో సోర్స్, Priyanka Dubey/BBC

ఫొటో క్యాప్షన్,

శాంతివన్‌లో చదువుకుంటున్న పిల్లలు

ఈసారి కూడా మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో వర్షాలు ఆలస్యంగా పడ్డాయి. నల్లరేగడి నేలల పంటపొలాలను దాటుకుంటూ మేం బాలాఘాట్ కొండల మధ్య ఉన్న థలసెరా గ్రామానికి వెళ్లాం.

గ్రామానికి చెందిన 65 ఏళ్ల లక్ష్మీబాయి తన పొలం మధ్యలో నిర్మించుకున్న గదిలో ఒక మేక, రెండు కోళ్లను పెంచుకుంటూ జీవిస్తున్నారు. గత రెండేళ్ల నుంచి ఇక్కడ రైతులు చేసుకుంటున్న ఆత్మహత్యల కారణంగా ఆమె కుటుంబం మొత్తం చిన్నాభిన్నమైంది.

జిల్లాలోని వేలాది మంది రైతులలాగే, లక్ష్మిబాయి భర్త కూడా అప్పులు తీర్చలేక బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమె కుమారుడు శివాజీ వ్యవసాయ కూలీగా పని చేసేవాడు. కానీ అతను కూడా ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

శివాజీ మరణించాక, ఆమె కోడలు నందా ఒక రోజు ఉదయం హఠాత్తుగా తన ముగ్గురు పిల్లలను వదిలిపెట్టి, ఎటో వెళ్లిపోయింది.

అయితే ఈ కథ లక్ష్మిదో, ఆమె భర్తదో లేక ఆమె కుమారుడిదో కాదు. మరాఠ్వాడా ప్రాంతంలో తీసుకున్న అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న రైతుల పిల్లలది.

ఆ ప్రాంతంలో నిర్వహిస్తున్న 'శాంతివన్' అనే పాఠశాలలో చదువుకుంటున్న ఆ పిల్లలంతా ఇప్పడు తమ కాళ్ల మీద తాము ఎలా నిలబడాలో నేర్చుకుంటున్నారు.

ఫొటో సోర్స్, Prriyanka Dubey/BBC

ఫొటో క్యాప్షన్,

ఆత్మహత్యలు చేసుకున్న రైతుల పిల్లలతో దీపక్ నాగర్‌గోజె, ఆయన భార్య

లక్ష్మీబాయి 14 ఏళ్ల మనవడు సూరజ్ శివాజీ రావు, తన ఇద్దరు చెల్లెళ్లతో కలిసి బీడ్ జిల్లాలోని అరవి గ్రామంలో ఉన్న ఆ పాఠశాలలోనే చదువుకుంటున్నాడు. తల్లి వెళ్లిపోయాక సూరజ్ అత్తయ్య జిజాబాయి తన సోదరుడి పిల్లల ఆలనా పాలనా చూసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్నవారి కుటుంబాల పిల్లల జీవితాలో 'శాంతివన్' ఆశాదీపాలు వెలిగిస్తోందని ఆమె తెలిపారు.

''మొదట ఈ పిల్లలు చాలా ఏడ్చేవాళ్లు. తాతయ్య, తండ్రి చనిపోవడం, తల్లి తమను విడిచిపోవడం.. ఇవన్నీ వాళ్లకు అర్థమయ్యేవి కాదు. వాళ్లు గ్రామమంతా తిరుగుతూ మా అమ్మ ఎక్కడికి వెళ్లిందని అడిగేవాళ్లు. నాకేం చెయ్యాలో అర్థమయ్యేది కాదు. అప్పుడే మాకు శాంతివన్ రెసిడెన్షియల్ స్కూల్ గురించి తెలిసింది. దాంతో ఈ పిల్లలను అక్కడ చేర్పించాం'' అని జిజాబాయి తెలిపారు.

సూరజ్‌ను కలవడానికి మేం థలసెరాకు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరవి గ్రామానికి వెళ్లాం.

అక్కడ తొమ్మిదో తరగతి చదువుతున్న సూరజ్‌తో పాటు శాంతివన్ వ్యవస్థాపకుడు, ప్రధానోపాధ్యాయుడు అయిన దీపక్ నాగర్‌గోజెను కలిశాం.

ఫొటో సోర్స్, Priyanka Dubey/BBC

ఇతరుల కోసం జీవించడంలోనే మజా..

బాబా ఆమ్టే ప్రేరణతో దీపక్ 18 ఏళ్ల క్రితం ఏడున్నర ఎకరాల స్థలంలో శాంతివన్‌ను ప్రారంభించారు.

''నేను బాబా ఆమ్టేను కలిసినప్పుడు నా వయస్సు 18 ఏళ్లు. ఆయనను కలిసిన తర్వాత నాకు - అందరూ వాళ్ల కోసం వాళ్లు జీవిస్తారు. కానీ ఇతరుల కోసం జీవించడంలోనే మజా ఉంది అనిపించింది. నేను బీడ్‌లోని బాలాఘాట్ ప్రాంతానికి చెందినవాణ్ని. ఇక్కడ ప్రాంతం మొత్తం రాళ్లతో నిండి ఉంటుంది. ఏడాదికి ఒక పంటే పండుతుంది.''

