రాజీవ్ గాంధీ హత్య కేసు: ఏడుగురు దోషుల విడుదలకు తమిళనాడు ప్రభుత్వం సిఫార్సు

రాజీవ్ గాంధీ హత్య కేసు

రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా తేలి.. యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఏడుగురిని విడుదల చేయాలని తమిళనాడు మంత్రివర్గం ఆదివారం తీర్మానించింది.

ఈ తీర్మానాన్ని గవర్నరు భన్వరిలాల్ పురోహిత్‌కు పంపనుంది. ఆయన తుది నిర్ణయం తీసుకుంటారు.

సుప్రీం కోర్టు ఇటీవల ఈ దోషుల విడుదల అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికే వదిలేసింది.

ఈ నేపథ్యంలో, రాజ్యాంగంలోని 161వ అధికరణ కింద ఈ ఏడుగురు దోషుల విడుదల కోసం గవర్నర్‌కు సిఫార్సు చేసినట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది.

రాజీవ్ గాంధీ 1991లో తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో హత్యకు గురయ్యారు.

ఈ కేసులో ఏడుగురిని దోషులుగా తేల్చి వారిని 20 ఏళ్లకు పైగా జైళ్లలో ఉంచారు.

దోషుల విడుదల అంశంపై తమిళనాడు మంత్రి డి.జయకుమార్ మాట్లాడుతూ- తమ సిఫార్సును గవర్నరు ఆమోదించాల్సిందేనని ఆయనకు మరో మార్గం లేదని చెప్పారు.

రాజీవ్ గాంధీ హత్య కేసులో మొదట 26 మందికి మరణ శిక్ష విధించారు. తర్వాత వీరిలో ఏడుగురే దోషులుగా మిగిలారు. 1990లో నళినికి, మరో ముగ్గురికి మరణ దండన పడింది.

రాబర్ట్ ప్యాస్, జయకుమార్, రవిచంద్రన్‌లకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు.

2000వ సంవత్సరంలో నళిని మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చారు. మరణ శిక్ష పడిన మరో ముగ్గురికి 2014లో శిక్షను తగ్గించి, యావజ్జీవ కారాగారం విధించారు. వీరి క్షమాభిక్ష దరఖాస్తుల పరిష్కారంలో తీవ్రమైన జాప్యం నేపథ్యంలో శిక్షను తగ్గించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)