ప్రెస్ రివ్యూ: పెట్రో ధరలకు నిరసనగా విపక్షాల భారత్ బంద్

పెట్రోల్ బంక్

ఫొటో సోర్స్, Getty Images

పెట్రోల్ ధర లీటర్‌కు వంద రూపాయలకు చేరువవుతోందని నమస్తే తెలంగాణ 'ఆగని పెట్రో మంట' పేరుతో ఒక కథనం ప్రచురించింది. పెట్రో ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ చేస్తున్న భారత్ బంద్‌కు తృణమూల్ దూరంగా ఉన్నట్టు తెలిపింది. బంద్‌ జరిగినా బ్యాంకుల కార్యకలాపాలకు ఆటంకం ఉండదని తమ కథనంలో పేర్కొంది.

పెట్రోల్ బంకుకు వెళ్లాలంటేనే గుండెదడ వచ్చేలా ఇంధన ధరలు దేశప్రజానీకాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. రూ.90కి చేరువైన లీటర్ పెట్రోల్ ధర త్వరలోనే సెంచరీ కొట్టేలా కనిపిస్తున్నది. మునుపెన్నడూ లేనివిధంగా ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర తొలిసారిగా ఆదివారం రూ.80.50ని తాకింది. డీజిల్ ధర కూడా రికార్డు స్థాయిలో రూ.72.61కి చేరుకుంది. డాలర్‌తో పోల్చితే రూపాయి పతనం కూడా ఈ ధరల పెరుగుదలకు కారణమవుతున్నది. ఇంధన ధరల పెరుగుదల ప్రభావం కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయని ఈ కథనంలో రాశారు.

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్.. నేడు (సోమవారం) దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్, ఎక్సైజ్ సుంకాల తగ్గింపుతో పెట్రో ధరల్ని అదుపుచేయాలని, చము రు ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి చేర్చాలని విపక్షాలు డి మాండ్ చేస్తున్నాయి. 2014లో పెరిగిన ధరలను తన ప్రచారాస్త్రంగా చేసుకుని మోదీ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడదే అస్ర్తాన్ని మోదీ పాలనపై ప్రయోగించాలని కాంగ్రెస్ వ్యూహం గా కనిపిస్తున్నది. యూపీఏ హయాంలో ఇంధన ధరలు పెరిగినప్పుడు పార్లమెంట్‌లో ఆనాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను బీజేపీ నేత లు టార్గెట్ చేసిన రెండు వీడియోలను కాంగ్రెస్ పార్టీ ఆదివారం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిందని నమస్తే తెలంగాణ తెలిపింది.

కాంగ్రెస్ భారత్ బంద్ పిలుపునకు పలు పార్టీలు మద్దతు ప్రకటించాయి. ప్రజలకు అసౌకర్యం కలుగకుండా ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు బంద్ నిర్వహించాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది. బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రకటించినట్టు కథనంలో పేర్కొన్నారు.

కాంగ్రెస్ భారత్ బంద్‌కు డీఎంకే, జేడీఎస్, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ, ఎన్సీపీ, వామపక్షాలు, ఎంఎన్ఎస్, జనసేన పార్టీలు మద్దతిచ్చినట్టు కథనంలో తెలిపారు. బీఎస్పీ, ఏఐఏడీఎంకే పార్టీలు తమ వైఖరి చెప్పలేదని, తృణమూల్ కాంగ్రెస్ మాత్రం బంద్‌కు మాత్రం దూరంగా ఉండాలని నిర్ణయించిందని ఇందులో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

అన్నదాతలకు బ్యాంకుల అరకొర సాయం

తెలంగాణలో కోటి ఎకరాలకు పైగా సాగు చేసినా బ్యాంకులు సహకరించలేదంటూ సాక్షి 'సగమే రుణం... తప్పని భారం అనే కథనం ప్రచురించింది. ఖరీఫ్‌ లక్ష్యం 25,496 కోట్లు కాగా, బ్యాంకులు 11,400 కోట్ల రూపాయలే రుణాలు ఇచ్చినట్టు సాక్షి పేర్కొంది.