''ఇక్కడ ప్రతి రెండో సంవత్సరం కరువు వస్తుంది. అందువల్ల ఇక్కడ వ్యవసాయం ఎప్పుడూ జూదమే. అందుకే రైతులు చాలా ఏళ్లుగా ఇక్కడ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వాళ్ల పిల్లలు చదువులు ఆగిపోతే వాళ్లంతా ఏమైపోతారా అని ఆలోచించాను'' అని దీపక్ తెలిపారు.

ఆ ప్రాంతంలో పేదరికం, నిరుద్యోగం ఎక్కువ కావడంతో ఆత్మహత్యలు మరింత పెరిగాయి. ఈ విషవలయాన్ని గుర్తించిన దీపక్ అలా ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను గుర్తించి, వారి పిల్లలకు ఉచితంగా చదువు చెప్పడం ప్రారంభించారు.

''ఇవాళ శాంతివనంలో సుమారు 8 వందల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వారిలో 3 వందల మంది హాస్టల్లో ఉంటున్నారు. ఈ 3 వందల మందిలో 2 వందల మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్న రైతుల పిల్లలే'' అని దీపక్ తెలిపారు.

ఫొటో సోర్స్, Priyanka Dubey/BBC

ఫొటో క్యాప్షన్,

పిల్లలతో దీపక్ నాగర్‌గోజె

ఈ పాఠశాలను దీపక్ ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం తీసుకోకుండా కేవలం కొద్దిమంది దాతల సాయంతో నడుపుతున్నారు. ఇక పిల్లలకు కావాల్సిన కూరగాయలు, ఆహారధాన్యాలు దీపక్ కుటుంబానికి చెందిన భూముల్లోనే పండిస్తున్నారు.

మేం వెళ్లేసరికి సూరజ్ భోజనం చేయడానికి మెస్‌కు వెళుతున్నాడు. అతని గ్రామం గురించి, నాన్నమ్మ గురించి అడగగానే ఆ పిల్లవాడి కళ్లు నీళ్లతో నిండిపోయాయి.

''కొన్నిసార్లు ఇంటికి దూరంగా ఉన్నానని బాధ కలిగినా, ఇక్కడ నేను సంతోషంగానే ఉన్నాను. ఇక్కడ నాకు మంచి స్నేహితులు కూడా ఉన్నారు. నేనే భవిష్యత్తులో డాక్టర్‌నో, ఇంజనీర్‌నో కావాలనుకుంటున్నాను'' అన్నాడు.

ఫొటో సోర్స్, Priyanka Dubey/BBC

ఫొటో క్యాప్షన్,

పూజా కిషన్ ఆవుటె

సూరజ్‌లాగే బీడ్ జిల్లా గెవోరాయి తహసీల్‌కు చెందిన పూజా కిషన్ అవుటె శాంతివన్‌లోనే పెరిగింది. ఆమె ప్రస్తుతం జిల్లా కేంద్రంలో కంప్యూటర్ కోర్స్ చదువుకుంటోంది.

20 ఏళ్ల పూజా మొదటి పరిచయంలోనే తన నవ్వు మొహంతో మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. తనలోని బాధను ఆమె తన మొహంలోని సంతోషం, తన ఉత్సాహం వెనుక దాచుకుంది. పూజాకు తమ ప్రాంతంలోని రైతుల జీవితాలను మెరుగుపర్చాలన్నది కోరిక.

తన కుటుంబం గురించి, చదువు గురించి చెబుతూ ఆమె, ''మా నాన్న తీసుకున్న అప్పు తీర్చలేకపోయాడు. మాకున్న కొద్దిపాటి భూమిలో ఆయన మా పెదనాన్నతో కలిసి పని చేసేవాడు. మా పెదనాన్న డబ్బులన్నీ తాను ఉంచుకుని, అప్పులు మాత్రం మా నాన్న వాటాకు పంచాడు'' అని తెలిపింది.

పూజా పదవ తరగతిలో ఉన్నపుడు ఆమె తండ్రి కాళ్లు చేతులు తాళ్లతో కట్టుకుని బావిలో దూకి చనిపోయాడు.

తండ్రి గురించి చెబుతుంటే ఆమె కళ్లలో నీళ్లు నిలిచాయి. ''ఆయనకు ఈత కొట్టడం వచ్చు. అందుకే పైకి తేలుతాననే భయంతో కాళ్లు చేతులు తాళ్లతో కట్టేసుకున్నాడు. ఇప్పడు ఇంటి వద్ద అమ్మ ఒక్కటే కూలి పని చేసుకుంటూ జీవిస్తోంది'' అని పూజా తెలిపింది.

పూజా ఇప్పుడు డిగ్రీ పూర్తి చేసి, పై చదువులు చదవాలనుకుంటోంది.

''నేను మాస్టర్ డిగ్రీ చేసి, మంచి సంస్థలో ఉద్యోగం సంపాదించాలనుకుంటున్నాను. ఉద్యోగం రాగానే మా అమ్మను నా దగ్గరకు తెచ్చేసుకుంటాను. ఆమెను ఎప్పుడూ నా దగ్గరే పెట్టుకుని, ఇంకెప్పుడూ పనికి పోనివ్వను.''

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)