ఈ నెలాఖరుకు ఖరీఫ్‌ ముగియనుంది. ఇప్పటికే కోటి ఎకరాలకు పైగా పంటలు సాగయ్యాయి. సీజన్‌లో సమృద్ధిగా వర్షాలు కురవడంతో లక్ష్యానికి మించి వరి నాట్లు పడుతున్నాయి. అయితే బ్యాంకులు రైతులకు పంట రుణాలు ఇవ్వడంలో సహకరించడం లేదన్న ఆరోపణలున్నాయి. దీంతో రైతులకు ప్రైవేటు అప్పులే దిక్కయ్యాయి. ఖరీఫ్‌ పంట రుణ లక్ష్యం రూ.25,496 కోట్లు కాగా, ఇప్పటివరకు రూ.11,400 కోట్లే బ్యాంకులు ఇచ్చాయి. అంటే లక్ష్యంలో సగం కూడా విడుదల చేయలేదు. దీనిపై వ్యవసాయశాఖ వర్గాలు బ్యాంకులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని సాక్షి కథనం తెలిపింది.

బ్యాంకులు మాత్రం ధరణి వెబ్‌సైట్‌ అందుబాటులోకి రాకపోవడం వల్లే రుణాలు ఇవ్వడంలేదని చెబుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే వ్యవహరిస్తున్నామంటున్నాయి. ప్రభుత్వం పంట రుణాలకు సంబంధించి ఈసారి కొత్త నిబంధనను అమలులోకి తీసుకొచ్చింది. ఈ ఖరీఫ్‌ నుంచి కొత్త పట్టాదారు పాసు పుస్తకం కుదువబెట్టుకోకుండానే రైతులకు రుణాలు ఇవ్వాలని బ్యాంకులను ఆదేశించింది. రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ధరణి వెబ్‌సైట్‌లో రైతుల సమాచారం సరిచూసుకున్న తర్వాతే పంట రుణాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. అయితే ఆచరణలో అది సాధ్యంకాలేదు. దీంతో బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. ధరణి వెబ్‌సైట్‌కు, రుణాలకు లంకె పెట్టడంపై విమ ర్శలు వస్తున్నా సర్కారు పట్టించుకోకపోవడంపై రైతులు మండిపడుతున్నారని ఈ కథనంలో వివరించారు.

ఫొటో సోర్స్, FACEBOOK/AndhraPradeshCM

ఏపీలో 'ముఖ్యమంత్రి యువనేస్తం' అమలుకు సన్నాహాలు

ముఖ్యమంత్రి యువనేస్తం అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు ఈనాడు ఒక కథనంలో పేర్కొంది. రాష్ట్రంలో 10 లక్షల మంది అర్హులు ఉన్నారని తెలిపింది. ఈ పథకానికి సంబంధించిన అర్హతల గురించి, ప్రభుత్వ వెబ్ సైటులో తమ పేరును ఎలా నమోదు చేసుకోవాలో తమ కథనంలో వివరించింది.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోన్న 'ముఖ్యమంత్రి యువనేస్తం' పథకం అమలుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ పథకం కింద నిరుద్యోగ భృతి పొందేందుకు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, అప్రెంటీస్‌షిప్‌, ఉద్యోగావకాశాలను అందుకునేందుకు అర్హుల జాబితాను కూడా సిద్ధం చేసింది. రాష్ట్ర పంచాయతీరాజ్‌, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలోని కమిటీ ఈ జాబితాను రూపొందించింది. ప్రజా సాధికార సర్వేతో పాటు ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ ఖాతాల సమాచారాన్ని పూర్తి స్థాయిలో విశ్లేషించాక రాష్ట్రంలో 10,11,234 మందికి అర్హత ఉన్నట్లుగా తేల్చారు. ఈ నెల 14 నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రారంభమయ్యాక నమోదు చేసుకున్న అభ్యర్థుల వివరాలను ఈ జాబితాతో పోల్చి చూసి అర్హులా, అనర్హులా అనేది తేల్చనున్నారు. దరఖాస్తు ప్రక్రియలో అర్హులు అనర్హులుగా గుర్తింపబడితే ఫిర్యాదుచేసుకొనేందుకు ప్రభుత్వం వీలు కల్పించిందని ఈనాడు కథనంలో తెలిపారు.

అర్హత :

  • వయస్సు 22-35 మధ్య ఉండాలి.
  • పీజీ/డిగ్రీ/డిప్లొమా పూర్తి చేసి ఏడాది అయి ఉండాలి.
  • దారిద్య్ర రేఖకు దిగువ(బీపీఎల్‌)నున్న కుటుంబానికి చెంది ఉండాలి.
  • తెల్లరేషన్‌కార్డులో పేరు తప్పనిసరి.
  • ప్రజాసాధికార సర్వేలో నమోదు చేసుకుని ఉండాలి.
  • ఆంధ్రప్రదేశ్‌లోనే నివసించాలి.
  • తల్లిదండ్రులు/కుటుంబ సభ్యులకు సామాజిక పింఛన్లు తీసుకుంటున్నా ఆ కుటుంబంలోని నిరుద్యోగి అర్హులే

అనర్హత :

  • ఇతర రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల నుంచి డిగ్రీలు పొందినవారు.
  • కుటుంబంలో ఏ ఒక్కరైనా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా..
  • కుటుంబంలో నాలుగు చక్రాల వాహనం ఉంటే.
  • ప్రభుత్వ పథకాల కింద రూ.50వేలపైన రాయితీ పొంది ఉంటే.
  • ప్రభుత్వ రంగ/ప్రైవేట్‌ రంగ సంస్థలో పనిచేస్తున్నా, ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ కింద నమోదైన సంస్థల్లో ఒప్పంద/పొరుగు సేవల్లో పనిచేస్తున్నా..
  • 2.5ఎకరాల మాగాణి లేదా 5 ఎకరాల మెట్ట కంటే ఎక్కువ భూమి ఉన్నా.. అనంతపురం జిల్లాలో అయితే 5 ఎకరాల మాగాణి, 10 ఎకరాల మెట్ట గరిష్ఠం.
  • శారీరక వికలాంగుల కోటా కింద పింఛన్‌ పొందుతున్నవారు.
  • నేరస్తుడిగా శిక్ష పడి ఉంటే.

ఉండాల్సినివి :

  • విద్యార్హత, వయసు ధ్రువీకరణ పత్రాలు.
  • బ్యాంకు ఖాతా.
  • ఆ బ్యాంకు ఖాతాకు ఆధార్‌ నెంబరు అనుసంధానం అయి ఉండాలి.
  • కుల, మత ధ్రువీకరణ పత్రాలు.

నమోదు ఇలా :

  • http://yuvanestham.ap.gov.in అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
  • అప్లై నౌ పై క్లిక్‌ చేయాలి.
  • ఆధార్‌ నెంబరు నమోదు చేయాలి.
  • ఓటీపీ పంపండి అని వస్తుంది అక్కడ క్లిక్‌ చేయాలి.
  • మీ మొబైల్‌(ఆధార్‌లో ఉన్న నెంబరు)కి ఓటీపీ వస్తుంది.
  • ఓటీపిని నమోదు చేసి పరిశీలన మీట నొక్కాలి.
  • వెంటనే అభ్యర్థి సమాచారం స్క్రీన్‌పై వస్తుంది వాటిని సరిచూసుకుని దరఖాస్తు కొనసాగించాలి.
  • విద్యార్హత సంబంధిత ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్‌ చేసి, అంగీకార మీట నొక్కి, క్లోజ్‌ బటన్‌ ఎంటర్‌ చేయాలి.
  • మీకు అర్హత ఉంటే ఒక కోడ్‌ స్క్రీన్‌ మీద కనిపిస్తుంది. దాన్ని సేవ్‌ చేసుకోవాలి.
  • స్క్రీన్‌పై వచ్చిన మీ వివరాలు సరికావని గుర్తిస్తే వాటిని అంగీకరించట్లేదని(డిస్‌అగ్రీపై) నమోదు చేయాలి.
  • అర్హులైనా అనర్హులుగా వస్తే 1100ను సంప్రదించవచ్చు.. yuvanestham-rtgs@ap.gov.in మెయిల్‌కు మీ సమస్యను తెలియజేయవచ్చు అని ఈనాడు తమ కథనంలో తెలిపింది.

ఫొటో సోర్స్, Telangana CMO

టీఆర్ఎస్ టికెట్ల కేటాయింపుతో తెలంగాణలో వేడెక్కిన రాజకీయం

టీఆర్ఎస్ టిక్కెట్ల కేటాయింపులతో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నట్టు ఆంధ్రజ్యోతి ఒక కథనం ప్రచురించింది. కూకట్‌పల్లిలో కృష్ణారావుపై కార్పొరేటర్లు తిరుగుబాటు చేశారని, జనగామలో ముత్తిరెడ్డిపై నేతలు ఆగ్రహంతో ఉన్నారని, మానకొండూర్‌లో యువకులు ఆందోళన చేశారని తెలిపింది.

సిట్టింగ్‌ అభ్యర్థులకు టికెట్లు కేటాయించడంతో.. టీఆర్‌ఎస్‌లో రాజకీయం వేడుక్కెతోంది. టికెట్లు తమకే ఇవ్వాలంటూ ఆశావహులు.. ఒత్తిళ్ల తీవ్రతను పెంచారు. పార్టీ కోసం పని చేసిన వారిని విస్మరించొద్దంటూ కొందరు విజ్ఞప్తులు చేస్తుండగా.. రెబల్‌గా పోటీ చేస్తామంటూ మరి కొందరు సవాళ్లు విసురుతున్నారు. కొన్ని చోట్ల అభ్యర్థుల దిష్టిబొమ్మలు దహనం చేయగా.. మరికొన్ని చోట్ల నిరసనల ద్వారా తమ గళం వినిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లిలో తాజా మాజీ ఎమ్మెల్యే గాంధీ అభ్యర్థిత్వాన్ని నిరసిస్తూ జగదీశ్వర్‌గౌడ్‌ అనుచరులు ఆదివారం మరోసారి సమావేశమయ్యారు. తమ నాయకుడికే టికెట్‌ ఇవ్వాలంటూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. నాంపల్లి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా స్థానికేతరుడైన ఆనందకుమార్‌ను ఎలా ప్రకటిస్తారని ఆశావహులు ప్రశ్నిస్తున్నారని ఆంధ్రజ్యోతి తమ కథనంలో పేర్కొంది.

ఈవిషయమై ఇప్పటికే మంత్రి కేటీఆర్‌ను కలిసి విన్నవించారు. ఉప్పల్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బొంతు రామ్మోహన్‌ను ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ టీఆర్‌ఎ్‌సవీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. కూకట్‌పల్లి అభ్యర్థి కృష్ణారావు తరఫున తాము ప్రచారం చేయబోమని నలుగురు కార్పొరేటర్లు, పలువురు సర్పంచ్‌లు తేల్చిచెప్పారు. మరోవైపు ఉప్పల్‌లో బేతి సుభాష్‌రెడ్డికి అనుకూలంగా కొందరు.. వ్యతిరేకంగా మరికొందరు వ్యవహరిస్తున్నారు. బాల్కొండ నుంచి తాను పోటీ చేయడం ఖాయమని ఆరెంజ్‌ ట్రావెల్స్‌ అధినేత ముత్యాల సునీల్‌రెడ్డి ప్రకటించారు. నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం లక్కోరలో నిర్వహించిన అభిమానుల ఆత్మీయ సభలో ఆయన మాట్లాడుతూ బాల్కొండలో తన విజయం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. తుంగతుర్తి టికెట్‌ స్థానికులకే ఇవ్వాలంటూ పలువురు నాయకులు మోత్కూరులో రాస్తారోకో చేశారు.

జనగామలో ముత్తిరెడ్డి నిలబడితే.. చేజేతులా సీటు వదులుకోవాల్సి వస్తుందని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. చేర్యాలలో సీనియర్‌ నాయకుడు మండల శ్రీరాములు ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించారు. ముత్తిరెడ్డి టికెట్‌ను రద్దు చేసి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డికి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి రాజయ్యకు టికెట్‌ ఇవ్వొద్దని డిమాండ్‌ చేస్తూ పల్లగుట్టలో నియోజకవర్గ నేతలు సమావేశమయ్యారు. పాలకుర్తిలో తక్కెళ్లపల్లి రవీందర్‌రావు... తన అనుయాయులతో సమావేశం నిర్వహించారు. పలు ప్రాంతాల్లో నిరసనలు కూడా జరిగినట్టు ఆంధ్రజ్యోతి ఈ కథనంలో వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images

తెలంగాణలో మహా కూటమి దిశగా ప్రతిపక్షాల ప్రయత్నాలు

తెలంగాణలో ఎన్నికల కోసం ప్రతిపక్షాలన్నీ మహా కూటమి దిశగా అడుగులు వేస్తున్నట్టు 'పొత్తు' పొడుపు పేరుతో ప్రజాశక్తి ఒక కథనం ప్రచురించింది. ఈరోజు కాంగ్రెస్‌, టిజెఎస్‌తో టీడీపీ చర్చలు జరపబోతోందని తెలిపింది. సీపీఐతో పొత్తు ఖరారైనట్టు ఈ కథనంలో పేర్కొంది.

తెలంగాణాలో ప్రతిపక్షాలన్నీ కలిసి మహాకూటమి దిశగా అడుగులు వేస్తున్నాయి. కలిసోచ్చే పార్టీలన్నింటితోనూ పొత్తు పెట్టుకుంటామని కాంగ్రెస్‌ ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీతో చర్చలకు తెలంగాణా టిడిపి సిద్దమైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అనుమతితో సోమవారం టి.టిడిపి బృందం కాంగ్రెస్‌ రాష్ట్ర నేతలతో పొత్తులపై చర్చించబోతున్నారు. కాగా ఆదివారమే టి.టిడిపి నేతలు సిపిఐ నాయకులతో చర్చించారు. వీరి మధ్య టిటిడిపి అధ్యక్షుడు రమణ ఇంట్లో జరిగిన చర్చలు పలప్రదం అయ్యాయి. వచ్చే ఎన్నికల్లో టిడిపితో కలిసి పని చేస్తామని సమావేశం అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం కేవలం కలిసి పోటీ చేసే అంశంపైనే చర్చించినట్లు చెప్పారు. అయితే తాము గెలిచే స్థానాలను మాత్రమే అడుగుతామని స్పష్టం చేశారని కథనంలో తెలిపారు.

మహా కూటమి ఏర్పాటు చేసే దిశలో టి.టిడిపి సోమవారం కాంగ్రెస్‌, టిజెఎస్‌తో చర్చలు జరపబోతోంది.. సాయంత్రం కాంగ్రెస్‌తో చర్చించనున్న టి.టిడిపి బృందం ఉదయాన్నే తెలంగాణా జన సమితి అధ్యక్షుడు కోదండరామ్‌తో చర్చింనున్నారు. ఈ మేరకు ఆదివారం తెలంగాణ జనసమితి అద్యక్షులు ప్రొ.కోదండరాం, టిపిసిసి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిలకు ఫోన్‌ చేసి మాట్లాడారు. సాయంత్రం ఉత్తమ్‌కుమార్‌ రెడ్డితోనూ రమణ నేతృత్వంలో ఏర్పాటై ఎన్నికల పొత్తుల చర్చల కమిటీ సమావేశం కానుంది. ఇటు పొత్తుల కోసం కాంగ్రెస్‌ పార్టీ కూడా సీనియర్‌ నేతలతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ రెండు కమిటీల సభ్యులు సాయంత్రం భేటీ కానున్నారని ప్రజాశక్తి కథనం పేర్కొంది.

టిడిపితో కలిసి పోటీ చేస్తే ఎక్కడ తమ సీట్లకు ఎసరు వస్తుందోనని కాంగ్రెస్‌కు చెందిన పలువురు నేతలు పొత్తును వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ఇప్పటికే తమ అభిప్రాయాలను పార్టీ రాష్ట్ర కమిటీకి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కలిసి పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తే...ఏకాభిప్రాయం కుదరని సీట్లలో స్నేహపూర్వక పోటీ అంశాన్ని తెరమీదకు తెస్తున్నట్లు సమాచారం ఉన్నట్టు ఈ కథనంలో తెలిపారు.

చంద్రబాబు నాయుడుతో పొలిట్‌ బ్యూరో సభ్యులు, ముఖ్య నేతలు ఆదివారం సమావేశమై ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. పొత్తుల కోసం సంప్రదింపుల కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు మేనిఫెస్టో రూపొందించడానికి మరో కమిటీని, ఎన్నికల్లో ప్రచారం కోసం ప్రచార కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇటు సిపిఎం ఆధ్వర్యంలోని బిఎల్‌ఎఫ్‌తో జనసేన జట్టు కట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ రెండు పార్టీ మధ్య జరిగిన తొలివిడత సమావేశాల్లో సానుకూల దృక్పదం వ్యక్తం అయ్యింది. ఈ నేపధ్యంలోనే మంగళవారం లేదా బుధవారం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం భేటీ కానున్నారు. ఈ భేటీ అనంతరం పొత్తుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని ప్రజాశక్తి కథనం చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)